Menu

Dogs Vs Humans: మనిషితత్వం, కుక్కతత్వం మధ్య యుద్ధం..! ఈ సమస్యకు అసలు మూలం ఓ దిక్కుమాలినతత్వం!

Tri Ten B 2 weeks ago
India’s 60 million street dogs are turning from village scavengers to city territory defenders

మొన్న ఇంటి దగ్గర ఒక సీన్ చూశాను. ఒక కుక్కను మధ్యలో పెట్టి అటు నుంచి ఇటు నుంచి కొంతమంది మనుషులు రాళ్లతో బెదిరిస్తూ హింసించారు..! పొద్దున లేచేసరికి ఆ కుక్క పిచ్చికుక్కలా అరస్తూ కనిపించింది. దాన్ని ఏ కుక్కా కరవలేదు.. మనుషులే దాని మనసును క్రూరంగా కరిచారు. ఇది మనిషితత్వం..! హిమాచల్ ప్రదేశ్‌లో తనకు ఫుడ్డు, బెడ్డు ఇచ్చిన యజమాని చచ్చిపోతే ఓ పెంపుడు కుక్క అతని సమాధి దగ్గరే నాలుగు రోజులు కాపల కాసిందట..ఇది కుక్కతత్వం..! ఇదంతా ఒక వెర్షన్..! ఓవైపు కుక్కల రక్షణ కోసం ఉద్యమాలు చేసే రేణుదేశాయ్‌ లాంటి గొప్ప మనసున్న మనుషులు కనిపిస్తుంటే మరోవైపు అన్నెం పున్నెం ఎరుగని చిన్నపిల్లలపై క్రూరంగా దాడులు చేస్తున్న కుక్కలు మరోవైపు..! ఇది ఇంకో వెర్షన్..! నిజానికి ఈ రెండు వెర్షన్లు నిజాలే..! ఇందులో పొల్లు కూడా తప్పులేదు.! మరి సమస్య ఎక్కడ మొదలైంది?

మనిషిలా కాదు.. కొన్నిసార్లు కుక్కలా ఆలోచించడమే ఈ భూమికి మేలు

మనిషిబుద్ధి అంటుంటాం. కుక్కబుద్ధి అంటుంటాం. కానీ నిజంగా చూస్తే ఈ రెండింటిలో ఎవరిది ఎక్కువ క్రూరత్వం అనే ప్రశ్న ఎవరూ అడగరు. మనిషి తాను జంతువు కాదని భ్రమపడతాడు. నిజానికి ఈ భూమిపై మనిషి ప్రత్యేక జీవి కాదు. కోట్లాది జీవజాతుల్లో ఒక జాతి మాత్రమే. జీవశాస్త్రం చెప్పే నిజం కూడా ఇదే. మన స్కూల్‌ పుస్తకాల్లో ఉండే మాట కూడా ఇదే. మనిషి కూడా జంతువే. కానీ మనిషి ఈ మాట వినడు. ఎందుకంటే వినడం కంటే పాలించడం, అధికారం చెలాయించడం మనిషికి ఇష్టం. అందుకే అడవులు నరికాడు. నదులను చంపాడు. పర్వతాలను త్రవ్వాడు. అటవీ ప్రాంతాల్లో అడ్డగోలుగా రోడ్లు వేశాడు. చివరకు జంతువులకు నిలువ నీడలేకుండా చేశాడు. చివరకు జంతువులు రోడ్డు మీదకి వచ్చాయి. అవి తలదాచుకునే స్థలం లేక బయటకు వస్తున్నాయంటే అది వాటి తప్పా? మనిషి చేసిన ఆక్రమణకు వచ్చిన ఫలితం కాదా ఇది? ఇంత చేసినా మనిషి తన తప్పులను ఒప్పుకోడు.. ఇతర జంతువులపై తీర్పులు కూడా మనిషే ఇస్తాడు. ఎవరు బ్రతకాలి.. ఎవరు చనిపోవాలో నిర్ణయిస్తాడు. ఎంత అధికారమదమిది?

ఇప్పుడు కుక్కలను చంపుతున్నారు. కుక్కలు దాడి చేస్తున్నాయట. పిల్లలు చనిపోతున్నారట.. అవును.. ఈ భయం నిజమే.. తల్లిదండ్రుల బాధ కూడా నిజమే. ఆ కడుపు కోతకు కోపం రావడం సహజమే..! అయితే కుక్కలు ఒక్కరోజులోనే ఇంత క్రూరంగా మారాయా అనే ప్రశ్న వేస్తే మనిషికి ఏం చెప్పాలో తెలియడంలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నకి సమాధానం వెతికితే మనిషి తన ముఖాన్ని తానే అద్దంలో చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కుక్కలు ఎక్కువగా ఎవరిని దాడి చేస్తున్నాయి? బలహీనులను.. ఎదురు చెప్పలేని పిల్లలను, వృద్ధులను..! ఒంటరిగా వెళ్లే మనషులను..! ఇలా ఎందుకు చేస్తున్నాయి? అదే మనిషి చూపిన మార్గం. మనుషులతో సావాసం పెరిగిన కొద్దీ కుక్కలు తమ సహజతత్వాన్ని కోల్పోయాయి. మనిషితత్వాన్ని అలవర్చుకున్నాయి. బలహినులపై ఆధిపత్యం, తక్కువవాడిపై అధికార ప్రదర్శన చేయడమే మనిషి లక్షణం.. మనుషులతో తిరిగి తిరిగి కుక్కలు నేర్చుకున్న గొప్ప కళాఖండమిదే.

ఇప్పుడు ఇక్కడ ఒక అడుగు వెనక్కి వేసి మొత్తం సినిమాను చూడాలి. ఆధిపత్యం అనేదే అసలైన సమస్య. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక స్థానం ఉంటుంది. అడవిలో సింహానిది పైచేయి. నీటిలో షార్క్‌ది పైచేయి. కానీ ఆ ఆధిపత్యానికి ఒక పరిమితి ఉంటుంది. ఆకలి తీరితే వేట ఆగుతుంది. భద్రత దొరికితే దాడి ఆగుతుంది. ప్రకృతిలో ఎవరూ అవసరానికి మించి చంపరు. అవసరానికి మించి ఆక్రమించరు. ఈ నియమాన్ని ఉల్లంగించిన ఒకే ఒక్క జీవి మనిషి మాత్రమే.

ఈ భూమిపై ఇప్పటివరకు సుమారు 80 లక్షలకుపైగా జీవజాతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతారు. అందులో ఒక్క మనిషి జాతి మాత్రమే మిగతా జీవుల స్థలాన్ని కబ్జా చేసింది. గత వందేళ్లలోనే లక్షలాది జాతులు అంతరించిపోయాయి. అడవులు తగ్గిపోయాయి. నదులు ఎండిపోయాయి. పక్షులకు ఆకాశం ఉన్నా చెట్లు లేవు. జంతువులకు భూమి ఉన్నా అడవులు లేవు. ఇది ప్రకృతి చేసిన తప్పు కాదు. ఇది మనిషి పక్కా ప్లాన్ చేసిన ప్రకృతి విధ్వంసం.

మనుషులపై వీధికుక్కల దాడి అని వార్తలు రాసుకోడానికి చేతులు, టెలికాస్ట్ చేసుకోసుకోడానికి టీవీ ఛానళ్ళు, పోస్టులు, వీడియోలు పెట్టడానికి సోషల్ మీడియాలు ఏడ్చాయి. మరి భూమిపై ఉండే జీవులు, ప్రకృతి వనరులపైన మనిషి చేస్తున్న దాడులను ప్రొజెక్ట్ చెయ్యాలంటే మనిషికి నిలువెల్లా నిండిపోయిన పచ్చి స్వార్థం, నాగరికత ముసుగులో చేస్తున్న దోపిడీ, అవకాశవాదం అడ్డొస్తాయ్. ఎందుకంటే మనిషి అనే పేరును తనకు తానే పెట్టుకున్న మనిషి.. పరిణామక్రమంలో తనకు సంక్రమించిన బుద్ధిని భూమిపై అధికారాన్ని చేలాయించడానికి ఉపయోగిస్తూ మేధస్సు అని నోరుంది కాబట్టి డప్పేస్కుంటున్నాడు. నిజానికి కపటం, అవినీతి, అరాచకం, నిర్దయ, అధికారమదం, అంతులేని స్వార్థం, అత్యాశ ఇలా సకల అవలక్షణాలు మాత్రమే మనిషితత్వం.

ఓవైపు మనిషి అభివృద్ధి అంటాడు. కానీ ఆ అభివృద్ధిలో జంతువుకు చోటు లేదు. అడవిలో రోడ్డు వేసినప్పుడు జంతువు దారి తప్పుతుంది. అడవిని చీల్చినప్పుడు జీవవ్యవస్థ చీలిపోతుంది. తర్వాత ఆ జంతువు పట్టణంలోకి వస్తుంది. అప్పుడు ఈ జీవి అడ్డంగా ఉందంటాడు. ప్రమాదమంటాడు. తొలగించాలంటాడు. చంపాలంటాడు. ఇక్కడే ఓ విషయాన్ని గమనించాలి. మనిషి తనను ప్రకృతికి భాగంగా చూడటం మానేశాడు. తాను ప్రకృతి మీద అధికారం కలిగిన న్యాయమూర్తినని భావిస్తున్నాడు. మరి ప్రకృతి మనిషికి ఆ హక్కు ఇచ్చిందా అనే ప్రశ్నకి సమాధానం ఎవరూ చెప్పరు.

ఇప్పుడు జరుగుతున్న కుక్కల ఎపిసోడ్‌ ఈ మొత్తం వ్యవస్థలో ఒక టీజర్ మాత్రమే. వాస్తవానికి కుక్కలు ఈ సమస్యకు మూలం కాదు. అవి ఈ వ్యవస్థలో పెరిగిన దానికి అనుభవిస్తున్న ఫలితం. ఇక్కడ కుక్కల మీద కోపం చూపించడం సులభం. వాటికి మాటలు లేవు. వాటికి వాదనలు లేవు. వాటికి కోర్టులు లేవు. కానీ ఈ సమస్యని అక్కడితో ఆపేస్తే అసలు నేరస్తుడైన మనిషి మళ్లీ తప్పించుకుంటాడు. ఇప్పుడు మనిషి చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన పని ఏంటంటే తనకు సమస్య ఎదురైతే చంపడమే పరిష్కారం అని నిర్ణయించుకోవడం. అడవిలోకి వచ్చిన జంతువు సమస్య, కాటు వేసిన కుక్క సమస్య, పంట పాడుచేసిన అడవి జంతువు సమస్య. ఇలా సమస్య వచ్చిందంటే తొలగించాలి. తొలగించాలంటే చంపాలి. ఇదే మనిషికి తెలిసిన నీతిమాలిన న్యాయం. ఇదే మనిషికి తెలిసిన మతిమాలిన మేధస్సు.

అయితే ఈ లాజిక్‌ని కాస్త ముందుకు తీసుకెళ్లి చూస్తే అసలు భయం మొదలవుతుంది. మనిషి కారణంగా భూమి ఉష్ణోగ్రత పెరిగింది. వరదలు వస్తున్నాయి. కరువులు వస్తున్నాయి. మరి ప్రకృతి కూడా అదే లాజిక్ వాడితే ఏమవుతుంది? భూమికి మనిషి సమస్యగా కనిపిస్తే ఏం జరుగుతుంది? అప్పుడు మనిషికి ఏ న్యాయం మిగులుతుంది? మనిషి ఒక విషయం మర్చిపోతున్నాడు. తాను ఈ భూమికి రాజు కాదు. ఈ భూమి మనషి చుట్టూ తిరగదు. మనిషి లేకుండానే ఈ భూమి కోట్ల సంవత్సరాలు బతికింది. మనిషి అంతరించిపోయినా బతుకుతుంది. ఈ నిజాన్ని అంగీకరించాలంటే మనిషికి అసహ్యం. అందుకే తన భద్రతే అన్నిటికంటే ముఖ్యం అంటాడు. తన పిల్లల ప్రాణాలే అన్నిటికంటే ముఖ్యం అంటాడు. ఇది తప్పు కాదు. కానీ తన భద్రత కోసం మిగతా జీవులన్నిటిని శిక్షించడమే తప్పు.

కుక్కల దాడుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో నిజం బయటకు తీయాలి. ప్రతి దాడి వెనుక ఒక కారణం ఉంటుంది. భయం ఉంటుంది. ఆకలి ఉంటుంది. స్థలాభావం ఉంటుంది. మనుషుల హింస ఉంటుంది. మనుషుల కొట్టుడు ఉంటుంది. మనుషుల బెదిరింపు ఉంటుంది. కుక్క పిచ్చిగా మారడానికి ఇంకో కుక్క కరవాల్సిన అవసరం లేదు. మనిషి ప్రవర్తనే చాలుసార్లు సరిపోతుంది. మనిషి కుక్కలను బలహీనులపై దాడి చేస్తున్నాయని తిడుతున్నాడు కానీ అదే మనిషి తన సమాజంలో బలహీనులపై ఏం చేస్తున్నాడు? పేదలపై అధికారం, మహిళలపై హింస, చిన్నవాళ్లపై లైంగిక దాడులు, మాటలతో-చట్టాలతో-బలంతో తొక్కడం. అదే పాఠం కుక్కలు నేర్చుకున్నాయి. మనిషి తన అద్దంలో కనిపించే ప్రతిబింబాన్నే ఇప్పుడు రోడ్ల మీద చూస్తున్నాడు.

అందుకే అసలు సమస్య కుక్కలు కాదు. అసలు సమస్య మనిషి మనసే. ఆధిపత్యం లేకపోతే భయం తగ్గుతుంది. భయం తగ్గితే హింస తగ్గుతుంది. కానీ ఆధిపత్యం వదలడానికి మనిషి సిద్ధంగా లేడు. ఎందుకంటే అధికారం అతనికి మత్తు. అదే మత్తు అతన్ని క్రూరంగా మార్చుతోంది. ఇలా చంపడం పరిష్కారం కాదు. అది ఒక పారిపోయే మార్గం మాత్రమే. సమస్యను ఎదుర్కొకుండా నోరు మూయించేయడం లాంటిదే ఇది కూడా. కానీ సమస్య అక్కడే మిగులుతుంది. రూపం మారుతుంది. బాధితుడు మారతాడు. ఈరోజు కుక్క, రేపు ఇంకో జంతువు, ఎల్లుండి ఇంకేదో జీవి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? మనిషి తన స్థానాన్ని గుర్తుంచుకునే రోజు ఈ సమస్యలకు ముగింపు ఉంటుంది. తాను యజమాని కాదని, ప్రకృతిలో ఓ భాగమని అర్థం చేసుకున్న రోజే సమస్య సాల్వ్ అవుతుంది. అప్పటివరకు ఈ భూమిపై మనిషితత్వం అనే పేరు వినడానికి బాగుంటుంది కానీ దాని నీడలో మాత్రం క్రూరతత్వం రాజ్యామేలుతూనే ఉంటుంది!

ALSO READ: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *