Menu

Israel Vs Hamas: ‘నరక ద్వారాలు తెరుచుకుంటాయి..’ ఇజ్రాయెల్‌ బరితెగింపు చర్యలు.. నెతన్యాహు నెక్ట్స్‌ టార్గెట్‌ ఇరాన్‌?

Tri Ten B
israel vs hamas war marco rubio targets iran

‘నరక ద్వారాలు తెరుచుకుంటాయి..’ హమాస్‌ టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) చేసిన ఈ హెచ్చరిక పశ్చిమాసియా ప్రజలను భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపేలా చేస్తోంది. ఈ మూడు పదాలు మిడిల్ ఈస్ట్‌లో రాబోతున్న మరో రాక్షస యుద్ధానికి సంకేతంగా నిలుస్తున్నాయి. నెతన్యాహు హెచ్చరిక ఆంతర్యం ఒక్కటే.. హమాస్‌ను ఈ భూమిపై లేకుండా చేయాలి.. హమాస్‌(Hamas)కు అన్ని విధాలా మద్దతుగా ఉంటున్న ఇరాన్‌నూ వదలకూడదు. ఇదంతా నెతన్యాహూ ఒక్కడే మాట్లాడి ఉంటే కేవలం బెదిరింపులాగే అనుకోవచ్చు కానీ అటు అమెరికా కూడా ఇరాన్‌కు ఇదే తరహా వార్నింగ్‌ ఇచ్చింది. ప్రతీ ఉగ్రవాద గ్రూప్ వెనుక, ప్రతీ హింసాత్మక చర్య వెనుక ఇరాన్ ఉందని.. మిడిల్ ఈస్ట్‌లో అశాంతికి నిజమైన కారణం ఇరాన్‌ అంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో(Marco Rubio) చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇంత నేరుగా ఇరాన్‌ను అమెరికా నిందించడం ఈ మధ్య కాలంలో జరగలేదు. రుబియో, నెతన్యాహూ ఒకే వేదికపై ఇరాన్‌ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఇరాన్‌ను మట్టికరిపిస్తామని నెతన్యాహూ చెప్పిన మాటకు అమెరికా బహిరంగంగా మద్దతు ప్రకటించింది. అంటే ఇజ్రాయెల్‌ వర్సెస్‌ హమాస్‌ యుద్ధం కాస్త అమెరికా వర్సెస్‌ ఇరాన్‌ యుద్ధంగా మారడానికి సమయం దగ్గర పడినట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇరాన్‌, అమెరికా తలపడితే ఏం జరుగుతుంది? ఇరాన్‌పై అమెరికాకు ఎందుకంత వ్యతిరేకత ఉంది?

ఇరాన్‌ విప్లవం నాటి నుంచి..

నిజానికి ఇరాన్, అమెరికా శత్రుత్వం ఒక్కరోజులో మొదలైంది కాదు. 1979 ఇరాన్ విప్లవం నుంచే ఈ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. అమెరికా మద్దతు ఉన్న రాజును ఆ నాడు గద్దె దించేశారు. నాటి విప్లవం సమయంలో 52 మంది అమెరికా అధికారులను 444 రోజుల పాటు ఇరాన్‌ బందీలగా ఉంచింది. ఆ తర్వాత అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య కోల్డ్‌ వార్‌ నడిచింది. ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అమెరికా గతంలో ఆరోపించింది. సిరియా, ఇరాక్, యెమెన్‌లలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు తమ దళాలపై దాడి చేసినట్టుగా అమెరికా చెబుతుంటుంది. ఇక ఇప్పుడైతే హమాస్, హిజ్బుల్లా, హౌతీలు లాంటి అమెరికా వ్యతిరేక గ్రూపులకు ఇరాన్ ఆయుధాలు, డబ్బులు అందిస్తోంది. ఇలా ఎన్నో అంశాల్లో అమెరికా, ఇరాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అవి ట్రంప్‌ రాకతో మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. హమాస్‌ సాకుతో ఇరాన్‌పై అమెరికా దాడులకు ప్లాన్ చేస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. హమాస్‌ శాశ్వతంగా చరిత్రలో కనుమరుగవ్వాలంటూ అమెరికా నేరుగా చెప్పడం చూస్తే ఈ విషయాన్ని క్లియర్‌కట్‌గా అర్థం చేసుకోవచ్చు. హమాస్ పునాదులు నాశనం చేయడమంటే ఇరాన్‌ను నేరుగా ఢీకొట్టడమే అవుతుంది. ఎందుకంటే హమాస్ కేవలం ఒక గ్రూప్ కాదు.. అది ఇరాన్ చేతుల్లో ఉన్న ఒక బలమైన ఆయుధం!

కాల్పుల విరమణ అమల్లో ఉన్నా..

అటు స్వేచ్ఛా ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని.. హమాస్‌కు అందుకే ఆయుధాలు, నిధులు ఇస్తామని ఇరాన్‌ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. పాలస్తీనియన్లను రక్షించడం తమ ధర్మంలో భాగమని ఇరాన్‌ చెబుతుంది. ఇలా ఇరాన్‌, అమెరికా వాదనలు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇవి ప్రపంచాన్ని రెండుగా చీల్చేలా చేస్తున్నాయి. అటు నెతన్యాహూ చేసిన మరో కామెంట్‌ చూస్తే ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ త్వరలోనే దాడికి దిగేలే ఉంది. అటు అమెరికా కూడా ఈ దాడిలో నేరుగా భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాన్‌కు ఇప్పటికే గట్టి షాక్‌లు ఇచ్చామని.. మిగిలిన పని ట్రంప్‌ మద్దతుతో పూర్తి చేస్తామని నెతన్యాహూ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అటు ట్రంప్‌ సైతం నెతన్యాహుకు గట్టి మద్దతు ఇస్తున్నారు. ఇజ్రాయెల్‌ ఏం చేయాలో అది చేసుకోవచ్చని ఇప్పటికే ఓ సందర్భంలో ట్రంప్‌ కుండబద్దలు కొట్టారు. ఒకరు కూడా తప్పించుకోకూడదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా MK-84 భారీ బాంబుల్ని ఇజ్రాయెల్‌కు అందించింది. ఈ బాంబులు కాంక్రీట్, మెటల్, అండర్‌గ్రౌండ్ టన్నెల్స్‌లో కూడా సమర్థంగా పేలుతాయి. ఇప్పుడు ఈ ఆయుధాలతోనే ఇజ్రాయెల్‌ హమాస్‌ను అంతమొందించాలని చూస్తోంది. అటు ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు నెతన్యాహూ దళాలు పాలస్తీనా పౌరులపై ప్రతాపం చూపించడం ఆపలేదు. సీజ్‌ ఫైర్‌ అమల్లో ఉన్నా కూడా రఫాలో మాత్రం ఇజ్రాయెల్‌ బాంబులు పేల్చుతూనే ఉంది. ఫిబ్రవరి 16 అర్థరాత్రి జరిపిన ఇజ్రాయెల్‌ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బందీలను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తున్నారనే సాకుతో ఇజ్రాయెల్‌ ఈ దాడులకు తెగబడుతోంది. ఇదంతా చూస్తూ ఇరాన్‌ ఊరుకుంటుందా అంటే కచ్చితంగా ఊరుకోదు. అలా హమాస్‌ను అడ్డం పెట్టుకోని ఇరాన్‌తో కయ్యానికి దిగాలన్నది ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యంగా అర్థమవుతుంది. అయితే గతంలోనూ ఇలాంటి పరిణామాలే జరిగాయి. కానీ ఇప్పుడు అమెరికా మద్దతుతో ఇరాన్‌ భరతం పడతామని ఇజ్రాయెల్‌ నేరుగా చెబుతుండడంతో ఈ యుద్ధం ఎటువైపుకు దారి తీస్తుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఎందుకు ఇంతలా రెచ్చగొడుతున్నారు?

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా భీకరమైన బాంబులు వేసే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ మీద నేరుగా అమెరికా సైనిక దళాలు దాడి చేయడమంటే, అది మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమే అవుతుంది. అటు సైనిక శక్తిలో ఇరాన్‌ కూడా చాలా శక్తివంతమైనది. సముద్రంపై ఆధిపత్యం కోసం అనేక ఆయుధాలను తయారు చేసుకున్న ఇరాన్‌.. అటు డ్రోన్ లాంచింగ్, మిస్సైల్ ప్రయోగాల్లో అందరికంటే ముందుంది. ఒమాన్ సముద్రంలో అమెరికా నౌకలు లక్ష్యంగా చేసుకోని దాడులు చేయడం ఇరాన్‌ ఏమాత్రం కష్టం కాదు. కానీ ఆ విధంగా ఇరాన్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నెతన్యాహూ, రుబియో మాటలు అంతలా రెచ్చగొట్టేలా ఉన్నాయి మరి!

ALSO READ: మానవత్వం మరిచిన ట్రంప్.. డబ్బుల కక్కుర్తితో పేద దేశాల ప్రజల కడుపు మాడ్చుతున్న ప్రెసిడెంట్!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *