ఏందన్నా ఇది…
అలతి అలతి పదాలతో మనసులో అలజడి రేపే హక్కు ఎవరిచ్చారన్నా?
చిన్న చిన్న మాటలతో గుండెలను పిండే అధికారం ఎవరిచ్చారన్నా నీకు?
ఎన్నాళ్లయింది… స్వచ్ఛమైన తెలుగు పాట వినక!
ఎన్నేళ్లయింది… సినీ సాహిత్యానికి సలాం కొట్టక!!
ఒక్కో పదం ఒక్కో బుల్లెట్.. ఒక్కో వాఖ్యం ఒక్కో మిస్సైల్!
దేన్నని వర్ణించను.. ఎంతని శ్లాఘించను!
పచ్చాపచ్చని చేలల్లో… పూసేటి పువ్వుల తావుల్లో.. అనే రాగానికి రోమాలు నిక్కబొడుస్తుంటే..
ఆకలితో నువు పస్తుంటే… నీ డొక్కలు ఎండిపోయేరా అనే వాక్యానికి కళ్లలో నుంచి నీరు ధారగా కారుతోంది!
బడిలో చెప్పని పాఠం ఇదిరా… బతుకే నేర్చుకొ నా కొడకా… ఇది తెలుగు సినిమా పాట సాహిత్యం అంటే ఎవరైనా నమ్ముతారా?
నువ్వు ఎవరో కానీ అన్నా… దమ్మున్నోడివి! జర మా భాషలో చెప్పాలంటే ‘తోపు’వి!!
హెడ్‌సెట్ పెట్టుకొని పాట వింటుంటే… తలగడ తడవడం అసంకల్పితమో, అద్భుతమో అర్థం కాని అయోమయ స్థితి.
అప్పుడెప్పుడో ఉద్యమ సమయంలో కలిగిన అనుభూతిని తిరిగి కల్పించినందుకు నీకు ధన్యవాదాలు.
నిజం చెప్పాలంటే నీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చాలా తక్కువ!
గజిబిజి జీవితాల్లో పడి గుండెలో తడి ఉందనే విషయమే మరిచిన వాళ్లకు…
నీ పాట ఒక చెంపపెట్టు! మనసు లోతుల్లో భావాలను తట్టిలేపినందుకు థ్యాంక్స్ సరిపోదు!!
సుద్దాల, సిరివెన్నెల, మా గద్దరన్నలెక్క నువ్వు పదికాలాల పాటు పదిలంగా ఉండాలి..
ఇలాంటి మరెన్నో పాటలతో మళ్లీ మళ్లీ ఏడిపించాలి.
పాట పాడిన గొంతుకు శతకోటి వందనాలు
ఆ కంఠంలో ఏముందో కానీ… నభూతో!
అరవీర భయంకర చప్పుళ్లే మ్యూజిక్ అని.. రణగోణ ధ్వనుల్లో సాహిత్యం మరుగున పడటమే తెలుగు పాట అని దాదాపు నిర్ధారణకు వస్తున్న సమయంలో… పాటను పాటలా వినిపించిన డీఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఇక చివరగా… ఎన్ని సినిమాలు తీశామన్నది కాదన్నా… ఎంత మంచి సినిమాలు తీశామన్నది లెక్క! ఈ లెక్కన ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి శేఖర్ కమ్ముల. మీ సినిమాల గొప్పదనం చెప్పేందుకు నా వయసు సరిపోదు… మీ ఆలోచనా సరలి విశ్లేషించేందుకు నా అనుభవం సరిపోదు. ఫిదా సినిమాలో ‘మైలపోలు’ తీయడం, యాట కూర వండటం వంటి దృశ్యాలను చిత్రించినప్పుడే మీరు సంథింగ్ స్పెషల్ అని రుజువైంది. నెత్తురు చుక్క పడకుండా రాష్ట్ర రాజకీయాలను చూపించినా… బచ్చాగాళ్లను హీరోలుగా పెట్టి ఇండస్ట్రీని షేక్ చేసిన మా బక్కోనికే (ఉద్దేశపూర్వకంగానే రాస్తున్నా) చెల్లింది. ఈ సినిమా బాగుందా, బాలేదా అనే దాని గురించిన విశ్లేషణ కాదిది. కేవలం ఆ పాట విన్నాక… నా మనసులోని భావాలకు అక్షర రూపం అంతే!
ALSO READ: మీకేందుకు ఇంత డాబు..! సినిమాల్లోనే హీరోలు.. అసలు నిజస్వరూపం మాత్రం ఇదే..!

Cine Stars: ఎవరిచ్చారీ బిరుదులు..? గ్లోబల్ స్టార్.. ఐకాన్ స్టార్? మెగా పీఆర్ మాములుగా లేదుగా!
Movie Review: ఫ్యాక్షన్ లేని సీమ కథ.. ఇందులో నటులు కాదు పాత్రల్లో గుర్తిండిపోతాయి..!
Suhani: దంగల్ ఫేమ్ సుహానీ మృతికి కారణమైన ఈ వ్యాధి గురించి తప్పక తెలుసుకోండి!
Kannagi Review: కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో సంకెళ్లు.. ఆ యువతి ఆలోచనలు ఎలా ఉంటాయ్ ?
Sandeep Vanga Vs Aamir: సెన్స్‌లెస్, లూజ్ టాక్.. సందీప్ రెడ్డి వంగా ఇది తగ్గించుకుంటే మంచిది!
Three Of Us: ప్రేక్షకులను వారి బాల్యంలోకి అచేతనంగానే తీసుకెళ్లే అద్భుత దృశ్య కావ్యం!