Menu

Dowry Cases: కట్నం తీసుకునేవాడు గాడిద కాదు మగాడిద.. పెళ్లంటే వ్యాపారమేనా?

Lakshmi Aruna 5 months ago
dowry harrasement cases

మన సమాజంలో ఇంకా చెరగని ఒక కర్కోటకం ఉంది.. అదే కట్నం. ఎన్ని చట్టాలు పెట్టినా, ఎంత అవగాహన పెంచినా.. కొంతమంది మాత్రం ఆ పాత పద్ధతిని వదలట్లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో జరిగిన నిక్కీ మరణం ఈ విషయాన్ని మళ్ళీ బహిర్గతం చేసింది.

నిక్కీ.. 26 ఏళ్ల యువతి. 2016లో విపిన్ భాటిని వివాహం చేసుకుంది. మొదట్లో కట్నం తీసుకోలేదని కుటుంబం చెబుతున్నా, పెళ్లి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. లగ్జరీ కారు కావాలని, 36 లక్షల రూపాయలు కావాలని అత్తింటివారు తరచూ ఒత్తిడి చేసేవారని తండ్రి చెబుతున్నారు. అంతేకాదు.. అప్పుడప్పుడు 20,000 నుంచి 50,000 రూపాయలు డబ్బు అడిగి హింసించేవారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఈ ఘటనలో కేవలం కట్నం కోణమే కాదు.. మరో ముఖ్యం విషయం ఉంది. నిక్కీకి స్వతంత్రంగా వ్యాపారం చేయాలని, బ్యూటీ పార్లర్ నడపాలని కల ఉంది. తన చెల్లెలు కంచన్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ, చిన్న బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించింది. కానీ విపిన్, అత్తమామలు దీనికి పూర్తి వ్యతిరేకం. ‘రీల్స్ ఎందుకు? పార్లర్ ఎందుకు?’ అంటూ గొడవ చేసేవారు.

ఇలాంటి వాదనల మధ్య.. ఆగస్టు 21న విషాదం జరిగింది. నిక్కీ తన ఇంట్లోనే కాలిపోయి మృతి చెందింది. మొదట గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పినా, ఆమె చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజీలు వేరే నిజాన్ని బయటపెట్టాయి. నిక్కీకి మంటలు అంటించారని, దారుణంగా కొట్టి కిందికి లాగారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు భర్త విపిన్‌తో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు. విచారణ అయితే ఇంకా కొనసాగుతోంది.ఇంకో విచిత్రం ఏంటంటే.. మరోవైపు, అత్తింటి బంధువులు మాత్రం నిక్కీ కుటుంబం నుంచే వేధింపులు జరిగాయని వాదిస్తున్నారు. ఈ రెండు కథనాల మధ్య నిజం ఏదో కోర్టులో తేలాల్సి ఉంది.

కానీ… ఇక్కడ జీవితాన్ని కోల్పోయింది ఎవరు? ఒక యువతి తన కలల కోసం, తన స్వరాన్ని వినిపించుకోవడానికి ఈ స్థాయిలో హింసకు గురవడం మన సమాజానికి బరువైన ప్రశ్న. ఎంత వరకు కట్నం? ఏది నియంత్రణ?

సోషల్‌మీడియాలోను, బయట సమాజంలోనూ నా కూతురి కోసం ఇంత కట్నం ఇచ్చాం.. కార్లు ఇచ్చాం..బైక్‌లు, నా బూడిద, నా పిండాకూడు ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటారు. రియాలిటిలో ఆ కట్నం కూడా ఆ మొగుడుకి, వాడి అమ్మాబాబులకు సరిపోదు.. చివరకు బాధపడేది అమ్మాయే, బలయ్యేది కూడా అమ్మాయే. ఇది హిందూ వివాహ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపం. అందుకే మీ అమ్మాయి కోసం ఇచ్చే కట్నం గురించి డప్పు, ఆర్భాటాలు, ఆవకాయ బద్దల లాంటి బిల్డప్‌లను మడిచి ఎక్కడైనా పెట్టుకోండి.. బయటకు షో చేయద్దు.. మీరు ఎంత ఇచ్చినా అది పబ్లిక్‌ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇతరుల తల్లిదండ్రులపై భారాన్ని పెంచుతోంది. అప్పులు చేసి మరి కట్నాలు ఇచ్చుకోవాల్సిన దుస్థితికి కారణమౌతుంది. రియాలిటీ తెలుసుకోండి..

నిక్కీ మరణం మనమందరికీ ఒక హెచ్చరిక. కట్నం తీసుకోవడమే నేరం కాదు, ఒక ఆడపిల్ల కలలను అణచివేయడమూ నేరమే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం ఒక్కొక్కరమూ ఆత్మపరిశీలన చేసుకోవాలి.

చివరగా.. ఒక మాట గుర్తుంచుకోవాలి.. పెళ్లి అనేది ఇద్దరి మధ్య బంధం కదా… వ్యాపారం కాదు కదా. మరి పెళ్లికి కట్నం ఎందుకు? కట్నం అనేది గర్వించాల్సిన సంప్రదాయం కాదు, నిర్మూలించాల్సిన వ్యాధి. అంటే ఒక మగాడిదకి కట్నం ఇచ్చి మరి మీ బిడ్డను బలి ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించుకోండి? మీ బిడ్డ పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ పెళ్లి చేసుకుని ఇలా బోలెడంత నగదు కట్నంగా ఇస్తే మీకు మిగిలేది ఏమిటి? ఆమె నిర్జీవమై మీ ఇంటికి రావటమా?

ALSO READ: నా మౌనమే మీ అహంకారానికి కారణమా? ఈ తరం ద్రౌపది: ఎవరికి తలవంచని వనిత..!


Written By

P. Lakshmi Aruna is an anchor, sub-editor, and freelance journalist who focuses on stories of women empowerment and humanity. A passionate storyteller and committed lifelong learner, she continues to grow every day in her craft and her purpose. Contact Details: prajadhwaninewstelugu@gmail.com

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *