Menu

నెత్తుటి మరకలు మరవని ప్రాంతానికి 43 ఏళ్ళ తరువాత వచ్చిన సీఎం! అసలు 1981 లో ఏం జరిగింది?

Sumanth Thummala

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఇంద్రవెల్లికి రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి సమయం నుండి 42 ఏళ్ళ తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన మొదటి ముఖ్యమంత్రి గా నిలిచాడు. ఇవాళ ఇంద్రవెల్లి స్మృతివనానికి శంకుస్థాపన చేశారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే ఇంద్రవెల్లి వేదికగా పిసిసి అధ్యక్షుడు హోదాలో దళిత,గిరిజన దండోరా పేరుతో మొదటి సభ నిర్వహించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని, ఇంద్రవెల్లి అమరుల స్మారకాన్ని స్మృతివనంగా మార్చి అభివృద్ధి చేస్తాం అని ఆ సభలో హామీ ఇచ్చారు. అలాగే పోడు భూములు, కనీస మౌలిక సదుపాయాలు వంటి అంశాల మీద కూడా వాగ్దానాలు చేశారు.

ఇవాళ మళ్ళీ అదే ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఇదే మొదటి బహిరంగ సభ కావడం విశేషం.

అయితే ఇన్నాళ్ల తర్వాత ఈ ప్రాంతానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రవెల్లి, కేస్లాపూర్ లో పర్యటించిన సీఎం, ఇంద్రవెల్లి స్మారక స్మృతివనానికి శంకుస్థాపన చేశారు.  అంతకు ముందు నాగోబా ఆలయం సందర్శించి పూజలు చేసారు.

అసలు ఏంటి ఇంద్రవెల్లి కథ?

హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయినప్పుడు ఆదివాసీ ప్రాంతాలు రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ కిందకు వచ్చాయి. తద్వారా గిరిజనుల భూములు ఇతరుల చేతుల్లో వెళ్లకుండా రక్షణకు తోడ్పడింది.1959 లో భూమి బదలాయింపు చట్టం తీసుకురాగా, 1970లో‌ దీనికి మార్పులు చేశారు. అయితే చట్టాలు ఎంత పకడ్బందీగా చేసినా, అమలు చేయడంలో నిర్లక్ష్యం జరిగింది. 70లలో ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి వ్యాపారాల నిమిత్తం వచ్చిన వారు స్థిర పడిపోయి స్థానిక గిరిజనుల చేతుల్లో ఉండాల్సిన భూమి,అటవి సంపద చేతులు మారాయి. గిరిజనుల నిరక్షరాస్యత, అమాయకత్వం ఈ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు.

ఒక్కటైన గిరిజనులు!

ఈ దోపిడీ, అన్యాయం, ఆక్రమణలను వ్యతిరేకిస్తూ గిరిజనులంతా మెల్లగా ఒక్కటవ్వడం మొదలు పెట్టారు. మావోయిస్టు ప్రభావం, అలాగే గిరిజన రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంఘటితం అవ్వడం మొదలెట్టారు అక్కడి జనాలు. తమ మీద జరుగుతున్న అన్యాయాలు, దోపిడీ మీద సంఘం ద్వారా అవగాహన కలగడం మొదలైంది. ఆ క్రమంలో ఎప్రిల్ 20,1981 నాడు గిరిజనులంతా ఒక్కటై సభ నిర్వహించాలని గిరిజన రైతు కూలీ సంఘం పిలుపునిచ్చారు.

చరిత్రలో చెరగని రక్తపు మరక! ఈ మారణకాండ :

ఏప్రిల్ 20,1981 సోమవారం. ఆరోజు సంత కూడా ఉండటంతో వివిధ గూడాల నుండి జనాలు వచ్చారు. మరోవైపు సభలో పాల్గొనేందుకు ముందుగానే తుడుం కొట్టి దండోరా వేయించారు. దాంతో కేస్లాపూర్, నర్సాపూర్, పిట్ట బొంగారం,ఉట్నూరు, ముట్నూరు, పాటగూడ, తుమ్మగూడ గ్రామాల నుండి వేల మంది గిరిజనులు కొండా కోన దాటుకుని వచ్చారు. దాంతో ఇంద్రవెల్లి లో జనాలు చాలామంది ఉన్నారు.

అయితే ముందు సభకు అనుమతి ఇచ్చిన పోలీసులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేసుకున్నారు. కానీ సమాచార సాధనాలు ఎక్కువగా లేని ఆరోజుల్లో అందులోనూ అటవి ప్రాంతంలో ఈ విషయం చేరలేదు. ఈలోగా జనాలు సభకు చేరుకున్నారు. ఇంద్రవెల్లికి వెళ్లే దారులను అప్పుడు మూసేశారు. అక్కడికి చేరుకుంటున్న కొందరిని అరెస్టులు చేయడం మొదలు పెట్టారు. సభ అనుకున్న ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఆ తర్వాత లాఠీచార్జీ మొదలు పెట్టారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా అలజడి రేపింది. సభ‌ నిర్వహనను అడ్డుకుంటున్న పోలీసులపై తిరగబడ్డారు జనం.‌

అయితే కాసేపటికే‌ పోలీసులు కాల్పులు జరిపడం మొదలు పెట్టారు.‌ అక్కడే ఉన్న మామిడి చెట్లు (ప్రస్తుతం స్థూపం ఉన్న ప్రాంతం) ఎక్కి మరీ జనాల్ని కాల్చారు. వారినుంచి తప్పించుకొనికి సమీప గ్రామాలకు, అడవిలోకి పరిగెత్తారు జనాలు. ఆ రోజు పచ్చని అడవి ప్రాంతం కాస్తా రక్త సంద్రం అయ్యింది. పోలీసులు సృష్టించిన మారణకాండ తో ఎక్కడ చూసినా శవాలు, గాయపడిన జనాలతో ఆ ప్రాంతం గంభీరంగా మారింది.

తప్పుడు లెక్కలు, నిజ నిర్ధారణలు!

ఈ ఘటనతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది.‌ ప్రభుత్వం ఈ ఘటనలో 13 మంది మరణించారు అని పేర్కొంది. అయితే వార్తా సంస్థలు ఈ సంఖ్య ఎక్కువే అని ప్రచూరించాయి. గిరిజనులు, హక్కుల నేతలు, వివిధ సంఘాల నాయకుల నుండి దీని మీద తీవ్ర విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం దొంగ లెక్కలు చేబతుంది అని ఆందోళన వ్యక్తం చేశాయి. దాంతో నిజ నిర్ధారణ కమిటీ బృందం ఆధ్వర్యంలో లెక్కలు తీయగా దాదాపు 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి టీ. అంజయ్య బాధితులను సందర్శించారు.

దిద్దుబాటు చర్యలు!

ఈ ఘటనను అప్పుడు జలియన్ వాలా బాగ్ మారణకాండ తో పోల్చారు. స్వతంత్ర భారతం లో అటువంటి ఘటన ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం వీరి సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనికి ప్రత్యేక అధికారి కూడా నియమించారు. భూ ఆక్రమణలు జరగకుండా మ్యాపింగ్ నిర్వహించారు.

1983లో ఇంద్రవెల్లిలో చనిపోయిన వారి గుర్తుగా కాల్పులు జరిగిన ప్రాంతంలో స్థూపాన్ని నిర్మించారు. అయితే 1986లో ఆ స్థూపాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పేల్చసారు. అది గిరిజనుల్లో తీవ్ర ఆవేశాలకు లోను కాకుండా ఉండడానికి అప్పటి ప్రభుత్వం ఐటిడిఏ నిధులతో మళ్ళీ స్థూపాన్ని కట్టించింది.

 

స్వరాష్ట్రం లోనూ నేటికీ నెరవేరని సమస్యలు;

ఇంత పెద్ద పోరాటం తర్వాత ఇచ్చిన హామీలను ఏ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20 న స్థూపం ప్రాంతంలో 144 సెక్షన్ విధించి,కొందరినే‌ ఆ స్థూపాన్ని సందర్శించే అవకాశం ఉండేది.ఎందరో నాయకులు ఇంద్రవెల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఇక్కడ గిరిజన సమస్యను తీరుస్తామని హామీలు ఇచ్చారు. అప్పటి కాంగ్రెస్ మంత్రి జైరాం రమేష్ ఇంద్రవెల్లి స్థూపాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 2014 ఎన్నికల ముందు ఇంద్రవెల్లి ప్రాంత అభివృద్ధికి హామీ ఇచ్చారు, కానీ గత పదేళ్ళలో ఒక్కసారి కూడా మళ్ళీ సందర్శించలేదు. పైపెచ్చు స్వరాష్ట్రంలో కూడా ప్రతి సంవత్సరం ఇంద్రవెల్లి స్మారకం దగ్గర ఆంక్షలు విధించింది అప్పటి ప్రభుత్వం. అనుమతి తీసుకున్న కొద్దిమంది మాత్రమే వెళ్ళడానికి వీలు ఉండేది.

వారి కష్టాలు, సౌకర్యాల లేమి ఇంకా ఉన్నాయి.. ఇప్పుడు ఆదివాసుల జాతుల నుండి గిరిజనులకు గొడవలు జరుగుతున్నాయి. నేటికీ పట్టా భూముల సమస్య వీరిని వెంటాడుతూనే ఉంది. కనీస సౌకర్యాలు అయిన నీరు, ఇళ్ళు లేక..‌ఆంబులెన్స్హు కూడా రావడం కష్టమైపోయింది. వీటిపై తుడుం దెబ్బ పేరుతో నిరసనలు, ఆందోళనలు కూడా నిర్వహించారు.

ఇకనైనా వీళ్ళ సమస్యలు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారుతాయా అనేది కాలమే సమాధానం చెబుతుంది.


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *