Menu

Kolkata r*ape case: కోల్‌కతా హత్యాచార కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు.. దోషి సంజయ్‌రాయ్‌కు ఏ శిక్ష పడిందంటే?

Tri Ten B
kolkata rape case timeline

ఆగస్టు 9, 2024.. కోల్‌కతా(kolkata)లోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్‌ హాస్పిటల్‌.. ఉదయం 9 గంటల 30 నిమిషాలు.. ఓ 31ఏళ్ల ట్రైనీ వైద్యురాలి మృతదేహం సెమినార్ హాల్‌లో అర్థనగ్న స్థితిలో కాలేజీ సిబ్బందికి కనిపించింది. వెంటనే ఆస్పత్రి యాజమాన్యానికి ఈ విషయం తెలిసింది. ఆ వెంటనే కాలేజీ మొత్తానికి, పొలీసులకు ఈ న్యూస్‌ వెళ్లింది. ఇక ఇండియా మొత్తం ఈ వార్త ప్రచారమవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆమె శరీరంపై మొత్తం 25 గాయాలున్నాయి. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఆ తర్వాత ఆమెను చేతులతో గొంతు నులిమి హత్య చేశారు. ఈ హ*త్యాచారం కేసులో 33ఏళ్ల కోల్‌కతా పోలీస్ సివిక్ వాలంటీర్ ఆగస్టు 10న అరెస్ట్ అయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్, డీఎన్‌ఏ ఫ్రూఫ్‌, ఫోరెన్సిక్ నివేదికలు అతడే ఈ నేరానికి పాల్పడ్డాడని నిర్ధారించాయి. అటు అదే సమయంలో కొన్ని వదంతులు వ్యాపించాయి. కేవలం ఒక్క మనిషి ఇంత దారుణం చేయలేడని.. ఇది గ్యాంగ్ రేప్‌ అని ప్రచారం జరిగింది. అటు సాక్ష్యాలు మాత్రం ఇదంతా సంజయ్‌ రాయ్‌ మాత్రమే చేశాడని చెప్పాయి. ఈ ఘటన దర్యాప్తు విషయంలో వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. కేసు దర్యాప్తులో ఆలస్యం, నిర్లక్ష్యంపై ఇప్పటికీ వారిపై ఆరోపణలున్నాయి. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని.. బాధితురాలి కుటుంబం కోల్‌కతా హైకోర్టులో సీబీఐ దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఆగస్టు 13న కేసును సీబీఐకి బదిలీ చేసింది. అటు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ప్రజల రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. ఆగస్టు 15న హాస్పిటల్‌లో ప్రవేశించి అత్యవసర విభాగం, నర్సింగ్ స్టేషన్‌ను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఆగస్టు 16న కోల్‌కతా పోలీసులు ఈ విధ్వంసానికి సంబంధించి 19 మందిని అరెస్టు చేశారు. అటు ఆగస్టు 19న ఈ కేసులో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. RG కర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను విచారించింది. అదే సమయంలో కోర్టు అనుమతితో సంజయ్‌రాయ్‌పై పోలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సీబీఐ ఆమోదం పొందింది.


ఆ తర్వాత ఈ కేసులో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోవడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. నాటి CJI చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ డాక్టర్ల భద్రత కోసం జాతీయ ప్రోటోకాల్ తయారు చేయడానికి 10 మంది సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కోల్‌కతా పోలీసులకు స్టేటస్ రిపోర్టు సమర్పించవలసిందిగా ఆదేశించింది. అటు కేంద్రం ఆదేశాలతో RG హాస్పిటల్ భద్రతను కేంద్ర బలగాలు స్వీకరించాయి. ఈ ఘటనలో కోల్‌కతా పోలీసులు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు. ఆగస్టు 24న సంజయ్ రాయ్‌పై లై డిటెక్షన్ పరీక్షలను నిర్వహించారు. ఆగస్టు 25న సీబీఐ సందీప్ ఘోష్‌తో పాటు 13 మంది నివాసాలపై దాడులు జరిపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సందీప్ ఘోష్‌ను సీబీఐ సెప్టెంబర్ 2న అరెస్టు చేసింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ఆయన తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఓవైపు జరుగుతూనే ఉండగా.. మరోవైపు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు చేపట్టారు. ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ నేతృత్వంలో వైద్యులు విధులు బహిష్కరించడం సంచలనం రేపింది. అక్టోబర్ 3న డాక్టర్లు నిరాహార దీక్షకు దిగారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష జరిగింది. ఈ నిరాహార దీక్ష 17 రోజుల పాటు కొనసాగింది. అక్టోబర్‌ 21న సీఎం మమతా బెనర్జీతో డాక్టర్ల సమావేశం జరిగిన తరువాత నిరాహార దీక్షను డాక్టర్లు విరమించారు.

సాక్ష్యాలను తారుమారు చేశారా?

నవంబర్ 4న సీబీఐ సీల్దా కోర్టులో సంజయ్ రాయ్‌పై నేరాలు చార్జ్ చేసింది. నవంబర్ 11న సీల్దా కోర్టులో ఈ కేసుపై విచారణ ప్రారంభమైంది. మరోవైపు సందీప్‌ ఘోష్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్ ఆలస్యం చేసిందని ఇది కరెక్ట్ కాదని కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇది సీబీఐకి పెద్ద షాక్‌గానే చెప్పాలి. ఎందుకంటే నేరం జరిగిన 90 రోజుల వ్యవధిలో సీబీఐ అతనిపై ఛార్జ్‌షిట్‌ నమోదు చేయడంలో విఫలమైంది. ఇటు సంజయ్‌రాయ్‌పై మాత్రం కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. అటు సీబీఐ దర్యాప్తుపై బాధితురాలి తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ కేసు దర్యాప్తు కొత్తగా ప్రారంభించాలని కోరుతూ డిసెంబర్‌ 24న బాధితురాలి తల్లిదండ్రులు కోల్‌కతా హైకోర్టు గడపతొక్కారు. రక్తం, దుస్తులు లాంటి కీలక సాక్ష్యాలను దర్యాప్తులో మాయం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మాజీ ప్రిన్సిపల్‌ సందీప్ ఘోష్‌పై తగిన చర్యలు తీసుకోలేదని కోర్టులో చెప్పారు. సీబీఐ దర్యాప్తు సక్రమంగా లేదని వాపోయారు. తమ కుమార్తెకు న్యాయం జరగడం లేదని.. ఈ కేసులో చాలా మంది దోషులు ఇంకా బయటే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరారు. బాధితురాలి తల్లిదండ్రుల అభ్యర్థనతో హైకోర్టు జనవరి 5, 2025న కీలక ఆదేశాలు జారీ చేసింది. అదనపు ఆధారాలను సమర్పించాల్సిందిగా సీబీఐను ఆదేశించింది. ఇటు జనవరి 18న సీల్దా సెషన్స్ కోర్టు సంజయ్ రాయ్‌ను దోషిగా తేల్చింది. జనవరి 20న అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మరణించేవరకు జైల్లోనే ఉండాలని తేల్చింది. సాక్ష్యాల ఆధారంగా అతడి నేరాన్ని నిర్ధారించింది.. అటు సంజయ్‌ మాత్రం ఇప్పటివరకు తన నేరాన్ని ఒప్పుకోలేదు. ఘటన జరిగిన ప్రాంతంలో సంజయ్‌ ఉన్నట్లు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని అతని తరుఫు లాయర్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: అత్యాచారాలకు ఉరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *