మన సమాజంలో ఎప్పటినుంచో ఒక ప్రశ్న సమాధానం కోసం ఎదురుచూస్తోంది… ఎందుకు ఎప్పుడూ ఒక ఆడదానినే జడ్జ్ చేస్తారు? అదే పనిని ఒక మగవాడు చేస్తే ఎందుకు క్షమిస్తారు? ఒక ఆడది రాత్రివేళ బయటకి వెళ్ళినా వెంటనే చర్చలు మొదలవుతాయి… ఎందుకు వెళ్తుంది? ఎవరితో ఉంది? చెడ్డ పేరు తెచ్చుకుంటుందేమో! అని తీర్పు ఇస్తారు. కానీ అదే సమయంలో ఒక మగవాడు అర్ధరాత్రి తిరిగి వస్తే, పని వల్ల అయి ఉంటుంది.. ఫ్రెండ్స్‌తో గడిపాడేమో అని సరిపెడతారు. అతను తాగివస్తే రిలాక్సేషన్ అంటారు… మరి ఆడదానికేది రిలాక్సేషన్… నడిరోడ్డు మీద సిగరెట్ తాగి పొగలు స్టైల్ గా వూదితే మగాడు అంటారు..అదే పని ఆడది చేస్తే ఏమంటారో మీ ఊహకే వదిలేస్తున్నా..!
ఇంకో ఉదాహరణ చెప్పాలా… ఒక ఆడది తన భర్త లేకుండా ఒంటరిగా తన పిల్లల్ని పెంచుకుంటూ పోరాటం చేస్తే, మన సమాజం ఏమంటుంది? పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఇలాంటివి ఎందుకు చేస్తుంది? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. కానీ అదే పరిస్థితిలో ఒక మగవాడు పిల్లల్ని ఒంటరిగా పెంచితే, అతనిని హీరోలా చూపిస్తారు… చూడండి! ఎంత గొప్ప తండ్రి! ఎంత బాధ్యతాయుతుడు! అని పొగడ్తలే కురిపిస్తారు. ఒక ఆడది చేసిన త్యాగం, ఆమె కార్చిన కన్నీరు, ఆమె బలంగా నిలబడి పిల్లలకు ఇచ్చిన భవిష్యత్తు మనకి కనబడదు. కానీ ఒక మగవాడు కనీసం కొంచెం బాధ్యత తీసుకున్నా.. దానిని గొప్పదనంగా ఎత్తిచూపుతారు. ఇది ఎంత అన్యాయం కదా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఆ స్త్రీ ప్లేస్ లో ఉంటే మీ పరిస్థితి ఏంటి అనేది?
అలాగే ఓ తల్లుల్లారా ఇప్పుడు చెప్పబోయేది మీ గురించే…ఒక తల్లి తాను పడిన కష్టాన్నే.. తన కూతురు చూడాలి అని కోరుకుంటుందా? కోరుకోకూడదు కదా? మరి జరుగుతున్నది ఏమిటి? ఉదాహరణకు ఒక బాధ్యత లేని భర్త నుండి ఎన్నో కష్టాలు పడి తన పిల్లల్ని కాపాడుకుంటూ వస్తుంది ఒక తల్లి. కానీ తన కూతురి దగ్గరకు వచ్చేసరికి తనకు కూడా బాధ్యత లేని వాడే భర్తగా వస్తే.. తనను కూడా తనలాగే సర్దుకుపోమని చెప్పటం ఎంతవరకు న్యాయం? తాను పడిన కష్టాన్నే తన కూతురు పడాలా? ఒక అమ్మగా, అక్కగా, అత్తగా, ఆడపడుచుగా, తోడికోడలుగా…ఒక ఆడదానికి మరొక ఆడదే సపోర్ట్ ఇవ్వకపోతే… ఏ బంధాన్ని నమ్మాలి? ఆమె ఎవరికి చెప్పుకోవాలి?
దుస్తులు వేసుకున్నా, స్నేహితులతో వున్నా, తనకు నచ్చిన కెరీర్‌లో ముందుకు పోయినా, పెళ్లి గురించి నిర్ణయం తీసుకున్నా, విడాకులు తీసుకున్నా… ఎప్పుడూ మొదట జడ్జ్ చేయబడేది ఒక ఆడదే. ఒక తప్పు చేస్తే.. అది ఆమె తప్పు కాకుండా, మొత్తం ఆడజాతి మీద వేసిన ముద్రలా మారిపోతుంది. కానీ ఒక మగవాడు అదే చేస్తే, అది అతని వ్యక్తిగత జీవితం అని సులభంగా వదిలేస్తారు. ఈ డబుల్ స్టాండర్డ్ ఎందుకు? ఎందుకంటే.. మన సమాజం చాలా కాలం పాటు పితృస్వామ్యపు బంధాలలోనే పెరిగింది. ఇంటి గౌరవం ఆడదాని చేతిలోనే ఉంది… అనే ఆలోచన ఇంకా బలంగా ఉంది. ఇతరులు ఏమంటారు? అనే ఒత్తిడి ఎప్పుడూ ఆడవారి మీదే ఉంటుంది.
కానీ ఒక సత్యాన్ని గుర్తుంచుకోండి… ఒక ఆడది ఒంటరిగా పిల్లల్ని పెంచితే అది తప్పు కాదు. అది ఆమెధైర్యం, ఆమెబలం, ఆమె మనోబలం. ఒక తల్లి గుండె ఎంతపెద్దది అంటే, తన బాధలను మింగేసి తన పిల్లలకోసం కొత్త జీవితాన్ని నిర్మించగలదు. ఆ త్యాగాన్ని గౌరవించాల్సింది పోయి, ప్రశ్నలు అడగడం ఎక్కడిన్యాయం? ఫ్రెండ్స్, నెమ్మదిగా ఈ దృశ్యకోణం మారుతోంది. ఎందుకు ఆడదానినే జడ్జ్ చేయాలి? మగవాడిని ఎందుకు అడగకూడదు? అని కొత్తతరాలు ప్రశ్నిస్తున్నాయి. ఇకనుండైనా ఆలోచన మారాలి. మనం ప్రతి ఒక్కరినీ ఆడదా, మగవాడా అని కాదు… ఒక వ్యక్తిగానే చూడాలి. వారి నిర్ణయాలు, వారి వ్యక్తిత్వం ఆధారంగా గౌరవించాలి.
అందుకే ఇకపై ఎవరో ఒకరిని జడ్జ్ చేయాలనిపించినప్పుడు… ఆడదా? మగవాడా? అని కాకుండా, అతను లేదా ఆమె ఒక వ్యక్తిగా ఏం చేశాడు? అని ఆలోచించండి. అప్పుడు మాత్రమే మనం నిజమైన సమానత్వ సమాజం వైపు నడుస్తాం. ఇది నా ఆలోచన కాదు.. నాలాంటి మరెందరో ఆలోచన.
ALSO READ: గాజాపై కరువు కాటు.. పేగులను పెకిలించే కన్నీటి కథ

‘అమ్మా..ఇలా ఎందుకు చేశావు? నేనేం చేశా అమ్మా..’ కన్న బిడ్డను తోసేసి చంపేసిన కసాయి తల్లి!
LGBTQ: పాత చింతకాయ పచ్చడి ప్రసంగాలు మానుకుంటే చాలా మంచిది..! వారి పట్ల ఇంత వివక్ష ఎందుకు?
Parenting: గట్టిగా అరవద్దు.. పిల్లల ముందు గొడవ పడొద్దు.. అధ్యయనాలు చెబుతున్న కఠిన నిజాలు!
Parenting: స్కూల్లో మీ పిల్లలు బుల్లియింగ్‌కు గురవుతున్నారా? ఈ 5 లక్షణాలు కనిపిస్తే అదే నిజం!
Relationships: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?
India’s Hidden Script: బాల్యం నుంచే Gender Roles ను నేర్పిస్తున్న ఫ్యామిలీలు, సొసైటీ