‘మానవజాతి ముందుకు వెళ్లాలంటే, భూమిని వదిలిపెట్టి కొత్త గ్రహాలను అన్వేషించాలి..’ ఇది ఎన్నో ఏళ్ల క్రితం స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక. ఆయన మరణించి 7ఏళ్లు దాటినా ఇప్పటికీ హాకింగ్ హెచ్చరికలను, సూచనలను ప్రపంచం పట్టించుకున్నట్టు కాని.. పాటిస్తున్నట్టు కాని ఎక్కడా కనిపించడంలేదు. ఇంతకీ హాకింగ్ ఎందుకలా వార్నింగ్ ఇచ్చారు? ఈ శతాబ్దం చివరి నాటికి భూగోళం అగ్నివేడికి బద్దలవనుందా? ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశులు అంతరించనున్నాయా? ఇది అర్థంకావాలంటే ముందుగా హాకింగ్ ఏం చెప్పారో పూర్తిగా తెలుసుకోవాలి.
మంచుకొండలు కరిగిపోతున్నాయా?
సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం, నరాల్లో చలి పాకినట్టు అనిపించే సమయం ఒకప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉండేదో కదా..! మీ చిన్నప్పటికి, ఇప్పటికీ సాయంత్రం వేళల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించారా? ఇప్పుడు అసలు స్వచ్ఛమైన ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారినట్టు అనిపించడంలేదా? నాకైతే అనిపిస్తోంది. ప్రకృతి నుంచి వినిపించే సంగీతం మూగబోయినట్టు.. మన భూమి నెమ్మదిగా జీవశక్తిని కోల్పోతున్నట్టు అనిపిస్తోంది. ఇది నా మాటలు కాదు.. స్టీఫెన్ హాకింగ్ మాటల సారాంశం కూడా ఇదే. ఓవైపు సముద్ర మట్టం పెరుగుతోంది.. మరోవైపు మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇదంతా ప్రపంచాన్ని శాసించే రాజకీయనేతలకు కనిపిస్తున్నాయో లేదో కానీ ఈ పరిస్థితులను భూమి గమనిస్తోంది. వేడి తట్టుకోలేని పుడమి తల్లి వేదనలో అర్తనాదం చేస్తోంది. ఒక్కసారి స్టీఫెన్ హాకింగ్ మాటలు గుర్తు చేసుకుందాం..! మనిషికి భూమిపై జీవించడానికి ఎక్కువ సమయం లేదని చెప్పిన హాకింగ్.. ఈ శతాబ్దం ముగిసేలోపే మనుషుల తీరు మారకపోతే ఈ భూమి ఏ జీవకణానికీ అనుకూలంగా ఉండదని హెచ్చరించారు. మనం బతకాలంటే… ఈ భూమిని వదిలి వెళ్లాల్సిందేనని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
నిద్రలేస్తున్న అగ్నిపర్వతాలు:
ఆయన చెప్పిన మాటలు ఊహాగానం కానే కాదు. భవిష్యత్తులో మానవజాతి ఎదుర్కొనే శాపం. హాకింగ్ మాటల ప్రకారం.. మనం జాగ్రత్తగా ఉండకపోతే.. భూమి మరో వీనస్గా మారనుంది. అంటే శుక్ర గ్రహం అన్నమాట. ఇది భగభగమని మండిపోయే గ్రహం. భూమి ఉష్ణోగ్రతలు కూడా 250 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంటాయని హాకింగ్ చెప్పారు. హాకింగ్ చెప్పింది జరిగితే సముద్రాలు మునుపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నీటి చివరి చుక్క కూడా ఎండిపోయి ఆవిరైపోతుంది. చెరువులు, నదులు, మహాసముద్రాలు ఇవేవీ ఉండవు. మబ్బులు కనిపించవు. వర్షం ఎప్పటికీ రాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ భూగోళం వేడిలో కాలిపోతూ ఉంటుంది. అప్పుడు నేల చీలిపోతుంది. భూమి లోపలి అగ్ని బయటికి వస్తుంది. అగ్నిపర్వతాలు నిద్రలేస్తాయి. మంటలు భూమి మీద నడుస్తాయి. గాలి కాలుష్యంతో నిండిపోతుంది. ఆక్సిజన్ అక్కడ ఉండదు. ఊపిరి తీసుకోవడం అసాధ్యం అవుతుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు విపరీతంగా పెరిగితే గాలి విషంగా మారిపోతుంది. ఒక్క మట్టికణం కూడా జీవించలేని స్థితి ఏర్పడుతుంది. అటు సమస్త జీవులను కాపాడే చెట్లు.. నీళ్లు లేక చనిపోతాయి..! పచ్చదనం పూర్తిగా మాయమయ్యే ఆ రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు హాకింగ్. వాతావరణ మార్పులతోనే ఇదంతా జరుగుతోందని వివరించారు. ఆయన చెప్పిన ప్రతీ మాట అక్షరాల నిజవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మీతేన్ వాయువులు పెరిగితే ఏమౌతుంది?
ఒకప్పుడు ఎండతో అల్లాడిన ప్రాంతాల్లో ఇప్పుడు వరదలు పోటెత్తుతున్నాయి. ఒకప్పుడు మంచుతో కప్పి ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు పొడిబారిన నేల కనిపిస్తోంది. భూమి ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరుగుతున్నాయి. గత 100 సంవత్సరాల్లో భూమి ఉష్ణోగ్రత సగటున 1.2 డిగ్రీల వరకు పెరిగింది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే మరికొన్ని ఏళ్లలో 2 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు మంచు కొండలు కరిగిపోతాయి. సముద్ర మట్టం ఎప్పుడూ లేని విధంగా పెరుగుతుంది. ఇది తుఫానులు, సునామీలకు కారణం అవుతుంది. 1990 తర్వాత మంచు కరిగే వేగం రెండు రెట్లు పెరిగింది. ఇది భూమిని మరింత వేడెక్కిస్తోంది. అంటార్కిటికాలో సైతం మంచు పర్వతాలు విరిగిపడుతున్నాయి. ఇవి సముద్ర మట్టాన్ని పెంచి, తీరప్రాంతాలను ముంచేస్తున్నాయి. సముద్రం వేడెక్కడం కారణంగా అది వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. సముద్రంలో కార్బన్ నిల్వలు ఎక్కువై.. మితేన్ వాయువు విడుదల అవుతోంది. ఇది భూమిని వేడెక్కించే విషపూరిత వాయువు. సముద్రపు జీవాలు ఆక్సిజన్ కోసం పోరాడాల్సిన దుస్థితి దాపరించింది. ఒకవేళ సముద్రంలోని జీవాలు చనిపోతే దాని ప్రభావం భూమిపై తిరిగే జీవాలపైనా పడుతుంది.
పెరుగుతున్న తుపాన్ల తాకిడి:
కేవలం సముద్రాలే కాదు.. మన పీల్చుతున్న గాలి కూడా కలుషితమే. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు గత 8లక్షల సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. మనం వాడే వాహనాలు, పరిశ్రమల పొగలు, అడవుల తగలబడటం.. ఇవన్నీ భూమి వాతావరణాన్ని మరింత హానికరంగా మారుస్తున్నాయి. దీనివల్ల భయంకరమైన తుపానులు పుట్టుకొస్తున్నాయి. గత 20 సంవత్సరాల్లో తుఫాన్ల తాకిడి 50శాతం పెరిగింది. ఇప్పుడు సంభవిస్తున్న తుపానులు ఒక్కరోజులోనే నగరాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి.
భూమి మిగలదు
అటు భూమి లోపల పొరలలో ఒత్తిడి పెరగడం కారణంగా అగ్నిపర్వతాలు మెల్లగా మేల్కొంటున్నాయి. భూకంపాలు పెరుగుతున్నాయి. భూమి లోపలి వేడి మరింతగా పెరిగే కొద్దీ, భూమి తట్టుకోలేని స్థితికి చేరుకుంటుంది. అటు ప్రపంచాన్ని నడిపిస్తున్న పాలకులు మాత్రం వాతావరణ మార్పుల గురించి పెద్దగా శ్రద్ధ చూపించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధాలు, వాణిజ్యం, రాజకీయాలపైనే తప్ప వాతావారణ మార్పు అంశాన్ని పట్టించుకునే నాయకులు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. భూమి కనుమరుగవుతున్నా.. భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నా.. మార్పు కోసం దేశాధినేతలు ఆలోచించకపోవడం అత్యంత బాధాకరం. ఉష్ణోగ్రతలు పెరిగి చెట్లు, జీవజాలం నశించిన రోజున మానవుడు తన వినాశనానికి తానే సాక్షిగా నిలుస్తాడు. హాకింగ్ చెప్పినట్లుగానే.. భూమి మనకోసం మిగలదు.. ఇక మీరే ఆలోచించండి.. ఇప్పటికైనా మార్పు కోరుకుంటామా? లేదా భూమితో కలిసి నశించిపోతామా? సమాధానం మన చేతుల్లోనే ఉంది… కానీ సమయం మాత్రం మిగిలి లేదు…!
ALSO READ: సింగర్ కల్పనకు ఉన్న సమస్య ఏంటి? నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలేంటి?

Moon Mining: చందమామకు తూట్లు పొడుస్తున్నారు.. ప్రపంచ దేశాల ఉన్మాద తీరు ఇది!
Disasters in Asia: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!
Climatic Change: వాతావరణ మార్పులతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం..ఈ రాష్ట్రానికి ఏమైంది?
Breast Milk Uranium: తల్లి పాలల్లోనూ విషం.. సైంటిస్టుల స్టడీలో షాకింగ్ నిజాలు!
Moon Endangered: జాబిల్లికి కష్టాలు..! చంద్రుడు కనిపించకుండా పోతాడా?
Human Brain: కొంతమంది వ్యక్తులకు భయమే తెలియదా? మన మెదడు చెబుతున్న షాకింగ్ ఫ్యాక్ట్ ఇదే!