Menu

Single Mother: భయం మధ్య బతికిన ధైర్యం… ఇద్దరు పిల్లల కోసం ప్రపంచంతో పోరాడిన ‘నిర్భయ’!

Lakshmi Aruna 7 months ago
single mother in india

ఆమె పేరు నిర్భయ…పేరులో మాత్రమే భయం లేదు కానీ అణువణువునా భయాలే..! ఆ భయాలే ఆమె మనసుని, మెదడుని చీల్చేస్తున్నాయి…చిన్నప్పటి నుంచి నిర్భయ పెరిగిన వాతావరణ ప్రభావమో లేక తన జీవితంలో ఇప్పటికి ఎదుర్కొంటున్న అపజయాలో తెలీదు కానీ…ఎవరితో అయినా వున్నది ధైర్యంగా చెప్పాలంటే భయం..నేను నాలాగే వుంటా అని చెప్పాలన్న భయం…మనసులో మాట గొంతు నుంచి బయటకు రాదు…కానీ కళ్ళల్లో నీళ్లు తిరిగిన అందరి ముందు చులకన అయిపోతానేమోనన్న భయం తనకు…ఆ కన్నీళ్లు తన గుండెల్లోనే ఇంకిపోయేలా ఇంకెన్నాళ్లు దాచుకోవాలో….!

ది బ్యాడ్‌ టచ్‌ ఆఫ్‌ లైఫ్

చిన్నప్పుడు తాను చేయని తప్పుకి అమ్మ, అక్క కలిపి నిందిస్తున్న క్షణంలో…నేను ఏమి చేయలేదని చెప్పినా వాళ్ళు వినని ఆ సమయంలోనే ఆ భయం కలిగిందేమో…లేదా ఆడుకోవటానికి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఇంట్లో లేదని వచ్చేస్తుంటే వాళ్ళ తాత తనని ప్రేమగా పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని పది రూపాయల నోటు చేతికిచ్చి చాక్లెట్ కొనుక్కోమని చెప్తే తాత ఎంత మంచివాడో అనుకుంది..కానీ తాకరాని చోట తాకుతూ కనీసం తన వయసు పట్ల కూడా జాలి లేని రాక్షసుడు అని అప్పట్లో అతని మీద కలిగిన భయమో….! ప్రేమించకపోతే చంపేస్తా అంటూ వెంట వచ్చిన కుర్రాళ్లను తప్పించు తిరిగేటప్పుడు ఏర్పడిన భయమా? బయట ఎవరితో అయినా మాట్లాడితే గుమ్మం దాటి పంపం అని బెదిరించిన ఫ్యామిలీ వాళ్ళ భయమా? కారణం ఏదైతేనేం? ఆ భయం తన లోపల దాగుంది…!

prajadhwani life style news telugu

ప్రతీకాత్మక చిత్రం (single mother)

నటనే ప్రేమగా మారిన వేళ

తన బాధ ఎవరికి తెలుసు? తన మనసుకి నిద్రపోయినప్పుడు గట్టిగా పట్టుకున్న తలగండ్లకు, బాత్రూం గోడలకు తప్ప..! ఎలాగోలా కష్టపడి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుని వెళ్ళిపోవాలనుకుంది…అనుకున్నది సాధించింది..కానీ అక్కడికి వెళ్లినా తన ఫ్యామిలీ నీడ తనను అనుక్షణం బ్లాక్మెయిల్ చేస్తూనే వుంది…అర్థరాత్రుళ్లు చీర కట్టుకుని వెళ్లాలా? అదేనా ఉద్యోగం పెళ్లి పెటాకులు లేకుండా ఏం చేస్తావ్ అంటూ…పెళ్లి పెళ్లి అంటూ ప్రాణాలు తోడేస్తుంటే…సరే.. కనీసం పెళ్లి చేసుకుని పోతే అయినా ఆ బాధ తప్పుతుందేమో అని తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం కూడా ఆమెను బలి తీసుకుంది..ప్రేమ నటించే భర్త…నమ్మింది కానీ తనను ఒక మెషీన్‌లా చూస్తున్నారు అనే నిజం తెలిసి ఆ బంధం నుంచి తప్పుకోవాలి అనుకునే లోపే ఇద్దరు పిల్లలు…! జీవితంలో ఎన్నో సాధించాలి అనుకున్న ఆమె ఆశలు…పెద్దవాళ్ళ పొరపాటు కారణంగా అడియాసలే అయిపోయాయి.

single mother in india

పిల్లల కోసమే ఈ ప్రాణం ఊపిరితీసుకుంటుంది

పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చి చేసుకున్న పెళ్లిని ప్రేమ పెళ్లిగా మార్చేశారు…నీ ఇష్ట ప్రకారమే చేసుకున్నావ్ అని ప్లేట్ ఫిరాయించేశారు…సరే కనీసం అదైనా సంతోషాన్నిచ్చిందా అంటే అక్కడ నిరాశే…కలిసి ఉండలేదు.. వదిలి వెళ్ళలేదు…పదేళ్లు భరించింది…అప్పుల పాలై పోయింది..ఇద్దరూ ఆడపిల్లలే ఏం చెయ్యాలి వాళ్ళకోసం…వాళ్ళు తనలాగా అవ్వకూడదు…ఇక నుంచి వాళ్ళకోసమే బతకాలి అనుకుంది. అప్పుడే నిర్ణయించుకుంది ఇకనుంచి తాను సంపాదించే ప్రతి రూపాయి వాళ్ళకోసమే అనుకుంది…తనలో తెగింపు వచ్చింది…ఇన్నాళ్లు లోకుల కోసం బతికింది..పరువు కోసం ప్రాకులాడింది…కానీ అది తనకు ఏం ఇచ్చింది ఎటు వెళ్లినా అవే విమర్శలు..అవే బాధలు…!

బంధనాల నుంచి విముక్తి!

ఇక ఎవరికోసం తన బతుకు.. అయితే చావాలి. కానీ తాను ఎందుకు చావాలి? తాను ఒకప్పటి ధైర్యం లేని మనిషి కాదు.. ఇప్పుడు తనలో చలనం వచ్చింది. ధైర్యం పెరిగింది..అదీ కాకుండా.. ఇన్నాళ్లు తనకంటూ అందరు వున్నా ఎవరు లేరు అనుకుందేమో! కానీ ఇప్పుడు తనకంటూ ఒక బాధ్యత వుంది…అదే తన ఇద్దరు బంగారు తల్లులు..ఇప్పుడు అదే ప్రపంచం అనుకుంది. అంతే! వివాహ బంధం నుంచి బయటకు వచ్చేసింది….ఎవరు ఏమనుకున్నా ఇది తన తుది నిర్ణయం అని తెగేసి చెప్పింది నిర్భయ. భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం లేదు.. ఎందుకంటే గతంలో తాను చూసిన చేదు జ్ఞాపకంలా అయితే కచ్చితంగా ఉండకపోవచ్చని తనకు తెలుసు.. ఎందుకంటే ఇది తన నిర్ణయం…తన ఆలోచన…అదే తనకు కొండంత బలం… నిజానికి ఇది కేవలం ఒక్క నిర్భయ జీవితమే కాదు… దేశంలో ఉన్న నిర్భయ లాంటి అభాగ్యులెందరో..! నాకైతే తాను జీవితంలో సక్సెస్ సాధిస్తుంది అనిపిస్తుంది.. మరి మీకు?

ALSO READ: మీ దేశభక్తిని మడిచి…! చంపేస్తున్న పనివేళలు.. వెట్టిచాకిరి చేయించుకుంటున్న కార్పొరెట్లు.. పరిష్కారం ఏది?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *