దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సందర్భంగా ఆక్స్ ఫామ్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు,అసమానతల వివరాలు కార్పొరేట్ శక్తి మన ప్రపంచాన్ని ఎలా విభజిస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించింది. కొత్త తరం ప్రజా చర్యల అవసరం పైనా విశ్లేషిస్తూ 2023 సంవత్సరం రిపోర్ట్ ను విడుదల చేసింది.
ధనవంతుల సంపద:
ప్రపంచంలో మొదటి 5 అత్యంత ధనవంతుల సంపద 2020 నుంచి రెండింతల కంటే ఎక్కువ పెరిగింది. ఈ ఐదుగురి సంపదను కలిపి రోజు ఒక మిలియన్ డాలర్లు ఖర్చు చేసినా పూర్తిగా ఖర్చు చేయడానికి 476 సంవత్సరాలు పడుతుందని తెలియజేసింది. అదే విధంగా ప్రపంచంలో ఉన్న 1% ధనికులు 43% ప్రపంచ సంపదను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మధ్యప్రాచ్యం(Middle East) లో 1% మంది 48% ఆర్థిక సంపదను కలిగి ఉన్నారు. ఆసియాలో 1% మంది 50% సంపదను కలిగి ఉంటే ఐరోపాలో 1% ధనికులు 47% సంపదను కలిగి ఉన్నారు.
మరోవైపు 2020 నుంచి 50 కోట్ల మంది కంటే ఎక్కువ జనాభా ఇంకా పేదరికంలో పడిపోయారు. కోవిద్, ద్రవ్యోల్బణం రేటుకు తగ్గట్టు పెరగని వేతనాలు కారణాలు అవ్వచ్చు అని ఆక్స్ఫామ్ అభిప్రాయపడింది. అత్యంత పేద దేశాల్లో 2019 నాటి పరిస్థితి కంటే ఎక్కువ పేదరికం ఇప్పుడు ఉంది. ఈ 1% ధనికులు సంవత్సరంలో వదిలే కర్బన ఉద్గారాలు ప్రపంచ జనాభాలో 2/3(66%) మంది పేదలు వదిలే కర్బన ఉద్గారాలతో సమానం.
లింగ అసమానతలు:
అలాగే ఆర్థిక వ్యవస్థలో లింగ బేధాలు ఇప్పటికీ తీవ్రంగా ఉంది అని ఆక్స్ఫామ్ నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మగవారు మగవారు ఆడవారి కంట 105 ట్రిలియన్ డాలర్ల సంపదను ఎక్కువ కలిగి ఉన్నారు. ఆరోగ్యం, సామాజిక రంగాలలో పనిచేస్తున్న ఆడవారు, ఫార్చ్యూన్ టాప్ 100 కంపెనీల్లో సీఈఓ లు సాధారణంగా ఏడాది సంపాదనను వీరు సంపాదించాలంటే 1,200 సంవత్సరాలు పడుతుంది. ప్రపంచంలోని 1,600 కంపెనీలలో కేవలం 24% మాత్రమే లింగ సమానత్వం పట్ల ప్రజా నిబద్ధతను కలిగి ఉన్నాయి అని పేర్కొంది.
ఆర్థిక గుత్తాధిపత్యం:
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కూడా ఆర్థిక గుత్తాధిపత్యం కొందరి చేతుల ద్వారా పెరుగుతూ ఆర్థిక అసమానతలకు కారణం అవుతుందని అంగీకరించిందని నివేదించారు. ఆపిల్ సంస్థ 3 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది, ఇది ఫ్రాన్స్ మొత్తం జీడీపీ కంటే ఎక్కువ.. ప్రపంచంలోని 5 అతిపెద్ద సంస్థలు కలిపి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల సంయుక్త జీడీపీ కంటే ఎక్కువ విలువైనవి. కార్పొరేట్ సంస్థలు ప్రజా వనరులను అత్యధికంగా దోపిడీ చేస్తున్నారు. వివిధ రంగాల్లో గుత్తాధిపత్యం నడుస్తూ ఆర్థిక దోపిడీకి,అంతరాలకు కారణం అవుతున్నాయి.
కార్పొరేట్లకు అనుకూల చట్టాలు
ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపిస్తున్న అత్యంత ధనవంతులకు అనుకూలంగా ప్రభుత్వాలు చట్టాలను రూపొందిస్తున్నాయని ఆక్స్ఫామ్ సంస్థ ఆక్షేపించింది. కనీస వేతనాలు ఈ కంపెనీల్లో అమలు కావడం లేదని, వారు సేకరించిన 148 అగ్రశ్రేణి సంస్థల డాటా ప్రకారం జూన్-2023 ముందు 12 నెలల్లో $1.8 ట్రిలియన్ల లాభాలను ఆర్జించాయని అంచనా వేసింది. 3 సంవత్సరాల సగటుతో పోలిస్తే ఇది 52 శాతం పెరిగింది, ఓవైపు లక్షలాది మంది కార్మికులు తగిన వేతనాలు పెరగక, జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వాటాదారులకు భారీ చెల్లింపులను అనుమతించారు.
ఈ నివేదిక ప్రకారం, ప్రస్తుత పరిస్థితి కొనసాగితే, ఒక దశాబ్దంలో ప్రపంచంలో మొదటి ట్రిలియనీర్‌ను చూడవచ్చు, అయితే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి 229 సంవత్సరాలు పట్టవచ్చు. కార్పొరేట్లు పన్ను విధానంపై కూడా అన్ని ప్రభుత్వాల మీద ప్రభావం చూపిస్తున్నారు. కార్పొరేట్లకు పన్ను మినహాయింపులు, ప్రత్యేక వసతులు కల్పిస్తూ సంపదను వారికి చేరుస్తున్నారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిరంతరం విపరీతంగా పెరిగిపోతోందని అసమానతల పెరుగుదలకు కారణం అవుతుందని, వ్యక్తుల, సంస్థల సంపద ఎక్కువవుతుందని చెప్పింది.
భారతదేశంపై ఆక్స్ ఫామ్ (Oxfam)
* ఇక భారతదేశంలో ప్రైవేటీకరణ విషయంలో, ప్రైవేట్ హెల్త్‌కేర్ మరియు విద్యా రంగాలలో దళితులు భరించలేని అధిక ఖర్చులు మరియు బహిరంగ వివక్షను ఎదుర్కొంటున్నారని ఆక్స్ ఫామ్ పేర్కొంది.
* భారతదేశంలోనే నలుగురు బిలియనీర్లు ప్రైవేట్ హాస్పిటల్ మరియు డయాగ్నస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఇక్కడ ప్రైవేటు వైద్యం ఎందరినో పేదలుగా చేస్తుంది. ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ రంగం విలువ 236 బిలియన్ డాలర్లుగా ఉంటూ వేగంగా పెరుగుతూ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ(IFC), ప్రపంచ బ్యాంక్ ప్రైవేట్ రంగ విభాగం నేరుగా 50 మిలియన్ డాలర్లకు పైగానే పెట్టుబడి పెట్టింది. భారతదేశంలో దీని ఆరోగ్య ప్రాజెక్టులు 25 ఏళ్ళ క్రితం ప్రారంభమైనప్పటి నుండి ఒక్క రిపోర్ట్ కూడా ప్రచురించలేదు. పెట్టుబడులు పెట్టిన 144 ఆసుపత్రులలో ఒకటి మాత్రమే గ్రామీణ ప్రాంతంలో ఉంది.
నివేదికలో సూచించినట్లుగా, కార్పొరేట్ శక్తి, శ్రమ దోపిడీ, పన్ను ఎగవేత, ప్రజా సేవల ప్రైవేటీకరణ, వాతావరణ సమస్యలను తీవ్రతరం చేయడం ద్వారా అసమానతకు దోహదం చేస్తుంది.
అసమానతలకు పరిష్కారాలు:
ఈ ఆర్థిక అంతరాలను మెరుగైన జీవన విధానాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు అసమానత తగ్గింపు కోసం ఖచ్చితమైన ప్రణాళికలను అభివృద్ధి చేయాలి. దాని కోసం విధానాలను రూపొందించాలి..
బ్రెజిల్ నాయకత్వం వహించబోతున్న G20, UNO భవిష్యత్తు సంస్కరణల శిఖరాగ్ర సమావేశాలలోGlobal North, South దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలి.
ఈ నివేదికలో ఆర్థిక వ్యవస్థను అందరికోసం పనిచేయడానికి మూడు నిరూపితమైన ఆచరణాత్మక మార్గాలను సూచించారు.
1. ప్రజల-ప్రభుత్వ ఆస్తులను పెంపొందించడం(విద్య, ఆరోగ్యం, ప్రజా రవాణా, శక్తి,ఇళ్ళు ఇంకా మౌలిక సదుపాయాలు మీద పెట్టుబడి)
2. కార్పొరేషన్లను నియంత్రించడం( ప్రైవేటు గుత్తాధిపత్యం నియంత్రణ, ట్రేడ్ యూనియన్లకు మద్దతు, పర్యావరణ,మానవ హక్కుల, లింగ,జాతి అన్యాయాలు జరగకుండా చట్టాలు)
3. వ్యాపార విధానాన్ని తిరిగి ఆవిష్కరించడం( హైబ్రీడ్, సమానమైన వ్యాపార విధానం, వ్యవస్థాపక మార్గాల ద్వారా సామాజిక లక్ష్యాలను సాధించడం),
ఈ విధంగా ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మీద ఆక్స్ ఫామ్ సంస్థ 2023 సంవత్సరానికి గాను నివేదిక అందించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్ వెల్ట్ హెచ్చరించినట్టు.. ‘ప్రజాస్వామిక రాజ్యం కంటే బలమైన స్థాయికి ప్రయివేటు అధికారం పెరగడాన్ని ప్రజలు సహిస్తే ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భద్రత ఉండదు..’ ఈ అసమానతలను వీడి లక్ష్యాలను నేటి ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు చేరుతుంది అనేది కాలమే సమాధానం చెబుతుంది.
Also Read: ఇది కేవలం సినిమా కాదు.. దర్శకుడు ఎంతో బాధ్యతతో స్పృశించిన సామాజిక అంశం!