Menu

Relationships: మనల్ని మనమే మరిచిపోయిన కథ.. బతుకుతున్నామా లేదా నటిస్తున్నామా?

Lakshmi Aruna 2 months ago
90s kids emotions

మనలో చాలామందికి ఈ ప్రశ్న ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఉంటుంది… “నేను ఇలా ఎందుకు అయ్యాను?” చిన్న నిర్ణయం కూడా ఎవరినో అడగకుండా తీసుకోలేని మనం, ఇంతగా సందేహాల్లో అసలెప్పుడు చిక్కుకుపోయాం? ఇది ఒక్కరోజులో వచ్చిన మార్పు కాదు. ఇది చిన్నప్పటి నుంచీ మనలో నాటిన భయం, మౌనం, అలవాటు. చిన్నప్పటి నుంచీ మనం విన్న మాట ఒక్కటే… “మేం చెప్పిందే వినాలి.” అయితే వినాలి అన్నవాళ్లే కానీ.., మనం చెప్పేదాన్ని వినే ప్రయత్నం మాత్రం ఎవరూ చేయలేదు. అర్థం చేసుకోవడం మన బాధ్యత అయ్యింది. అర్థం చేసుకోవాల్సింది వాళ్లు అని మనకి ఎప్పుడూ అనిపించేలా ప్రవర్తించలేదు.

కట్టుదిట్టమైన ఆంక్షల గోడల మధ్య మన బాల్యం గడిచిపోయింది. ఇష్టం అంటే ఏంటో తెలిసేలోపే ఇష్టాలను అన్నిటిని వదిలేయడం నేర్చుకున్నాం. స్వేచ్ఛ అంటే ఏంటో అర్థమయ్యేలోపే స్వేచ్ఛ ప్రమాదమని నమ్మేశాం. మన మనసుకు వచ్చిన ప్రతి కోరికకీ ఒక భయం అంటించేశారు మన పెద్దవాళ్ళు. అందుకే ఈరోజు మనం స్వతంత్రంగా ఒక పూర్తి నిర్ణయం తీసుకోవాలంటే చేతులు వణుకుతాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనం తీసుకున్న ప్రతి నిర్ణయానికీ “తప్పు” అనే ముద్ర వేశారు. ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అది నిలబడదు, ఎందుకంటే ఆ ఆవేశం కూడా చాలా కాలంగా నొక్కిపెట్టిన భావాలే.

ఫీల్ అయ్యి అయ్యి ఫీలింగ్స్ నే వదిలేశాం. ఎందుకంటే ఫీల్ అయితే బలహీనంగా కనిపిస్తామనిపించింది. ఇష్టపడి ఇష్టపడి ఇష్టాలు వదిలేశాం, ఎందుకంటే ఇష్టం అంటే స్వార్థమని నేర్పించారు. కోరుకుని కోరుకుని కోరికలు వదిలేశాం, ఎందుకంటే కోరుకోవడం తప్పులా మార్చేశారు.ఆశపడి ఆశపడి ఆశలనే వదిలేశాం. ఎందుకంటే ఆశిస్తే బాధ తప్పదన్నారు, ప్రేమించి ప్రేమించి ప్రేమను వదిలేశాం. ప్రేమిస్తే మోసం తప్పదన్నారు. అలా ఒక్కొక్కటిగా మన జీవితంలో రంగులు మాయమయ్యాయి, మనం మాత్రం నవ్వుతున్నట్టు నటించాం నటిస్తూనే బ్రతికేస్తున్నాం.

ఇలా మనల్ని మనమే కోల్పోతూ, ఖాళీ అవుతూ, నెమ్మదిగా బతుకుతున్నట్టు కనిపించే స్థితికి వచ్చాం. చివరికి బతుకు ఏమైపోతుందోనని భయపడి భయపడి… బతకడాన్నే మానేశాం. ఇప్పుడు ఒక నిజం అర్థం చేసుకోవాలి. మనల్ని అర్థం చేసుకోకపోయిన వాళ్లు మన జీవితాన్ని తిరిగి జీవించరు. బాధపడేది మనమే. కోల్పోయేది మనమే. కానీ మనల్ని మనమే అర్థం చేసుకోవడం మాత్రం ఈ క్షణం నుంచే మొదలుపెట్టొచ్చు.

ఇష్టం ఉండటం తప్పు కాదు. కోరిక ఉండటం నేరం కాదు. ఫీలింగ్స్ ఉండటం బలహీనత కాదు. ప్రేమ కోరుకోవడం లోపం కాదు. ఈసారి ఎవరూ అర్థం చేసుకోకపోయినా, కనీసం మనల్ని మనమే అర్థం చేసుకుందాం. ఎందుకంటే మనం బతకడానికి పుట్టాం… బతకడం మానేయడానికి కాదు.

ALSO READ: మీ లైఫ్‌ పార్ట్‌నర్‌తో చెప్పకూడని నాలుగు విషయాలు.. ఇది సిక్రెసీ కాదు ప్రైవసీ!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *