Menu

Rajyasabha Elections: రాజ్యసభ ఎన్నికలు.. తెలంగాణలో మూడో స్థానంపై ప్రతిష్టంభన!

Sumanth Thummala

Rajyasabha elections Schedule Released: రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు నగారా మోగింది. 15 రాష్ట్రాలకు గాను 56 స్థానాలకు భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవాళ విడుదల చేసింది. ఏప్రిల్ తో ఈ స్థానాలకు గడువు ముగుస్తుంది. వీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన చెరో మూడు స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. ఫిబ్రవరి 8వ తారీఖున నోటిఫికేషన్ విడుదల జారీ చేయనుంది. నామినేషన్ల స్వీకరణ అదే రోజు నుండి ఫిబ్రవరి 15 వరకు సమయం ఇచ్చింది. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 16, నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 27న పోలింగ్, అదే రోజు ఫలితాల విడుదల అని షెడ్యూల్ లో ఈసీ పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల నుంచి వీరే:
ఏప్రిల్ లో గడువు తీరుతున్న రాజ్యసభ సభ్యుల్లో తెలంగాణ నుండి జోగినపల్లి సంతోష్,బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి సిఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

మళ్లీ కాంగ్రెస్ ప్రాతినిధ్యం:
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి రాష్ట్రంలో అధికారంలోకి రాలేక పోయిన కాంగ్రెస్, కనీసం రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే అంత మేరకు కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయింది. అయితే గత ఏడాది రాష్ట్రంలో 64 స్థానాలు గెలిచి అధికారం చేపట్టిన కాంగ్రెస్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే అవకాశం సంపాదించుకుంది. సిపిఐ తో కలిసి 65స్థానాలు ఉన్న కాంగ్రెస్ మూడు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ కి ఒక్క రాజ్యసభ స్థానం కచ్చితంగా దక్కుతుంది. ఒక రాజ్యసభ సభ్యుని అభ్యర్థిగా నిలపాలంటే ఒక పార్టీ పదిమంది ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రతిపాదించాలి. కాబట్టి 10 కంటే తక్కువ స్థానాలు ఉన్న బిజెపి, ఎంఐఎం కు అవకాశం లేదు. కాబట్టి మిగిలిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 104. దాని ప్రకారం ఒక్కో అభ్యర్థికి దాదాపు 35 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. ఈ లెక్కన కాంగ్రెస్ కు ఒక స్థానం, బీఆర్ఎస్ కు మరో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానం మీద సస్పెన్స్ నెలకొంది.ఇక ఒక్క స్థానానికి కాంగ్రెస్ నుండి సీనియర్ నేతలు అయిన జానారెడ్డి, చిన్నారెడ్డి,వి. హనుమంతరావు, మాజీ కేంద్రమంత్రులు బలరాం నాయక్, రేణుకా చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక మరొక స్థానం బీఆర్ఎస్ దక్కించుకునే నేపథ్యంలో మరోసారి అవకాశం కోసం వద్దిరాజు రవిచంద్ర, అలాగే ఎమ్మెల్యేలుగా ఓడిన ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ ఒక్క స్థానం ఎవరిది?
తెలంగాణకు సంబంధించి మూడు స్థానాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ చరక స్థానం కైవసం చేసుకోవడం ఖాయం కాగా ఇప్పుడు మూడోస్థానంపైనే ప్రతిష్టంభన నెలకొంది. మూడో అభ్యర్థికి అవసరమైన 35 ఎమ్మెల్యేల ఓట్లు ఇరు పార్టీలకు లేవు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను లాక్కునే అవకాశం ఉండొచ్చు అంటూ చర్చ నడుస్తుంది. ఇటీవల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది. అలాగే మరొక బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి ని కలిసి దాదాపు గంటసేపు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందా? అనే చర్చ కొనసాగుతుంది.

ఏది ఏమైనప్పటికీ దేశంలో సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఒక్క స్థానానికి జరిగే ఎన్నికపై రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


Written By

1 Comment

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *