Menu

NTA Scams: పరీక్షలు పెట్టడం కూడా చేతకాదా? విద్యార్థుల భవిష్యత్‌తోనే ఆటలా?

Tri Ten B
NEET EXAM CANCEL

అది 2020 సెప్టెంబర్.. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రారంభమైంది.. వెంటనే చాలా మంది సిస్టమ్స్‌(కంప్యూటర్లు) హ్యాంగ్ అయ్యాయి. మరికొంతమందికి ఏకంగా సర్వర్‌ క్రాష్ అయ్యింది.. ఇంకొంతమందికి అసలు లాగినే అవ్వలేదు. దీంతో విద్యార్థులు ఎగ్జామ్‌ను మళ్ళీ పెట్టాలని డిమాండ్‌ చేశారు.

➡ 2024 జూన్ 4.. నీట్ ఫలితాలు విడుదలైన రోజు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720కు 720 మార్కులు వచ్చాయి. మరికొంతమందికి 719, 718 మార్కులు వచ్చాయి.. నెగిటివ్‌ మార్కింగ్‌ సిస్టమ్‌ ఉన్న నీట్‌లో ఈ తరహా మార్కులు రావడంతో విద్యార్థులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అవి గ్రేస్‌ మార్కులు అని పరీక్ష నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA) సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో గ్రేస్‌ మార్కులు కలిపిన 1563మందికి మళ్లీ ఎగ్జామ్ పెడతామని NTA చెప్పింది.

2024 జూన్ 19.. అంతకముందు రోజే అభ్యర్థులు UGC-NET ఎగ్జామ్‌ రాశారు. పరీక్ష రాసి 24 గంటలు గడిచిందో లేదో ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్టు NTA ప్రకటించింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. UGC-NET పరీక్ష రాయడం కోసం చాలా దూరాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తీరా పరీక్ష రాసిన తర్వాత దాన్ని రద్దు చేశారని తెలియగానే తీవ్ర నిరాశకు గురయ్యారు.


పైన చెప్పినవన్ని మచ్చుకు కొన్ని మాత్రమే. NTA ప్రారంభమైన 2017 నుంచే ఈ సంస్థపై అనేక వివాదాలు ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవడం NTAకి అలవాటుగా మారింది. ఏ ఎగ్జామ్‌ నిర్వహించినా ప్రతీసారి ఏదో ఒక గందరగోళం, అవకతవకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. జేఈఈ నుంచి నీట్ పరీక్ష వరకు NTA పరీక్షలు నిర్వహించడంతో అతిపెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయినా కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు ఉండవు. దేశంలోనే అతి పెద్ద పార్టీగా చెప్పుకునే బీజేపీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలపై మౌనం పాటిస్తుండడం పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతోంది.


నీట్ పరీక్షను రద్దు చేస్తారా?
UGC-NET పరీక్షను రద్దు చేయడంతో నీట్‌ పరీక్షను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అటు చాలా మంది విద్యార్థులు సైతం ఇదే డిమాండ్‌ వినిపిస్తున్నారు. నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌ అయ్యిదంటూ అనేక ఆధారాలు కూడా లభిస్తున్నాయి. తన మామయ్య ఇచ్చిన ప్రశ్నపత్రం అసలు పరీక్షా పేపర్‌తో సరిపోలిందని నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ పోలీసుల ముందు అంగీకరించాడు కూడా. అటు నీట్‌ పేపర్‌ లీక్‌ గురించి సమాధానం చెప్పాలని NTAతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటిసులు జారి చేసింది.


ఇలా అయితే పరీక్షలు రాసేదెవరు?
విద్యార్థులు, అభ్యర్థుల జీవితాలను ప్రభావితం చేసే పరీక్షల నిర్వహణలో ఇన్ని వివాదాలు ఉండడం ముమ్మాటికి బీజేపీ వైఫల్యమే. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించిన రోజులు చూసి ఏళ్లు గడుస్తున్నాయి. కేంద్రం నిర్వహించే పరీక్షలపై అభ్యర్థుల్లో నమ్మకం రోజురోజుకు సన్నగిల్లుతోంది. గతంలో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ పరీక్షల్లోనూ ఎన్నో అక్రమాలు జరిగాయి. దేశంలో కోట్లాది మంది జీవితాలు పరీక్షలపైనే ఆధారపడి ఉంటాయి. వారి భవిష్యత్‌ కోసం పరీక్షలు పారదర్శకంగా జరగడం అన్నిటికంటే అవసరం. కనీసం ఈ విషయం కూడా బీజేపీకి పట్టనట్టుగా ఉంది.


నీట్ అంతా గందరగోళం:
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజే నీట్ పరీక్షా ఫలితాలను హడావుడిగా రిలీజ్ చేశారు. విడుదలవ్వాల్సిన డేట్‌ కంటే పది రోజుల ముందుగానే ముందస్తు సమాచారం లేకుండా ఫలితాలను వదిలారు. ఆ రోజంతా ప్రజలంతా ఎన్నికల ఫలితాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారని NTAకి తెలియనిది కాదు. అయితే నీట్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు అదే రోజు నుంచే నిరసన బాటపట్టారు. పరీక్షల్లో వచ్చిన ఫలితాలను చూసి కంగుతిన్నారు. ఇలా మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారన్ని ఫిక్స్‌ చేసుకున్న రోజు నుంచే వివాదాల్లో చిక్కుకుంది. నీట్ ఎపిసోడ్‌ ఓవైపు సుప్రీంకోర్టులో నలుగుతుండగానే UGC-NET రద్దు అవ్వడంతో అభ్యర్థులు కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు…!


పేపర్ లీక్ అయ్యిందా?
ఇక NTA వైఫల్యాలపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 2018లో జేఈఈ-మెయిన్స్‌ పేపర్ లీకైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఒక అభ్యర్థికి బదులుగా మరో అభ్యర్థి పరీక్షలు రాయడం, లంచాలు ఇవ్వడం లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. అటు నార్మలైజేషన్‌ ప్రక్రియపైనే అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. పరీక్షా పేపర్‌ ఆలస్యంగా ఇవ్వడం, ఒక సెట్‌కు బదులు మరో సెట్‌ క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఈ సాకుతో గ్రేస్‌ మార్కులు కలపడం ఎంత వరకు కరెక్ట్‌ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పరీక్ష సజావుగా సాగితే ఇలాంటి వాటికి అస్కారమే ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు. అటు 2021, 2019లోనూ నీట్‌ ప్రశ్నాపత్రం లీకైందన్న ప్రచారం జరిగింది. ఇక 2018 నీట్ పరీక్షల్లో ప్రాంతీయ భాషాల క్వశ్చన్ పేపర్లు హిందీ, ఇంగ్లీష్‌ ప్రశాపత్రాలతో పోల్చితే చాలా కష్టంగా వచ్చాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా మొదటి నుంచి NTA పరీక్షల నిర్వాహణలో ఘోరంగా విఫలమైంది.

Also Read: పేదలు డాక్టర్లు కాకూడదా? నీట్‌ పరీక్షా విధానమే బడాబాబుల కోసం!

Also Read: వివాదాల సుడిగుండంలో నీట్.. అసలేంటీ స్కామ్?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *