Menu

NEET Scam: పేదలు డాక్టర్లు కాకూడదా? నీట్‌ పరీక్షా విధానమే బడాబాబుల కోసం!

Tri Ten B
Chennai teen dies by suicide after ... neet suicides scam

ఆమె పేరు ప్రదీపా..
ఊరు: తమిళనాడు-విల్లుపురంలోని పెరువల్లూర్ గ్రామం
తండ్రి: షణ్ముగం (వ్యవసాయ కూలీ)
తల్లి: అమృత (గృహిణి)

దళిత కుటుంబానికి చెందిన ప్రదీపాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక కల డాక్టర్‌ కావడం.. చిన్నతనం నుంచి ఈ లక్ష్యంతోనే అడుగులు వేసింది. పట్టుదలగా చదివింది. పదో తరగతి పరీక్షల్లో 98శాతం,12వ తరగతిలో 93.75శాతం మార్కులు సాధించింది. అటు మెడికల్‌ ఎంట్రాన్స్‌కు నిర్వహించే నీట్‌ పరీక్షలోనూ క్వాలిఫై అయ్యింది. చిన్నతనం నుంచి చదివింది స్టేట్‌ సిలబస్‌లోనైనా CBSE సిలబస్‌తో జరిగే నీట్‌ పరీక్షలో రాణించింది. మంచి స్కోర్‌తో నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన ఆమెకు మేనేజ్‌మెంట్ కోటా కింద నేచురోపతి కోర్సులో సీటు వచ్చింది. అయితే అధిక ఫీజు చెల్లించలేక, మళ్లీ ప్రిపేర్ అవుదామని భావించి మేనేజ్‌మెంట్ కోటా కింద కాలేజీలో జాయిన్ కాలేదు ప్రదీపా. తమ గ్రామానికి దగ్గరలో ఎక్కడా ఎలాంటి కోచింగ్‌ సెంటర్‌ లేకపోవడంతో సొంతంగానే నీట్‌కు ప్రిపేర్ అయ్యింది. అయితే తర్వాతి ఏడాది నీట్‌లో క్వాలిఫై కాలేకపోయింది. అటు లక్షలు పోసి కోచింగ్‌ తీసుకున్న వారికి సీటు వచ్చింది. ఇక తాను నీట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాదించలేనని భావించిన ప్రదీపా తనువు చాలించింది.. ఇది 2018లో జరిగిన ఘటన!

ప్రదీపా (File)

ఆత్మహత్యల పరీక్ష:
2017లోనూ ఇలాంటి తరహా ఘటనే తమిళనాడులో జరిగింది. 12వ తరగతిలో 1200 మార్కులకు 1176 మార్కులు సాధించిన అనిత నీట్‌లో ఉత్తీర్ణత సాధించలేక ప్రాణాలు తీసుకుంది. ఇలా ప్రదీపా, అనిత లాంటి కథలు ఎన్నో విషాదాంతమయ్యాయి. నీట్‌ పరీక్ష కారణంగా ఆత్మహ*త్య చేసుకుంటున్న వారి సంఖ్య ప్రతీఏడాది పెరుగుతూ పోతోంది. అటు గ్రామీణ ప్రాంతాల నుంచి డాక్టర్లగా మారుతున్నవారి సంఖ్య నానాటికి తగ్గుతూ వస్తోంది.

అనిత (File)

ఇవేం పరీక్షా విధానాలు:
అసలు కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌ కాన్సెప్ట్‌ పేద, మధ్యతరగతి ప్రజలకు పెను శాపం. ఎందుకంటే ఈ పరీక్షలకు కోచింగ్‌ అవసరం. స్కూల్‌ విద్యకు, కాలేజీ చదువుల కోసం చాలా మంది పేరెంట్స్‌ అప్పులు చేసి పిల్లలను చదివిస్తుంటారు.. మరికొందరు ప్రభుత్వ విద్యాలయాల్లో తమ పిల్లలను చేర్పిస్తుంటారు. వీరంతా మళ్ళీ మెడికల్‌, ఇంజనీరింగ్‌ సీట్ల కోసమో, ఉద్యోగాల కోసమో కోచింగ్‌ సెంటర్ల గడప తొక్కాల్సి వస్తోంది. అటు అప్పొసప్పో చేసి చదివించలేని తల్లిదండ్రుల పిల్లల విద్యా, ఉద్యోగ జీవితం అక్కడే ఆగిపోవాల్సిన దుస్థితి దాపరిస్తోంది. ఇవన్ని తెలిసి కూడా కాంపిటేటివ్‌ పరీక్షల చుట్టూనే ప్రభుత్వాలు తిరుగుతుండడం విడ్డూరం. ముఖ్యంగా నీట్‌ లాంటి పరీక్షలు పిల్లల జీవితంతో చెలగాటమడుతున్నాయి, టీనేజ్‌లోనే వారి జీవితాలను అంధకారంలోకి తోసేస్తున్నాయి.


ఇదేం నిర్వాహణ?
నీట్‌ పరీక్షను 2024లోనూ వివాదాలు వదలడంలేదు. నీట్‌ పరీక్షలో గందరగోళంపై దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అసలు నీట్‌ పరీక్షనే రద్దు చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. గతంలో తమిళనాట మాత్రమే ఎక్కువగా వినిపించిన నీట్‌ రద్దు డిమాండ్‌ ఇప్పుడు దేశమంతా వినిపిస్తుండడం.. అందులో బీజేపీ పాలిత ప్రాంతాలు కూడా ఉండడం కమలం పార్టీని ఉలిక్కిపడేలా చేసింది. గ్రేస్‌ మార్కుల కేటాయింపులో తప్పు చేసి నాలుక కరుచుకున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సి(NTA) 1563 మందికి రీఎగ్జామ్‌ పెడతామని సుప్రీంకోర్టుకు చెప్పిందంటే పరిక్ష నిర్వాహణ ఎంత అసమర్థంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మునపెన్నడూ లేని విధంగా ఏకంగా 67మందికి 720కి 720 మార్కుల రావడంపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు బీహార్‌లో నీట్‌ పేపర్‌ లీకైందంటూ పలువురు పోలీస్‌ అధికారులే చెప్పడం ప్రకంపనలు రేపుతోంది.

పేదలు డాక్టర్లు కావద్దా?
అసలు నీట్‌ పరీక్షను పలు రాష్ట్రాలు ఇంతలా వ్యతిరేకించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ పరీక్షా విధానంతోనే అసలు సమస్య. పూర్తిగా NCERT బుక్స్‌ బెస్‌ చేసుకోని CBSE సిలబస్‌ను కవర్‌ చేస్తూ నీట్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఇది కేవలం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రమే అనుకూలించే సిలబస్‌. ఎందుకంటే CBSE స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండేది పట్టణాల్లో మాత్రమే. చాలా గ్రామీణ ప్రాంతాల్లో అసలు CBSE స్కూళ్ల జాడే కనిపించదు. వారంతా ప్రభుత్వ స్కూళ్లలోనో, దగ్గరలోని ప్రైవేట్‌ స్కూళ్లలోనో చదువుతారు. అవి స్టేట్‌ సిలబస్‌తో నడిచే విద్యాలయాలు. ఇలా మొదటి నుంచి స్టేట్‌ సిలబస్‌కు అలవాటు పడిన విద్యార్థులు నీట్‌ పరీక్షకు NCERT బుక్స్‌ను ప్రిపేర్ కావాల్సి వస్తోంది. ఇది వారికి మైనస్‌గా మారుతోంది. దీంతో ఎక్కువగా మెడిసిన్ సీటు సంపాదించేవారు పట్టణాల నుంచే ఉంటున్నారు.

ధనికులే వైద్యులు కాగలరా?
ఒక పరీక్షను నిర్వహించేటప్పుడు అది సమాజంలోని ఏ వర్గానికి కూడా ప్రతీకూలించే విధంగా ఉండకూడదు. మన దేశంలో డాక్టర్లను దేవుడితో సమానంగా కోలుస్తారు. అయితే ఈనాడు చాలామంది డాక్టర్లకు ధనదాహమే తప్ప రోగుల ఆర్థిక, సామాజీక పరిస్థితులు అర్థంచేసుకునే గుణం లేకుండా పోతోంది. ఎందుకంటే చిన్నతనం నుంచి అర్బన్‌ ఏరియాల్లో పెరుగుతూ వచ్చినవారే డాక్టర్లు కాగలగుతున్నారు. ఒకవేళ సీటు రాకున్నా కోట్ల ఖర్చు పెట్టి మెడిసిన్‌ విద్యను కొంటున్నారు. ఇటు ప్రభుత్వ విద్యాలయాలనే నమ్ముకోని చదువుతున్న పేద విద్యార్థుల కలలు, ఆశలు నీట్‌ లాంటి పరీక్షా విధానాలతో చెల్లచెదురువుతున్నాయి. ముఖ్యంగా చాలా రాష్ట్రాల్లోని దళితులు జాతీయ పరీక్షా విధానాలతో తీవ్రంగా నష్టపోతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read: వివాదాల సుడిగుండంలో నీట్.. అసలేంటీ స్కామ్?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *