Menu

Afghanistan Cricket: ఓవైపు అగ్రరాజ్యాల దురహంకారం.. మరోవైపు మత ఛాందసం.. ఈ రెండిటి మధ్య అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎలా ఎదిగింది?

Tri Ten B
What is the story behind the rise of the Afghanistan cricket team in international cricket?

‘మీ ముందు అతి కఠినమైన సవాళ్లు ఉంటే.. వాటిని ఎలా ఎదుర్కొవాలో అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ను చూసి నేర్చుకోండి..’ ఇది 2010లో అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరి క్లింటన్‌ చేసిన వ్యాఖ్యలు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అఫ్ఘాన్‌ అడుగుపెట్టి 14ఏళ్లు దాటింది. ఈ 14ఏళ్లలో అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎదిగిన తీరు అసమాన్యం. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపిస్తూ క్రికెట్‌లో అఫ్ఘాన్‌ దూసుకుపోతున్న తీరు సగటు క్రీడాభిమానిలోనూ స్పూర్తి నింపుతోంది. వెస్టిండీస్‌-అమెరికా గడ్డపై జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఇంటిముఖం పట్టినా ఈ టోర్నీలో అఫ్ఘాన్‌ సాధించిన విజయాలను యావత్‌ క్రికెట్‌ ప్రపంచం తలుచుకోని మురిసిపోతోంది. బహూశ పక్క జట్టు విజయాలకు మరో జట్టు అభిమానులు సంబరడపడడం, ఆనందపడడం ఒక్క అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ విషయంలోనే జరిగిందని చెప్పవచ్చు..!

ఇక నుంచి అఫ్ఘాన్‌ అంటే క్రికెట్‌ కూడా గుర్తుకు వస్తుంది:
అన్ని దేశాల్లో క్రికెట్‌లో రాజకీయాలు ఉంటాయి. అవి క్రికెట్‌ జట్టును, ఆటను ప్రభావితం చేస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓ జట్టు ఎదిగిన తీరును ప్రస్థావించాల్సి వచ్చినప్పుడు ఆ దేశ రాజకీయాల గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా వివరించవచ్చు. కానీ అఫ్ఘాన్‌ క్రికెట్‌ గురించి చెప్పాలంటే రాజకీయాలు, అగ్రదేశాల ఆగడాల గురించి మాట్లాడకుండా ఏమీ చెప్పలేని పరిస్థితి. అటు రష్యా ఇటు అమెరికా పెత్తనాలకు సర్వనాశనం అయిపోయిన దేశం అఫ్ఘానిస్థాన్‌. ఐదు దశాబ్దాలకు పైగా అఫ్ఘాన్‌ నెలపై నెత్తురు పారని రోజే లేదు. ఇలాంటి గడ్డ నుంచి వచ్చిన ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచం చేత జేజేలు కొట్టించుకుంటారని ఓ 7ఏళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుటికీ అఫ్ఘాన్‌ అంటే తాలిబన్లు, యుద్ధాలు, అమ్మాయిల స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపే పాలకులు, మత ఛాందస ప్రభుత్వాలే అందరికి గుర్తొస్తాయి. అయితే వాటితో పాటు ఇప్పుడు క్రికెట్‌ కూడా గుర్తురాక తప్పదు!

బీజం పడిందే అక్కడే:
1980లో అఫ్ఘాన్‌ గడ్డపై సోవియట్‌ రష్యా పెత్తనాల కారణంగా ఎంతోమంది పక్కనే ఉన్న పాకిస్థాన్‌కు వలస వెళ్లిపోయారు. పాక్‌లోనే శరణార్థులగా జీవితం ప్రారంభించారు. అక్కడే అఫ్ఘాన్‌ క్రికెట్‌కు బీజం పడింది. పాక్‌లో అప్పటికే క్రికెట్‌ పట్ల ఓ రకమైన క్రేజ్‌ ఉండడంతో శరణార్థులగా జీవిస్తున్న అఫ్ఘాన్‌ కుర్రాళ్లు కూడా బ్యాట్‌, బాల్‌ పట్టుకోని వీధుల్లో ఆడుకునేవారు. అలా అఫ్ఘాన్‌ పిల్లలకు, యువతకు క్రికెట్‌ అంటే ఇష్టం పెరిగింది. ఆ తర్వాత 1995లో అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఏర్పడింది. అయితే నాడు అఫ్ఘాన్‌ను పాలిస్తున్న తాలిబన్లు క్రికెట్‌పై నిషేధం విధించారు. ఇక 2001లో అఫ్ఘాన్‌లో ప్రజాపాలన మొదలైన తర్వాత క్రికెట్‌ ఆడుకునే స్వేచ్ఛ లభించింది. అటు పాకిస్థాన్‌ నుంచి తిరిగి అఫ్ఘాన్‌కు క్రికెట్‌ సైన్యం చేరుకుంది.

క్రికెట్‌ ఆడటానికి ఏ మాత్రం వనరులు లేని అఫ్ఘాన్‌ రోడ్డుపైనా, చిన్న చిన్న గ్రౌండ్‌లల్లో గేమ్‌ ఆడుకునేది. అయితే అఫ్ఘాన్‌ క్రికెట్‌ను మలుపు తిప్పిన ఘనత మహ్మద్‌ నబీకే దక్కుతుంది. 2001లో పాకిస్థాన్‌ నుంచి అఫ్ఘాన్‌కు తిరిగి వచ్చిన నబీ చురుగ్గా క్రికెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. మొహమ్మద్ షెహజాద్, అస్ఘర్ ఆఫ్ఘన్, షాపూర్ జద్రాన్‌లతో క్రికెట్ ఆడేవాడు. వీరందరూ కూడా అఫ్ఘాన్‌ జాతీయ జట్టులో కీలక ఆటగాళ్లగా మారారు.

నబీతోనే మొదలు:
2006లో ముంబైలో జరిగిన మ్యాచ్‌ అఫ్ఘాన్‌ క్రికెట్‌ టాలెంట్‌ను ప్రపంచక్రికెట్‌కు పరిచయం చేసింది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)తో జరిగిన టూర్ మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ తరఫున బరిలోకి దిగిన నబీ 116 పరుగులతో సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌ను వీక్షించిన మాజీ ఇంగ్లండ్‌ టెస్ట్ కెప్టెన్ మైక్ గాటింగ్ నబీని ఇంగ్లాండ్‌లోని MCC యంగ్ క్రికెటర్స్ ప్రొగ్రామ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ క్రికెట్ దిగ్గజాలు సచిన్‌, ఇంజీమామ్‌కు బౌలింగ్‌ చేసే అవకాశం నబీకి లభించింది. అలా అఫ్ఘాన్‌ తరుఫున నబీ వివిధ ఆటగాళ్లతో పాటు ధనిక బోర్డులకు దగ్గరయ్యాడు. ఇదే ఆ తర్వాత కాలంలో ఐసీసీకు అఫ్ఘాన్‌కు దగ్గర చేసింది.

నబీ అఫ్ఘాన్‌ క్రికెట్‌కు ఎంత సేవ చేశాడో చెప్పేందుకు ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కేవిన్‌ పీటర్‌సన్‌ మాటలే ప్రత్యేక్ష ఉదాహరణ. బిగ్‌బాష్ లీగ్‌లో తన జట్టును ఓడిపోయే స్థితి నుంచి నబీ గెలిపించిన తర్వాత అతిడిని పీటరస్‌ ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ అఫ్ఘానిస్థాన్‌’ అంటూ కీర్తించాడు. ఇప్పటికీ పీటర్‌సన్‌ కామెంటరీ బాక్స్‌లో ఉన్నప్పుడు నబీ గురించి ప్రస్థావన వస్తే ‘ప్రెసిడెంట్‌’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తాడు కేపీ. అఫ్ఘాన్‌ క్రికెట్‌ను నబీ ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడో చెప్పడానికే తానీ బిరుదు ఇచ్చినట్టుగా కేపీ చెబుతుంటాడు.

ఇక అఫ్ఘానిస్థాన్‌ను తొలి రోజుల్లో ఆదుకున్న క్రెడిట్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకే దక్కుతుంది. ఐసీసీ(ICC)లో అఫ్ఘాన్‌కు అనుబంధ సభ్యత్వం వచ్చిందంటే అది పాకిస్థాన్‌ కారణంగానే జరిగింది. తమకు సాయం చేయాలని ఏసీబీ(ACB) పాకిస్థాన్ క్రికెట్ బోర్డును సంప్రదించింది. ఈ విషయాన్ని పాక్‌ బోర్డు ఐసీసీ వద్దకు తీసుకెళ్లింది. అఫ్ఘాన్‌ క్రికెట్‌ సాధించిన వృద్ధిని చూసిన ఐసీసీ 2001లో అనుబంధ సభ్య దేశంగా హోదాను ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సంవత్సరంలోనే క్రికెట్ ఆడేందుకు అఫ్ఘాన్‌ పాకిస్థాన్‌లో పర్యటించింది.

రషీద్ ఖాన్ (File)

చిన్న జట్లను ఓడిస్తూ…:
2009లో డివిజన్‌ క్రికెట్‌లో ఛాంపియన్‌గా నిలిచిన అఫ్ఘాన్‌ ఆ తర్వాత 2010లో తొలిసారి అంతర్జాతీయ టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత నుంచి క్రమక్రమంగా అఫ్ఘాన్‌ ఎదుగుతూ వచ్చింది. ఆ తర్వాత 2011లో అఫ్ఘాన్‌కు వన్డే హోదా లభించింది ఐర్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్ లాంటి జట్లను ఓడించిన అఫ్ఘాన్‌ తొలి రోజుల్లోనే చిన్న జట్లను ఓడిస్తూ నిచ్చెనమెట్లు ఎక్కింది. ఆ తర్వాత 2013లో ICC అసోసియేట్ సభ్యత్వం కూడా అఫ్ఘాన్‌కు లభించింది.

ఐపీఎల్‌.. బీబీఎల్‌…:
ఇక అఫ్ఘాన్‌ తొలి రోజుల్లో క్రికెట్‌ జట్టు ప్రాతినిధ్యం వహించిన వాళ్లంతా పాకిస్థాన్‌లో శరణార్థులగా క్రికెట్‌ నేర్చుకున్న వారే. అయితే ఆ తర్వాత కాలంలో అఫ్ఘాన్‌ గడ్డపై నుంచే నేరుగా యువత క్రికెట్‌లో అద్భుతాలు చేస్తూ వచ్చింది. 2015లో రషీద్‌ ఖాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అఫ్ఘాన్‌ క్రికెట్‌ స్థాయిను అమాంతం పైకి తీసుకెళ్లాడు. నబీ అండర్‌లో రషీద్‌ రాటు దేలాడు. ఇటు ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియన్‌ బిగ్‌బాష్ లీగ్‌(BBL)లోనూ అఫ్ఘాన్‌ ఆటగాళ్లు కీలక ప్లేయర్లగా మారిపోయారు. ముఖ్యంగా రషీద్‌ బౌలింగ్‌లో అఫ్ఘాన్‌ క్రికెట్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లిందనే చెప్పవచ్చు. కోహ్లీ, ఏబీడీ, గేల్‌, ధోనీ లాంటి ఆటగాళ్లను సైతం రషీద్‌ కట్టడి చేసిన తీరు అతడిని అందరిలో ఒకడిగా నిలబెట్టింది. ఇది అఫ్ఘాన్‌లో క్రికెట్‌ పట్ల మరింత క్రేజ్‌ను పెంచేలా చేసింది. ఆ తర్వాత కాలంలో 2017లో ఐసీసీలో పూర్తిస్థాయి సభ్యత్వం కూడా వచ్చింది. ఇలా అనుబంధ సభ్యత్వం, అసోసియట్‌ సభ్యత్వం, పూర్తిస్థాయి సభ్యత్యం మూడు తెచ్చుకోవడానికి అఫ్ఘాన్‌కు కేవలం 16ఏళ్లు(2001-2017) పట్టింది.

యువరక్తంతో అఫ్ఘాన్‌ క్రికెట్‌ను మరో ఎత్తుకు తీసుకెళ్లిన కోచ్‌:
అయితే చాలామందికి తెలియని అఫ్ఘాన్‌ క్రికెట్ హీరో ఒకరున్నారు. అతని పేరు ఆండీ మోల్స్. గతంలో అఫ్ఘాన్‌ క్రికెట్‌ టీమ్‌కు కోచ్‌గా పని చేశాడు మోల్స్‌.

2017 అఫ్ఘానిస్థాన్‌ U-19 క్రికెట్ టీమ్‌

పైన ఉన్న క్రికెట్‌ టీమ్‌ను చూడండి.. ఇదంతా మోల్స్‌ వారసత్వం.. మోల్స్‌ తీసుకొచ్చిన కుర్రాళ్ల బలగం. ఇప్పుడు అఫ్ఘాన్‌ను ముందుండి నడిపిస్తున్న వారంతా పైన ఉన్న పేర్లలో ఉన్నవారే. అప్పుడు వారంతా యువరక్తం. ఈ జట్టును గోల్డెన్‌ జనరేషన్‌ అని అఫ్ఘాన్‌ ప్రజలు పిలుస్తుంటారు. ఎందుకంటే జాతీయ జట్టు కంటే ముందే ఈ అండర్-19 జట్టు ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అంతే కాదు అండర్-19 ఆసియా కప్‌ను కూడా ఈ జట్టు గెలుచుకుంది. అందులో ఉన్న నవీన్‌-ఉల్‌-హక్‌, ముజీబ్‌ మనందరికి సుపరిచితులే. టీనేజ్‌లోనే వారి ప్రతిభను వెలికితీసిన మోల్స్‌కు అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎప్పుడూ రుణపడే ఉంటుంది. కరోనా సమయంలో అఫ్ఘాన్‌ క్రికెట్‌ బోర్డు తీవ్ర నష్టాల్లో పేరుకుపోవడంతో కోచింగ్‌ స్టాఫ్‌కు డబ్బులు ఇచ్చుకోలేకపోయింది. ఈ కారణంతో మోల్స్‌ జట్టును వీడారు.

ఇండియా సాయం అపురూపం:
ఇటు టీ20 వరల్డ్‌కప్‌తో పాటు 2023లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్‌ జట్లను అఫ్ఘానిస్థాన్‌ ఓడించిన వెంటనే చాలామంది బీసీసీఐకి క్రెడిట్లు ఇవ్వడం ప్రారంభించారు. నిజానికి అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎదుగుదలలో భారత్‌ పాత్ర మరువలేనిది. గ్రేటర్ నోయిడాలోని షహీద్ విజయ్ సింగ్ పాఠిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ 2015లో అఫ్ఘాన్‌ క్రికెట్‌కు తాత్కాలిక హోమ్ గ్రౌండ్‌గా మారింది. ఎందుకంటే అఫ్ఘాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాల సంఖ్య 10లోపే ఉంది. అవి కూడా మంచి స్టాండర్డ్స్‌లో ఉండవు. అఫ్ఘాన్‌లో పేదరికానికి కారణమైన రష్యా, అమెరికాలు ఏనాడు కూడా ఆ జట్టును పట్టించుకోలేదు. ఇండియా మాత్రం అఫ్ఘాన్‌ క్రికెట్‌కు వనరులు అందించింది. ఏకంగా హోం గ్రౌండ్‌నే ఇచ్చింది. 2017లో గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్‌తో అఫ్ఘాన్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడింది.

సౌకర్యాలు కల్పించడం ద్వారా అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎదుగుదలకు కారణమైంది బీసీసీఐ. అయితే కేవలం సౌకర్యాలు కల్పించడం మాత్రమే కాదు.. భారత మాజీ ఆటగాళ్లు లాల్‌చంద్ రాజ్‌పుత్, మనోజ్ ప్రభాకర్, అజయ్ జడేజాలు గతంలో అఫ్ఘాన్‌ జట్టుకు కోచింగ్‌, మెంటర్లగా పనిచేశారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌ సమయంలో అజయ్‌ జడేజా అఫ్ఘాన్‌ మెంటార్‌గా పైసా ఫీజు తీసుకోకుండా సేవలందించాడు.

ఇలా అఫ్ఘాన్‌ క్రికెట్‌ ఎదుగుదలలో క్రికెట్‌ ప్రపంచం అందించిన సహాకారం వెలకట్టలేనిది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అప్ఘాన్‌ ఆటగాళ్ల గురించే. 2021లో అఫ్ఘాన్‌ తిరిగి తాలిబన్ల చేతిల్లోకి వెళ్లిపోయిన తర్వాత అక్కడి క్రికెట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అసలు తాలిబన్లకు క్రికెట్‌ అంటే ఏ మాత్రం ఇష్టం లేదు. 2001కు ముందు తాలిబన్ల పాలనలో క్రికెట్‌ ఆడడం నేరంగా ఉండేది. అయితే 2021లో తాలిబన్ల చేతిల్లోకి తిరిగి అధికారం వచ్చే సమయానికి అఫ్ఘాన్‌ క్రికెట్‌కు మంచి పేరు ఉంది. దీంతో కేవలం మహిళల క్రికెట్‌ను మాత్రమే తాలిబన్లు బ్యాన్‌ చేశారు. ఇటు పురుషుల క్రికెట్‌ ద్వారా తమకు అంతర్జాతీయంగా మంచిపేరే వస్తుందని భావించిన తాలిబన్లు మెన్స్‌ టీమ్‌ జోలికి రాలేదు. అలాగని మద్దతూ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లపై టీ20 ప్రపంచకప్‌లో గెలుపు తర్వాత తాలిబన్‌ ప్రభుత్వం రషీద్‌ఖాన్‌తో మాట్లాడడం వారి అవకాశవాదానికి నిదర్శనం కాకపోతే మరొకటి కాదు. ఇటు తాలిబన్లు మహిళ జట్టును బ్యాన్‌ చేయడంతో అఫ్ఘాన్‌లో పర్యటించేందుకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మహిళలను తిరిగి ఆడనిస్తేనే అఫ్ఘాన్‌లో పర్యటిస్తామని తెగెసి చెప్పాయి. అయినా తాలిబన్లు వెనక్కి తగ్గలేదు.

పడిన చోటే లేచిన అఫ్ఘాన్‌:
మరోవైపు ఈ పరిణామాలు అఫ్ఘాన్‌ పురుషుల జట్టుపై మానసికంగా తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయినా అఫ్ఘాన్‌ జట్టు వెన్నుచూపలేదు.. కుంగిపోయినా పైకి లేచి నిలబడింది.. తడబడిన చోటే తొడగొట్టింది.. 2023 వన్డే ప్రపంచకప్‌లో అగ్రజట్లను ఓడించడంతో పాటు 2024 టీ20 వరల్డకప్‌లో సెమీస్‌వరకు వచ్చింది. ఇక భవిష్యత్‌లో అఫ్ఘాన్‌ ఎన్ని అద్భుతాలైనా సృష్టించవచ్చు.. క్రికెట్‌ ప్రేమికులను ఇలానే అలరిస్తూ ఉండొచ్చు.. 1980ల నుంచి 2024 వరకు అఫ్ఘాన్‌ క్రికెట్‌ ప్రయాణం ఎంతోమందికి నిజంగా స్పూర్తిదాయకం..!

Also Read: నరకంగా మారిన శుభకార్యలు.. గుదిబండగా మారిన ఆడంబరాలు!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *