ఒకవైపు బర్డ్ ఫ్లూ వార్తలు, మరోవైపు GBS అలజడి… ఇంకొవైపు ఏమో మైకోప్లాస్మా న్యుమోనియే. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అనారోగ్య సమస్యలు ఓ విపత్తుగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పిల్లల ఊపిరితిత్తుల్లో పెనుముప్పుగా మారిన మైకోప్లాస్మా న్యుమోనియే ఇన్ఫెక్షన్ తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. హాస్పిటళ్లలో మళ్లీ కోవిడ్ తరహా గందరగోళం మొదలైంది. తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై భయంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇంతకీ మైకోప్లాస్మా న్యుమోనియే అంటే ఏంటి? ఇది ఇంతగా ఎందుకు వ్యాపిస్తోంది?
మైకోప్లాస్మా న్యుమోనియే అంటే ?
మైకోప్లాస్మా న్యుమోనియే అనేది ఒక బ్యాక్టీరియాకు సంబంధించిన వ్యాధి. ఇది చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది. శరీరాన్ని లోపలి నుంచే దెబ్బతీస్తుంది. గొంతులో నొప్పి, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతీసే శక్తి కూడా ఈ బ్యాక్టీరియాకు ఉంటుంది. ఇది కొత్తగా వచ్చిన వ్యాధి కాదు. మైకోప్లాస్మా న్యుమోనియే వందల ఏళ్లుగా ఉన్నది. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మళ్లీ వ్యాపిస్తోంది. చైనా, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఇండియాలోనూ ఇదే పరిస్థితి. 2025 జనవరిలో చెన్నైలో ఈ కేసుల సంఖ్య పెరిగాయి. ఇటు ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోనూ మైకోప్లాస్మా న్యుమోనియే కేసులు రికార్డయ్యాయి.
ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా?
హైదరాబాద్‌లో చాలా మంది పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. మారిన వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, సంక్రాంతి సెలవుల తర్వాత పిల్లలు స్కూళ్లకు తిరిగి వెళ్లడం లాంటి కారణాలతో ఈ ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. పిల్లలు సమూహాల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల ఒకరి దగ్గరి నుంచి మరొకరికి ఈ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు విడుదలయ్యే బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాపిస్తుంది. కానీ వైరస్‌లతో పోల్చితే ఈ బ్యాక్టీరియా వ్యాపించే వేగం చాలా తక్కువ. ఎక్కువగా స్కూళ్లు, పిల్లల సంరక్షణా కేంద్రాలలో ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే అంతేసంగతి:
మన ఊపిరితిత్తులు కొన్ని రకాల రక్షణ కణాలతో కప్పి ఉంటాయి. ఇవి వైరస్‌లు, బ్యాక్టీరియా, కాలుష్యం లాంటి వాటిని నిరోధిస్తాయి. అయితే మైకోప్లాస్మా న్యుమోనియే చాలా తెలివైన బ్యాక్టీరియా. ఇది ఊపిరితిత్తుల లోపలికి ప్రవేశించి అక్కడ నెమ్మదిగా పెరిగి, ఇన్ఫెక్షన్‌ను సృష్టిస్తుంది. ఇది ఊపిరితిత్తుల కణాలను నాశనం చేసి, దగ్గు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు కలిగిస్తుంది. కొంతమందికి స్వల్పంగా ఉంటే, మరికొంతమందిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ కావడంతో చాలా మంది దీన్ని ముందుగా పట్టించుకోరు. కానీ, ఆలస్యం చేస్తే ఊపిరితిత్తులను పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఆ వ్యాధుల బారిన పడితే మైకోప్లాస్మా న్యుమోనియే వస్తుందా?
అనుమానాస్పద లక్షణాలు ఉన్న పిల్లలను వెంటనే డాక్టర్‌కి చూపించాలి. కరోనా లాగా వేగంగా వ్యాపించకపోయినా, దగ్గు-తుమ్ములు ఉన్నవారు మాస్క్ ధరించడం మంచిది. పిల్లలు ఎక్కువ సమూహాల్లో ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులను తరచుగా కడుక్కోవాలి. డాక్టర్ల సూచన మేరకు ఇన్‌ఫ్లుయెంజా న్యుమోనియా వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కొంతవరకు రక్షణ ఉంటుంది. నిజానికి ఈ వ్యాధి చాలా సందర్భాల్లో స్వయంగా తగ్గిపోతుంది. కొందరికి దీని లక్షణాలు కొద్ది రోజుల్లో తగ్గిపోతాయి. మరికొందరికి మాత్రం యాంటీబయోటిక్ మందులు అవసరం. ఇక ఈ బ్యాక్టీరియా కొన్నిసార్లు యాంటీబయోటిక్స్‌కు కూడా చిక్కదు. అందుకే రిస్క్ లేకుండా లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ని కలవడం తప్పనిసరి.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతున్న ఈ GB సిండ్రోమ్ అంటే ఏంటి? చికిత్సలేంటి?