Menu

Oruvanukku Oruthi: ‘మగాడిద’లు పీక్కుతింటున్నాయ్..! టీవీ 3*3 ఛానెల్‌ పెద్దలు ఓసారి దీన్ని చదవాలి!

Tri Ten B 7 months ago
rithanya case

కట్నం తీసుకునే వాడు గాడిద అనే సామెత ఉంది.. ఈ సామెత కనిపెట్టిన వాడికి, టీవీలో క్యాప్షన్లు పెట్టి పెద్ద పతిత్‌ లాగా షో-ఆఫ్‌గా వేసేవాడికి ఓ విషయం తెలియదు. ఈ భూమిపై నివసిస్తున్న కోట్లాది జీవాల్లో కట్నాన్ని ఆచారంగా పాటించే జాతి కేవలం మానవజాతి మాత్రమే. మరి కట్నం తీసుకునేవాడు గాడిద ఎలా అవుతాడు? మగాడు అవుతాడు..ఇంకా చెప్పాలంటే డబ్బులకు అమ్ముడుపోయే వాడవుతాడు. ఇది చట్టప్రకారం నేరమే అయినా కట్నం తీసుకునే మగాళ్లు సమాజంలో అడుగడుగునా కనిపిస్తారు. మన చుట్టే ఉంటారు.. మనతో పాటే ఉంటారు..చాలాసార్లు మన పక్కనే కూర్చుంటారు.. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో కూడా ఉంటారు. మరి ఇక్కడ గాడిదతో పోలిక ఎందుకో అర్థంకాదు. ఇంతకి మీరెప్పుడైనా ‘ఒరువనుక్కు ఒరుతి’ అనే పదాన్ని విన్నారా? ఇది తమిళ పదం* కాబట్టి.. అక్కడ చాలామంది పాటించే ఆచారం కాబట్టి.. తెలుగురాష్ట్రాల్లో ఉన్న మీరు ఈ పదాన్ని పెద్దగా విని ఉండకపోవచ్చు. అయితే ఇది కేవలం తమిళులకు సంబంధించిన అంశమే కాదు..మన సమాజంలోనూ వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఇప్పుడీ ఆచారం గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకి ఒరువనుక్కు ఒరుతి అంటే ఏంటి? ఈ ఆచారం గురించి చెప్పేముందు కట్నం గురించి ఎందుకు మాట్లాడానో మీకు అర్థంకావాలంటే ముందుగా తమిళనాడులో ఏం జరిగిందో తెలుసుకోవాలి.

మూడుముళ్లు..ముళ్లకంప:

ముందు.. ఓ విషయాన్ని చెప్పండి.. మీ ఇంట్లో మీ పిల్లలు లేదా అక్కా, చెల్లి పెళ్లికి మీరు ఎంత ఖర్చు చేశారు? ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నారు? అసలు ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాన్ని పంచుకోవడానికి డబ్బులు కుమ్మరించాల్సిన అవసరం ఉందంటారా? అవసరం ఉందో లేదో మీ వ్యక్తిగత అభిప్రాయానికే వదిలేస్తున్నా కానీ.. తిరుప్పూరులో రితన్య అనే యువతి పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అంతేకాదు 70లక్షల రూపాయల కారు, 2 కోట్ల విలువైన బంగారంతో ఆమెను అత్తారింటికి పంపించారు. ఇదంతా పెళ్లి కొడుకు కుటుంబం పెట్టిన డిమాండ్లు. వామ్మో.. ఇంత కట్నమా అని నోరెళ్లబెట్టకండి.. ఇచ్చేవాడికి లేని బుద్ధి అడిగేవాడికి ఉంటుందా లేదా అనే అంశాన్ని కాసేపు పక్కనపెడదాం. తన కూతురు ఆనందంగా ఉంటుందని సుమారు 5 కొట్లు పెళ్లికే తగలేసిన తల్లిదండ్రులకు చివరికి ఏం మిగిలింది? తన కూతురు శవంగా ఇంటికి తిరిగొచ్చింది. మూడుముళ్లు పడ్డ నాటి నుంచి ఆమె జీవితం ముళ్లకంపలో పడినట్టుయ్యింది. నిత్యం అత్తారింట్లో వేధింపులు, కనీస గౌరవం లేదు..ఇటు తల్లిదండ్రులేమో ఊరంతా పిలిచి కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. డబ్బు ఖర్చులోనే కుటుంబ పరువును చూసుకున్నారు. ఇంత చేశారు కదా.. మరి ఆమెకు కనీసం సుఖం ఎందుకు దక్కలేదు? మగవాడి కోరికల చుట్టూ తిరిగే ఈ వ్యవస్థ ఆమెను మానసికంగా తినేసింది. తర్వాత శారీరకంగానూ చంపేసింది. పెళ్లైన 78 రోజుల్లో రితన్య తనను తాను అంతం చేసుకుంది. ఈ కేసులో ఆమె భర్తను అరెస్ట్ చేశారు.

ritanya tamilnadu suicide

ఇదంతా చదువుతుంటే తప్పంతా ఆమె భర్తతో లేదా ఆమె అత్తమామలదో అనిపిస్తుందా? లేదా కోట్ల రూపాయల కట్నం ఇచ్చిన రితన్య తల్లిదండ్రులదనిపిస్తుందా? మీరు ఈ రెండిటి మధ్యే ఆలోచిస్తుంటే అసలైన సమస్యను పక్కనపెడుతున్నట్టే లెక్కా..! ఏంటి అర్థంకాలేదా? తనను తాను చంపుకోవడానికి ముందు రితన్య ఆమె తల్లిదండ్రులకు ఓ వాయిస్‌ మెసేజ్ పంపింది. ఇప్పటికే ఓ వ్యక్తితో కలిసిన తాను.. మరో వ్యక్తితో భవిష్యత్‌లో కలవలేనని రితన్య చెప్పింది. ఒరువనుక్కు ఒరుతి సూత్రాన్ని పాటించడమే తనకు ముఖ్యమని వాయిస్‌ మెసేజ్ వినిపించింది. ఆమె మరణం తర్వాత తన కుమార్తె చెప్పిన మాటలను తలుచుకున్న రితన్య తండ్రి ఇదేదో గొప్ప విషయంగా మీడియాకు చెప్పుకున్నారు. ‘ఒరువనుక్కు ఒరుత్తి’ సంప్రదాయాన్ని పాటించిన తన కూతురిని మెచ్చుకున్నారు. ఆ సమయంలో తన కూతురు చనిపోయిన బాధ కంటే ఆయన కళ్లలో ‘ఒరువనుక్కు ఒరుత్తి’ సూత్రంపై ఉన్న గర్వం, మాటల్లో అహంకారమే ఎక్కువగా కనిపించింది.

ఒరువనుక్కు ఒరుత్తి అంటే ఒక ఆడపిల్లకు ఒక్కడే మగాడు అని అర్థం. ఇది ప్రేమ నుంచి పుట్టిన పదం కాదు. తనతో లైంగికంగా కలిసిన తన భార్య భవిష్యత్‌లో ఇంకెవరితోనూ కలవకూడదనే ఆలోచన నుంచి వచ్చిన ఆచారం. భార్య శరీరం తనకే సొంతమనే భావనలో నుంచి పుట్టిన సంప్రదాయం. ఇది పైకి ఏదో సాధారణంగా అనిపిస్తున్నా ఈ ఆలోచన వెనుక ఎంతో విషం దాగుంది. భార్య శరీరాన్ని భర్త తన ఆస్తిగా, హక్కుగా భావించడమేంటో అర్థంకావడంలేదు. ఇది మూమ్మాటికి మూఢత్వమే.. ఇందులో ప్రేమ లేదు.. స్వేచ్ఛ లేదు.. గౌరవం లేదు.. ఓ ఆడదాని శ్వాసకు విలువే లేదు. ఎందుకంటే భర్త ఎలాంటి శాడిస్టయినా వాడితోనే జీవించాలనే ఆచారమిది. మనసును చంపుకుంటూ, వేధింపులు అనుభవిస్తూ చచ్చేవరకు భర్తతోనే ఉండాలనే సంప్రదాయమిది. అందుకే మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోండి.

అసలు భార్య శరీరాన్ని భర్త తన ఆస్తిగా భావించడమేంటి? ఆమె శరీరం తమకే సొంతమనే హక్కు భర్తలకు ఎవరిచ్చారు? ఆమె ఒకసారి ఓ వ్యక్తితో కలిసిందని ఇక జీవితాంతం ఇష్టం ఉన్నా లేకున్నా అతనితోనే ఉండాలని చెప్పే ఆచారాలను పాటించడమేంటి? మరి అదే మగాడు మరో పదిమంది మహిళలతో గడిపితే తప్పు లేదా? అది అతని సామర్థ్యమని వికృత సమాధానం చెప్పాలా? అతను చేస్తే ఒప్పు.. ఆమె చేస్తే తప్పా? పెళ్లయిన తర్వాత ఆమె బతుకుకు దారి లేకుండా ఎవరు చేస్తున్నారు? ఏ ధర్మం ప్రకారం ఆమెను బతకనివ్వకుండా బంధిస్తున్నారు? ఇప్పుడు చెప్పండి.. రితన్య మరణానికి కారణమేంటి? ఈ ఆచారం కాదా?

రితన్య తన భర్తతో తప్ప ఇంకెవరితోనూ కలవలేనుకుంది. ఆమె తల్లిదండ్రులు నూరిపోసిన ఆచారమే రితన్యను చంపేసింది. దేశంలో పిల్లలకు విలువలు ఏం నేర్పుతారో తెలియదు కానీ..మూఢచారాలను మాత్రం గట్టిగానే రుద్దుదారని చెప్పేందుకు రితన్య ఎపిసోడే పెద్ద ఉదాహరణ. అందుకే చిన్నతనం నుంచి తాను నమ్మిన సూత్రమే ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు ఆమెకు భవిష్యత్తే లేకుండా చేసింది. ఆమె మరణం తర్వాత కూడా అదే సంప్రదాయాన్ని సమర్థిస్తున్న రితన్య తండ్రికి కూతురు కంటే ఆచారమే ఎక్కువేమో మరి.

మధ్యలో గాడిదల గోలేందుకు బ్రో?

ఇక ఇప్పుడు ఓ సారి మనం మొదట్లో మాట్లాడుకున్న కట్నం గురించి చెప్పుకుందాం..! ఇది మన దగ్గర కూడా ఉంది కదా..! ఓ యువతి పెళ్లి చేసుకున్న 78 రోజులకే జీవితాన్ని ముగించుకుందని తెలియగానే.. అసలు ఈ కట్నం ఎందుకివ్వాలి అని ఆలోచించినవారి కంటే.. అమ్మో దాదాపు 5 కోట్లు ఇచ్చినా సరిపోలేదా అని అనుకున్నవాళ్లే ఎక్కువ. నిజానికి అప్పనంగా రూపాయ్‌ ఇచ్చినా కట్నమే.. 5 కోట్లు ఇచ్చినా కట్నమే. అది ఇచ్చుకునే వారి స్థోమత బట్టి ఉంటుంది. అసలు ప్రశ్న ఇది కాదు.. అసలు కట్నం ఎందుకివ్వాలి? పెళ్లి గురించి వంద మాటలు మాట్లాడితే అందులో 99మాటలు డబ్బు చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయి? ఈ భూమిపై కట్నం తీసుకునేవాడు కేవలం మగాడు మాత్రమే అయితే.. మధ్యలో గాడిదల గోలేందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాలు మీరే చెప్పండి..

ALSO READ: నరకంగా మారిన శుభకార్యాలు.. గుదిబండగా మారిన ఆడంబరాలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *