Menu

Indian Medal Prospects: ఈ ఆటగాళ్లపై కోటి ఆశలు.. ప్యారిస్‌లో త్రివర్ణ పతాకాన్ని వీళ్లు ఎగురవేస్తారా?

Tri Ten B
paris olympics 2024

Paris Olympics 2024: విశ్వ క్రీడా మేళా ఒలింపిక్స్‌లో ఈ సారి భారత సత్తా చాటాలని యావత్‌ దేశం కోరుకుంటోంది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత జట్టు మంచి ప్రదర్శనే చేసింది. ఒలింపిక్స్‌లో అగ్రశ్రేణి జట్లతో పోల్చితే ఈ ప్రదర్శన చాలా తక్కువే అయినా ఇండియాపరంగా ఆశించినస్థాయి కంటే ఎక్కువ మెడల్సే సాధించింది. ఒక గోల్డ్, రెండు సిల్వర్‌, నాలుగు బ్రాంజ్‌ మెడల్స్‌తో కలిపి ఓవరాల్‌గా ఏడు మెడల్స్‌ కొట్టింది. మరి ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో టీమిండియా గత ట్యాలీని అధిగమిస్తుందా? ఈ సారి భారత్‌కు మెడల్స్‌ తీసుకొచ్చే సత్తా ఉన్న ప్లేయర్లు ఎవరు?

నీరజ్ చోప్రా (జావెలిన్ త్రో):
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వరుసగా రెండో ఒలింపిక్ బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు. ఒకవేళ అదే అలా చేయగలిగితే వరుసగా రెండుసార్లు స్వర్ణ పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్‌ నిలుస్తాడు. ఇక ప్రస్తుతం నీరజ్ చోప్రా సూపర్బ్‌ ఫామ్‌లో ఉన్నాడు. జూన్ 18న ఫిన్‌లాండ్‌లోని తుర్కులో జరిగిన పావో నుర్మి గేమ్స్‌లో పాల్గొన్న నీరజ్‌… 85.97 మీటర్ల బెస్ట్ త్రోతో బంగారు పతకాన్ని సాధించాడు.

పురుషుల హాకీ జట్టు:
భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో మొత్తం ఎనిమిది సార్లు (1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964, 1980) స్వర్ణ పతకాన్ని సాధించింది. ఒకసారి (1960) రజత పతకాన్ని గెలుచుకుంది. మూడుసార్లు (1968, 1972, 2020లో) కాంస్య పతకాన్ని సాధించింది. నిజానికి 1980 తర్వాత ఒలింపిక్స్‌లో ఒక్కసారి కూడా మెడల్‌ గెలవని టీమిండియా గత టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్‌ కొట్టి నాలుగు దశబ్దాల సుధీర్ఘ నిరక్షణకు తెరదించింది. ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా స్వర్ణ పతకం సాధించాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

లవ్లినా బోర్గోహైన్ (బాక్సింగ్):
2020 ఒలింపిక్స్‌లో లవ్లినా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రీసెంట్‌గా చెక్ రిపబ్లిక్‌లో జరిగిన గ్రాండ్ ప్రి టోర్నీలో పాల్గొన్న లవ్లినా రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఒక మ్యాచ్‌ గెలిచింది. గ్రాండ్ ప్రి టోర్నీలో లవ్లినా రజత పతకాన్ని గెలుచుకుంది.

వినేష్ ఫోగట్ (రెజ్లింగ్):
వినేష్ ఫోగట్ 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా పతకం సాధించడంలో విఫలమైంది. అయితే ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో వినేష్‌ సత్తా చాటుతుందని ఫ్యాన్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పివి సింధు (బ్యాడ్మింటన్):
2016 రియో ​​సమ్మర్ ఒలింపిక్స్‌లో రజత పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు నుంచి భారత్ మరో పతకంపై ఆశలు పెట్టుకుంది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తే భారత్‌కు అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా సింధు గుర్తింపు తెచ్చుకుంటుంది.

నిఖత్ జరీన్ (బాక్సింగ్):
రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ ప్యారిస్ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని తహతహలాడుతోంది. నిఖత్‌కు ఇది తొలి ఒలింపిక్స్‌. ఆమె చివరిసారిగా మేలో జరిగిన ఎలోర్డా కప్‌లో స్వర్ణం గెలిచింది.

మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్):
టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని గెలుచుకున్న మీరాబాయి చాను ప్యారిస్‌లోని ఒలింపిక్ మెడల్‌పై కన్నేసింది. అయితే టోక్యో ఒలింపిక్స్‌ విజయం తర్వాత ఆమె కెరీర్‌ పడుతూ లేస్తూ వచ్చింది. ఎందుకంటే ఈ మూడేళ్లలో ఆమెను గాయాలు తీవ్రంగా వేధించాయి.

సిఫ్ట్ కౌర్ సమ్రా (షూటింగ్):
ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత సిఫ్ట్ ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్‌లో అద్భుతమైన ప్రదర్శనత చేసింది. ఇటివలి ముగిసిన మ్యూనిచ్ ప్రపంచ కప్‌లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్):
సింగపూర్ ఓపెన్ తర్వాత సాత్విక్, చిరాగ్ ఏ టోర్నీ ఆడలేదు. పురుషుల డబుల్స్‌లో వీరిద్దరు పతకం తీసుకొస్తారని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో, ఇద్దరూ తమ మూడు గ్రూప్ మ్యాచ్‌లలో రెండు గెలిచినప్పటికీ క్వార్టర్-ఫైనల్‌లో ఓడిపోయారు. అయితే ఈ మూడేళ్లలో ఈ జోడి గేమ్‌లో ఎంతో రాటుదేలింది.

అదితి అశోక్ (గోల్ఫ్):
టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని చేజార్చుకోలేకపోయిన అదితి అశోక్ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్‌ సాధించింది. అదితి మూడోసారి ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది.. అదితి 2016లో తొలి ఒలింపిక్స్‌ ఆడింది. భారత్ అదితి పతకం తేస్తుందని ఆశలు పెట్టుకుంది.

Also Read: పాండ్యా ఏం పాపం చేశాడు..? వచ్చీ రాగానే గంభీర్ వివాదం రేపాడా?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *