Menu

Mock Assembly: లోకేశ్‌ గారూ.. ఓ సారి నిజాలు మాట్లాడుకుందాం రండి! మీ తాత ఏం చేశారో ఒక్కసారి తెలుసుకోండి!

Tri Ten B 2 months ago
university student elections andhra pradesh mock live school students

పాలకవర్గాలకు నీతి లేకపోయినా కనీసం ఇంగితం ఉండాలి. విద్యార్థులకు రాజకీయాలపై పట్టులేకున్నా కనీస రాజకీయ స్పృహ ఉండాలి. ఈ రెండు కనపడని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ తప్పు విద్యార్థులదో, టీచర్లదో కాదు.. యూనివర్శిటీల్లో విద్యార్థి సంఘాల(University Student Elections) ఎన్నికలు రద్దు చేసిన ప్రభుత్వాలది. అప్పుడెప్పుడో 1988లో నాటి సీఎం ఎన్టీఆర్‌(NTR) విద్యార్థి సంఘాల ఎన్నికలను రద్దు చేశారు. ఇది జరిగి 37ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటికీ ఆ నిర్ణయం అలానే ఉంది. మధ్యలో ప్రభుత్వాలు మారాయ్, ముఖ్యమంత్రులూ మారారు. అయినా ఏ ఒక్కరూ కూడా విద్యార్థి సంఘాల ఎన్నికలపై నోరు విప్పిన పాపనపోలేదు. ఇదే సమయంలో ఏపీలో మాక్‌ అసెంబ్లీ పేరిట కూటమి ప్రభుత్వం ఎక్కడలేని హడావుడి చేసింది. 175 నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి ఒక్కో విద్యార్థిని ఎంపిక చేసి మాక్ అసెంబ్లీ(Mock Assembly) నిర్వహించింది. ఈ మాక్‌ అసెంబ్లీకి నారా లోకేశ్‌తో పాటు పచ్చ మీడియా ఇచ్చిన ఎలివేషన్లు చూసి కేజీఎఫ్‌ డైరెక్టర్‌ సైతం కాసేపు కంగారు పడ్డాడట. ఎందుకంటే ఈ రేంజ్‌ ఎలివేషన్లు ఇవ్వడం తెలుగు మీడియాకే సాధ్యమవుతుంది.

మాక్‌ అసెంబ్లీ అంటే నటనా?

ఇక్కడ అర్థంకాని విషయం ఒకటుంది. విద్యార్థులను మాక్‌ అసెంబ్లీకు తీసుకొచ్చి ఏం చేసినట్టు? వారంతా ఎవరో ఒకరి పాత్రలో నటించాలా? ఒక పవన్‌ కల్యాణ్(Pawan Kalyan), ఒక చంద్రబాబు(Chandra babu naidu) ఉండాల్సిందేనా? బయటకు వచ్చిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ పాత్రలో జీవించిన ఓ విద్యార్థి తాను జగన్‌ ఫ్యాన్‌ అని చెప్పుకున్నాడు. ఇంకో విద్యార్థి లోకేశ్‌(Nara Lokesh) అన్నకు థ్యాంక్స్ చెప్పాడు. ఇంతకీ థ్యాంక్స్ ఎందుకు? గొప్పగా నటించే అవకాశం ఇచ్చినందుకా? అసలు మాక్‌ అసెంబ్లీ రియల్ అసెంబ్లీలా ఎక్కడ సాగింది? రియల్‌ అసెంబ్లీలో బాలయ్యబాబు బూతులు ఉంటాయ్..ఇటు మాక్ అసెంబ్లీ మాత్రం ప్రశాంతంగా సాగింది. ఒక కథ, స్క్రీన్‌ ప్లేతో నడిచింది. నిజమైన అసెంబ్లీ సమావేశాలు ఇలా ఎక్కడ జరుగుతున్నాయ్? ఇతరుల భార్యలను దూషించే ఎమ్మెల్యేలు, స్వయంగా సీఎంలే పేల్చే ఫ్యాక్షనిస్టు డైలాగులు, సమస్య గురించి తప్ప వ్యక్తిగత విమర్శలకు పోయే లీడర్లు..! ఇటు స్పీకర్‌గారు ఎంత పక్షపాతంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి అసెంబ్లీలు చూసి పిల్లలు ఎలాగో చెడిపోతారు కాబట్టి.. వారికి బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చారు. దీని వల్ల వారికి ప్రజాస్వామ్య విలువలు తెలుస్తాయట..! ఎంత బాగా తెలుస్తాయో చెప్పడానికి ఏదైనా సాక్ష్యం ఉంటుందా? ఏ విద్యార్థి అయినా రాజకీయాల్లోకి దూసుకొచ్చిన సందర్భాలు ఇటివల ఏమైనా ఉన్నాయా? ఇప్పుడున్న బడాబడా కేంద్రమంత్రులు, తలపండిన రాజకీయ నాయకుల్లో చాలామంది విద్యార్థి సంఘాల తరుఫున చురుగ్గా పనిచేసిన వారే కదా..! మరి ఈ తరహా ట్రెండ్‌ గత మూడు దశాబ్దాలుగా ఎందుకు ఆగిపోయింది? అసలు విద్యార్థి సంఘాల ఎన్నికలే జరగకపోతే లీడర్లు ఎలా పుట్టుకొస్తారు?

1988లో ఏం జరిగింది?

1988లో విద్యార్థి సంఘాల ఎన్నికల నిలిపివేత ఒక చిన్న ఘటన అని భావించేవారు ఈ మూడున్నర దశాబ్దాల చీకటిని చూడలేదనే చెప్పాలి. 1988లో ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ నిజాం కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవలో దేవేందర్‌ యాదవ్‌ అనే విద్యార్థి హ*త్యకు గురవడం సంచలనం రేపింది. ఈ కారణంతో నాటి పాలకులు ఈ ఎన్నికలపై నిషేధం విధించారు. అయితే ఈ నిర్ణయం వెనుక అసలు కారణం కేవలం క్యాంపస్‌లో జరిగిన హింస మాత్రమే కాదు. నాటి కాలంలో విద్యార్థులు తమ సమస్యలను తామే పరిష్కరించుకునేవారు. ఫీజులు పెరిగినా, సమయానికి పుస్తకాలు అందించపోయినా నేరుగా ప్రభుత్వాలతోనే పోరాటం చేసేవారు. ఒకే గళంతో విమర్శలు గుప్పించేవారు. ఇలా ఒకే గళంతో మాట్లాడితే, ఒకే వేదికపై నిలబడి ప్రశ్నిస్తే అధికార భవనాల పునాదులు కంపిస్తాయని ప్రభుత్వాలకు తెలుసు. అదే భయం తర్వాత ప్రతి ప్రభుత్వాన్నీ అదుపులో పెట్టింది. విద్యార్థి రాజకీయాలు గాలి పీల్చే ప్రదేశం అయితే, ఆ ప్రదేశాన్నే గోడలతో మూసివేశారు. ఆ గోడలు పెరుగుతూ యూనివర్శిటీలను చిన్నచిన్న జైళ్లగా మార్చాయి. ప్రశ్నించే హక్కు తలుపుపై తాళం పడింది.

మీ మనుషులే పెద్ద దొంగలు బాబు:

ఇంతలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ రాష్ట్రాన్ని ఓ వైరస్‌లా కమ్మేసింది. పారాయణ, పైతన్య లాంటి సంస్థలు మహమ్మారిలా రాష్ట్రాన్ని పట్టిపీడించడం మొదలైంది. పాఠశాలలకు వెళ్లే పిల్లలు ముందుగా నేర్చుకునేది అక్షరాలు కాదు, మార్కులు. వారికి చదువు అంటే పరీక్షలకు సిద్ధం కావడం మాత్రమే. రాజకీయ అవగాహన, సామాజిక బాధ్యత, ప్రజా సమస్యలపై చైతన్యం లాంటి పదాలు వారి నిఘంటువులోనే లేకుండాపోయాయి. ఎందుకంటే కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులను ఆలోచించే మనుషులుగా కాదు, పరీక్షలు రాయడానికి తయారుచేసే యంత్రాలుగా చూస్తాయి. ఆలోచించగలిగే యువత పెరిగితే ప్రభుత్వాలకు ప్రమాదం. కార్పొరేట్ విద్యలో మార్కులే మొక్కలు అయితే, రాజకీయ అజ్ఞానం వాటికి వేసే నీరు. ఈ పద్ధతిలో పెరిగిన తరాన్ని ప్రజాస్వామ్యంపై మాట్లాడమని అడగడం విడ్డూరం.

ఇదంతా జరుగుతున్న సమయంలో రాజకీయ పార్టీలలో వంశపారంపర్య పాలన మరింత బలపడింది. రాజకీయాలు కొన్ని కుటుంబాల అడ్డాగా మారాయి. కొత్తవారు రావాలని అనుకున్నా కూడా వారికి స్థానం లేదు. రాజకీయ నాయకత్వం ఎన్నికలతో రావాలి కానీ ఇక్కడ అది వారసత్వంతో వస్తుంది. ఈ పరిస్థితిలో విద్యార్థులకు రాజకీయాల్లో అడుగు పెట్టే అవకాశం లేకుండాపోయింది. యూనివర్శిటీల్లో యూనియన్ ఎన్నికలు జరిగి ఉంటే, ఈ రాష్ట్రం కొత్త నాయకులను చూసేది. ప్రశ్నించగలిగిన యువతనూ చూసేది. ప్రత్యామ్నాయ స్వరాలను విన్నేది. ఇప్పుడా పరిస్థితి లేకపోగా మాక్ అసెంబ్లీల పేరిట డ్రామాలు మొదలయ్యాయి. నిజమైన ప్రజాస్వామ్యాన్ని నొక్కేసినవారే ఇప్పుడు ప్రజాస్వామ్య పాఠాలు బోధించడానికి తెరపైకి రావడం హిపోక్రసీ కాకపోతే మరేమౌతుంది?

నిజానికి ప్రజాస్వామ్యం అంటే నటన కాదు. అది మనిషి గళం. అది హక్కుల కోసం నిలబడటం. ఈ మాక్ అసెంబ్లీల్లో పిల్లలు మాట్లాడారు కానీ స్వేచ్ఛగా మాట్లాడలేదు. వారిని స్క్రిప్టు రాసిన చేతులే నడిపించాయి. అసెంబ్లీ ఎలా ఉండాలో ముందుగా చూపించారు. కానీ అసలు అసెంబ్లీ ఎలా ఉందో దాచేశారు. దీన్ని ప్రజాస్వామ్య పాఠం అంటారా లేక రాజకీయ మేకప్ అంటారా అన్న నిర్ణయం ప్రజలదే.

ఇటు మూడున్నర దశాబ్దాలుగా నిశ్శబ్దం మబ్బుల్లా యూనివర్శిటీలపై పడిపోయింది. ఇప్పుడు ఆ మబ్బులను చెరిపేయాల్సిన సమయం దగ్గరపడుతోంది. యువతకు నాయకత్వం నేర్పాలంటే ముందుగా యూనియన్ ఎన్నికలు పునరుద్ధరించాలి. వారు వేదికపై నిలబడే అవకాశాలను ఇవ్వాలి. ప్రజాస్వామ్యం నటించినప్పుడు కాదు, పాల్గొన్నప్పుడు పుడుతుంది. ఈ రాష్ట్రం కొత్త నాయకత్వాన్ని కోరుకుంటే, మొదట విద్యార్థుల గొంతులను తెరిచే ధైర్యం చూపాలి. ఎందుకంటే ఈ మౌన సముద్రంలో మొదటి అల ఎక్కడ పుడుతుందో, ఎవరు లేస్తారో, ఎవరు మాట్లాడతారో తెలీదు. కానీ ఆ అల ఎప్పుడో ఒక రోజు పుడుతుంది. ప్రజాస్వామ్యం మళ్లీ తన స్వరాన్ని తిరిగి పొందే రోజు వచ్చి తీరుతుంది.

ALSO READ: 25ఏళ్ల నెత్తుటి మరక.. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకం.. అసలు విద్యుత్ పోరాటానికి కారణమేంటి?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *