Menu

Oceanic Life: నా సముద్రపు కన్నీటి కథ..రహస్య ప్రపంచంలో తేలియాడుతున్న రాకాసి ప్లాస్టిక్‌ కవర్లు!

Tri Ten B 7 months ago
oceanic tempo telugu news

నాకప్పుడు 20ఏళ్ల వయసు. అప్పుడే సముద్రాన్ని మొదటిసారి దగ్గరగా చూశాను. ఆ సమయంలో మనసంతా అక్కడి అలల మురిపాలతో మురిసిపోయింది. ఇసుకలో బట్టలు వదిలేసి, స్నేహితులతో కలిసి అలలపై దూకిన ఆ రోజులు నాకు మరచిపోలేని జ్ఞాపకాలు. ఆ సముద్రపు ఒడ్డునే మేమంతా కలల కోటలు కట్టుకున్నాం. ఒక చిన్న గాలి వాటిని కూల్చేసినా.. మేమంతా ఒక్కసారిగా నవ్వేవాళ్లం. ఆ నవ్వుల్లో.. ఆ పక్షుల పలకరింపుల్లో సముద్రం మాతో పాటే పాడినట్టే అనిపించేది. ఆ అలలు.. ఎంత బలంగా దూసుకొచ్చినా నాకు భయమే ఉండేది కాదు. అల నన్ను తాకినప్పుడు, అది అమ్మ చెయ్యిలా అనిపించేది. ఆ నీటిలో తలపెట్టినపుడు.. అది ఓదార్చే ఒడిలా ఉండేది. సూర్యుని నుంచి చివరి కిరణం పడినప్పుడు, సముద్రం రంగుల చీర కట్టుకున్నట్టు ఉండేది. అలల నాదం నిద్రలేని రాత్రుల్లో లాలిపాటలా వినిపించేది. కానీ ఇదంతా గతం..!

ప్రకృతి ఊపిరిని తీస్తున్న మనిషి:

ఇప్పుడు తీరానికి వెళ్తే.. ఆ ఆనందపు చిరునవ్వు కనిపించదు. ఎందుకంటే… ఆ సముద్రం మౌనంగా నన్ను చూస్తోంది. అది మాట్లాడడం మానేసింది. తడిచిన గాలి నన్ను హత్తుకోవడమే ఆపేసింది. దాని అలలు మెల్లగా కన్నీటి శబ్దంలా వినిపిస్తున్నాయి. సముద్రపు లోతుల్లో ఏదో ఆవేదన దాగుంది. అందుకే సముద్రపు గర్భాన్ని చూడాలనుకున్నాను..కాస్త లోతుగా వెళ్లాను.. అదంతా అది ఒక రహస్య ప్రపంచంలా మారిపోయింది. అలలపై మునుగుతున్న ప్లాస్టిక్ కవర్లు, చచ్చిపోయిన చేపలే కంటికి కనిపించాయి. బయటకొచ్చి ఇసుకగుళ్లు కట్టుకున్న ఒడ్డును తదేకంగా చూశాను. అక్కడా ప్లాస్టిక్‌ కవర్లే.. ఇదంతా చూసిన మనసు ఒక్కసారిగా ముక్కలైంది. ఈ దుస్థితికి కారణం మనమేనేమో అనిపించింది. ప్రకృతి ఊపిరిని మనమే జారవిడుస్తున్నట్టు కనిపించింది. అభివృద్ధి పేరిట మనం వేసిన ప్రతి అడుగు, సముద్రం గుండెలను చీల్చేసింది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న తీరాలు ఇప్పుడు యంత్రాల శబ్దంతో నిండిపోయాయి. మనం కనిపెట్టిన గడియారాలు… ఆ కాలమానం, ఇప్పుడు సముద్రం ఊపిరి పీల్చే హక్కును కూడా మెల్లగా తీనేస్తున్నాయి.

కొన్ని శతాబ్దాల క్రితం మనిషి మొదటిసారి సముద్రంపై కాలం చూసేందుకు ఘడియారాన్ని తీసుకొచ్చాడు. అదే రోజు సముద్రపు వేళలపై మన అధికారం మొదలైంది. అలానే సముద్రాన్ని కూడా మన లాభనష్టాల పుస్తకాల్లో ఓ పేజీగా రాసేశాం. కాని సముద్రం ఒక వ్యాపారం కాదు… అది ఒక జీవం. కోట్లాది జీవాలకు నిలయం. ఈ భూమి కేవలం మనిషిసొత్తు మాత్రమే కాదన్న నిజాన్ని పక్కనపడేశాం. అందుకే గతంలో నన్ను అల్లుకున్న ఆ సముద్రపు తల్లి.. ఇప్పుడు తన శ్వాస కోసం పోరాడుతోంది. పూర్వం నేనెరిగిన ప్రేమ మౌనంగా కన్నీళ్లు కారుస్తోంది. గుండె ఆగినట్టు అనిపిస్తోంది. ఇప్పుడీ సముద్రం మాట్లాడటం లేదు. మనం కూడా వినే స్థితిలో లేము. స్వార్థం మనకళ్లను కప్పేసింది. మనం చూసే అందమైన కంటిని మనమే కోల్పోయేలా చేసుకున్నాం.

ఈ హక్కు మనుషులకు ఎవరిచ్చారు?

ఇదంతా ఆలోచిస్తూ ఉన్న నేను.. మరోసారి సముద్రపు లోతుల్లో ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడే అక్కడి తవ్వకాలను చూశాను. కోట్లాది సంవత్సరాల క్రితం తయారైన మెరుపులాంటి చిన్న చిన్న రాళ్లను.. ఇప్పుడు పెద్ద యంత్రాలతో తీసిపారేస్తున్నారు. ఇటు సముద్రపు అడుగున జీవించే చిట్టి జీవాలు, బుజ్జి చేపలు, కనిపించని ప్రపంచం.. ఇలా అన్నీ కలతలోకి వెళ్లిపోయాయి. వాటి జీవితం ఎంత శాంతంగా ఉంటుందో మనం ఊహించలేం కానీ.. ఇప్పుడు మాత్రం వాటి జీవితమంతా శూన్యమే. వాటికి మాటలు లేవు. మనం చేసే శబ్దం వాటి నిశ్శబ్దాన్ని భయంగా మార్చేస్తోంది. తలెత్తి చూస్తే… ఆ నీలం నీటి కింద నన్ను ఓ ప్రశ్న తాకింది. ఇంతకు మనం చేస్తున్న పని భవిష్యత్ ఆశల వైపు ప్రయాణం కోసమా? లేదా ఓ భారీ విధ్వంసానికి పడుతున్న మొదటి అడుగా? ఎందుకంటే ఒకప్పుడు సముద్ర తీరంలో కనిపించిన జీవులు ఇప్పుడు కనుచూపు మెరలో కానరావడంలేదు. వాటి మార్గాలు మారిపోయాయి. వాటి దారులు దూరంగా జరిగిపోయాయి. ఎక్కడెక్కడికో పోతున్నాయి. చలికాలంలో వచ్చే తిమింగలాలు, మిగతా సముద్ర జంతువులు… ఇప్పుడు ఎటు వెళ్తున్నాయ్? కొన్ని జాతులు పూర్తిగా ఎందుకు కనుమరుగవుతున్నాయ్? కేవలం మన అవసరాల కోసం.. అభివృద్ధి పేరిట వాటి జీవితాలను చంపేసే అధికారం మనకు ఎవరిచ్చారు?

సముద్రం నిన్ను చూసి భయపడుతుందా?

వాటి ప్రపంచం నెమ్మదిగా ఏర్పడింది. వాటి జీవితం ఒక్కరోజుది కాదు.. లక్షల సంవత్సరాల ప్రయాణం. సముద్రపు లోతుల్లో ఉండే ప్రతి చిన్న జీవం, ప్రతి రాయి, ప్రతి గింజ.. మనకి కనిపించకపోయినా.. వాటికీ ఓ చరిత్ర ఉంది. అది మానవ చరిత్ర కన్నా ముందే మొదలైంది. అక్కడి జీవన రేఖలు మనిషి పుట్టుక ముందు నాటి నుంచే ఉన్నాయి. కాని ఇప్పుడు మనకి వాటిపైనే అధికారం ఎలా వచ్చింది? కోట్ల సంవత్సరాల పాటు తయారైన ప్రకృతి మన చేతుల్లో కొన్ని నిమిషాల్లోనే ఎందుకు నాశనమవుతోంది? ఇది అభివృద్ధి కాదు… ఇది ఆత్మవంచన. ఒకప్పుడు నా జీవితంలో సముద్రం ఓ ఆనందం. ఓ మాధుర్యం. ఇప్పుడు అది నన్ను తాకినా ఏమీ అనిపించడంలేదు.. దాని గుండెధ్వని వినిపించడం లేదు. నాకు తెలిసింది ఒక్కటే.. మనకున్న ఈ క్షణం తాత్కాలికం. మనం చేసే ఈ తప్పు మాత్రం శాశ్వతం. సముద్రాన్ని గౌరవించకపోతే.. అది మనల్ని క్షమించదు. అందుకే ఈ ప్రకృతి విపత్తులు, సునామీలు, భూకంపాలు..! ఇప్పుడైనా మనం మారాలి..! ఒకప్పుడు నేను తడిచిన సముద్రపు అల.. ఇప్పుడు నన్ను తాకడానికి సిగ్గుపడుతోంది. నన్ను చూసి భయపడుతోంది. ఇప్పుడైనా ఒక్క నిమిషం ఆలోచిద్దాం. మన కళ్ల ముందు చలించి పారిపోతున్న ఈ నీటి బిందువు..
ఎప్పటికీ తిరిగి రాదన్న నిజాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు దాని బాధ మనం వినకపోతే.. రేపటి రోజున వినడానికి మానవజాతే ఉండకపోవచ్చు. ఎందుకంటే.. నీళ్లే జీవానికి ఆధారం.. ఆ ఆధారాన్ని చంపేయవద్దు..! ఇది నా సముద్ర ప్రయాణంలో నేను అనుభవించిన కథ.. నా సముద్రపు కన్నీటి గాధ!

ALSO READ: నువ్వెవరు? ఈ కులాలు, వర్గాలు ఎవరి సృష్టి? నిజంగా దేవుడు ఉన్నాడా?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *