మగాడు మగాడిలా ఉండాలి..!
ఆడది అణిగిమణిగి ఉండాలి..!
వాడు మగాడు..తిరుగుతాడు..
నువ్వు ఆడదానివి నీకేందుకు..!
ఆడంగి ఎదవలా ఆ ఏడుపెందుకు?
గాజులు తొడుక్కొని కూర్చున్నామా?
ఏంటి.. ఇదంతా.. ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నారని ఆలోచిస్తున్నారా? ఎందుకో క్లియర్‌కట్‌గా వివరిస్తా. ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం! నేను పైన చెప్పిన ప్రతీ మాట దేశంలో అత్యాచారాలు(Ra*pes) పెరగడానికి కారణం అవుతున్నాయని మీకు తెలుసా? ఏంటి.. అర్థంకాలేదా? ఈ మాటలన్నీ మనలో చాలా మంది వాడుక భాషలో వినియోగించే పదాలే కదా. సినిమాల్లో, సీరియల్స్‌లో తరుచుగా వినిపించే డైలాగులే కదా. మరి వీటికి లైంగిక వేధింపులకు, మహిళలపై జరుగుతున్న ఘోరాలకి లింకేంటి అనేగా మీ డౌట్..! చెబుతా చదవండి..! కేరళ(kerala)లో జరిగిన ఓ యదార్థ ఘటన గురించి ముందుగా తెలుసుకోండి.
బంధువులతో జాగ్రత్త
ఆమెకు చిన్నతనం నుంచి అథ్లెట్ అవ్వాలనే కల. వారిది ఓ దళిత కుటుంబం. తండ్రి పొలంలో కూలి పని చేసేవాడు. తల్లి ఇంటి పనిని చూసుకునేది. పేదరికం, కుల వివక్ష మధ్య బతుకీడ్చుతున్న ఆమెకు ఉన్న ఒకే ఒక ఆశ..ఆమె ఆట! దేశానికి పతకాలు తీసుకురావాలని.. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని అనునిత్యం కష్టపడుతూండేది. అయితే 13 ఏళ్ల వయసులో ఆమె కుటుంబానికి దగ్గర బంధువైన ఓ వ్యక్తి మృగంగా మారాడు. తెలిసితెలియని వయసులో ఉన్న ఆమెను కోరికలు తీర్చమని బలవంతపెట్టేవాడు. అతను మాత్రమే కాదు.. పక్కింటి మామయ్య, తండ్రి స్నేహితుడు, కోచ్.. ఇలా అందరూ ఇంతే చేసేవారు. ఆమె ఎవరిపైన నమ్మకం పెట్టుకుందో వాళ్లే ఆమె జీవితాన్ని నాశనం చేశారు. ఒక్కసారి కాదు, గత ఐదేళ్లలో అనేకసార్లు వారి కామవాంఛకు ఆమె బలైపోయింది. మొత్తం 64 మంది ఆమెను లైంగికంగా వేధించారు. 18ఏళ్లు నిండకముందే ఆమెపై 5 సార్లు గ్యాంగ్ రేప్ జరిగింది. ఆమెను హింసించిన వారిలో 17 ఏళ్ల మైనర్ ఉన్నాడు. 47 ఏళ్ల పెద్ద వయసు వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిలో చాలా మంది ఆమెకు తెలిసినవారే. ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక గదిలో ఒంటరిగా కూర్చొని ఎన్నో సంవత్సరాలు వెక్కి వెక్కి ఏడ్చింది. చివరకు ఆ అమ్మాయి కళ్లలో కన్నీరు ఎండిపోయాయి. ఆమె జీవితం చీకటిలో మసకబారిపోయింది. ఇది కేరళలో జరిగిన నిజమైన ఘటన. ఇలాంటి కథలు దేశంలో లక్షల కొద్దీ ఉన్నాయి..! బయటకు రానివి, బయటపడనవి ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అవి బయటకు వచ్చినప్పుడు మాత్రం మనుషులు ఆవేశంతో రగిలిపోతారు. దోషులను ఉరి తియ్యాలి.. కాల్చి పడేయాలి లాంటి మాటలు మాట్లాడుతారు. కోల్‌కతా ఆర్జీకర్ డాక్టర్ అత్యాచార ఘటనైనా, 2019లో సంచలనం రేపిన దిశ ఘటనైనా..వారికి సంబంధించిన కథలు విన్న తర్వాత ప్రజలు ఇలానే రియాక్ట్ అయ్యారు. కాని మరణశిక్షలతో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా?
ఉరి శిక్షల తర్వాత ఘోరాలు ఎందుకు ఆగలేదు?
2012లో దేశాన్ని కుదిపేసిన నిర్భయ(Nirbhaya) హత్యాచారం తర్వాత దేశం అగ్నిగుండంగా మారింది. నాటి దోషులను ఉరిశిక్ష వెయ్యాలని అనేక మంది రోడ్లపైకి వచ్చారు. చివరకు న్యాయస్థానం వారికి మరణశిక్ష విధించింది. ఈ ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా దోషులకు శిక్ష పడినా అత్యాచారాలు మాత్రం ఆగకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 2019 డిసెంబర్‌లో దిశా కేసులో నలుగురు యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన ఘటన తర్వాత అత్యాచారాలు ఆగాయా? అంటే సమస్యకు పరిష్కారం కఠిన చర్యల్లో మాత్రమే లేదని అర్థం చేసుకోవచ్చా? మరి సమస్య మూలాలేంటి? ఈ సమస్య ఎక్కడ నుంచి పుట్టింది? ఈ సమస్యకు శాశ్వత పరిష్కరమేంటి? సమాజంలో పురుషాధిక్య భావనలు మహిళలను తక్కువగా చూడటానికి, వారి స్వేచ్ఛను పరిమితం చేస్తున్నాయని మీకు అనిపించడంలేదా? భారత్‌లో లైంగిక దాడులలో ఎక్కువ శాతం మంది బాధితులకు తెలిసినవారు ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? NCRB 2022 నివేదిక ప్రకారం, నమోదైన అత్యాచార కేసులలో సుమారు 94శాతం కేసుల వరకు నిందితులు బాధితులకు తెలిసినవారే ఉన్నారు.
ఆ ఆలోచనే నేరం..
అమ్మాయి పుట్టినప్పటి నుంచి అలా ఉండాలి ఇలా ఉండాలి.. ఈ బట్టలేసుకోవాలి.. ఆ బట్టలేసుకోవాలని.. సమాజం వేసిన క్యాసెట్‌నే అరగదీసే వరకు వేస్తూనే ఉంటుంది. మరి మగపిల్లాడు పుడితే ఏం నేర్పిస్తున్నారు? వాళ్లకి బుద్ధులు నేర్పాల్సిన బాధ్యత ఎవరిది? వయసు పెరుగుతున్న సమయంలో వచ్చే ఆలోచనలు, కోరికలు సహజమేనని.. వాటిని కంట్రోల్ చేసుకోవాలని మీకు ఏ తరగతిలోనైనా ఏ బయోలజీ టీచర్ అయినా బోధించినట్టు గుర్తుందా? రిప్రొడక్షన్ ఛాప్టెర్ అంటే ఏదో బూతు లెసన్‌లా భావించే ఉపాధ్యాయులు ఉండడం సిగ్గుచేటు కాదా? ఏది తప్పో.. ఏది ఒప్పో.. అసలు consent అంటే ఏంటో చెప్పకుండా పిల్లలు పెరగడానికి, ఆ తర్వాత దారుణాలకు ఒడిగట్టడానికి కారణమవుతున్న వ్యవస్థను నిందిస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఏమో.. ఇదంతా ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు..!
అసలు అత్యాచారం చేయాలన్న ఆలోచన రావడమే నేరం.. ఆ ఆలోచనే రాకుండా చేయాలి.. అంతేకానీ ఘోరం జరిగినపోయిన తర్వాత ఏ శిక్ష వెయాలన్నదాని గురించి డిబెట్లు పెట్టుకోని.. డిస్కషన్లు పెట్టుకోని.. దోషి చేతులు నరకాలా.. కాళ్లు నరకాలా లేదా ఇంకేదైనా నరకాలా అని ఆవేశంతో ఊగిపోతే సమస్యకు సొలూష్యన్ దొరికినట్టా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, ఆ మాటకొస్తే చివరకు పడక గదిలోనూ భార్యను బానిసగా చూస్తూ లింగ వివక్షను నరానరానా ఎక్కించుకున్న ఎంతోమంది ఆలోచనా తీరు ఈ అత్యాచారాలకు మూల కారణం! ఈ ఆలోచనా తీరును తెగ నరకితే సమాజంలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యలు జరగవు. పురుష ఆధిపత్య ధోరణి, లైంగిక విద్యపై అవగాహన లేని చదువులు మహిళలపై అత్యాచారాలు జరగడానికి అతి పెద్ద కారణం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. ఏ సమస్యకైనా పరిష్కారం ఆ సమస్యకు చెందిన కూకటివేళ్లలో ఉంటుంది కానీ చెట్టుపై ఉన్న కొమ్మలలో కాదు. అలా సమస్యను కూకటివేళ్లతో సహా పెకలించాలంటే మీరేం చేయాలి?? మాట్లాడాలి..! ఎవరితో..? పిల్లలతో.. అబ్బాయిలతో.. పురుషులతో.. అందరితో! వారి మైండ్‌సెట్ మారితేనే అత్యాచారాలు ఆగుతాయి. గౌరవం, సమానత్వం లాంటి అంశాలను బోధించాలి. అటు విద్యవ్యవస్థలో రావాల్సిన మార్పుల గురించి ప్రభుత్వాలు ఆలోచించాలి.. అప్పుడే ఆడది అర్థరాత్రైనా స్వేచ్ఛగా తిరగగలుగుతుంది..! మరి మీరేం అంటారు? అత్యాచారాలకు, ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పరిష్కారం నేను చెప్పినదాంట్లో ఉందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.. ఈ వీడియోను మీకు తెలిసినవారందరికి షేర్ చేయండి..!
ఇది కూడా చదవండి: అత్యాచారాలకు ఉరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?

Kolkata r*ape case: కోల్‌కతా హత్యాచార కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు.. దోషి సంజయ్‌రాయ్‌కు ఏ శిక్ష పడిందంటే?
Mamata Banerjee: ఇంత దిగజారుడు రాజకీయమా? చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో మమత తర్వాతే ఎవరైనా..!
Kolkata Rape Horror: అత్యాచారాలకు ఉరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?
Kolkata Murder-Sexual Assault Case: దేశంలో హత్యాచార రాజకీయాలు .. నిజాన్ని దాటేందుకు మరెన్నో కుట్రలు!!