భారత్‌కు బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15..! ఇది దాదాపుగా అందరూ చెప్పే సమాధానం. కానీ దేశంలో కొందరు మాత్రం స్వాతంత్ర్య దినోత్సవ తేదీని మార్చుతుంటారు. ఆ మధ్య ఒకసారి నటి కంగనా రనౌత్ దేశానికి స్వాతంత్ర్యం 2014లో మోదీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిందని చెప్పారు. ఇక నిన్నగాక మొన్న ఆర్‌ఎస్‌ఎస్(RSS) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagawat) దేశానికి స్వాతంత్ర్యం 2024 జనవరి 22న వచ్చిందని సెలవిచ్చారు. ఆ రోజు అయోధ్య(Ayodhya) రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగిందని.. 1947లో రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే ఇండియాకు వచ్చిందన్నారు భగవత్. ఆ నాడు దేశం ఆత్మస్వాతంత్ర్యాన్ని పొందలేకపోయిందని చెప్పుకొచ్చారు. రాముడు, కృష్ణుడు, శివుడు భారతీయతకు ప్రాణం లాంటివారని…వారిని స్వీకరించడంలోనే నిజమైన స్వాతంత్ర్యం ఉందని చెప్పారు. ఇప్పుడివే మాటల దేశంలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు మోహన్ భగవత్ వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) భగవత్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భగవత్ చేసిన కామెంట్స్‌కి ఇతర దేశాల్లో అయితే ఇప్పటికే జైల్లో పెట్టేవారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. మోహన్ భగవత్ చేసిన కామెంట్ దేశద్రోహానికి సమానమని.. భారత స్వాతంత్ర్య పోరాటాన్ని, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ దేశంలోని ప్రతి సంస్థను ఆక్రమించాయని రాహుల్ విరుచుకుపడ్డారు.
Mohan Bhagwat’s audacious comment that India didn’t gain true independence in 1947 is an insult to our freedom fighters, every single Indian citizen and an attack on our Constitution. pic.twitter.com/6sMhdxn3xA
— Rahul Gandhi (@RahulGandhi) January 15, 2025
వేల మందిని చంపేశారు
అయితే అసలు మోహన్ భగవత్ ఈ కామెంట్స్ ఎందుకు చేశారు? నిజానికి రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఆర్‌ఎస్‌ఎస్‌కు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎంతో కీలకమైనది. రామ మందిర ఉద్యమంతోనే ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఉన్న బీజేపీ తమ ఉనికిని చాటుకుంటూ వచ్చింది. అయోధ్య రామమందిరం కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది ఆర్‌ఎస్‌ఎస్. ఈ క్రమంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత జరిగిన అల్లర్లలో ఎంతో మంది హత్యకు గురయ్యారు. రామమందిర కలను సాకరం చేస్తామనే హామీతో ఎన్నికల్లో పాల్గొంటూ వచ్చిన బీజేపీ 2014 నాటికి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2019లోనూ విజయం సాధించింది. ఇక 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. చివరకు 2024 జననరి 22న రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది కోట్లాది హిందువుల కలగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చెబుతున్నాయి. రామ మందిరం హిందూ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందన్నది వీరి వాదన. హిందుత్వ అనేది ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతానికి మూలస్థంభం. హిందుత్వ అంటే హిందూ మతం ఆధారంగా భారతీయతను నిర్వచించడం.. అంటే ఇండియాను హిందూ మతం ఆధారంగా Define చేయడమని అర్థం. అందుకే మోహన్ భగవత్ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠను స్వాతంత్ర్యంతో పోల్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎప్పుడైనా రాజ్యాంగానికి విలువనిచ్చారా?
ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ విధానాలు సమానత్వం, న్యాయం లాంటి రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తాయని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. ఒక మతానికి చెందిన ధర్మాలతో బీజేపీ దేశాన్ని నడిపించే ప్రయత్నం చేస్తుందన్నది కాంగ్రెస్ ప్రధాన వాదన. హిందూ సమాజాన్ని సమీకరించి.. ఇతర మతాలను తక్కువ చేయడమే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ప్రధాన ఎజెండా అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుంటారు. దేశ రాజ్యాంగానికి విలువ ఇవ్వరని.. జాతీయ జెండాను కూడా అవమానించిన చరిత్ర ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉందని నిత్యం ఆరోపిస్తుంటారు. మరోవైపు కాంగ్రెస్‌ది యాంటీ-హిందూ స్టాండ్ అని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ రివర్స్ కౌంటర్ ఇస్తుంటాయి. ఇలా ఇరు వర్గాల మాటల మంటలు ఎప్పటినుంచో కొనసాగుతున్నాయి. మరోసారి అవే మంటలు రాజుకున్నాయి.
ఇది కూడా చదవండి: మకరజ్యోతి మర్మం ఏంటి? అసలు సూర్యుడు రాశులు జంప్ చేయడం ఏంటి గురు..!!