Menu

South Africa Massacre: కార్మికులను ఆకలితో మాడ్చి చంపేసిన ప్రభుత్వం.. సొరంగంలో కుళ్ళిన శవాలకుప్పలు!

Tri Ten B
Stilfontein mine south africa deaths

అదొక అంధకార సొరంగం… ఒకప్పుడు బంగార గనిగా ప్రజలకు తెలిసేది.. కానీ ఇప్పుడు అది మనిషి శరీరాన్ని తినే మృత్యు గుహగా మారింది. ఓవైపు బంగారం కోసం వేట.. మరోవైపు ఆకలి కోసం పోరాటం.. ఇంకోవైపు ప్రభుత్వ ఉన్మాద నిర్ణయం 78మంది చావుకు కారణమైంది. ఇంతమంది తిండి లేక.. తాగడానికి నీరు లేక.. గుహలోని బొద్దింకలు తిని చనిపోవడం ఎంత దారుణమో దక్షిణాఫ్రికా పాలకులకే అర్థంకావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బాధిత కుటుంబాలు. దక్షిణాఫ్రికా-స్టిల్ఫాంటైన్(Stilfontein) పట్టణంలో ఉన్న బఫెల్స్‌ఫాంటైన్ గోల్డ్ మైన్‌లో చిక్కుకున్న బాధితుల కథ విషాదాంతమైంది. రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసిందని దక్షిణాఫ్రికా(south africa) పోలీసులు అధికారికంగా ప్రకటించారు. మొత్తం 333 మంది గుహలో చిక్కుకున్నారని.. అందులో 246 మందిని రక్షించినట్టు చెప్పారు. మిగిలిన 78 మంది మరణించినట్టుగా ధ్రువీకరించారు.

అబద్ధపు లెక్కలు

2024 ఆగస్టులో బఫెల్స్‌ ఫాంటైన్ గోల్డ్ మైన్‌లో అక్రమంగా బంగారం తవ్వుతున్న సుమారు 400 మంది కార్మికులు చిక్కుకుపోయారని వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు మాత్రం 333మందేనని ఇప్పుడు చెబుతున్నారు. కానీ అదే ఆగస్టులోనే ఏడుగురు చనిపోయినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 2024 నవంబర్‌లో గుహలో నుంచి 14 మంది తప్పించుకుని బయటపడ్డారు. ఈ లెక్క చూస్తే పోలీసులు చెబుతున్నది అబద్ధంగా అనిపిస్తోందని అక్కడి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. మిగిలిన వారు ఎప్పుడో చనిపోయి ఉండొవచ్చు అని భావిస్తున్నాయి. మరోవైపు ప్రాణాలతో బయటపడ్డ 246 మంది మానసిక స్థితి దయనీయంగా కనిపిస్తోంది. వారి శరీరాలు బక్కచిక్కిపోయి ఉన్నాయి. నెలల పాటు చీకటి తప్ప వెలుగును చూడని ఆ కళ్లు ఒక్కసారిగా సూర్యరశ్మిని తాకే సరికే విలవిలలాడిపోయాయి. అటు కుళ్లిపోయిన 87 శరీరాలు ఎవరివో ఎవరికీ అర్థంకావడం లేదు. శవాల నుంచి వస్తున్న వాసనను భరించలేక ఆ మృతదేహాల వద్దకు వెళ్లేందుకే ఎవరూ సాహసించడంలేదు. ఇంత అమానవీయ పరిస్థితికి ప్రభుత్వ వైఖరే కారణమని మానవహక్కుల సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

