Menu

Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!

Tri Ten B 3 weeks ago
marraige system in india telugu news

పెళ్లి గురించి మాట్లాడగానే పవిత్రత, సంప్రదాయం, సంస్కృతి లాంటి పెద్ద పెద్ద పదాలు ముందుకొస్తాయి. కానీ ఆ పదాల వెనక దాక్కున్న అసలు నిజాన్ని చూడాలనే ధైర్యం చాలా మందికి ఉండదు. ఎందుకంటే ఆ నిజం మతవాదులకు భరించలేనిదిగా ఉంటుంది. ప్రశ్నిస్తే పాపమవుతుంది. అర్థం చేసుకుంటే వ్యవస్థే కూలిపోతుంది. అందుకే పెళ్లిని ప్రేమగా, త్యాగంగా, స్వర్గంలో నిశ్చయించిన బంధంగా అబద్ధపు ప్రచారం చేస్తారు. నిజానికి అది ఏ గొప్ప బంధమూ కాదు. అది ఒక సామాజిక వ్యాపార ఒప్పందం. డబ్బు, హోదా, సంప్రదాయం, భ్రమల మీద నడిచే ఒప్పందం.

ఈ వ్యవస్థలో పెళ్లి చేసుకునే ఇద్దరు మనుషుల పాత్ర చాలా తక్కువే ఉంటుంది. వారి ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు, ప్రేమల అసలు లెక్కలోకి రావు. మధ్యలో కుటుంబ సభ్యులు దూరుతారు. బంధువులు ఉంటారు, మతాలు ఉంటాయి, పూజారులు ఉంటారు, జాతకాలు ఉంటాయి, ముహూర్తాలు ఉంటాయి, డబ్బులు ఉంటాయి కానీ ప్రేమే ఉండదు. కామన్‌సెన్స్ అసలే ఉండదు. ఇద్దరు కలిసి ఎలా జీవించాలన్న కనీస చర్చ కూడా ఉండదు. ఉన్నదంతా లెక్కలు, బేరసారాలు, షరతులే.

ప్రత్యేకంగా హిందూ వివాహ వ్యవస్థలో ఈ వ్యవహారం మరింత స్పష్టంగా, మరింత నగ్నంగా బయటపడుతుంది. ఏ రోజు బంగారం ఇవ్వాలి, ఏ రోజు చీర ఇవ్వాలి, ఏ రోజు కానుకలు ఇవ్వాలి, ఏ రోజు డబ్బులు ఇవ్వాలి లాంటి అంశాలు కచ్చితంగా నిర్ణయించబడి ఉంటాయి. కానీ ఇవన్నీ ఎందుకు చేయాలన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఉండదు. ఎవరో పూజారి చెప్పారు కాబట్టి చేయాలంతే.. పెద్దొళ్లు చెప్పారు కాబట్టి డబ్బులు తగలబెట్టాల్సిందే. ఈ కారణాల వల్ల చాలా కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతాయి. మనుషుల జీవితాలు నలిగిపోతాయి. అయినా దీనికి పవిత్రత అనే దిక్కుమాలిన ట్యాగ్ ఒకటి తగిలించి అందరి నోర్లు మూయిస్తారు. ఈ పవిత్రత ముసుగును లాగి పక్కన పడేస్తే అసలు నిజం కళ్లకు కనిపిస్తుంది. ఈ అబద్ధాల వెనుకున్న పచ్చి నిజమే పెళ్లి.. అదే అర్థంలేని లొల్లి!

ఈ పెళ్లి వ్యవస్థలో ప్రేమకు చోటు లేదని చెప్పడానికి పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరం లేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అనే పేరుతో నడిచే ఈ ప్రక్రియ మొత్తం ఒక సంతలా సాగుతుంది. అమ్మాయి వైపు నుంచి ఎంత డబ్బు వస్తుంది, ఎంత బంగారం ఇస్తారు, ఎంత ఆస్తి ఉందన్నది ముందే లెక్కేస్తారు. అబ్బాయి వైపు నుంచి జాబ్ ఏంటి, జీతం ఎంత, హోదా ఏంటి, భవిష్యత్తులో ఎంత సంపాదిస్తాడన్నదే ప్రధాన చర్చ. ఆ ఇద్దరూ కలిసి ఎలా జీవిస్తారన్న ప్రశ్న ఎవరికీ అవసరం ఉండదు. ఒకవైపు అమ్మాయిని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. మరోవైపు మగాడిని ధర పెట్టి కొనుగోలు చేసే ధోరణి కనిపిస్తుంది. ఇది పెళ్లి కాదు. ఇది నింజ వృత్తులకు ఏ మాత్రం తీసిపోని వ్యాపారం. ఈ వ్యాపారంలో భావోద్వేగాలు అనే అంశాన్ని మార్కెట్లో పనికిరాని సరుకుల్లా పక్కన పడేస్తారు. డబ్బు మాట్లాడుతుంది. హోదా నిర్ణయిస్తుంది. మనుషులు మాత్రం మౌనంగా అన్నీ మూసుకోని ఓ మూల కూర్చొవాల్సిందే!

ఈ వ్యాపార పెళ్లికి మతం అండగా నిలబడిన చోట అది మరింత క్రూరంగా మారుతుంది. ఆచారాలు ముసుగులో నడిచే వ్యవహారం మొత్తం ఒక దోపిడీలా మారుతుంది. బంగారం, చీరలు, జాకెట్లు, లుంగీలు, లంగాలు, కానుకలంటూ డబ్బులంతా విసిరిపడేయాల్సిందే. అలా విసరకపోతే అపశకునమంటారు. ప్రశ్నిస్తే సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయం మధ్యలో పూజారుడు నిలబడి అన్నిటికీ అధికారం చెలాయిస్తాడు. అతడు చెప్పిందే వేదం. అతడు నిర్ణయించినదే నిబంధన. డబ్బు ఇచ్చేవాళ్లు ఎందుకు ఇస్తున్నారో కూడా ఆలోచించరు. ఎందుకంటే ఆలోచించడమే పాపమని చిన్నప్పటినుంచి మెదళ్లలో నింపారు. చదువు ఉంటుంది. ఉద్యోగం ఉంటుంది. ప్రపంచం మొత్తం తిరిగిన అనుభవం ఉంటుంది. కానీ పెళ్లి దగ్గరికి రాగానే ఆ మెదడులో మట్టి, మశానం తప్ప ఏమీ మిగలనట్టు మారుతుంది.

ఈ ఆచారాలన్నీ కలసి ఒక మతపరమైన ఆర్థిక చక్రాన్ని నడుపుతాయి. ఈ చక్రంలో కుటుంబాల డబ్బు కరుగుతుంది. అప్పులు పెరుగుతాయి. కానీ ఎవరికీ ప్రశ్నించే హక్కు ఉండదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడి పేరుతో జరిగే దోపిడీకి ఎవరూ ఎదురు మాట్లాడలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రతికున్న మెదళ్లను తాత్కాలికంగా పూడ్చిపెట్టి, సంప్రదాయం అనే శవాన్ని మోసుకెళ్లడమే ఇక్కడి వివాహ వ్యవస్థకు బలమైన మూలం.

ఈ మధ్యలో ముహూర్తం అనే మరో పిండాకూడు కాన్సెప్ట్ బయలుదేరుతుంది. అదే సమయం. అదే నక్షత్రం. అదే లగ్నం. అదే పూజ. అదే మంత్రం. కానీ ఫలితాలు మాత్రం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటాయి. అదే ముహూర్తంలో పెళ్లి అయినవాళ్లలో కొందరు విడాకులు తీసుకుంటారు. కొందరు నరకం అనుభవిస్తారు. కొందరు పెళ్లి చేసుకొని బయటకు రాగానే ఏ లారీ కిందో పడి చస్తారు కూడా. మరి ఇదేం దిక్కుమాలిన ముహూర్తమో ఏమో పంతులగారి దగ్గర సమాధానం ఉండదు. ఏదైనా అంటే పూర్వజన్మ పాపమంటారు.. ఎక్కువ ప్రశ్నిస్తే శపిస్తానంటాడు. నిజానికి ఇద్దరు మనుషుల మధ్య ఉండాల్సిన బంధంలోకి అర్థంలేని జ్యోతిషాన్ని దూర్చడం ఎంత అజ్ఞానమో చదువుకున్న మూర్ఖులకే తెలియాలి. ఇక్కడ పెళ్లి అనేది ఇద్దరి మధ్య ఉండే సంబంధంలా కాకుండా గ్రహాలు, కాలం, పూజారులు కలిసి ఆడే నాటకంగా మారిపోతుంది. ఈ నాటకంలో మనుషులు బొమ్మలు. వాళ్ల జీవితాలే ప్రయోగాలు.

ఇంతటితో ఈ వ్యవస్థ ఆగిపోదు. పెళ్లి అయ్యాక అసలు సర్కస్ మొదలవుతుంది. ఇక్కడ పెళ్లి అనేది ఇద్దరు కలిసి జీవించడానికి తీసుకున్న నిర్ణయం కాదు. పది మంది కలిసి ఇద్దరి జీవితాలను నియంత్రించడానికి వేసుకున్న ఉచ్చు. భార్యాభర్తల మధ్య ఏ చిన్న విషయం జరిగినా వెంటనే కుటుంబం దూరుతుంది. అమ్మ ఏమంటుంది, నాన్న ఏమంటాడు, అత్త ఏమంటుంది, మామ ఏమంటాడు, బంధువులు ఏమనుకుంటారన్న భయం ప్రతి నిర్ణయాన్ని నడిపిస్తుంది. భర్తకు భార్యతో సమస్య ఉంటే భార్యతో మాట్లాడడు. తన ఇంటివాళ్ల దగ్గరికి వెళ్తాడు. భార్యకు భర్తతో సమస్య ఉంటే భర్తను ఎదుర్కోదు. తన పుట్టింటికి పరుగెడుతుంది. ఇద్దరి మధ్య సంభాషణకు చోటుండదు కానీ చుట్టూ ఉన్న 10 మంది నోళ్లకు మాత్రం ఎలాంటి కొరత ఉండదు. ప్రతి ఒక్కరూ నీతి చెబుతారు. ఉపదేశాలు ఇస్తారు. త్యాగం చేయమంటారు. సర్దుకుపోమంటారు. నిజానికి ఈ కుటుంబ వ్యవస్థలో వ్యక్తిగత ఆనందానికి విలువ ఉండదు. సుఖంగా ఉండడం స్వార్థమవుతుంది. బాధపడడం గొప్పతనమవుతుంది. ఈ పెళ్లి వ్యవస్థ వ్యక్తులను తయారుచేయదు. బానిసలను తయారుచేస్తుంది. తమ జీవితాన్ని తామే నడిపించలేని మనుషులను తయారుచేసి, అదే సంస్కృతి అని గొప్పగా చెప్పుకుంటుంది.

పోని ఈ వ్యవస్థ దారుణం ఇంతటితో ఆగుతుందా అంటే అదీ లేదు. ఈ పెళ్లి అనే ఉచ్చులోకి ఒకసారి అడుగుపెట్టాక బయటకు రావడం అనేది 33 కోట్ల మంది దేవుళ్ల ఉన్న భారతదేశంలో ఓ శిక్షలా మారుతుంది. పెళ్లిలోకి వెళ్లడం ఒక రోజు పనే కానీ బయటకు రావడానికి సంవత్సరాలు పడుతుంది. కోర్టులు ఉన్నాయి కానీ న్యాయం ఉండదు. చట్టాలు ఉన్నాయి కానీ సమయాన్ని తినిపడేస్తాయి. విడాకులు కావాలంటే ఓపిక, డబ్బుతో పాటు మానసిక బలాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. కలిసి ఉండలేని ఇద్దరిని కూడా కలిసి ఉండమని ఈ వ్యవస్థ బలవంతం చేస్తుంది. సర్దుకుపోమని చెబుతుంది. త్యాగం చేయమని బోధిస్తుంది. ఎందుకంటే విడాకులు తీసుకుంటే పరువు పోతుందట. జనాలు చచ్చిపోతున్నా కూడా వీళ్లకు పరువులే ముఖ్యమైపోతాయి.

ఈ వ్యవస్థను సమర్థించడానికి మతాలు మరో అబద్ధాన్ని ముందుకు తెస్తాయి. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయట. మరి ఆ స్వర్గం ఎక్కడుంది. ఎవరు చూశారు. ఎవరు కొలిచారు. లేని స్వర్గాన్ని ఉన్నట్టు చూపించి, ఉన్న నరకాన్ని భరించమని చెప్పడమే మతాల పని. ఈ అబద్ధాలకు పూజలు ఉంటాయి. మంత్రాలు ఉంటాయి. కథలు ఉంటాయి. కానీ నిజం మాత్రం ఉండదు. దేవుడి పేరుతో ప్రశ్నలను చంపేస్తారు. విశ్వాసం పేరుతో ఆలోచనను సమాధి చేస్తారు. పెళ్లి అనే వ్యవస్థ నిలబడటానికి ఈ అబద్ధాలే కంచెగా పనిచేస్తాయి. అందుకే ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధలైనా ఆడవచ్చనే తిక్కమాలిన సామెతను ఏ తలకమాసినోడో కనిపెట్టి సమాజంపై రుద్దిపడేశాడు.

ఇదే అజ్ఞానం, ఇదే రోగం, ఇదే క్యాన్సర్ ఇతర మతాల్లో కూడా వేరే వేరే వేషాల్లో కనిపిస్తుంది. ఇస్లాంలో పెళ్లి ఒక ఒప్పందమంటారు కానీ ఆ ఒప్పందంలో సమానత్వం కనిపించదు. మహిళ అక్కడ కూడా కుటుంబాల మధ్య జరిగే లావాదేవీలో ఒక భాగమే. మహర్ అనే మాటతో గొప్పగా మాట్లాడతారు కానీ ఆచరణలో అది మహిళకు భద్రత కాదు, మౌనం పాటించడానికి ఇచ్చే ధరలా మారిపోతుంది. విడాకుల విషయంలోనూ పురుషుడికి ఉన్న సులువు మహిళకు ఉండదు. మతం పేరు చెప్పుకుని వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కును నియంత్రిస్తారు.

ఇటు క్రైస్తవ వివాహ వ్యవస్థ అనేది మరో రకమైన మానసిక నిర్బంధం. పెళ్లి పవిత్రమంటారు, జీవితాంతం విడదీయరానిదంటారు. కలిసి జీవించలేక విడాకులు తీసుకుంటామన్నా దాన్ని కూడా పాపమంటారు. పాస్టర్ అధికారం మనుషుల జీవితాల మీద తీర్పు చెప్పే స్థాయికి ఎదుగుతుంది. ఇక్కడ కూడా ప్రేమ ముఖ్యం కాదు, వ్యక్తిగత ఆనందం ముఖ్యం కాదు, మతానికి విధేయతే అసలు నిబంధన. మతం మారినా కథ మారదు. వ్యవస్థ మారదు. పవిత్రత, విశ్వాసం, దేవుడు అనే మాటల వెనక దాక్కున్న ఈ మతపరమైన వివాహ వ్యవస్థలన్నీ చివరికి ఒకటే చెబుతాయి. మనిషి కన్నా మతం గొప్పది. జీవితంకన్నా ఆచారం గొప్పది.

ఈ వ్యవస్థను ఆర్థిక కోణం నుంచి గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం భావోద్వేగాల దోపిడీ కాదు. ఇది శ్రమ దోపిడీ కూడా. పెళ్లి అయ్యాక మహిళ చేసే పనికి లెక్క ఉండదు. ఇంటి పనిని అసలు పనిగా చూడరు. పిల్లల పెంపకాన్ని సేవ అంటారు. భర్తకు సహాయం చేయడాన్ని త్యాగమంటారు. ఒకవేళ భార్య లేదా భర్త ఎవరైనా డబ్బులు సంపాదిస్తున్నా ఆ డబ్బును కూడా ఎవరో ఒకరు దోపిడి చేసుకుపోతారు. ఇంట్లో, బయట ఏ పనీ చేయకుండా లైఫ్‌ పార్టనెర్‌ సంపాదన మీద బతికేవాళ్లు చాలామందే ఉంటారు.

అంతా తెలిసినా సమాజం మారదు. ఎందుకంటే మారాలంటే ముందుగా ఆలోచించాలి. ఆలోచించాలంటే సంప్రదాయానికి ఎదురు నిలవాలి. మతాన్ని ప్రశ్నించాలి. కుటుంబానికి నో చెప్పాలి. ఇవి చేయడానికి ధైర్యం కావాలి. కానీ ఈ వ్యవస్థ ధైర్యాన్ని కాదు విధేయతను నేర్పిస్తుంది. ప్రశ్నించే మనుషులను కాదు తలవంచే బానిసలను తయారుచేస్తుంది. అందుకే ఈ పెళ్లి వ్యవస్థ ఇప్పటికీ బతికే ఉంది. ప్రేమ లేకున్నా బతుకుతుంది. లాజిక్ లేకున్నా లగెత్తుతుంది. నిజం లేకున్నా నడుస్తుంది. ఎందుకంటే భ్రమల మీద నిలబడిన వ్యవస్థలకు నిజం అవసరం ఉండదు. భయమే చాలు. ఆ భయము, అజ్ఞానమే ఈ వివాహవ్యవస్థకు అసలైన మూలం.

ALSO READ: నన్ను నాలా బ్రతకనివ్వని ఈ సమాజం నాకెందుకు? నిన్ను నీలాగే ప్రేమించు. నిన్ను నీలాగే గౌరవించు!

ALSO READ: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *