ఒక మహిళ చేతిలో పుస్తకం ఉంది. కళ్లలో భయం ఉంది. కానీ గొంతులో మాత్రం నిజం ఉంది. ఆమె దేవుడిని తిట్టలేదు, మతాన్ని కించపరచలేదు. పుస్తకంలో రాసిన ఒక సంఘటనను మాత్రమే ప్రశ్నించింది. “ఇక్కడ ఆమె తప్పు ఏంటి?” అని. అంతే. ఆ ఒక్క ప్రశ్నతో ఆమె పేరు ముందు దేశద్రోహి అనే ముద్ర పడింది. ఆమె చేసిన నేరం ఏంటంటే, ఒక మహిళ బాధను మరో మహిళగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం.
సీతాదేవి అగ్నిపరీక్ష గురించి మాట్లాడితే సంస్కృతి మీద దాడి అంటారు. ద్రౌపది వస్త్రాపహరణం గుర్తు చేస్తే మత అవమానం అంటారు. కానీ సీతాదేవి ఎందుకు అగ్నిపరీక్ష చేయాల్సి వచ్చింది? ఆమె ఎందుకు సభలో నిస్సహాయంగా నిలబడాల్సి వచ్చింది? అని ఎవ్వరూ అడగరు ఒక మహిళ ఏడుస్తుంటే సహించాలి అని నేర్పిన సమాజం, ఆమె ఎందుకు ఏడుస్తుందో అడిగితే మాత్రం వణుకుతోంది. ఎందుకంటే ప్రశ్నలు అధికారాన్ని కంపింపజేస్తాయి. మౌనం మాత్రమే దానిని కాపాడుతుంది.
దేశద్రోహం అంటే దేశాన్ని అమ్మడం. దేశానికి హాని చేయడం. దేశ సార్వభౌమత్వాన్ని కూల్చే ప్రయత్నం. కానీ చెప్పండి… ఒక మహిళ తనలాంటి మరో మహిళ కథలోని అన్యాయాన్ని ప్రశ్నిస్తే, అది దేశానికి ఎలా ప్రమాదం అవుతుంది? ఆమె అడిగిన ప్రశ్న సరిహద్దులు దాటిందా? సైనిక రహస్యాలు బయటపెట్టిందా? లేక కేవలం మనసున్న మనిషిలా స్పందించిందా? ఈ దేశంలో మహిళలు ఎప్పుడూ భరించాల్సిందేనా. భర్త మాట, కుటుంబ గౌరవం, సమాజ భయం, మతం పేరు. అన్నిటినీ మౌనంగా భరించాలి. కానీ అదే మహిళ “ఇది ఎందుకు?” అని అడిగితే, అప్పుడు ఆమె దేశానికి ప్రమాదంగా మారుతుంది. ఎంత సులువు కదా? ప్రశ్నించే మహిళను దేశద్రోహిగా మార్చేయడం.
ఇది మత రక్షణ కాదు. ఇది మహిళ గొంతు నొక్కేయడం. భక్తి కాదు. భయం. ఈ దేశం ఒక్క మతానిది కాదు. ఒక్క ఆలోచనదీ కాదు. ఇది రాజ్యాంగం మీద నిలబడిన దేశం. నమ్మే హక్కు ఉన్నట్టే, నమ్మకపోయే హక్కు కూడా ఉన్న దేశం. కానీ ఈ రోజు నెమ్మదిగా ఏం జరుగుతోంది అంటే, మతాన్ని ప్రేమగా కాకుండా అధికారంగా మార్చుకున్న కొందరు, ముఖ్యంగా ప్రశ్నించే మహిళల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక పురుషుడు ప్రశ్నిస్తే చర్చ అంటారు. అదే ప్రశ్న ఒక మహిళ అడిగితే అవమానం అంటారు. తిరుగుబాటు అంటారు. దేశద్రోహం అంటారు. ఎందుకంటే ఆమె మౌనంగా ఉండాలని ఈ సమాజం నిర్ణయించుకుంది.
ఇస్లామిక్ ముఠాల గురించి మాట్లాడినప్పుడు మనం భయపడ్డాం. అదే ముఠా మానసికత ఇప్పుడు వేరే పేరుతో, వేరే ముసుగులో కనిపిస్తే మాత్రం చూసీ చూడనట్టు వదిలేస్తున్నాం. మాకు నచ్చితే భక్తి. మాకు నచ్చకపోతే దేశద్రోహం. పేర్లు మారాయి కానీ ఆలోచన మారలేదు. దేశాన్ని ప్రేమించడం అంటే గుడ్డిగా నమ్మడం కాదు. తప్పు కనిపిస్తే మాట్లాడడం. ముఖ్యంగా, ఒక మహిళ ఏడుపులో ఉన్న నిజాన్ని వినడం. బాధను అర్ధం చేసుకోవడం. దేశం బలంగా ఉండాలంటే మౌనం కాదు, మానవత్వం కావాలి.
అందరూ గుడ్డిగా గడ్డి తిని బతకాలా? లేక ఆలోచించి, ప్రశ్నించి, కన్నీళ్లతో అయినా నిజం మాట్లాడే హక్కు మనకుందా? ఒక మహిళ అడిగిన ప్రశ్న దేశాన్ని కూల్చదు. ఆ ప్రశ్నలను అణిచేయడమే దేశాన్ని ఖాళీ చేస్తుంది.
ఈ దేశం దేవుళ్లదే కాదు. మనుషులది కూడా. అందులో మహిళలు కూడా మనుషులే. వాళ్లకు బాధ ఉంటుంది. ప్రశ్న ఉంటుంది. గొంతు ఉంటుంది. ఆ గొంతు నొక్కితే దేశం మిగులుతుంది కానీ ఆత్మ చచ్చిపోతుంది.
ALSO READ: దుస్తులు కాదు.. నీ నీచమైన చూపే అసలు నేరం..! మీకు కంట్రోల్ లేకపోతే ఆడదాన్ని నిందిస్తారా?