మాఫియా ఆగడాలకు బలి

ఇక దక్షిణాఫ్రికాలో అక్రమంగా తవ్వకాలు చేసేవారిని ‘జామా జామాస్‌’ అని పిలుస్తారు. వీరంతా బంగారం కోసం అక్రమంగా గనులను అన్వేషిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది దక్షిణాఫ్రికా పొరుగు దేశాల నుంచి వచ్చిన వలసదారులు. మొజాంబిక్, జింబాబ్వే, లెసోథో లాంటి దేశాల నుంచి వచ్చిన పేద ప్రజలు. వీరికి దేశంలో నివసించేందుకు సరైన డాక్యుమెంట్స్ ఉండవు. బంగారం లాంటి విలువైన లోహాల కోసం మూసివేసిన గనుల్లోకి వెళ్లి తవ్వకాలు చేస్తారు. వారి జీవనోపాధి ఇది మాత్రమే. గనుల్లో తవ్వకాలకు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగించరు. పాత పద్ధతులతోనే గనులను తవ్వుతారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. అందుకే గుహల్లోనే వీళ్లు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నెలల పాటు సొరంగాల్లోనే ఉంటారు. అదేంటి..! నెలల పాటు గన్నుల్లోనే ఉంటే తిండి ఎట్లా తింటారు? నీరు ఎలా తాగుతారని మీకు డౌట్ వచ్చిందా? వీరంతా ఇతర దేశాల నుంచి దక్షిణాఫ్రికాకు వచ్చినవారని చెప్పుకున్నాం కదా? వీళ్లంతా వారికి వారుగా నేరస్థులగా మారరు. బంగారంతో కోట్లు సంపాదించాలని అక్రమంగా తవ్వకాలు చేపట్టరు. ఇదంతా ఓ సిండికెట్‌ మాఫియా అండర్‌లో జరిగే నేరం. పేదరికంతో జీవనోపాధి కోసం వలస వచ్చిన ఈ కార్మికులను దక్షిణాఫ్రికా లోకల్‌ మాఫియా తమ గుప్పిట్లో పెట్టుకుంటుంది. బంగారం తవ్వితే డబ్బులు ఇస్తామని చెబుతుంది. అలా మాఫియా కోట్లు సంపాదిస్తుంది.. వీళ్లకి మాత్రం పూటకు సరిపడేలా తిండి పెడుతుంది. అది కూడా ప్రతీసారి కాదు. కొన్ని సార్లు తిండీ, నీరు లేకుండానే వీళ్లంతా పని చేస్తారు. గన్నుల్లో ఉన్నప్పుడు ఈ సిండికెట్‌ గ్రూపులు వారికి ఆహారం, నీరు అందిస్తాయి. అలా రోజుల పాటు బంగారం కోసం చీకటి గుహల్లో బతుకీడ్చుతుంటారు కార్మికులు.

ఇంత అన్యాయమా?

ఇక్కడ గమనిస్తే నేరం చేస్తున్నది ‘జామా జామాస్‌’ కమ్యూనిటీనే.. కానీ చేయిస్తున్నది మాత్రం మాఫియా. అటు ప్రభుత్వం మాత్రం ఈ మాఫియాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. వారిని ఏం చేయలేకే బలహీనులైన కార్మికులపై ప్రభుత్వం ప్రతాపం చూపిందన్న ఆరోపణలున్నాయి. ఆగస్టు నుంచి జనవరి వరకు.. అంటే ఐదు నెలల పాటు వారికి ఆహార సరఫరా లేకుండా చేసింది ప్రభుత్వం. చివరకు కోర్టు ఆదేశాలతో, తప్పనిసరి పరిస్థితుల్లో వారిని గుహ నుంచి బయటకు తీసుకొచ్చింది. కానీ అప్పటికే చేయిదాటిపోయింది. కొన్ని శవాలను, మరికొన్ని బతికి ఉన్న శవాలను ఆస్పత్రికి అప్పగించింది. ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘనే.. ఒక్క మాటలో చెప్పాలంటే జామా జామాస్ కార్మికుల జీవితం పేదరికానికి.. వలసల దుస్థితికి.. అలాగే ప్రభుత్వాల అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యం!

ఇది కూడా చదవండి: శాంతి వెనుక వ్యధలు.. వెంటాడే భయానకాలు.. పాలస్తీనా కన్నీటి కథ!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *