Menu

Moon Mining: చందమామకు తూట్లు పొడుస్తున్నారు.. ప్రపంచ దేశాల ఉన్మాద తీరు ఇది!

Praja Dhwani Desk 6 days ago
what is moon mining

Earth provides enough to satisfy every man’s needs, but not every man’s greed అని చెప్పారు గాంధీ. లోభానికి హద్దులుండవనే నిజం ఈ ఒక్క వాక్యంలో కనిపిస్తుంది. అయితే ఇంతకంటే దురదృష్టం ఏంటంటే ఆ లోభం భూమితోనే ఆగిపోలేదు. అడవులు, నదులు, పర్వతాలు తవ్వి తవ్వి కూడా మనిషి సంతృప్తి పడడంలేదు. ఇప్పుడు అదే లోభం ఆకాశాన్ని దాటి చంద్రుని చేరింది. రాత్రి మన పిల్లలకు కథలు చెప్పిన చంద్రుడు, పాటలకు ప్రేరణ ఇచ్చిన చంద్రుడు, ఇప్పుడు కొన్ని దేశాల దృష్టిలో మరో భూమిలా కనిపిస్తున్నాడు. భూమి సరిపోదన్న మనిషి మనస్తత్వం ఇప్పుడు చంద్రుడినీ కూడా వదలడంలేదు. అభివృద్ధి పేరుతో కొన్ని దేశాలు చంద్రుడిని కూడా తమ సొంత భూమిలా భావిస్తూ అక్కడి మట్టిని చీల్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ఏంటా దేశాలు? చంద్రుడిపై వాళ్లేం చేయబోతున్నారు?

చంద్రుడిపై జరుగుతున్న ఈ కొత్త పోటీ ఒక్క దేశానిది కాదు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు ఒక్కొక్కటిగా చంద్రుడిపై కన్నేశాయి. అభివృద్ధి పేరుతో, పరిశోధన ముసుగులో చంద్రునిపై శాశ్వతంగా ఉండాలని, అక్కడి వనరులను తమ నియంత్రణలో పెట్టాలని అమెరికా ఎప్పటినుంచో చూస్తోంది. చంద్రుడిపై వనరులను దోచుకోవాలని చైనా చూస్తోంది. రష్యా కూడా ఈ పందెంలో వెనుకబడకుండా తన స్థానాన్ని బలపర్చుకునే ప్రయత్నం చేస్తోంది. యూరప్, జపాన్, ఇతర దేశాలు కూడా తమ వాటా కోసం ఈ పోటీలో దిగుతున్నాయి. బయటకు ఇది విజ్ఞాన ప్రయాణంలా కనిపించినా లోపల మాత్రం లక్ష్యం వేరుగా ఉంది. ముందు ఎవరు అక్కడికి చేరతారు? ఎవరు అక్కడి సంపదను తమ చేతుల్లో పెట్టుకుంటారన్నదే అసలైన టార్గెట్.

ఉదాహరణకు అమెరికా ఏం చేస్తుందో ముందుగా తెలుసుకుందాం. చంద్రునిపై నీరు ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించి, అక్కడ తమ యంత్రాలను దింపాలని అమెరికా ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకుంది. నిజానికి చంద్రుని నీరు అమెరికాకు ఒక వనరు మాత్రమే కాదు, ఒక శక్తినిచ్చే ఆయుధం కూడా. పరిశోధన అనే మాట ముందు పెట్టి, వెనక నుంచి సంపదను దోచుకోవాలని చూస్తున్న ఈ ప్రయత్నం ఓ కొత్త రకం వలస పాలనలా కనిపిస్తోంది.

ఇటు చైనా విషయానికి వస్తే.. డ్రాగన్ కంట్రీ కూడా తనదైన మార్గంలో ముందుకు సాగుతోంది. చైనా చంద్రుడిని ఒక శక్తి గనిగా చూస్తోంది. అక్కడ దొరికే మట్టి, వాయువులు, ఖనిజాలను భూమికి తీసుకువచ్చి విద్యుత్ తయారు చేయాలని చైనా ఆలోచిస్తోంది. ఇలా చేస్తే భవిష్యత్తులో ఇంధనం కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదని చైనా భావిస్తోంది. అంటే చంద్రుడిని ఉపయోగించుకుని భూమిపై తన బలాన్ని పెంచుకోవాలనే ఆశ చైనాకు ఉంది. దేశాభివృద్ధి పేరుతో చంద్రుడిని ఒక ప్రయోగశాలగా మార్చే ప్రయత్నం ఇది. మానవజాతి కోసం కాదు, తమ దేశ ఆధిపత్యం కోసం ఈ ప్రయాణం జరుగుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇటు రష్యా కూడా చంద్రుడిని ఒక అందమైన నేచురల్‌ శాటిలైట్‌గా చూడడం లేదు. భూమిపై అమెరికా, చైనా లాంటి దేశాలతో పోటీ పడినట్టే, ఇప్పుడు చంద్రుడిపై కూడా తన జెండా పాతాలని కోరుకుంటోంది. చంద్రుడిపై అడుగు పెట్టడం అంటే ప్రపంచానికి తాము కూడా బలమైన దేశమని చూపించడమే రష్యా లక్ష్యం. చంద్రుడిని ఉపయోగించుకుని తన శక్తిని చాటాలని రష్యా ప్రయత్నిస్తోంది. ఇక ఈ పోటీలో చిన్న దేశాలు కూడా వెనుకబడకుండా తమ పేరును చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. జపాన్, యూరప్, ఇతర దేశాలు కలిసి చంద్రుడిపై అడుగు పెట్టాలనుకుంటున్నాయి. అక్కడ సంపదపై చిన్న దేశాలు కూడా కన్నేశాయి..!

నిజానికి చంద్రుడిని తవ్వడం అంటే ఒక రాయి తవ్వడంలా కాదు. చంద్రుడి ఉపరితలం కోట్ల సంవత్సరాలుగా అలాగే ఉంది. అక్కడి మట్టిని కదిలిస్తే శాశ్వతంగా మారిపోతుంది. శాస్త్రవేత్తలు చంద్రుడిపై పరిశోధనలు చేయాలనుకుంటే ఆ అవకాశాలు కూడా నాశనం అవుతాయి. అంతరిక్షంలో ఎగిరే ధూళి, చెత్త కలిసి భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలకు కూడా ప్రమాదంగా మారేలా చేస్తాయి. కానీ ఈ విషయాల గురించి ఆలోచించడానికి దేశాలకు టైమ్ లేదు. వారికి కావాల్సింది లాభం మాత్రమే.

ఇంకో పెద్ద సమస్య కూడా ఉందండి. చంద్రుడిపై ఎవరిది హక్కు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానమే లేదు. భూమిపై దేశాల మధ్య సరిహద్దులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ చంద్రుడిపై అలాంటివేమీ లేవు. ఎవరు ముందుగా వెళ్లితే వాళ్లదే అన్నట్టు పరిస్థితి తయారవుతోంది. ఇది రేపు దేశాల మధ్య గొడవలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఒకప్పుడు భూమిపై వనరుల కోసం యుద్ధాలు జరిగాయి. రేపు చంద్రుడిపై వనరుల కోసం యుద్ధాలు జరిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ యుద్ధంలో చిన్న దేశాలకు చోటు లేదు. డబ్బు, టెక్నాలజీ ఉన్నవాళ్లే చంద్రుడికి చేరుతున్నారు. మిగిలిన దేశాలు చూస్తూ ఉండిపోవాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుడు మొత్తం మానవజాతికి చెందాల్సిన వారసత్వం కేవలం కొద్దిమంది శక్తివంతుల లోభానికి బలైపోతున్నట్టు కనిపిస్తోంది.

అందుకే ఇప్పుడు మనమంతా ఒక చోట ఆగి ఆలోచించాలి. అభివృద్ధి అంటే కనపడిన ప్రతిదాన్ని తవ్వడమేనా? మనిషి ఎదగాలంటే ప్రకృతిని పూర్తిగా నాశనం చేయాలా? ఇప్పటికే భూమిని గాయపరుస్తున్నాం.. ఇప్పుడు అదే గాయాన్ని చంద్రుడికి కూడా పెట్టాలనుకోవడం స్వార్థం కాదా? చంద్రుడు మనకి సంపద మాత్రమే కాదు.. ఒక జ్ఞాపకం, ఒక కల, ఒక వారసత్వం. ఆ కలను మనమే చెరిపేసుకుంటే రేపు మన పిల్లలకు చెప్పడానికి కథలు కూడా మిగలవు.

ALSO READ: అమెరికా రాజకీయాల నీడలో నలిగిన మరో దేశం.. ఇది చాలా దారుణం!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *