Menu

One Year of Gaza War: అక్టోబర్ నరమేధం.. ఎవరిది అసలైన ఉగ్రవాదం?

Tri Ten B
Israel-Gaza war one year on

‘రెండు వైపులా తప్పు అని మీరు చెప్పిన ప్రతిసారీ.. గాజాపై బాంబు వేస్తారు..’

‘చరిత్ర అక్టోబర్‌ విప్లవం గురించి చదువుకుంది..కానీ ఇప్పుడు అక్టోబర్‌ వినాశనం గురించి చెప్పుకోవాలి…’

ఫిబ్రవరి 10,2024.. ఆమె పేరు హింద్ రజాబ్.. వయసు 7.. తనని కాపాడాలంటూ పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ(PRCS)కి కాల్ చేసింది..! PRCS అనేది వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, తూర్పు జెరూసలెంలోని పాలస్తీనా ప్రజలకు సహాయం అందించే మానవతా సంస్థ..!

‘..వాళ్ల(నా బంధువుల)ని చంపేశారు.. నన్ను చంపడానికి వస్తున్నారు.. వార్ ట్యాంక్ నా పక్కనే ఉంది.. ప్లీజ్ నా దగ్గరకు రండి..’

ఇంతలోనే ఫోన్ కట్‌ అయ్యింది.. హింద్‌ రజాబ్‌ లైవ్‌ లొకేషన్‌ తెలుసుకున్న PRCS..ఓ అంబులెన్స్‌తో కలిసి ఆమె దగ్గరకు బయలుదేరింది. అయితే అంబులెన్స్‌లో వెళ్లినవారిలో ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు. రెండు రోజుల తర్వాత హింద్‌ రజాబ్‌ శవమై కనిపించింది.. ఆమెను కాపాడడానికి వెళ్లిన అంబులెన్స్‌ బాంబు దాడికి తునాతునకలైంది. అందులో ఏ ఒక్కరూ బతికిలేరు. ఇది ఏడాది కాలంగా ఇజ్రాయెల్‌ ఆర్మీ సృష్టిస్తోన్న మారణహోమానికి సాక్ష్యానికి నిలిచే ఓ ఉదాహరణ మాత్రమే. అక్కడ నిత్యం ఎందరో హింద్‌ రిజాబ్‌లు రోజూ బలవుతూనే ఉన్నారు. ఏ యుద్ధంలోనైనా చిన్నారుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఇరుపక్షాలపైనే ఉంటుంది.. దీనికి సంబంధించిన ఐక్యరాజ్యసమతి తీర్మానాన్ని ఇజ్రాయెల్‌ 1951లోనే ఆమోదించినా ఇప్పటివరకు ఆ చట్టాన్ని పాటించిన సందర్భాలేవీ ఆ దేశానికి లేకపోవడం అక్కడి నేతల కండకావరానికి నిదర్శనం!

ఇజ్రాయెల్ vs హమాస్ యుద్ధం

రజాబ్‌కు సహాయం చేయడానికి వెళ్తున్న అంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడి (PC: Dawoud Abo Alkas – Anadolu Agency )

అంతర్జాతీయ కోర్టు చట్టాలు కూడా పట్టవా?

పాలస్తీనాలోని గాజాలో ప్రజలు పిల్లలు మరియు మహిళలు మరణించారు

UNRWA ప్రకారం చనిపోయిన వారి లెక్కలు

అక్టోబర్ 7,2023న మొదలైన ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం అమాయక చిన్నారులు, మహిళలను బలిగొంది. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 41వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌ సైనికులు కర్కశత్వానికి ప్రాణాలు కోల్పోయారు. యూనిసెఫ్‌ లెక్కల ప్రకారం ఇందులో దాదాపు సగం మంది పిల్లలే ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్ వైపు 1,706 మంది చనిపోయారు అని లెక్కలు చెబుతున్నాయి.(కానీ ఇజ్రాయెల్ ఈ లెక్కలు దాస్తుంది అని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆరోపిస్తున్నాయి). అంతర్జాతీయ క్రిమినిల్ కోర్టు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అరెస్ట్ వారెంట్ జారి చేసినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికా అండతో పాలస్తీనా గడ్డపై నెత్తుటి ప్రవాహానికి కారణం అవుతోంది.

గాజాలో ఒక సంవత్సరం యుద్ధం

PC: REUTERS/అమీర్ కోహెన్

ఇజ్రాయెల్‌ ఇంటెలిజెన్స్‌ కావాలంటే సైలెంట్‌గా ఉందా?

నిజానికి ముందుగా హమాసే దాడి చేసిందని.. అందుకే ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటోందని కొన్ని మీడియా సంస్థలు ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇది నిజమే కావొచ్చు.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసింది హమాసే..ఇందులో ఏ మాత్రం అబద్ధం లేదు. అయితే ప్రపంచంలో టాప్‌ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ కలిగి‏న ఇజ్రాయెల్‌ ముందుగా హమాస్‌ దాడులను పసిగట్టలేకపోయిందా అంటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికి ఇది అక్టోబర్ 7న మొదలవ్వలేదు. ఎన్నో ఏళ్లుగా ఇజ్రాయెల్ నిర్బంధాలు సృష్టిస్తూ పాలస్తీనా ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజానికి ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్‌ ప్రాంతాలపైనే హమాస్‌ రాకెట్‌లతో విరుచుకుపడింది. అది ఒకప్పటి పాలస్తీనా నేలే.. దాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న తర్వాత మధ్యలో గొడ కట్టింది. ఆ గొడను దాటి హమాస్ సైనికులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200మందిని చంపేశాయంటే అది నెతన్యాహు ప్రభుత్వ ఫెయిల్యూర్‌గా చెప్పాలి.

ఇజ్రాయెల్ ఒక సంవత్సరం యుద్ధం గాజా

PC: REUTERS/అమీర్ కోహెన్

డైవర్షన్ పాలిటిక్స్.. అసలైన ఉగ్రవాదులు ఎవరు?

నిజానికి ఈ ఘటన జరిగిన సమయంలో ఇజ్రాయెల్‌లో బెంజమిన్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఆయన తన పదవి నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అలాంటి సమయంలో మొత్తం ఇజ్రాయెల్‌ ప్రజల డైవర్షన్‌ హమాస్‌వైపు వెళ్లింది. ఆ తర్వాత ప్రతీకార చర్య సాకుతో గాజా గడ్డపై బెంజమిన్ బలగాలు రాకెట్లతో విరుచుకుపడ్డాయి. హమాస్‌ దళాలు ఉన్నరన్న అనుమానాలతో ఆస్పత్రులపైనా దాడులకు దిగాయి. రిలీఫ్ క్యాంపులపైనా బాంబుల వర్షం కురిపించాయి. ఎంతో మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. వీరిలో UNRWA లోని 179 మంది ఉద్యోగులతో సహా 224 మంది మానవతావాద వాలంటీర్లు కూడా ఇజ్రాయెల్ దాడికి బలి అయ్యారు. ఇంత ఘోరానికి పాల్పిడన ఇజ్రాయెల్ ఆర్మీ ఏ ఉగ్రవాద సంస్థకూ తీసిపోనిది కాదు.. ఆ సైన్యం వెనుక ఉన్న ప్రధాని ఏ ఉగ్రవాదికి తక్కువ కాదు. అయితే రాజ్యం చేసే హింస చెల్లుబాటయ్యే ఈ ప్రపంచంలో బెంజమిన్‌ కేవలం ఇరాన్‌, పాలస్తీనా అనుకూల దేశాలకు మాత్రమే ఉగ్రవాదిలా కనిపిస్తున్నాడు.. భారత్‌తో సహా మిగిలిన దేశాలకు ఆయనో హీరో..! ఇక ఎంత ఎక్కువ మందిని చంపితే అంత ఎలివేషన్ కూడా ఇవొచ్చు కదా..! అయినా దాదాపు ప్రపంచమంతా మానవ హంతకులే దేశాన్ని ఏలుతున్నప్పుడు బెంజమిన్ క్రూరత్వాన్ని ఎవరైనా ప్రశ్నించాలని, దానికి అడ్డుపడాలని భావించడం అత్యాశే అవుతుంది.

ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ రాకెట్లు

PC: REUTERS/అమీర్ కోహెన్

నాటి నుంచి నేటి వరకు..:

యుద్ధం మొదలైన ఏడాది కాలంలో మానవ హక్కులను ఇజ్రాయెల్ కాలరాయని రోజే లేదు. పాలస్తీనా గడ్డపై నెత్తురు కారణ నిమిషమే లేదు. నిజానికి 76ఏళ్లగా పాలస్తీనా ఇలాంటి వేదననే అనుభవిస్తోంది. 56% భూభాగాలను ఇజ్రాయెల్‌కు కేటాయించాలని 1948లోనే ఐక్యరాజ్యసమితి చెప్పినా ఏ మాత్రం పట్టించుకోని ఇజ్రాయెల్‌ పాలస్తీనా భూభాగాలన్ని తనవే దాదాపు 8దశాబ్దాలుగా విర్రవీగుతూనే ఉంది. 1948 యుద్ధంలో దాదాపు 15 వేల మంది పాలస్తీనీయన్లను ఇజ్రాయెల్ బలగాలు చంపేశాయి. ఆ నాడే దాదాపు 7లక్షల మంది పాలస్తీనా ప్రజల పొరుగు దేశాలకు వెళ్లిపోయారు. ఇక మిగిలి ఉన్న 20లక్షల జనాభాలో దాదాపు 2 శాతం మంది ఈ ఒక్క ఏడాదిలోనే చనిపోయారు.

ఫోటోలలో: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం

PC: REUTERS/సలేహ్ సేలం

ఈ యుద్ధం ఇప్పటితో ఆగదు.. ఇంకా ఎంతో మంది అమాయకుల రక్తాన్ని చూడనిదే ఇజ్రాయెల్‌ నిద్రపోదు.. ప్రపంచదేశాలూ ప్రేక్షక పాత్ర వహించకుండా ఉండవు. అమెరికా వంటి దేశాలు యుద్ధం ఆగాలి అని ఓ వైపు చెబుతూ మరో వైపు ఇజ్రాయెల్‌కు ఆర్థిక, సైనిక, ఆయుధాలతో కపటత్వాన్ని చూపుతుంది. మొన్నటివరకు ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హమాస్‌.. నిన్నటివరకు ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హిజ్బుల్లా.. ఇప్పుడేమో ఇజ్రాయెల్‌ వర్సెస్‌ ఇరాన్‌. ఈ నెత్తుటి నరమేధం ఎర్ర సముద్రాన్ని రక్తంతో నింపుతుంది. 

ఇది కూడా చదవండి: అత్యాచారాలకు ఊరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *