Menu

Relationships: కన్నీటి చుక్కలో దాగిన శాంతి.. ఈ సమాజంపై ఓ మహిళ ఒంటరిగా గెలవగలదా?

Lakshmi Aruna 4 months ago
single mother problems

సునీత తన తల్లికి కాల్ చేసింది..

‘హెలో అమ్మ.. ఇంకో రెండు గంటల్లో ఇంటికి వచ్చేస్తాం అమ్మా’

‘నువ్వు రావులే.. నీ ఇష్టం వచ్చినట్టే ఉండు..’ కాల్‌ కట్ చేసింది తల్లి.

తల్లి మాటలతో సునీత మనసు మరోసారి విరిగిపోయింది. ఆ మాటల శబ్దం కంటే, వాటి వెనక దాగిన తిరస్కారమే సునీత హృదయాన్ని చీల్చేసింది. పిల్లలతో కలిసి స్నేహితురాలి ఇంటికి వెళ్లడం కూడా తప్పేనా అనిపించింది. భర్తతో విడిపోయిన ఆడది ఎక్కడికి వెళ్లకూడదా అనే ఆలోచన మెదడులో తట్టింది. ఇలాంటి ఆలోచన రావడం సునీతకు కొత్తేమీ కాదు.. భర్తకు దూరంగా ఉంటున్న ఈ ఏడాది కాలంలో ఈ ఆలోచన అనేకసార్లు తలలో తుఫానై తన్నుకొచ్చిన సందర్భాలకు లెక్కేలేదు. ఆమెను తప్పు చేసిన ఆడదిగా చూపించడానికి ఎంతమంది ప్రయత్నించారో కూడా ఆమెకు తెలియనిది కాదు. అయినా తన పుట్టింటి కుటుంబాన్ని ఎప్పుడూ దూరం పెట్టుకోలేదు సునీత. మనసు పగిలినా, మాటలతో గుచ్చినా, ఆ బంధాలను వదలలేకపోయింది. ఎన్నిసార్లు మనసు నొప్పించే మాటలు మాట్లాడినా వారందరిని భరించుకుంటుపోవడం సునీతకు అలవాటైపోయింది. కోపం.. ఆ వెంటనే జాలి.. ఇదే ఆమె మనసు తీరు. కానీ ఇంకెంతకాలం? భర్త లేకుండా ఓ మహిళ స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకలేదా ? తన కష్టంతో ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్న తనకు ఒక పూట ఆనందంగా జీవించే అర్హత కూడా లేదా? ఈ ప్రశ్నలే సునీతను ఎన్నోసార్లు వేధించాయి. అయినా సమాధానం మాత్రం దొరకలేదు. ఎందుకంటే సమాజం ఆ సమాధానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు.

భర్తతో విడిగా ఉండడమే పెద్ద నేరంగా, ఘోరంగా చూసే సమాజం మనది. ఈ సంప్రదాయాలు, కట్టుబాట్లు మగవారి కోసమే ఉంటాయి. వారిపట్లే జాలి చూపిస్తాయి. వారినే కాపాడుతాయి. ఇష్టం లేకున్నా భర్తతోనే కలిసి బతకాలని చెప్పే సంస్కృతి మనది. భార్య అంటే భరించేదని చెప్పే నీతిలేని సూత్రాలను మోసే ఈ సమాజంలో సునీత ప్రతీచోటా అవమానాలు, అనుమానలే ఎదుర్కొంటోంది. సొంత ఇంటివారే, తన బాధను అర్థం చేసుకోవాల్సిన వారే.. బాధ్యత అనే మాట తెలియని భర్తతో తిరిగి ఉండమని నచ్చజెప్పాలని అనుకోవడం ఆమెకు కత్తి గుచ్చినట్టే అనిపించేది. విడాకులంటే భూతాన్ని పిలిచినట్టే భావించే మనుషులు మన చుట్టూ ఎప్పుడూ ఉంటారు. ఇష్టం లేకపోయినా బాధలు భరిస్తూ, చివరి ఊపిరి వరకు కలిసి ఉండాలని బలవంతం చేసే ఆ చీకటి భావాల మధ్య సునీతకు వెలుగు కనపడలేదు. ఇలాంటి సిద్ధాంతాలను రుద్దిన ఆ నీచులు ఎవరో సునీతకు అర్థమయ్యేది కాదు.

తనలా ఎంతమంది మహిళలు వేదన అనుభవిస్తున్నారో అని ఆమె బాధపడని రోజే లేదు. తనకు చేతినిండా కష్టాలున్నా.. కంటినిండా కన్నీళ్లే ఉన్నా ఇతరుల బాధల గురించి కూడా ఆలోచించే మనస్తత్వం ఆమెది. తన జీవితంలో వేదనలే పూటపూటా తోడున్నా, ఇతరుల బాధలకూ జాలిపడే మనసు ఆమెది. ఇలాంటి సున్నితమైన మనసు కాబట్టే తన భర్త చేయాల్సిందంతా చేశాడు. ఆమెకు భారమై నిలిచాడు. ఇంట్లో ఇద్దరు కూతుళ్లు ఉన్నా వారిపట్ల బాధ్యత తెలియని తన భర్తపట్ల సునీతకు కోపం లేదు.. తిరస్కారమే ఉంది. అతను వద్దు అనే భావన మాత్రమే ఉంది. అతన్ని నిందించి, హింసించే నైజం లేదు. అతడిని అగౌరవపరచాలనే ఉద్దేశ్యం కూడా లేదు. అతని బతుకు అతను బతికితే చాలు అనుకుంది. తన బతుకు తనను బతకనిస్తే చాలు అనుకుంది. కలిసి ఉన్న రోజుల్లో భర్త అప్పులు తీర్చడానికే తన జీవితం ఉందేమో అనే ఆలోచన తన మెదడుకు రాని నిమిషమే లేదేమో. చివరకు తెగదెంపులు చేసుకోని తన కష్టంతో పిల్లలను పోషించుకుంటున్న ఆమెకు ఇప్పుడు కూడా అన్నీ అడ్డంకులే. ఎవరో ఒకరు తోడుండాలి.. ఎవరో ఒకరు తీర్పునివ్వాలి అని చెప్పే మనుషుల మధ్యే తన బతుకును వెళ్లదీస్తోంది.

సునీతకు ఎన్నోసార్లు అనిపించింది.. ఈ ఊరే వదిలిపెట్టి.. ఈ మనుషులు, ఈ బంధాలను దాటి, ఒక దూర ప్రదేశంలో తన ఇద్దరు పిల్లలతో మాత్రమే జీవించాలనిపించింది. అక్కడ ఎవరూ తీర్పు చెప్పని లోకం ఉండాలని కోరుకుంది. తన కళ్ళలో తానూ మాత్రమే కనిపించాలని.. తన నవ్వులో తన పిల్లల శబ్దమే కలవాలనే కోరిక ఎన్నోసార్లు కలిగింది. కానీ ప్రతిసారి ఆ ఆలోచన గుండెల్లో మొలకెత్తినప్పుడల్లా.. ఎదో అజ్ఞాతమైన భయం ఆ మొలకను తుంచేసేది. విప్లవం కావాలనుకున్న మనసు.. కుటుంబ బంధాలకు మళ్లీ లొంగేది. ఆఫీసులో కూర్చుని కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ ఉండేది కానీ మనసు మాత్రం ఎక్కడో దూరంగా తిరుగుతూ ఉండేది. ఏం చేయాలో తెలియని అయోమయంలో రోజులు గడిచిపోతున్నాయ్. తన చిన్ననాటి నుంచే కుటుంబం వేసిన నియమాలు తన మనసును బంధించిన తాళాలు అయ్యాయి. ఆ తాళాలను తెరవడానికి ధైర్యం కలగలేదు. తన జీవితంలో 12 సంవత్సరాలు గడిపిన భర్తను విడిచిపెట్టగలిగింది కానీ 36 సంవత్సరాలుగా తనలో నాటుకున్న కుటుంబపు భయాలను మాత్రం తెంచలేకపోయింది. నిజానికి సునీతకు కావాల్సింది స్వేచ్ఛ మాత్రమే. ఆ స్వేచ్ఛ అంటే ఎవరి మీద ద్వేషం కాదు.. ఎవరి మీద తిరుగుబాటు కాదు,కేవలం శాంతిగా ఊపిరి పీల్చే హక్కు మాత్రమే. కానీ ఆ స్వేచ్ఛ కూడా ఆమెకు దొరకడంలేదు.

ప్రతీ రోజు ఆమెలో పుట్టే ఆలోచనలు విప్లవాల్లా మొదలై చివరకు కన్నీటి రక్తంలా ఆగిపోతున్నాయి. కోపం, ఆవేశం, అసహనం కట్టలు తెంచుకున్నా ఆ భావాలు ఆమె గొంతులోనే ఆగిపోతాయి. మాటలు పెదవుల వరకు వచ్చి మళ్లీ వెనక్కి తిరుగుతాయి. మనసులో మంటలు రగులుతాయి కానీ కళ్లలో మాత్రం నీరే నిలుస్తుంది. ఎంత చెప్పాలనుకున్నా ఎవరు వింటారనే ఆలోచన ఆమెను మళ్లీ చుట్టేసుకుంటుంది. ఇలా చుట్టూ నలుగురు ఉన్నా ఆమె ఒంటరే అనే చేదు నిజాన్ని అర్థంచేసుకుంది. అందుకే సునీత చివరకు తలవంచడం మానేసింది. కన్నీళ్లను తుడుచుకుంటూ తిరిగి నిలబడటం నేర్చుకుంది. ఇప్పుడు ఆమె జీవితంలో ఉన్న ఆశయాలు రెండు మాత్రమే. ఒకటి బ్రతకడం కోసం కష్టపడే దృఢ సంకల్పం.. రెండోది తన పిల్లలకు స్వేచ్ఛ అంటే ఏంటో నేర్పే బాధ్యత. ఉద్యోగం ఆమెకు డబ్బు సంపాదించే మార్గం కాదు.. అది బతకడానికి ధైర్యం ఇచ్చే శక్తి. ఒకప్పుడు ఈ ప్రపంచం ఆమెను దెబ్బతీసింది, కానీ ఇప్పుడు ఆ దెబ్బలే ఆమెకు బలంమవుతున్నాయి. తన పిల్లలు తమ అమ్మలో కనిపించే ఆ బలం చూసి గర్వపడాలి, భయపడకూడదు. అదే సునీతకు కావాల్సిన విజయం.

తన కూతుళ్లను ఆమె ఒక గోడ వెనక పెంచాలని అనుకోవడం లేదు. ప్రపంచం ఎలా ఉందో వారికీ చూపాలనుకుంటోంది. ఆ ప్రపంచంలో వారు తలవంచకూడదని నేర్పాలనుకుంటోంది. ప్రేమ అంటే లొంగడం కాదని, బంధం అంటే బానిసత్వం కాదని, పెళ్లి అంటే జీవిత పరమార్థం కాదని వారికి అర్థం తెలిసేలా చేయాలనుకుంటోంది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎవరి దయపై కాదు, తమ బలంపై నిలబడగలిగే స్త్రీలగా వారు ఎదగాలని కోరుకుంటోంది. తన కుటుంబసభ్యులు చేసిన తప్పు ఇప్పుడు తాను చేయకూడదని నిర్ణయించుకుంది. సునీత ఇప్పుడు బలహీనురాలు కాదు. ఆమె జీవితం ఇబ్బందుల్లో ఉన్నా, ఆమె ఆలోచనలు మాత్రం స్థిరంగా నిలబడి ఉన్నాయి. కష్టాలు ఆమెకు శత్రువులు కావు.. అవే ఇప్పుడు ఆమెకు గురువులు. పిల్లల కోసం బ్రతకడమే కాదు, వారికి స్వేచ్ఛతో ఎలా బ్రతకాలో నేర్పడం ఆమె కొత్త ప్రయాణం. అదే ఆమెకు రెండో జన్మ.

అయినా సునీత మనసులో కొన్ని ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఈ సమాజం ఎప్పటికైనా మారుతుందా? భర్త లేకుండా ఉన్న ఒక స్త్రీని ఎప్పుడైనా సాధారణ మనిషిగా చూడగలదా? ఒక మహిళ తన కష్టంతో, తన బలంతో బతికే హక్కు కలిగి ఉందని ఈ సమాజం ఎప్పుడైనా అంగీకరించగలదా? భర్త లేకుంటే ఆడది బ్రతకలేదా? ఈ ప్రశ్నలే ఆమెను ప్రతీ ఉదయం నిద్రలేపుతాయి. అయితే ఆమె సమాధానం వెతకడం మానేసింది. ఎందుకంటే ఈ ప్రశ్నలు కేవలం తనవి మాత్రమే కాదని సునీతకి తెలుసు. చాలా మంది మహిళలను వేధిస్తున్న ప్రశ్నలు ఇవేననీ తెలుసూ. ఈ ఆలోచనల మధ్యే సునీత నిద్రలోకి జారుకునేందుకు కళ్లు మూసింది. తనకు తెలియకుండానే ఒక కన్నీటి చుక్క ఆమె కంటి నుంచి జారింది. కానీ అది ఓటమి కాదు. అది శాంతి. ఎన్నో గాయాల మధ్య కూడా జీవించగలిగిన స్త్రీ హృదయం ఆ కన్నీటి చుక్కలో ఒక శాంతి కనుగొంది. చుట్టూ ఉన్న చీకటిలో ఆ ఒక్క చుక్క మాత్రమే వెలుగులా మెరుస్తోంది. ఆమెకు తెలుసు రేపు మళ్లీ అదే పోరాటం మొదలవుతుంది. కానీ ఈ రాత్రి మాత్రం ఆమె గెలిచింది. తనలోని నొప్పిని, బలాన్ని, తల్లితనాన్ని, పక్కనే నిద్రిస్తున్న కూతుళ్లను ఒకేసారి హత్తుకోని నిద్రలోకి జారుకుంది.

ALSO READ: ఓ స్త్రీ.. నీ విలువెంత? ఈ ప్రశ్నకు ఎవరైనా సమాధానం చెబుతారా?


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *