Menu

Silence: మౌనం.. గుణం కాదు… అది బంధనమే..! అన్యాయానికి ఎదురొడ్డి నిలబడి, ప్రశ్నించే నీ గొంతుకే నిజమైన ఆయుధం!

Lakshmi Aruna 7 months ago
silence is not power

నేనేమి చేయలేదని ఆ రోజు నాకు గట్టిగా అరవాలి అనిపించింది. కానీ నేను నిశ్శబ్దాన్నే పాటించాను. తప్పు వాళ్లు చేశారు.. అయినా నేను మౌనంగా భరించాను. ఎందుకంటే.. మౌనం నాకు అలవాటైపోయింది…కానీ నా మదిలో ఒక ప్రశ్న… ఈ మౌనం నాకు సహజమా? లేదా అది ఎవరో నన్ను అలానే బతకమని బలవంతం చేసి పెట్టిన నిబంధనా?

మౌనం ఓ గుణమా… అస్సలు కాదు.. అది ఎవరెవరో వేసిన నిబంధన మాత్రమేనని నాకు అర్థమైంది! కానీ ఎందుకు? ఎప్పటి నుంచి మనం ఇలా మౌనంగా బతకడం ప్రారంభించాం? ఈ మౌనం మనసులో గాయాన్ని నయం చేస్తుందా? లేదా మన జీవితాన్ని నెమ్మదిగా దహించేస్తుందా? మన జీవితం మొదలయ్యేది ఏడుపుతోనే. కానీ మనకు బాధ కలిగినప్పుడు ఏడిస్తే, “అలా ఏడవకూడదు” అంటారు. పిల్లలు పెద్దలతో మాట్లాడితే.. “పెద్దలు మాట్లాడేటప్పుడు మాట్లాడవద్దు” అంటారు. సరైన ప్రశ్నలు వేసినా.. “సైలెంట్‌గా ఉండు నీకేం తెలీదు” అంటారు. చేసిన తప్పు ఎవరిదైనా సరే.. “మౌనంగా ఉండు.. మర్చిపో దానిగురించి” అంటారు. ఈ మాటలు వినీవినీ..మౌనా్ని ఒక ‘గుణంలా’ ఫీల్ అయ్యేలా చేస్తారు.

కానీ ఇది నిజంగా మన గుణమా? కాదు,, ఇది మనమీద సమాజం విధించిన ఓ షరతు మాత్రమే! ఒకతరం తమ మనసులో ఉన్న మాటల్ని బయట పెట్టకుండానే కాలాన్ని నెట్టుకొచ్చేసింది.
తప్పులను ప్రశ్నించలేదు.. అన్యాయాన్ని ఎదిరించలేదు.. ప్రేమని వ్యక్తపరచలేదు..
నమ్మకాన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే వారికి ‘మౌనమే గొప్పది’ అని అప్పటి పెద్దలు నేర్పించారు. కానీ నీ మౌనం వల్ల ఎవరెవరి గుండెల్లోకి నీవు చేరకుండాపోయావో తెలుసా? ఎంత మంది.. నువ్వు వినిపించాలనుకున్న మాటలు వినలేకపోయారో ఎప్పుడైనా ఆలోచించావా? ఎంత మంది పక్కవాళ్ల తప్పుడు నిర్ణయాల కింద మౌనంగా నలిగిపోయారో గమనించావా?

మౌనం కొన్నిసందర్భాల్లో మంచిదే… వివాదాన్ని నివారించాలి.. మనశ్శాంతికి అవసరం కూడా. కానీ అదే మౌనం.. మన హక్కుల పైనా, మన స్వరానికైనా అడ్డుకట్టేస్తే? మన అభిప్రాయాన్ని చెప్పకుండా భయపడతే? మన గళం మూగబోతే? ఆ మౌనం.. గుణం కాదు…అది బంధనమే!

అది భయంతో కూడిన నిశ్శబ్దం. అది ఎదగడాన్ని ఆపేసే కలుషితమైన కవచం. ఇప్పుడు సమయం వచ్చింది.. మన మాటలు తిరిగి వినిపించాల్సిన సమయం. మన భావాలను ఎవరూ తక్కువగా అనుకోకుండా బలంగా వాళ్లని ఢీకొట్టాల్సిన సమయం. ఒక అమ్మాయి అన్యాయానికి గురైతే..మౌనంగా ఉండకుండా నిలబడే సమయం. ఒక ఉద్యోగి దౌర్జన్యానికి గురైతే ‘ఇది నా బాధ కాదు‘ అనుకోకుండా ముందుకు వెళ్లే సమయం. ఏ నిర్ణయం తీసుకున్నా “ఇతరులు ఏమనుకుంటారు” అనే భయాన్ని మరిచి జీవించే సమయం.

“మౌనం ఓ గుణం కాదు. ఎవరెవరో వేసిన నిబంధన!” ఇది మరిచిపోకండి. మీ మాట.. మీ స్వరం.. మీ ఆత్మబలానికి ప్రాతినిధ్యం. నిజంగా బతకడమంటే మౌనంగా బతకడం కాదు.. మాట్లాడే ధైర్యాన్ని కలిగి ఉండటమే జీవితం!

మీరు మౌనంగా ఉన్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ మౌనం వల్ల ఎవరికో అశాంతి కలగవచ్చు.. మరొకరికి అన్యాయం జరగొచ్చు కాబట్టి… ఈరోజు మొదలు మౌనాన్ని గుణంగా కాకుండా, ప్రశ్నించండి.. మాట్లాడండి.. మన దారిని మనమే తీర్చిదిద్దుకుందాం! కనీసం ఇప్పటికైనా మాట్లాడండి.. లేదంటే మీ మౌనాన్ని ఎదుటివాళ్లు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంది.

నీ మౌనం నీ మనసును మాత్రమే కాదు.. సమాజాన్ని కూడా చీకటిలో నెట్టేస్తుంది

ALSO READ: భయం మధ్య బతికిన ధైర్యం… ఇద్దరు పిల్లల కోసం ప్రపంచంతో పోరాడిన ‘నిర్భయ’!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *