చట్టం యూనిఫాం ధరించి బుల్లెట్లు ప్రయోగిస్తే అమాయకులే ముందుగా బలవుతారు..
కోల్‌కతాకు తూర్పున అసలు భూభాగాలే లేవనట్టుగా మిగిలిన ప్రాంతాల్లోని భారతీయ ప్రజలు బతుకుతుంటారు.. ఎప్పుడైనా మహిళలు నగ్నంగా రోడ్డెక్కి నిరసనకు దిగితేనో.. లేదా ఎవరైనా మహిళను నగ్నంగా ఊరేగించి చిత్రహింసలకు గురిచేస్తే తప్ప అసలు ఈశాన్య భారతం గురించి ఆలోచించేవారే తక్కువ. ఒకవేళ అదే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ‘మాకు ప్రత్యేక దేశం’ కావాలని అడిగితే మాత్రం అందరిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ఇండియా నీకు ఏం అన్యాయం చేసిందని ఊగిపోతుంటుంది.. వారిని వేర్పాటువాదులగా, ఉగ్రవాదులగా చిత్రకరించి దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటుంది. అంతేకానీ వారి బాధలు పట్టవు.. అణచివేత చట్టాల చాటున నలిగిపోతున్న పేద, ఆదివాసుల బతుకులు కనపడవు.. అయినా తమ భాషే గొప్పదని కొట్టుకునే, డిబెట్లు పెట్టుకునే, అరుచుకునే ఉత్తర-దక్షిణాది రాష్ట్రాల బడానేతలకు, ప్రజలకు ఈశాన్య భారతమంటే కేవలం దేశంలోని ఓ భూభాగం మాత్రమే. అందుకే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(AFSPA) దశాబ్దాలుగా అక్కడ తిష్ఠవేసుకోని కుర్చొంది. ఇదే చట్టం ఈశాన్య భారతంలో కాకుండా మరెక్కడైనా ఉండి ఉంటే ఇప్పటివరకు అది ఎప్పుడో రద్దైపోయేది. గతేడాది(2023) మే నుంచి మణిపూర్‌లో అశాంతి తప్ప ప్రజలు సుఖంగా బతికిన రోజులు లేవు. జాత్యంతర ఘర్షణలు, ఆర్మీ హింసాత్మక చర్యలు, ప్రభుత్వ వైఫల్యం.. ఇవన్నీ ఆ రాష్ట్ర ప్రజలను నరకయాతన అనుభవించేలా చేస్తున్నాయి. AFSPA పునరుద్ధరణతో పాటు మెయితీ-కుకి వర్గాల ఘర్షణలు, మహిళలపై అమానుష చర్యలు, ప్రభుత్వ ఆంక్షలు.. ఇవన్నీ ఈ ప్రాంతంలో పరిస్థితిని అంతకంతకూ దిగజార్చేలా చేస్తున్నాయి. మరి దీనికి ముగింపు ఎప్పుడు? ఇంత జరుగుతున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టైనా లేదా? ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని క్రెడిట్లు తీసుకునే ప్రధాని మణిపూర్ ఘర్షణలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? అసలు మణిపూర్ ఎందుకు మంటల్లో కాలిపోతుంది?
అసలేం జరుగుతోంది?
గతేడాది మే నుంచి అల్లకల్లోంగా ఉన్న మణిపూర్‌లో నవంబర్(2024) రెండో వారం నుంచి పరిస్థితులు మరింత అదుపు తప్పాయి. జిరిబాం, ఇంఫాల్ లాంటి ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. నవంబర్ 12న జిరిబాంలో 10మంది కుకీలను CRPF బలగాలు కాల్చి చంపాయి. చనిపోయిన వారంతా మిలిటెంట్ల అని చెప్పాయి. అయితే వారంతా తమ గ్రామ వాలంటీర్లని అక్కడి ప్రజలు చెబుతున్నారు. గతేడాది మే ఘటనల తర్వాత మణిపూర్‌లోని గ్రామాలు రక్షణ కోసం ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించుకున్నాయి.
10 మంది కుకిలను CRPF బలగాలు చంపిన తర్వాత మణిపూర్‌లో ఉద్రిక్తతలు అమాంతం పెరిగాయి. ప్రభుత్వ ఆస్తులు, ఇళ్లులపై దాడులు పెరగడంతో, కేంద్రం ఆరు ఏరియాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ వెంటనే AFSPAను సంబంధింత ప్రాంతాల్లో కేంద్రం పునరుద్ధరించింది. ఇది అక్కడి ప్రజల ఆగ్రహానికి కారణమైంది. ఏకంగా సీఎం బిరెన్ సింగ్ ఇంటినే ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. ఇప్పటివరకు సీఎం అల్లుడి ఇల్లు సహా ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లలపై దాడులు చేశారు. అటు మణిపూర్‌లో రెండు చర్చిలకు దుండగులు నిప్పు పెట్టారు. ఇలా కుకీ, మెయితీ వర్గాల మధ్య మరోసారి మంటలు రాజుకున్నాయి. దీంతో రాజధాని ఇంఫాల్‌లో అధికారులు కర్ఫ్యూని విధించారు. ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇక పరిస్థితులు ఇంత ఉద్రిక్తంగా మారడానికి AFSPA పునరుద్ధరణ కారణమని భావిస్తున్న సీఎం.. చట్టాన్ని సంబంధిత ప్రాంతాల్లో ఉపసంహరించుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు.
రక్షణ పేరుతో మణిపూర్ ప్రజల గుండెలపై బూటు కాలు మోపారు..
AFSPA అంటే ఏంటి?
AFSPA (Armed Forces Special Powers Act)ను భారత ప్రభుత్వం 1958లో తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని చేసినప్పుడు ప్రస్తుత నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, మేఘాలయ, త్రిపురలు ‘అస్సాం’లో భాగంగా ఉండేవి. ఈ రాష్ట్రాలు వేరుపడిన తరువాత 1972లో ఆ చట్టాన్ని సవరించి పేరు మార్చకుండానే ఆ రాష్ట్రాలన్నిటికీ వర్తింపజేశారు. ఈ రాష్ట్రాల్లో తీవ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ వాదన. ఈ చట్టం ద్వారా కేంద్రం కల్లోలిత ప్రాంతాలగా గుర్తించిన ప్రదేశాల్లో ఆర్మీకి సర్వ అధికారులూ దక్కుతాయి. ఆర్మీ ఇష్టారీతిన బుల్లెట్లు ప్రయోగించవచ్చు. ఎవరిమీదైనా అనుమానం వస్తే చాలు వారెంట్ లేకుండా అరెస్టులు చేయవచ్చు. ఏ కారణం చూపకుండా ఇళ్లను సోదా కూడా చేయొచ్చు. అయితే తమకు అన్యాయం జరిగిందని బాధితులు పోలీస్ స్టేషన్ గడప తొక్కినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే AFSPA చట్టం ప్రకారం ఆర్మీ చర్యలపై కేసులు పెట్టడం సాధ్యం కాదు.. అలా చేయాలంటే కేంద్రం అనుమతి అవసరం. అందుకే ఈ చట్టం ఎప్పుడూ వివాదాస్పదమే. పౌరులపై ఆర్మీ విచ్చలవిడి బలప్రయోగానికి కారణమయ్యే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో పాటు మానవ హక్కుల సంఘాలు నిత్యం పోరాడుతూనే ఉంటాయి. పౌరులను వేర్పాటువాద అనుమానితులుగా భావించి చంపడం, అరెస్టు చేయడం లాంటి ఘటనలు మణిపూర్ సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనూ అనేకసార్లు జరిగాయి. ఈ చట్టానికి ఎక్కువగా బలైపోయింది నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాలు. అక్కడ నివసించే గిరిజన తెగలు.
ప్రస్తుత ఘర్షణలకు కారణమేంటి?
మెజార్టీ వర్గ ఓట్ల కోసం కులాల మధ్య, తెగల మధ్య, వివిధ వర్గాల మధ్య చిచ్చుపెట్టే పార్టీగా గొప్ప పేరు సంపాదించుకున్న బీజేపీ అదే సూత్రాన్ని మణిపూర్‌లోనూ అమలు చేయాలని భావించడం ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణం. తమని తాము బ్రహ్మణులుగా, అగ్రకులంగా చెప్పుకునే మెయితీ ప్రజలకు ST హోదా కల్పించే ప్రయత్నం చేసింది బీజేపీ. మణిపూర్‌లో ఎక్కువశాతం జనాభా మెయితీలే ఉంటారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీరి జనాభా 53శాతానికి పైనే ఉంటుంది. భౌగోళికంగా కోండ, లోయ ప్రాంతాలగా మణిపూర్‌ను విభజించవచ్చు. మెయితీలు లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. కుకిలతో పాటు నాగాలు, ఇతర గిరిజన తెగలు కోండ ప్రాంతాల్లో జీవిస్తారు. వీరంతా క్రైస్తవులు. వీరంతా మిజోరాం, మియన్మార్ ప్రాంతాల నుంచి వలస వచ్చారు. వీరికి రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా కుకిలు, నాగాలు వెనుకపడినవారు. అటు మెయితీల చేతిలోనే ఎక్కువ సంపద ఉంది. అయితే వారిని STలగా గుర్తించాలని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం భావించడం అగ్గి రాజేసింది. ఇలా చేయడం వల్ల రిజర్వేషన్లలో ఎక్కువభాగం మెయితీలకే పోతుందన్నది కుకిల వాదన.
మెయితీలను STల జాబితాలో చేర్చకూడదంటూ 2023 ఏప్రిల్‌లో కుకిలతో పాటు పది గిరిజన తెగలు చేసిన నిరసనలు మే3, 2023న తీవ్రరూపం దాల్చాయి. ఇక మే4న ఇద్దరు కుకి మహిళలను మెయితీ అతివాదులు నగ్నంగా ఊరేగించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. 2004 జులై 15న 12మంది మహిళలు ఆర్మీకి వ్యతిరేకంగా నగ్నంగా నిరసనకు దిగిన ఘటన తర్వాత దేశం మొత్తం మణిపూర్ గురించి చర్చించిన ఘటన ఇది. నాడు 32ఏళ్ల మనోరమాదేవిని అస్సాం రైఫిల్స్ జవాన్లు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనే వేర్పాటువాద సంస్థకు ఆమెతో సంబంధాలు ఉన్నాయని బలవంతంగా ఆమెను ఇంటి నుంచి పట్టుకుపోయిన జవాన్లు ఆ తర్వాత ఆమె తమ నుంచి తప్పించుకుందని చెబుతూ బుల్లెట్లు ప్రయోగించారు. సంప్రదాయ లుంగీ, రబ్బర్ చెప్పులు ధరించిన మనోరమాదేవి సాహసాలకు మారుపేరుగా చెప్పుకునే జవాన్లు నుంచి తప్పించుకోని పరిగెడుతుంటే ఆమెను పట్టుకోవడం కుదరక కాల్చారట. ఇక ఆమె శరీరంపై అత్యాచారం జరిగినట్టు గుర్తులు కూడా ఉన్నాయి. బలమైన గాయాలున్నాయి. ఏకంగా 8 తుపాకీ తూటాలు ఉన్నాయి. పారిపోతున్న ఓ మహిళను పట్టుకోవడానికి 8 బుల్లెట్లు పేల్చడమేంటో వీరజవాన్లకే తెలియాలి.
రక్షకులనే రాక్షసులగా మార్చిన చట్టం-AFSPA
ముగింపు ఎప్పుడు?
నగ్నంగా అవమానానికి గురైతేనో, లేదా నగ్నంగా నిరసనకు దిగితేనో తప్ప మణిపూర్ ప్రజల బాధలు దేశానికి పట్టవు. అటు ప్రభుత్వాలకు ఈశాన్య రాష్ట్రాల భూభాగాలపై ఉండే శ్రద్ధ అక్కడి ప్రజలపై ఉండదు. స్వతంత్ర రాజ్యంగా వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన మణిపూర్‌ను మొఘల్ రాజులు కూడా ఆక్రమించుకోలేకపోయారు. 1947లో భారత్‌కు బ్రిటీష్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మణిపూర్ రాజు బోధాచంద్ర సింగ్‌తో నాటి కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారు. రక్షణ రంగం, విదేశీ వ్యవహారాలు, ప్రసార సాధనాలు అనే మూడు విషయాల్లో మాత్రమే అధికారం ఉండే షరతు మీద నాడు బోధాచంద్రా సింగ్ భారత్‌లో తన రాజ్య విలీనానికి సంతకం చేశారు. అయితే రెండేళ్లు తిరగకముందే నెహ్రు-పటేల్ ఒత్తిడి కారణంగా 1949లో మణిపూర్ పూర్తిగా భారత్‌లో వీలనమైంది. ఇది నాడు మెయితీలకు ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే రాజుల పాలనలో ఉన్నా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే వారంతా మణిపూర్‌ను ఏలారు. ఈ విలీనంతో తమ స్వతంత్రతను కోల్పోయినట్టుగా మణిపూర్ ప్రజలు భావించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మణిపూర్ చుట్టూ ఎన్నో వివాదాలు, ఎన్నో హింసాత్మక ఘటనలు.. ఇది ఎప్పటికీ ముగుస్తుందో, ఎంతవరకు వెళ్తుందో తెలియదు. అటు ఇలాంటి సమస్యలకు సైనిక పాలనే పరిష్కారమని కేంద్రం పదేపదే భావిస్తుండడం అత్యంత బాధాకరం. మణిపూర్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణలకు నిర్భంద చట్టాలు, సైనిక పాలన, ఓటు బ్యాంకు రాజకీయాలు, ప్రభుత్వ వైఫల్యాలే అతిపెద్ద కారణాలు!
ఇది కూడా చదవండి: రాజ్యం చేసిన ద్రోహం! ప్రొఫెసర్ సాయిబాబా మరణం!!