Menu

Stress Job: కార్పొరేట్ల రక్తదాహం.. ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న కంపెనీలు

Praja Dhwani Desk 12 months ago
work stress

ఉదయం 5 గంటలు.. ఓ యువకుడు అలసిపోయిన కళ్లతో నిద్రలేచాడు. రాత్రి ఇంటికి రాగానే పడుకోవాలని ప్రయత్నించినా నిద్ర మాత్రం రాలేదు. బ్రష్ చేయడంతో మొదలైన రోజు.. ఆఫీస్ వెళ్లేవరకు ఒక యుద్ధమే. ఓవైపు డబ్బు సంపాదించాల్సిన అవసరం.. మరోవైపు కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతతో కడుపునిండా తినకుండానే ఆఫీస్‌కు పరిగెట్టాడు. డెస్క్ ముందు కూర్చున్నాక ప్రారంభమయ్యే పని.. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా చేస్తుంది. లంచ్ బ్రేక్? సరిగ్గా పదినిమిషాలు..! మధ్యలో తినేది రెండు బిస్కెట్లు. సాయంత్రం 6 అయ్యింది.. కానీ పని ఇంకా అయిపోలేదు. గంటలు గడుస్తున్నాయి.. అయినా కంప్యూటర్ ముందు కూర్చుండి టైప్ చేస్తూనే ఉన్నాడు. అలా రాత్రి 9, 10, 11… ఇంటికి చేరేసరికి అర్థరాత్రి.. మళ్లీ ఉదయం 5గంటలు..! ఇలా 10 నుంచి 15 ఏళ్లు గడిచిపోయాయి… అతనికి 40ఏళ్లు వచ్చేశాయి. తర్వాత మిగిలింది ఏంటి? డయాబెటిస్, బీపీ, మైగ్రేన్, నరాల బలహీనత, గుండె సంబంధిత వ్యాధులు, ఆర్థరైటిస్, నిద్రలేమి, మానసిక ఒత్తిడి! ఇది ఇండియాలోని కార్పొరేట్‌, ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే సగటు ఉద్యోగి దీన కథ. ప్రధాని ఆర్థిక సలహా మండలి సమర్పించిన నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 4.55శాతం మంది ఉద్యోగులు వారానికి 70 గంటలకుపైగా పని చేస్తున్నారు. 7.2శాతంతో గుజరాత్‌ ఇందులో మొదటి స్థానంలో నిలిచింది. అంటే శ్రమదోపిడి అత్యధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్‌ అన్నమాట. ఇటు తెలంగాణలో 5.05శాతం మంది, ఆంధ్రప్రదేశ్‌లో 4.16శాతం మంది వారానికి 70గంటలకు పైగా పని చేస్తున్నారు. అలా పని చేసి చివరకు ఏం సాధిస్తున్నారు? 40ఏళ్లు వచ్చేసరికి 40రకాల రోగాలను తెచ్చుకుంటున్నారు. ఆస్పత్రుల పాలవుతున్నారు. సంపాదించిన జీతమంతా ఫార్మాకే తగలేస్తున్నారు. ఉదయం 5గంటల నుంచి మొదలయ్యే పని యుద్ధం రాత్రి 10గంటలు దాటినా కొనసాగుతూనే ఉంటుంది.

వ్యక్తిగత జీవితం ఉండకూడదా?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అధిక పని గంటల ఒత్తిడికి లక్షల మంది ఉద్యోగులు నరకం అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, మాన్యుఫాక్చరింగ్, కన్సల్టింగ్ రంగాల్లో ఉన్న ఉద్యోగులే అధికంగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ప్రకారం వారానికి 55 గంటలకంటే ఎక్కువ పని చేయడం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. ఓవర్‌ టైమ్‌ వర్క్‌ గుండెపోటు ముప్పును 35శాతం పెంచుతుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలను 17శాతం పెంచుతుంది. 2016లో అధిక పని వేళల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై ప్రపంచవ్యాప్తంగా 7,45,000 మంది మరణించినట్టు WHO లెక్కలు చెబుతున్నాయి. అధిక పని ఒత్తిడి కోర్టిసోల్ హార్మోన్ స్థాయి పెరిగి డయాబెటిస్‌కు దారి తీస్తుంది. ఒబెసిటీ, నిద్రలేమి లాంటి సమస్యలను సృష్టిస్తుంది. ఇలాంటి ప్రమాదాలను చాలా దేశాలు గుర్తిస్తుంటే.. ఇండియాలో కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగుల రక్తాన్ని పీల్చుతున్నారు. 70 నుంచి 90 గంటల పని చేయాలని ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. భార్యలను చూడొద్దు, పిల్లలతో ఆడుకోవద్దు లాంటి ఉన్మాద సూచనలు కూడా ఇస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్‌లో ఉద్యోగం అనేది పని కాదు.. ఓ భయంకరమైన శిక్ష…! ఇంకా చెప్పాలంటే ఉద్యోగులను రోబోలుగా మార్చేస్తున్నారు. లాభాల కోసం జీవనశైలిని తుంచిపారేస్తోంది. మొత్తంగా మనిషి ఆరోగ్యాన్ని చంపేస్తోంది. ఇది ముమ్మాటికి కార్మిక హక్కుల ఉల్లంఘనే!

ప్రపంచవ్యాప్తంగా అమెరికా,జర్మనీ, జపాన్ లాంటి దేశాలు పని గంటలను వారానికి 40 గంటలకు పరిమితం చేస్తున్నాయి. ఇండియాలో మాత్రం పేరుకు వారానికి 48గంటల పని విధానం. కానీ చేయించుకునే పని మాత్రం 70 నుంచి 80 గంటలు! ఇదంతా ముంబైలోనో, ఢిల్లీలోనో జరుగుతున్న ఘోరం కాదు.. హైదరాబాద్‌లో కూడా పరిస్థితి ఇలానే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్ర కలలో కూడా పని చేస్తున్నట్టుగా, మెయిల్స్‌ చెక్‌ చేస్తున్నట్టుగా చాలా మంది మానసిక స్థితి మారిపోతుంది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ-ILO ప్రకారం గటు పని గంటలు వారానికి 44 గంటలకు మించకూడదు. అయితే ఈ నిబంధనలను ఇండియాలో అమలు చేస్తున్న కంపెనీలు ఎక్కడ? ఎన్ని సంస్థలు కార్మిక హక్కులను గౌరవిస్తున్నాయి? అసలు గౌరవించాల్సిన అవసరమే లేదని భావిస్తున్న ఈ కార్పొరేట్ యాజమాన్యాలు, ఉద్యోగులను అణగదొక్కడం తప్ప ఏమైనా చేశాయా? మనిషిని బతికించాల్సిన ఉద్యోగమే.. మావన శరీరాన్ని రోగాలు పాలుచేయడం లేదా? చివరకు చిన్నవయసులోనే వారంతా శవాలుగా మారడం లేదా? ఏమో ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ‘The government and corporates are two sides of the same coin.. as one exploits, the other justifies, and the worker is crushed in between..’!

ALSO READ: మలమూత్రాల నీటిలోనే మహా కుంభమేళ.. ప్రభుత్వ సంస్థనే తప్పుబడుతున్న సైంటిస్ట్ యోగి !!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *