Menu

Road Accidents: బస్సు డ్రైవర్లు తాగి బండి నడుపుతున్నారా? అసలు పోలీసుల దృష్టి ఎక్కువగా బైకర్లపైనే ఎందుకు?

Lakshmi Aruna 2 months ago
drunk and drive bus accidents

హైవే రోడ్డు. రాత్రి 11 గంటలు. ఒక చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఒక బైక్‌ని ఆపారు. రైడర్‌ను బ్రీతలైజర్ టెస్ట్ చేశారు. పక్కనే ఒక భారీ లారీ పూర్తి స్పీడ్‌లో వెళ్లిపోయింది. ఎవరూ ఆపలేదు. కొద్దిసేపటికే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. అందులో 40 మంది ప్రయాణికులు.. అదీ అలాగే వెళ్లిపోయింది. ఈ సీన్ రోజూ మన రోడ్లపై రిపీట్ అవుతుంది. కానీ ఎవరూ మాట్లాడరు. ఈ రోజు మనం ఈ అసమానత గురించి, ఈ అన్యాయం గురించి మాట్లాడుకుందాం.

బైక్ రైడర్లకు, కార్ డ్రైవర్లకు మాత్రమే ఆల్కహాల్ టెస్టులు ఎందుకు? వారు తప్పు చేస్తే పట్టుకోవాలి.. అది సరైనదే.. కానీ…ఒకసారి క్లియర్‌గా చూస్తే…ఒక బైక్ ప్రమాదంలో మహా అయితే ఇద్దరికి ప్రమాదం జరగొచ్చు…ఒక కార్ ప్రమాదంలో నలుగురైదుగురు ప్రమాదం పాలవొచ్చు..అదే ఒక బస్సు ప్రమాదంలో కనీసం 30,40మంది ప్రమాదానికి గురవుతారు. అయితే లారీలు, బస్సులకు ఎందుకు పరీక్షలు లేవు ? వందల మంది ప్రాణాలతో ఆడుకునే వాళ్ళను ఎందుకు తనిఖీ చేయరు?

లారీ డ్రైవర్ల యథార్థ విషయానికొస్తే:

రోజంతా సుమారు 18-20 గంటలు నిరంతర డ్రైవింగ్.. నిద్ర రాకుండా ఉండటానికి చాలామంది మద్యం తీసుకుంటారు. ఓనర్లు, కంపెనీల టైం ప్రెషర్. “ఎలాగైనా సమయానికి చేరుకోవాలి”
విశ్రాంతి ఉండదు, నిద్ర ఉండదు, భోజనం కూడా డ్రైవింగ్ చేస్తూనే నడిపేవారుంటారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల పరిస్థితి చూస్తే :

స్పీడ్ పరిమితులు ఏవీ పట్టించుకోరు. రాత్రిళ్లు హైవేల్లో 100-120 kmph స్పీడ్‌లో వెళ్తుంటారు. 40-50 మంది ప్రయాణికుల భద్రత ఒక డ్రైవర్ చేతుల్లో ఉంటుంది. అలాంటి డ్రైవర్ మద్యం సేవించి డ్రైవ్ చేసినా ఎవరూ తనిఖీ చేయరు. ఏమంటే ఇంకో డ్రైవర్ అదనంగా వుంటారు అని చెప్తారు. కానీ అసలు మద్యం తాగితే.. బస్సులో నిద్రపోయే ప్యాసెంజర్‌నే బస్సులో ప్రయాణించనివ్వరు కదా! మరి అంతమందిని గమ్యానికి చేర్చాల్సిన డ్రైవర్ తాగి డ్యూటీ చేయటానికి ఎలా అంగీకరిస్తారు.

భయంకరమైన గణాంకాలు ఏంటో తెలుసా :

హైవే ప్రమాదాల్లో చాలా వరకు 40% లారీ, బస్సుల వల్ల జరుగుతున్నాయి. ఎక్కువ మరణాలు రాత్రి పూట.. డ్రైవర్ల నిద్రలేమి, మద్యం ప్రభావం వల్లనే జరుగుతున్నాయి. ప్రతి ప్రమాదంలో సగటున కనీసం 5-6 మంది మరణాలు సంభవిస్తున్నాయి.

ఎందుకు ఈ అన్యాయం? దీనికి కారణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి:

1. లారీని, బస్‌ని ఆపడం కష్టం. సమయం ఎక్కువ పడుతుంది. పోలీసులకు టార్గెట్లు ఎక్కువ మంది చిన్న వాహనాలను పట్టుకోవడం సులభం కాబట్టి చిన్న వెహికల్స్ నే టార్గెట్ చేస్తారు.

2. ట్రాన్స్‌పోర్ట్ సంఘాలు బలంగా ఉంటాయి. వారికి రాజకీయ కనెక్షన్లు. పోలీసులు వాళ్ళను ఆపడానికి భయపడతారు. ఇటీవల లారీ డ్రైవర్లు స్ట్రైక్ చేశారు కదా మేము ఎవర్ని గుద్ది పోయినా ( HIT and RUN ) మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అని…

3. లారీ, బస్ ఓనర్లు నెలవారీ “సెటిల్‌మెంట్లు” చేస్తుంటారు. అందుకే వారి వాహనాలను ఎవరూ తనిఖీ చేయరు. మనకి అందాల్సింది అందితే ఏదైనా చేసుకోవచ్చు అంత ఫ్రీడమ్ కంట్రీ కదా మనది.

4. బైక్, కార్ల కంటే.. లారీలు, బస్సులు తక్కువ. వాటి ప్రమాదాల్లో చనిపోయేవాళ్ళ కుటుంబాలకు న్యాయం కోసం పోరాడే శక్తి లేదు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగలేరు.

పరిష్కారాలు ఏమిటి – ఏం చేయాలి?

సమానచట్టాన్ని అమలు చేయాలి. అంటే.. ప్రతి వాణిజ్య వాహనానికి తప్పనిసరిగా ఆల్కహాల్ టెస్టులు జరపాలి. హైవేల్లో ప్రత్యేక చెక్ పోస్టులు కేవలం లారీలు, బస్సుల కోసం రాత్రి సమయాల్లో ఎక్కువ తనిఖీలు చేపట్టాలి. అన్ని వాణిజ్య వాహనాల్లో GPS ట్రాకింగ్ పెట్టాలి. స్పీడ్ లిమిటర్లు తప్పనిసరి చేయాలి. మద్యం సేవించి డ్రైవ్ చేసిన లారీ, బస్ డ్రైవర్లకు లైసెన్స్ రద్దు చేయాలి. ఓనర్లపై కూడా కేసులు వేయాలి. ప్రమాదానికి వారు బాధ్యత తీసుకోవాలి. ప్రమాదం జరిగితే కంపెనీపై భారీ జరిమానాలు విధించాలి. 8 గంటల తర్వాత తప్పనిసరిగా డ్రైవర్‌కి విశ్రాంతి ఇవ్వాలి. డ్రైవర్లకు మంచి వేతనాలు, బీమా సౌకర్యాలు కల్పించాలి. డ్రైవర్లకు హెల్త్ చెకప్‌లు చేయించాలి.

ALSO READ: మృత్యు ఒడిలోకి 313మంది..! ఆ దేశంలోనే వరదలు, భూకంపాలు ఎందుకు?
సామాన్య ప్రజలుగా మనం ఏం చేయాలి?

ఇది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. మనమందరం బాధ్యులం. రాత్రిళ్లు ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించండి. లారీలు, బస్సులు రాష్‌ డ్రైవింగ్ చేస్తుంటే వెంటనే 100 లేదా 112కి ఫిర్యాదు చేయండి. సోషల్ మీడియాలో అవేర్‌నెస్ సృష్టించండి.
మన ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి.

గుర్తుంచుకోండి.. బైక్ రైడర్ మద్యం తాగి ప్రమాదం చేస్తే ఒక కుటుంబం నాశనం అవుతుంది. కాని లారీ డ్రైవర్, బస్ డ్రైవర్ మద్యం తాగి ప్రమాదం చేస్తే 20-30 కుటుంబాలు నాశనం అవుతాయి. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానంగా వర్తించాలి. వందల మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. మనం మౌనంగా ఉండకూడదు. తప్పులేదు.. మార్పు కోసం గొంతు పెంచండి! అన్యాయాన్ని నిలదీయండి.

ALSO READ: వీధిన పడ్డ బతుకులు.. ఆసియాపై పగబట్టిన ప్రకృతి.. లక్షలమంది బలి!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *