Menu

LayOffs: కోతల కల్లోలం.. మళ్లీ ఉద్యోగాలు ఊడుతున్నాయ్!


కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అనేక సంస్థలు తమ ఉద్యోగులను తీసివేయడం మొదలుపెట్టాయి. మూడేళ్ల నుంచి కొనసాగుతోన్న ఈ కోతల పర్వం 2024 ప్రారంభ నెల జనవరిలోనూ కంటిన్యూ అయ్యింది.


Sumanth Thummala

టెక్ ప్రపంచంలో మళ్లీ “కోతల” కల్లోలం కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీల్లో లే-ఆఫ్ ల జాతర మొదలైంది. కొత్త సంవత్సరం మొదలై నెల కాకుండానే మళ్లీ ఉద్యోగాలు పోతున్నాయి. layoffs.fyi అనే స్వతంత్ర సంస్థ సేకరించిన వివరాల ప్రకారం 62 కంపెనీల్లో 10,000 పైచిలుకు ఉద్యోగులకు ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి ఉద్వాసన పలికారు. ఇందులో ప్రముఖ కంపెనీ అయిన గూగుల్ ‌1,000 కి పైగా ఉద్యోగులను తీసేసింది. అమెజాన్, మెటా లాంటి సంస్థలు కూడా తమ ఉద్యోగుల్లో కోత విధించింది.

మూడేళ్లుగా గడ్డు కాలం
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అనేక సంస్థలు తమ ఉద్యోగులను తీసివేయడం మొదలుపెట్టాయి. మెటా సంస్థ కేవలం 2023 సంవత్సరంలోనే 20,000 పైచిలుకు ఉద్యోగులను తీసేసింది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ కూడా తమ చరిత్రలోనే అతిపెద్ద లే ఆఫ్ ని ప్రకటించింది. 12,000 ఉద్యోగులను తీసేసింది.

2022లో 1,061 టెక్ కంపెనీలు 164,769 మంది ఉద్యోగులను తొలగించగా, 1186 కంపెనీలు 2023లో 262,595 మంది కార్మికులను తొలగించాయి. సగటున, గత రెండేళ్లలో ప్రతిరోజూ దాదాపు 555 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు – లేదా ప్రతి గంటకు 23 మంది కార్మికులు. ఒక్క జనవరిలోనే 89,554 మంది ఉద్యోగులను తొలగించారు. రిటైల్, కన్జ్యూమర్, హార్డ్ వేర్ కంపెనీల్లో అత్యధికంగా ఉద్యోగాలను తీసేశారు.

దేశంలో ఉద్వాసనలు:
గత రెండు సంవత్సరాల్లో భారతదేశంలో 36,000 కంటే ఎక్కువమంది ఉద్యోగాలను కోల్పోయారు. 2023 సంవత్సరంలో 100 కంటే ఎక్కువ స్టార్టప్ కంపెనీలు 15,000కుపైగా ఉద్యోగాలకు కోత విధించాయి. బైజుస్ గత రెండేళ్లలో పదివేలకు పైగా ఉద్యోగులను తొలగించింది. ఫ్లిప్ కార్ట్ పేటీఎం,ఓలా,అనకాడమీ బ్లింకిట్, డన్జో లాంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

2024 లోను అదే కథ!
ఈ సంవత్సరం కూడా కంపెనీలు లే ఆఫ్ లకు సిద్ధమవుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులకు రాసిన అంతర్గత లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కంపెనీకి ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలతో పాటు పెద్ద ప్రాధాన్యతలున్నాయని చెప్పారు. దీనికి భారీ పెట్టుబడి అవసరమవుతుందన్నారు. ఇది కొన్ని రంగాలలో ఖర్చు తగ్గింపుతో పాటు తొలగింపులకు దారి తీస్తుందని తెలిపారు. ఏది ఏమైనా ఈ ట్రెండ్ పరిశీలిస్తే దేశంలో ఐటీ కంపెనీలు కూడా ఇదే దారిన వెళ్లొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: లక్షలు పోసి ల్యాప్‌టాప్‌ కొన్నాడు.. బాక్స్‌ ఓపెన్‌ చేస్తే ఫ్యూజులౌట్.. ఏం జరిగిందంటే?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *