Menu

Pre Term birth Surgery: సీ-సెక్షన్‌ ఆపరేషన్లకు క్యూ కడుతున్న భారతీయులు.. అమెరికాలో అసలేం జరుగుతోంది?

Tri Ten B
c section surgeries indians america

Donald Trump Birthright Citizenship Updates: ఊపిరి తీసుకోవడమే కష్టంగా ఉంటుంది.. పిల్లలకు పాలు ఇవ్వడం నరకంలా అనిపిస్తుంది.. ఆత్మవిశ్వాసం కోల్పోయి మానసిక సమస్యలు చుట్టుముడతాయి.. మెదడులో రక్తస్రావం జరుగుతుంది.. నరాల సంబంధిత వ్యాధులు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.. కొన్నిసార్లు మరణం సంభవిస్తుంది..! ఇదంతా ‘ప్రీ టర్మ్ బర్త్ సర్జరీ’ చేయించుకున్న వారికి వచ్చే సమస్యలు. అర్థంకాలేదా..? ప్రీటర్మ్ బర్త్(Preterm Birth) అంటే గర్భం పూర్తికాక ముందే శాస్త్రచికిత్స చేయించుకోని పిల్లలను కనడం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం గురించే విపరీతంగా చర్చ జరుగుతోంది. కారణం.. డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఓ నిర్ణయం. అమెరికా గడ్డపై పుట్టినవారికి లభించే యూఎస్‌ పౌరసత్వ హక్కును తొలగిస్తూ ప్రెసిడెంట్ సంతకం చేయడం, ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు కోర్టుకు వెళ్లడం, జడ్జి ట్రంప్‌ ఆర్డర్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం చకాచకా జరిగిపోయాయి. రాజ్యాంగబద్ధమైన హక్కుకు సంబంధించిన అంశం కావడంతో ఇది కోర్టుల్లోనే నలగడం ఖాయం. అటు అదే సమయంలో ఇండియన్స్‌తో పాటు అమెరికాలో నివాసముంటున్న ఇతర వలసదారులను ఓ డేట్‌ మాత్రం ఫుల్‌గా టెన్షన్ పడుతోంది. అదే ఫిబ్రవరి 20. కాసేపు కోర్టుల్లో ఏం జరిగిందో తర్వాత ఏం జరగబోతుందో పక్కన పెడితే ఈ తేదీ లోపు పిల్లలు పుడితే వారు అమెరికా పౌరులగా ఉంటారు. ఈ తేదీ దాటిన తర్వాత పుడితే వారికి అమెరికా పౌరసత్వం రాదు. అందుకే కొంతమంది చాలా దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రీ టర్మ్‌ బర్త్‌ సర్జరీల కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు.

ప్రీ టర్మ్‌ చాలా డేంజర్

సాధారణంగా 9నెలలు నిండిన తర్వాత తల్లి కడుపు నుంచి బిడ్డ బయటకు రావాల్సి ఉంటుంది. అంతకంటే ముందే బేబి బయటకు వస్తే అనేక సమస్యలు వస్తాయి. ఇది దాదాపు అందరికి తెలిసిన విషయమే. అయితే గర్భం పూర్తికాక ముందే.. సుమారు 37 వారాల కంటే ముందు పిండాన్ని శస్త్రచికిత్స ద్వారా బయటకు తీయ్యడాన్ని ప్రీ టర్మ్‌ బర్త్‌ సర్జరీ అని పిలుస్తారు. అంటే ఏడు లేదా ఎనిమిదో నెలలోనే పిండాన్ని బయటకు తీస్తారు. సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఇలా చేస్తారు. ఇప్పుడు అమెరికాలో పలు వీసాల ద్వారా నివాసముంటున్న ఇండియన్స్‌ కొందరు ఇలానే ఆలోచిస్తున్నారు. తమకు ముందుగానే డెలవరీ చేయాలని డాక్టర్లను సంప్రదిస్తున్నారు. అటు డాక్టర్లు మాత్రం ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా తల్లిదండ్రులు మాత్రం వైద్యుల మాట వినడం లేదని సమాచారం. శస్త్రచికిత్స ద్వారా ప్రీటర్మ్ డెలివరీ చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు.

అవయవాలు దెబ్బతింటాయి..

7 లేదా 8వ నెలలోనే పిండం బయటకు తీయడం వల్ల Respiratory సిస్టమ్‌ పూర్తిగా అభివృద్ధి చెందదు. అంటే పుట్టిన బిడ్డకు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు తల్లి శరీరం కూడా ఎఫెక్ట్ అవుతుంది. హార్మోన్ల లోపాలు తలెత్తుతాయి. దీని వల్ల బిడ్డకు పాలు ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇది తీవ్రమైతే ఆ బిడ్డకు తల్లిపాలే లేకుండా పోతాయి. దీని కారణంగా ఆ బిడ్డ జీవితంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO లెక్కల ప్రకారం, ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాలకు ప్రధాన కారణంగా ప్రీటర్మ్ బర్త్ కాంప్లికేషన్లు నిలుస్తున్నాయి. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు, శరీర అవయవాలు సరైన విధంగా పని చేయకపోవడం లాంటి సమస్యలు పిల్లల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయి.

అటు తల్లికి విపరీతమైన బ్లడ్‌ లాస్‌ జరుగుతుంది. రక్తం ఎంత బయటకు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. దీని కారణంగా రక్తమార్పిడి చేయాల్సి రావొచ్చు. అంటే వెరొకరి రక్తాన్ని బాధిత తల్లికి transfuse చేయాల్సి ఉంటుంది. ఇక తల్లి నుండి బిడ్డకు కనెక్ట్ చేసే కణజాలన్ని Placenta అని పిలుస్తారు. 37 వారాల ముందస్తు డెలివరీ కారణంగా కొన్నిసార్లు ఈ కణజాలాన్ని మాన్యువల్‌గా తొలగించాల్సి ఉంటుంది. ఇది మళ్లీ రక్తాన్ని కోల్పోయే ప్రమాదాన్ని పెంచుతుంది.

పౌరసత్వం కోసం పిల్లలను చంపేస్తారా?

అటు ప్రీటర్మ్ బర్త్ కారణంగా బిడ్డ కడుపు భాగం అభివృద్ధి చెందకపోతే గ్యాస్‌ సమస్యలతో బతికి ఉన్నంతకాలం బాధపడాల్సి వస్తుంది. 9నెలల నిండకముందే బిడ్డ బయటకు వస్తే నరాల అభివృద్ధి కూడా జరగని పరిస్థితులు ఉంటాయి. పుట్టే బిడ్డకు సెరెబ్రల్ పాల్సీ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. సెరెబ్రల్ పాల్సీ అంటే ప్రసవ సమయంలో బిడ్డ మెదడుకు ఆక్సిజన్, రక్త సరఫరా లేదా గ్లూకోజ్ సరఫరా జరగకపోతే వచ్చే మెదడు సమస్య. సెరెబ్రల్ పాల్సీ ఉన్న పిల్లల మాట, చూపు, మేధస్సు సాధారణ పిల్లల్లా ఉండవు. ఆకలి వేస్తుందని, నిద్ర వస్తుందని కూడా తల్లికి చెప్పలేరు. ఎంత వయసు వచ్చినా వాళ్ళ పనులు వారికి వారుగా చేసుకోలేరు. అటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా పిల్లలను వేధించవచ్చు. IVHకి గురి కావోచ్చు. ఇది ఒక రకమైన మెదడు రక్తస్రావం. ఇది నరాల సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ప్రీ టర్మ్‌ బర్త్‌ సర్జరీలతో ఎన్నో సమస్యలు వస్తాయి. నిజానికి చాలా అరుదైన సందర్భాల్లో మాత్రం డాక్టర్లు ముందస్తు డెలవరీలకు ప్రతిపాదిస్తారు. అది కూడా లైఫ్‌ అండ్‌ డెత్‌ లాంటి పరిస్థితుల్లో మాత్రమే. కానీ ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయం కారణంగా వలసదారుల తల్లిదండ్రులు చేస్తున్నది ముమ్మాటికి నేరమే అవుతుంది. పౌరసత్వం కోసం పుట్టబోయే బిడ్డను జీవితకాలం నరకంలో బతికేలా చేయడం ఎంత ఘోరమే మీరే ఆలోచించండి..!

ఇది కూడా చదవండి: అందుకే అమెరికా ఫెడరల్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యున్నతమైనది.. భారతీయ చట్టాలకు, యూఎస్‌ చట్టాలకు తేడా ఇదే!

 

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *