ఒక్కసారి పెళ్లి చేసుకో వాడు మారకపోతే చూడు…
అరే వాడికి పెళ్ళి చేసేయండ్రా.. వాడే లైన్లో పడతాడు…
ఏం కాదమ్మా పెళ్ళయ్యాక మార్చుకోవచ్చు…
ఇలాంటి మాటలు తరచూ మనం వింటూనే ఉంటాం కదా? చాలామందికి చిన్నప్పటి నుంచీ వినిపించే మాటే ఇది. “పెళ్లయితే మారిపోతాడు!” అంటే ఓ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నా, కోపంగా ఉన్నా, బాధించడానికైనా అలవాటు ఉన్నా, ‘ఓ సారి పెళ్లి అయ్యాక చూడు… అంతా మారిపోతాడు‘ అని అమ్మాయికి ధైర్యం చెప్పేస్తారు.
కానీ నిజంగా అలా జరుగుతుందా?
ఒక మనిషి మారాలంటే అతనిలో నిజమైన అభిప్రాయం, నిజమైన ప్రయత్నం ఉండాలి. కానీ ‘పెళ్లయితే మారిపోతాడు‘ అని చెప్పడం ఎందుకో..! పెళ్లి అనే కార్యక్రమాన్ని ఓ మ్యాజిక్ స్టిక్‌లా ఊహించడం దేనికి? ఒక్క పెళ్ళితోనే, మనిషి క్షణాల్లో దేవుడిలా మారిపోతాడని ఒక విపరీతమైన అపోహే కదా!
పెళ్ళి అనేది ఒక బాధ్యత. ఓ పద్ధతి. ఇద్దరూ ఒకరికొకరు అర్థం చేసుకుని కలిసి జీవించే ప్రయత్నం. అది ఒకరి మీద ఒకరికి ప్రయోగం చేసే ప్రయోగశాల కాదు. అబ్బాయి చెడ్డవాడైతే… పెళ్లి తర్వాత అతను అవ్వన్నీ వదిలేసి మానవతావాదిలా మారిపోతాడా? మహాత్మగాంధీలా మద్యానికి దూరంగా ఉంటాడా? ఇంతకు మించిన జోక్ ఉంటుందా? కానీ ఇప్పటికీ ఇవే మాటలు వినిపిస్తున్నాయి.
ఇక్కడే నిజానికి అసలైన బాధ మొదలవుతుంది. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, మనసును చంపుకోని, అసలే మారే ఉద్దేశ్యమే లేని వాడిని పెళ్లి చేసుకుంటే, అది అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే మొదటి చెత్త నిర్ణయం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మగవాళ్లు ‘నాన్న’గా మారిన తర్వాత మారతారు. అంటే, తమ పిల్లల్ని చూసి తమ బాధ్యత గుర్తొస్తుంది. కానీ అదే టైమ్‌లో కొన్ని సందర్భాల్లో వారి బాధ్యత మించిపోయి తిరిగి బాధే మిగులుతుంది.
అమ్మాయిల్లో చాలా మందికి ఒక బ్లైండ్ హోప్ ఉంటుంది. ‘అతన్నీ పెళ్లి చేసుకుంటే నేను మార్చేస్తా‘ అనుకుంటారు. ఈ భావన వింటే అబ్బాయిలకి హాస్యంగా అనిపిస్తుంది. కానీ ఆ భావన వల్ల అమ్మాయి జీవితంలో బాధలు మొదలవుతాయి. ఎవరైనా మారాలంటే వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పటం కాదు. వాళ్లు నిజంగా మారాలనే అవసరం కలిగి, మారడానికి ప్రయత్నిస్తే తప్ప…అది జరగదు.. ఇంకా చాలామంది సొసైటీలో చెబుతారు చూడండి..
‘పెళ్లయితే మంచోడవుతాడు‘ అంటే పెళ్లి ఏమైనా మానసిక చికిత్సా? అదేమైనా సైకాలజిస్ట్ ఇచ్చే థెరపీనా? కాదుగా!
ఈ అపోహ వల్ల ఎన్నో తలనొప్పులు, ఎన్నో డివోర్సులు, కొన్ని సార్లు మానసిక క్షోభలే కాదు… బహుశా జీవితం అంతా నష్టపోయే పరిస్థితే వస్తుంది.
అందుకే… “పెళ్లయితే మారతాడు” అనే అబద్దాన్ని నమ్మొద్దు. పెళ్లికి ముందు అతను ఎలా ఉన్నాడో ఆ లక్షణాలనే అనలైజ్ చేయండి. అతనికి నిజంగా మారాలన్న మనస్సుందా, లేదా అనేది తెలుసుకోండి లేకుంటే… మీరు కూడా చివరికి ఒక “అతనివల్ల నా జీవితం ఇలా అయింది” అని ఏడుస్తూ సొసైటీలో మరో కథ అవుతారు.
పెళ్లి అనేది మార్పు కాదు..పెళ్లి అనేది ఒక నిర్ణయం..ఆ నిర్ణయం ముందు.. ఆ మనిషి నిజంగా మంచివాడేనా? మారాలనే బుద్ధి కలిగినవాడేనా అని చూసి తీరాలి.
ALSO READ: మౌనం.. గుణం కాదు… అది బంధనమే..! అన్యాయానికి ఎదురొడ్డి నిలబడి, ప్రశ్నించే నీ గొంతుకే నిజమైన ఆయుధం!

Rationalist Files: ‘ఆమెను మోసం చేశారు..’ నిజమైన హేతువాదం సోషల్మీడియాలో కాదు.. నిజ జీవితంలో కనిపించాలి..! సిద్ధాంతాల వెనుక దాక్కునే పిరికితనం!
Adenoids: ‘అమ్మా.. నేను మళ్లీ ఊపిరి పీల్చలేకపోతున్నా..’ కూతురి కోసం తల్లి పడిన వేదన! చివరకు ఏం జరిగిందంటే!
Marriage System: ఇది పెళ్లి కాదు..దోపిడి..! ఇదేం సన్నాసి సంత.. ఇంతటి నీతిమాలిన వివాహ వ్యవస్థ ఎక్కడా ఉండదు!
Middle Class Dreams: అద్దంలో కనిపించిన కల.. ఇది ఒక మిడిల్ క్లాస్ కథ!
Life Lessons: మిస్ అయిన ట్రైన్… జీవితం నేర్పిన పాఠం! ఆలస్యం కూడా ఆశీర్వాదమేనా?
Business Ideas: ఈ 6 బిజినెస్ ఐడియాస్తో మీరు లక్షలు సంపాదించవచ్చు.. పెట్టుబడి కూడా చాలా తక్కువ!