Menu

Manual scavenging in India: భారతీయ సమాజంలో శాపం! సఫాయి కార్మికుల జీవనం;

Sumanth Thummala

భారతదేశం విశ్వ గురువుగా మారుతుందని ఐదు ట్రిలియన్ల ఎకనామిక్ సాధిస్తామని హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మారుస్తామని పాలకులు గొప్పలకు పోతారు. కానీ 2024లో కూడా మనిషి మలమూత్ర విసర్జకాలను మరో మనిషి నేరుగా దిగి వాటిని శుభ్రం చేయాల్సిన పరిస్థితిని మాత్రం మార్చలేకపోతున్నారు. ఆ పని చేస్తుండగా కోల్పోయిన ఎన్నో ప్రాణాలను చూసి కూడా ప్రభుత్వాలు చలించవు.

తాజాగా హైదరాబాద్ లో కుల్సుంపుర వద్ద మ్యాన్ హోల్ శుభ్రం చేస్తుండగా ముగ్గురు పారిశుద్ధ కార్మికులు చనిపోయారు. మృతులు ఎం శ్రీనివాస్(40), వి. హన్మంత్ (42), ఎం. వెంకటేశ్వర్ రావు (40) . వీరిని రోజు కూలీ కింద అయ్యప్ప ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ఏజెన్సీ అనే కాంట్రాక్ట్ సంస్థ నియమించింది.‌ కుల్సుంపుర సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ బి. మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం శ్రీనివాస్ మ్యాన్‌హోల్ కవర్ తెరిచేందుకు యత్నిస్తూ అందులో పడిపోయాడు. తనని కాపాడేందుకు ప్రయత్నించిన హన్మంత్, వెంకటేశ్వరరావు మ్యాన్‌హోల్ లో దూకారు. అయితే విషవాయులు పీల్చి చనిపోయారు. వాళ్ళని కాపాడాలని ప్రయత్నించిన జీవన్ రాజ్ అస్వస్థకు గురై ఆస్పత్రి పాలయ్యాడు. వారి కనీస భద్రతకు సంబంధించి చర్యలు తీసుకొని కాంట్రాక్ట్ కంపెనీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఊసే లేనీ చట్టం అమలు, అసలు పాలకులకైనా ఎరుకేనా?

మాన్యువల్ స్కావెంజింగ్ నిషేదం మీద ఇప్పటిదాకా స్వతంత్ర భారతం లో 3 సార్లు చట్టం చేసారు. అసలు ఇటువంటి చట్టం ఒకటి ఉందని కూడా సాధారణ ప్రజలకు తెలియదు.‌ సామాన్యులకే కాదు, అసలు ఎంతమంది పాలకులకు ఇటువంటి చట్టం ఒకటి ఉందని తెలుసో అనేది మనకు సమాధానం దొరకని ప్రశ్న!

కానీ 31 ఏళ్ల క్రితమే 1993లో మరుగుదొడ్లను, మ్యాన్ హోల్స్ ను శుభ్రం చేసే పనిని నిషేధించింది అప్పటి ప్రభుత్వం అది అమలుకు నోచుకోకపోగా, మళ్లీ 2013లో తిరిగి చట్టం చేసి వారికి వేరే ఉపాధిని చూపించే విషయాన్ని కూడా చట్టాంలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం. “ఈ చట్టం ప్రకారం మరుగుదొడ్లను, సీవరేజీ లేన్లను శుభ్రం చేయడానికి ఇకపై పారిశుద్ధ్య కార్మికుల (మాన్యువల్ స్కావెంజర్స్)ను వినియోగించుకుంటే అలాంటివారు ఏకంగా జైలు శిక్షను, జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది”. 2020 లో మళ్ళీ దీనికి సవరనలు చేస్తూ “మురుగు కాలువలు మరియు సెప్టిక్ ట్యాంక్‌లను ప్రమాదకర క్లీనింగ్‌లో ఎవరైనా వ్యక్తి లేదా ఏజెన్సీ ద్వారా నిమగ్నం చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. రూ. 5 లక్షలు లేదా రెండూ” అని చట్టం చేసింది.అయితే తీసుకొచ్చిన చట్టాలు ఏ మాత్రం అమలుకు నోచుకోలేదు. చట్టం చేసి దాన్ని అమలు చేయని చట్టంగా ఇది మిగిలిపోయింది. అలాగే ఈ చట్టం ప్రకారం మిషన్లు వెళ్లడానికి వీలు లేకుండా మ్యాన్‌హోల్ నిర్మాణం పాడైపోయిన సందర్భంలో మాత్రమే అది కూడా అన్ని జాగ్రత్తలతో కూడిన సదుపాయాలు కల్పిస్తూ చేయాలి. కానీ వాస్తవంగా అటువంటి జాగ్రత్తలు ఎక్కడా తీసుకోవడం లేదు.

“ఏ దేశంలోనూ, ప్రజలు చనిపోవడానికి గ్యాస్ ఛాంబర్‌లకు పంపబడరు, ”అని 2019 సెప్టెంబర్‌లో భారత సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ నేటికీ దేశంలో వేలాదిమంది కార్మికులు అదే పని చేస్తున్నారు. సెప్టిక్ ట్యాంకులు,మ్యాన్‌హోల్స్, మరుగుదొడ్లు శుభ్రం చేసే పనిని ఉపాధిగా చేసుకుని బతుకుతున్న వారు ఈ దేశంలో లక్షల్లో ఉన్నారు. వారిలో చాలామందికి ఈ చట్టాల గురించి, తమకు ఉండాల్సిన కనీస సదుపాయాలపై అవగాహన లేదు.‌

వేలల్లో మరణాలు! అయినా పట్టని పాలకులు:

1993 లో చట్టం చేసినప్పటి నుండి 2022-23 వరకు 1,035 మంది కార్మికులు చనిపోయారని సామాజిక న్యాయ, సాధికారత శాఖ పార్లమెంటు లో తెలిపింది. సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ 2018 నుండి 2023 వరకు 443 మంది చనిపోయారు అని పేర్కొంది.

దేశంలోని మొత్తం 766 జిల్లాల్లో 508 జిల్లాలు మాత్రమే మాన్యువల్ స్కావెంజింగ్ ఫ్రీగా ప్రకటించుకున్నాయి.

మాన్యువల్ స్కావెంజర్ల పునరావాసం, స్వయం ఉపాధి పథకం (SRMS) కింద ఏటికేడు బడ్జెట్ ను తగ్గిస్తూ పోతున్నారు. 2023లోనే మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన కోసం సుప్రీంకోర్టు అక్టోబర్ 20, 2023న మొత్తం 14 పాయింట్లతో ఆదేశాలు జారీ చేసింది.

అప్పటి న్యాయమూర్తులు ఎస్ రవీంద్ర భట్, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం “కేంద్రం మరియు రాష్ట్రాలు మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని పూర్తిగా నిర్మూలించేలా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికి సంబంధించిన చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని” ఆదేశించారు.

అసలు లెక్కలే సరిగ్గా లేవు!

కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ చేసిన సర్వే ప్రకారం 18 రాష్ట్రాల్లో 87,913 మంది మాన్యువల్ స్కావెంజర్లు ఉన్నారు. 2011 నాటి సామాజిక-ఆర్థిక కుల గణన 1,82,505 గృహాలలో మాన్యువల్ స్కావెంజింగ్ ప్రాథమిక వృత్తిగా చేసుకొని బతుకుతున్నట్టు గుర్తించింది. అయితే 2013 లో చేసిన సర్వేలో 58,098 మ్యానువల్ స్కావెంజర్లనీ గుర్తించింది. అయితే పని చేస్తున్న, చేస్తూ చనిపోయిన వారికి సంబంధించి సఫాయి కరంచారిల సరైన లెక్కలు అందుబాటులో ఉండటం లేదు అని, జాతీయ నేర గణాంకాల బ్యూరో (NCRB) కచ్చితమైన లెక్కలు నమోదు చేయడం లేదు అని జాతీయ కమిషన్(NCSK) అభిప్రాయ పడింది.

కులం కట్టిన గోడ! ప్రాధమిక హక్కులకు తూట్లు:

2021 రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన దానిలో ఇదివరకటి సర్వే లెక్కల ప్రకారం పని చేస్తున్న మ్యానువల్ స్కావెంజర్లలో కేవలం 43,797 మంది కులాన్ని గుర్తించగలిగారు. వీరిలో 97.5% అంటే 42,594 మంది కార్మికులు దళితులే.( ఈ లెక్కల్లో స్పష్టత లేదని పైగా దేశం మొత్తం చేసిన సర్వే కాదని గుర్తించాలి!)

అంటరాని జాతిగా తీవ్రమైన కులవివక్ష ను ఎదుర్కొంటున్న దళితులే ఈ పని చేస్తున్నారు. మనిషి మలమూత్ర విసర్జకాలను చేతులతో ఎత్తి శుభ్రం చేయాలి అనే‌ ఆలోచనే‌ ఎంతో దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.‌ అటువంటిది ఎన్నో వేల ఏళ్లుగా ఒక జాతిని ఈ పని లోకి నెట్టివేయబడుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం చట్టం ద్వారా ఏర్పరచబడిన ప్రక్రియ ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించకూడదు పౌరుల రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కుకు హామీ ఇస్తుంది. ఇది జీవితం మరియు స్వేచ్ఛ యొక్క ఏకపక్ష లేమికి వ్యతిరేకంగా కొన్ని రక్షణలను నిర్ధారిస్తుంది. కాని విసర్జకాలను శుభ్రం చేసే‌ రొంపిలోకి కూరుకుపోయి రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక హక్కులకు భంగం కలుగుతున్నాయి.

ఇష్టంగా చేస్తున్నారా? ఇది ఆధ్యాత్మికమా!

ఈ పని చేయడాన్ని వారేదో ఇష్టంగా చేయడం లేదు. గత్యంతరం లేక చేస్తున్నారు.‌తరాలుగా ఇదే పని చేసేలా కులం పేరుతో ఈ మురికి కూపంలోకి దిగుతున్నారు.‌ వారికి వేరే ఉపాధి దొరకక, సరైన రీతిలో ఇతర అవకాశాలు లభించక ఇందులో ఉండిపోతున్నారు.ఇందులో కులం పాత్ర అత్యధికంగా ఉంది.

కానీ ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్మయోగ్ పుస్తకంలో వీరి పనిని ఆధ్యాత్మికతకు సంబంధించిన పనిగా చూడాలని చెప్పారు. మరి ఆధ్యాత్మికత కొరకు శిక్షణ పేరుతో ఎక్కడ పడితే అక్కడ సెంటర్లు ఏర్పాటు చేసి కోట్ల వ్యాపారం చేస్తున్న వారు ఈ పని చేస్తూ ఆధ్యాత్మికతను పొందుతారా? ఇలా అమానవీయ పనులను కూడా గొప్పగా చెప్పుకోవడం ఏ అభివృద్ధికి సూచికం? వారు చేస్తున్న పనిని కీర్తిస్తూ వారి పాదాలను శుభ్రం చేయడం అనేది, ఆ కార్మికులు ఆ పనే చేయాలని ఆశిస్తున్నారా?

లెక్కలు అంతకు మించి!

సఫాయి కర్మచారి ఆందోళన్ అనే‌ స్వచ్ఛంద సంస్థ ప్రకారం దేశంలో 7,70,000 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరిలో సుమారు ప్రతి సంవత్సరం 2 వేల మంది చనిపోతున్నారు. వారి జీవితకాలం కూడా గణనీయంగా క్షీణిస్తుంది అని పేర్కొంది.

పేరు గొప్ప ఊరు దిబ్బ:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యానువల్ స్కావెంజింగ్ కు స్వస్తి పలుకుతూ, ఆధునిక యంత్రాల సహాయంతో పనులు చేస్తామని కొన్ని యంత్రాలను తీసుకొచ్చి చేతులు దులిపేసుకుంటారు. ఆ తర్వాత దాని గురించి ప్రస్తావనే ఉండదు.

ఇండియా జి20 వంటి సదస్సును విజయవంతంగా నిర్వహించింది, ప్రపంచంలో లో మన పాత్ర ఎంతో పెరిగింది.‌ దేశం, రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది అని దంపుడు స్పీచ్ లు ఇచ్చే నాయకులు, ఈ 21వ శతాబ్ధంలో ఇంకా జనాలు స్వయానా తమ చేతులతో మలమూత్రాలను ఎత్తి పోస్తూ జీవిస్తున్న ప్రజలు ఉన్నంతకాలం మనం ఏం అభివృద్ధి సాధించినట్టు? ఈ ప్రశ్నకు సమాధానం మన పాలకులే చెప్పాలి.

Also Read: ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి.. కంపరం కలిగిస్తోన్న వార్తలు!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *