1999 జనవరి 14..
ప్రాంతం: శబరిమల-పంబా(కేరళ)
స్వామియే శరణం అయ్యప్ప భక్త నినాదాలతో అప్పటివరకు హోరెత్తిపోతున్న కొండ ప్రాంతాన్ని ఒక్కసారిగా భీతావహ వాతావరణం ఆవహించింది. మకరజ్యోతి దర్శనానికి వచ్చిన వేలాది మంది భక్తులు తొక్కిసలాటలో కొండపైనే గందరగోళం నెలకొంది. జ్యోతి దర్శనం కోసం ఎగబడ్డ వారి జీవితాల్లో వెలుగు నిలువ లేకుండా పోయింది. ఈ ఘటనలో 52 మంది మరణించారు.
2011 జనవరి 14:
ప్రాంతం- శబరిమల-పులుమేడు(కేరళ)
మకరజ్యోతి దర్శనానికి వెళ్ళిన భక్తులు తిరిగి వస్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 102 మంది చనిపోయారు. ఇది శబరిమల దేవస్థానం చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది.
ఈ రెండు ఘటనల్లో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 154. ఇంతమందిని బలితీసుకున్న కారణం మాత్రం ఒక్కటే.. అదే ‘మకరజ్యోతి..’
నిజాలు మాట్లాడితే సహించలేని, భరించలేని భక్తులు ఉండే సముహాలు ఇండియాలో కోకొల్లలు. దీనికి అయ్యప్ప భక్తులు మినహాయింపేమీ కాదు. 40రోజుల నిష్టతో పూజలు చేస్తున్నామని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటామని నీతి సూత్రాలు వల్లించే అయ్యప్పలు తమ దేవుడి గురించి ఎవరైనా హేతుబద్ధంగా ప్రశ్నలు సంధిస్తే మాత్రం ఉగ్రరూపం దాల్చుతారు. సహనం కోల్పోయి భౌతికదాడులకు దిగుతారు. ఈ వెలుగు మానవ సృష్టేనని.. అది తమ పనేనని స్వయంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కోర్టులో అంగీకరించిన విషయాన్ని కూడా పట్టించుకోరు. ‘మా నమ్మకాలు మావి’, అవి ఎంత అర్థంలేనివిగా ఉంటే నీకేందుకని ప్రశ్నించడం కూడా వారికి అలవాటే. ఆలయాన్ని నిర్వహించే ట్రావెన్‌కోర్ బోర్డు మకరజ్యోతి మానవ సృష్టేనని ఒప్పుకున్నా, ఒకవేళ ఆ అయ్యప్ప నిజంగా ఉండి, ఈ భూమిపైకి వచ్చి అదే విషయాన్ని చెప్పినా భక్తులకు మాత్రం మకరజ్యోతి దేవుడి మహిమేగానే అనిపిస్తుంది. దేవుడి మహత్యంలానే కనిపిస్తుంది. అందుకే మకరజ్యోతి మోసం బయటపడి, కోర్టులోనే బహిర్గతమై 14ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ జ్యోతి దర్శనం కోసం కోట్లాది మంది వెళ్తూనే ఉన్నారు. వెళ్తూనే ఉంటారు కూడా! మూఢత్వానికి ఏ మత భక్తులైనా పెట్టుకున్న పేరు ‘విశ్వాసం-నమ్మకం.’ ఆ నమ్మకాల ముసుగులోనే, ఆ విశ్వాసం మత్తులోనే తొక్కిసలాల్లో భక్తులు మరణించారన్న విషయం కూడా బోధ పడదు.
1981లోనే నిజం బట్టబయలు
నిజానికి మకరజ్యోతి మోసం చట్టబద్ధంగా బయటపడింది 2011లోనే కానీ.. దీని అసలు గుట్టువిప్పేందుకు దశాబ్దాల పోరాటం జరిగింది. 1970దశకంలో హేతువాదులు మకరజ్యోతి మోసాన్ని బయటపెడతామని వెళ్తే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే నిజాలను కప్పి ఉంచడం, దాయడం ఎక్కువ కాలం చేయలేని పని. 1981లో యుక్తివాది సంఘం మొదటిసారి మకరజ్యోతి మోసాన్ని బహిర్గతం చేసింది. ఇది మానవ సృష్టేనని సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. అయినా భక్తులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. అటు ట్రావెన్‌కోర్ బోర్డు సైతం హేతువాదుల ప్రచారం అబద్ధమని బుకాయించే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.
2011లో కేరళ హైకోర్టు వాదనల్లో ట్రావెన్‌కోర్ జనాలు చూస్తున్న వెలుగు మానవులు సృష్టించింది,మకరజ్యోతి వేరని, పునంబలమేడు ప్రాంతంలోని గిరిజనలు కొండ పైన పెట్టే జ్యోతి “మకర విలక్కు”, మకరజ్యోతి అనేది వేరు అని వాదించింది.
సరే హేతువాదుల వాదన, కోర్టులో ట్రావెన్‌కోర్ అంగీకారాన్ని పక్కనపెడదాం. భక్తులు విశ్వాసించే పురాణ కథల్లోకే వెళ్లి చూద్దాం. ఏ పురాణ కథలోనైనా మకరజ్యోతి అంశం ఉందని ఏ హిందు పండితుడైనా చూపించగలరా? లేదు..! ఎందుకంటే అయ్యప్పకు సంబంధించిన ఏ పురాణ కథలోనూ మకరజ్యోతి ప్రస్థావన లేదు. ఇదంతా 1950 తర్వాత పుట్టుకొచ్చిన కథ. 1950లో శబరిమల ఆలయం పునర్నిర్మాణం తర్వాత ఈ జ్యోతి నమ్మకం మొదలైంది. పునంబలమెడు ప్రాంతంలో నివసించే గిరిజనులు చలికి ఒక రోజు వెలిగించిన మంట శబరిమల కోండపై ఉన్నవారికి ఓ దివ్యకాంతిలా కనిపించింది. అది మకర సంక్రాంతి రోజు జరగడంతో ఆ కాంతిచుట్టూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. అది స్వయంగా అయ్యప్ప మహిమని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని సొమ్ము చేసుకునేందుకు ఆలయ పెద్దలు దుస్సాహసానికి పునుకున్నారు. గిరిజనుల సాయంతో ప్రతీఏడాది మకర సంక్రాంతి నాడు పునంబలమెడు ప్రాంతానికి వెళ్లి దీపాన్ని వెలిగించేవారు. కర్పూరం, ఇతర పదార్థాలను ఉపయోగించి దీపాన్ని స్వయంగా తమ చేతులతో వెలిగించేవారు. ఇలా భక్తులను దశాబ్దాల పాటు బురిడికొట్టించారు. ఇదంతా ట్రావెన్‌కోర్ బోర్డు స్వయంగా కేరళ హైకోర్టుకు చెప్పిన పచ్చి నిజాలు. భక్తుల్లో మకరజ్యోతి అయ్యప్ప మహిమగా ప్రచారం చేసుకోని ఆలయ బోర్డు తమ ఖజానాన్ని భారీగానే నింపుకుంది. ఇప్పటికీ నింపుకుంటూనే ఉంది.
అసలు శబరిమల ఒక బౌద్ధ క్షేత్రం అనే ఆధారాలు ఉన్నాయి అని కొందరు బౌద్ధ చరిత్రకారులు అంటున్నారు. కేరళ ప్రభుత్వం కూడా మహిళలను ఆలయంలోకి అనుమతి ఇచ్చే విషయంలో ఇది ఒక బౌద్ధ క్షేత్రంగా చెప్పింది. నిజానికి దేవాలయం బౌద్ధ నిర్మాణంలా ఎందుకుందో వారి అయ్యప్ప భక్తుల మెదడుకు తట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘శరణం’ అనే పదం బౌద్ధ సంప్రదాయాలకు చెందినదన్న విషయం కూడా వారి దృష్టికి రాకపోవడం విడ్డూరం!
జ్యోతిష్యం శాస్త్రమా?
అటు జ్యోతిష్యాన్ని ఓ శాస్త్రంగా చెబుతూ, ఆ అజ్ఞానాన్ని మకరజ్యోతితో ముడిపెడుతూ ఎన్నో కట్టు కథలు ప్రచారంలో ఉన్నాయి. సూర్యుడు ధన రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడాన్నే మకర సంక్రాంతిగా చెబుతారు. రాశులు (constellations) అంటే నక్షత్రాల సమూహం. సూర్యుడు కూడా నక్షత్రమే. అన్ని నక్షత్రాల్లానే సూర్యుడు కూడా కదులుతాడు. మనకు అతి దగ్గరి నక్షత్రం (Proxima Centauri) 4.24 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే సుమారు 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు. మరి స్వయంగా ఒక నక్షత్రం అయిన సూర్యుడు వేరే రాశుల మధ్య నెలకు ఓసారి మారడం ఏంటి? పైగా వాటివల్ల ఫలానా రోజు, ఫలానా సమయానికి పుట్టిన వారి జీవితం ఎలా మారిపోతుంది?
రెండు వేరు వేరు బాసూ:
అసలు జ్యోతిషం అనేది ఖగోళ శాస్త్రం కాదు. Astrology, Astronomyని ఒకే రకంగా కొందరు చిత్రకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంటారు. ఖగోళ శాస్త్రం నక్షత్రాలు,గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు వంటి వాటి స్థితిగతులను,ఆచరణలను అధ్యయనం చేస్తుంది. కానీ జ్యోతిషం మాత్రం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణం లేకుండా నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అసలు హిందూవులు ఇప్పుడు ఎంతగానే నమ్ముతున్న రాశిచక్రాలు భారతీయ సంస్క్రతికి చెందినవి కూడా కావు. ఇవి పాత గ్రీకు-రోమన్ సంస్కృతుల్లో భాగాలు. ఈ 12 రాశులను పూర్వకాలంలో గ్రీకు-రోమన్లకు కనిపించిన ఖగోళ స్థితులపై వారు సృష్టించుకున్న ప్రామాణిక పద్ధతులు మాత్రమే. ఎన్నో ఖగోళ, గణిత సూత్రాల ద్వారా అందించిన అప్పటి ప్రాచీన ఉపఖండపు జ్ఞానం దోపిడీ కోసం మూఢనమ్మకాల సుడిలో చిక్కుకున్నాయి.
సుదీర్ఘకాలంలో నక్షత్రాలు స్థితి మారడం వల్ల నక్షత్రాల స్థానం మారిపోతుంది. అంటే 2000 సంవత్సరాల క్రితం సృష్టించిన రాశి చక్రం ఇప్పటి ఖగోళ స్థితులకి అనుకూలంగా ఉండదు. అసలు అప్పటి హైందవ నమ్మకాల ప్రకారం భూమి చుట్టే సూర్యుడు, చంద్రుడు తిరిగుతారు అని అనుకునేవారు. శాస్త్రపరంగా గ్రహాలు లేదా నక్షత్రాలు భూమిపై ఉన్న మనుషుల వ్యక్తిత్వాన్ని, జీవిత ఘటనలు ప్రభావితం చేస్తాయని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు. ఇక మకర సంక్రాంతి రోజున సూర్యుడు తన గమనాన్ని మార్చుకుంటాడు అని అంటారు. వాస్తవానికి అది భూమి సూర్యుని చుట్టూ తిరిగే మార్గం వల్ల వచ్చే మార్పు.. అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ కారణంగా జరిగే సీజనల్ మార్పు. ఇది భూమికి ఉన్న వంపు కారణంగా ఉత్తరాయణ ప్రారంభం అని చెబుతారు. దీన్నేWinter Solstice అంటారు. వాస్తవానికి ఇది ప్రతి యేటా డిసెంబర్ 21-22 తేదీల మధ్య జరుగుతుంది. భూమి ఇక్కడ సూర్యునికి అత్యంత దూరంగా పరిభ్రమిస్తూ ఉంటుంది Summer solstice ను జూన్ 21 న చూస్తాం. ఆ రోజు భూమి సూర్యునికి అత్యంత దగ్గరగా ఉంటుంది.
అయితే ఈ ప్రక్రియను మతాల కథలకు జోడించి చెప్పడం కేవలం కల్పితం మాత్రమే. ఈ కల్పితాలనే భక్తులు నమ్ముతారు. అందరిని నమ్మమంటారు.. నమ్మకపోతే దాడులు కూడా చేస్తారు.. దేవుడి భక్తులు ఏదైనా చేయగలరు.. వారికి అన్నీ హక్కులూ ఉన్నాయి కాబోలు..!. అందరిని నమ్మమంటారు.. నమ్మకపోతే దాడులు కూడా చేస్తారు.. దేవుడి భక్తులు ఏదైనా చేయగలరు.. వారికి అన్నీ హక్కులూ ఉన్నాయి కాబోలు..!
ఇది కూడా చదవండి: పుణ్యం కోసం వెళ్తే ప్రాణాలే పోతాయ్.. కుంభమేళ నుంచి తిరుపతి వరకు దేశాన్ని విషాదంలో ముంచేసిన మతపరమైన తొక్కిసలాటలు!