Menu

Professor G N Saibaba: రాజ్యం చేసిన ద్రోహం! ప్రొఫెసర్ సాయిబాబా మరణం!!

Tri Ten B
prof sai baba death reason

ప్రజలు స్వేచ్ఛగా ఏదైనా విషయం గురించి చర్చించలేని వాతావరణంలో బతుకుతున్నారంటే ఆ సమాజంలో ప్రజాస్వామ్యం పతనమైనట్లే లెక్క..! అది ఏ భావాజాలం గురించైనా కావొచ్చు.. ఎలాంటి వారి గురించైనా కావొచ్చు..! దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది దేశద్రోహం అవుతోంది. క్రూరమైన UAPA లాంటి చట్టాల మాటున ప్రభుత్వ విమర్శకులను, మానవ హక్కుల కార్యకర్తలను, సామాజీకవేత్తలను నిర్భందించి చిత్రహింసలకు గురిచేసి చంపడం పాలకులకు అలవాటుగా మారిపోయింది. స్టాన్‌స్వామి, ప్రొఫెసర్ సాయిబాబా మరణాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పైకి ఇవి సాధారణ మరణాలు లాగానే కనిపిస్తున్నా ఇవి ముమ్మాటికి రాజ్యం చేస్తున్న హత్యలే..!

కోర్టుల మధ్య నలిగిపోయే బతుకులు

ఆదివాసీలు, దళితులు, అడుగడుగునా అత్యాచారాలకు బలవుతున్న మహిళలు, మతపరమైన మైనారిటీల కోసం పోరాడిన సామాజిక న్యాయ కార్యకర్త ఫ్రొఫెసర్ సాయిబాబా మరణం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. 90శాతం వైకల్యం ఉన్న వ్యక్తిని దాదాపు 10ఏళ్ల పాటు అండా సేల్‌లో నిర్భందించడం, ఆ తర్వాత కోర్టు ఆయన్ను నిర్ధోషిగా ప్రకటించడం భారతీయ చట్టాలలోని లోపాలకు నిదర్శనం. ఒక కోర్టు బెయిల్ ఇస్తే మరో కోర్టు ఆపుతుందా? రెండు న్యాయస్థానాలే కదా? ఒక కోర్టు దోషిగా జీవిత ఖైదు విధిస్తే మరో కోర్టు నిర్ధోషిగా విడుదల చేస్తుందా? ఇలా కోర్టుల మధ్య తిరుగుతూ నలిగిపోయే జీవితాలు ఎందరివో! న్యాయం ఒక కోర్టులో దక్కకపోతే మరో కోర్టుకు వెళ్లడం నిందితుల హక్కే కావొచ్చు.. కానీ న్యాయం చేయాల్సిన కోర్టులు తామిచ్చే తీర్పులు రాజ్యాంగబద్ధంగా ఉంటున్నాయా లేదా అన్నది చూసుకోకపోతే న్యాయవ్యవస్థ దిగజారినట్టే లెక్క!

అరెస్టే అక్రమం

‘మావోయిస్టులతో లింకులు ఉన్నాయి.. ఆయన ఇంటర్నెట్‌ నుంచి నక్సలైట్ల సాహిత్యాన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు..’ ఇది 2014లో నాడు ఢిల్లీ యూనివర్శిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సాయిబాబాపై పోలీసులు మహారాష్ట్ర పోలీసులు మోపిన అభియోగాలు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-UAPA కింద 2014 మే9న సాయిబాబాను అరెస్ట్ చేశారు. పోలీస్‌ యూనిఫామ్‌లో రాకుండా సాధారణ దుస్తులు ధరించి వచ్చిన పోలీసులు నాడు సాయిబాబా ఇంటికి వెళ్లి బలవంతంగా జైలుకు తరలించారు. నిజానికి 2013లోనే సాయిబాబా ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆయన పర్శనల్‌ కంప్యూటర్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, పుస్తకాలతో పాటు ఇంట్లోని మరికొన్ని డాక్యుమెంట్స్‌ను పట్టుకువెళ్లారు. ఆ తర్వాత ఆయనకు నిషేధిత సంస్థ మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు కేసు ఫైల్ చేశారు. నాటి నుంచి నాగ్‌పూర్ జైల్లోనే ఉన్న సాయిబాబా అనేకసార్లు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేసినా దాదాపు ప్రతీసారి అది తిరస్కరణకే గురైంది.

పోలీసులే సాక్ష్యులా?

ఆ తర్వాత మార్చి 7, 2017న UAPA చట్టంలోని పలు సెక్షన్ల కింద సాయిబాబాకు గడ్జిరౌలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే ఈ కోర్టులో సాయిబాబాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారిలో 23 మంది ఉంటే అందులో 22 మంది పోలీసులే ఉండడం విడ్డూరం. ఎందుకంటే మహారాష్ట్ర పోలీసులే సాయిబాబాను అరెస్ట్ చేశారు.. మళ్ళీ సాక్ష్యులు కూడా మహారాష్ట్ర పోలీసులే ఉన్నారు. నాడు తీర్పు వెలువడిన సమయంలో సాయిబాబా ICUలో చికిత్స పొందుతున్నారు. అప్పటికే ఆయన్ను అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. 5ఏళ్లకే పోలియో బారిన పడ్డ సాయిబాబా ఆ తర్వాత అనేక సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆయనకు దాదాపుగా 19 ఆరోగ్య సమస్యలు వేధించాయి. 90శాతం వైకల్యం ఉన్న సాయిబాబా వీల్‌చైల్‌ లేకుండా కదలలేరు. అలాంటి వ్యక్తిని అసలు వీల్‌ చైర్‌ కూడా తిరగని అండా సెల్‌లో నిర్భందించారు. తన ఆరోగ్య సమస్యల గురించి ఆయన కోర్టుకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న కళ్లు లేని న్యాయస్థానాలకు ఆయన బాధ పట్టలేదు.


ఇంతటి క్రూరమా?

జైల్లో ఉన్నా తన న్యాయపోరాటాన్ని మాత్రం సాయిబాబా ఆపలేదు. 2022అక్టోబర్‌లో సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తీర్పునిచ్చింది. ఆ వెంటనే మహారాష్ట్ర పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లడం.. అక్కడ న్యాయస్థానం బాంబే కోర్టు తీర్పు ఇవ్వడంతో సాయిబాబా విడుదలకాలేదు. అయితే 2023 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టు మరోసారి సాయిబాబాను నిర్ధోషిగా తీర్పునిచ్చింది. అయితే మరోసారి సుప్రీంకోర్టు ఈ తీర్పును తోసిపుచ్చింది. అయితే బాంబే హైకోర్టులో మరో బెంచ్‌కు ఈ కేసును అప్పగించాలని ఆదేశించింది. చివరకు 2024ఏప్రిల్‌లో విచారణ జరిపిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్‌ సాయిబాబాను నిర్ధోషిగా ప్రకటిస్తూ మహారాష్ట్ర పోలీసుల దాష్ఠికాన్ని ఎండగట్టింది. సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది.

10ఏళ్ల నరకం.. వెంటనే మరణం

జరిగిన పరిణామాలన్ని గమనిస్తే ఈ పదేళ్ల కాలంలో సాయిబాబా తన మరణానికి దగ్గరయ్యారు. రెండు చేతులు, వెన్ను, తుంటి నొప్పితో బాధపడ్డారు. అండా సెల్‌లో ఉండే విపరీతమైన వేడి, గడ్డ కట్టుకుపోయే చలి ఆయన్ను శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగించేలా చేసింది. ఆయన పరిస్థితి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మంచినీళ్ళు తాగడానికి గాజు సీసా కూడా పట్టుకోలేని స్థితిలో సాయిబాబా జైలు జీవితం గడిచింది. నీరు తాగడానికి స్ట్రా అడిగినా ఇవ్వని పోలీసుధికారుల తీరు చూస్తే దేశంలో రాజ్యహింస ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకే కాదు.. తన జైలులో 90శాతం మంది ఖైదీలు ఇలాంటి జీవితాన్నే గడిపారని అనేక సందర్భాల్లో చెప్పారు సాయిబాబా.

జైలు నుంచి విడుదలయ్యాక గత సెప్టెంబర్ 28న ఆయనకు గాల్‌బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. అయితే గాల్‌బ్లాడర్ తొలగించి స్టంట్ వేసిన చోట ఆయనకు చీము పట్టడం.. వెంటనే తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చేరారు. స్టంట్‌ వేసిన చోట చీము పట్టిందని రిపోర్టులు వచ్చాయి. దీంతో ఆ చీమును డాక్టర్లు తొలగించారు. అయినా సాయిబాబా ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ వచ్చింది. 57ఏళ్ల వయసులో చివరకు అదే ఆయన మరణానికి కారణమైంది.

ఇంకెంత మందిని బలితీసుకుంటారో

నేరారోపణ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుగానే ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకోని.. దానికి తగ్గట్టుగా సాక్ష్యాలు, సాక్ష్యులను సృష్టించి జైలుకు పంపడం, ఆ తర్వాత వారి చావుకు కారణం కావడం భారత్ రాజకీయ వ్యవస్థ దుర్బర దుస్థితికి నిదర్శనం. భీమా కోరేగావ్ కేసులో నిందితుడైన ఫాదర్ స్టాన్ స్వామి జ్యుడీషియల్ కస్టడీలో చనిపోయారు.. విరసం నేత వరవరరావు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడి, జైలు నుంచి వచ్చేందుకు అలుపెరగని పోరాటం చేసి 82ఏళ్ల వయసులో బెయిల్‌పై విడుదలయ్యారు. వీరంతా నిందితులే..! అయినా ఏళ్లకు ఏళ్లు జైలు జీవితం గడిపారు.

రాజ్యహింస.. రాక్షస రాజ్యం!

అర్బన్‌ నక్సెల్‌ అనే పదాన్ని సృష్టించి మానవహక్కుల నేతలను నిర్భందించి అరెస్టు చేయడం.. చివరకు వారి చావుకు కారణం అవ్వడం ముమ్మాటికి మావన హక్కుల ఉల్లంఘనే అవుతుంది. సాక్ష్యాత్తు దేశ ప్రధానే అర్బన్‌ నక్సెల్స్‌ అని పదాన్ని అదేపనిగా వాడడం ప్రజాస్వామ్య దేశంలో రాక్షసరాజ్యానికి అతి పెద్ద ఉదహరణ. 90శాతం అంగవైకల్యం ఉన్న సాయిబాబాకు మాట్లాడే నోరు మాత్రమే.. చివరకు దాన్ని కూడా అణచివేయాలని చూడడం పాలకుల భయాన్ని కళ్లకు కడుతోంది. తమది కాని భావాజాలాన్ని ఎదుర్కొనే శక్తి లేక, తెలివి లేక తన దుర్బుద్ధితో చట్టాలను ఉల్లంఘించి మరీ అరెస్టులు చేస్తోంది. లేదా రాజ్యంగ సూత్రాలను ఉల్లంఘించే చట్టాలను కొత్తగా సృష్టించి మరీ నిర్భందిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు..’ సుప్రీంకోర్టులో ఏపీ సీఎంకు ఘోర అవమానం!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *