SN subrahmanyan controversy: తాజ్‌మహల్(Taj Mahal) నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరో? అని శ్రీశ్రీ(Sri Sri) అన్నాడు. వారు ఎవరైనా కూలీలే ఆ అద్భుతాన్ని నిర్మించారు. షాజహాన్ తన శ్రమ కష్టం చేసుకుని నిర్మించలేదు. అలానే ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత ఉండే కట్టడాల నుండి, రోడ్లు, మురికి కాలువలు ఇవన్నీ నిర్మించింది, నిర్మించేది కూలీలు మాత్రమే. ఏసీ రూముల్లో కూర్చుని వాళ్ళతో పనులు చేయించుకునే వాళ్ళు కాదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఇటీవల ఎల్&టి చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
“సంక్షేమ పథకాలు సౌకర్యాలు కల్పిస్తున్న కారణంగా నిర్మాణ కార్మికులు పని చేయడానికి ఇష్టపడటం లేదని” లార్సెన్ అండ్ టూబ్రో మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు.
దీనిపై నెటిజన్లు తనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ”మీరు కోట్లు సంపాదిస్తూ, అరకొరగా అయినా కార్మికులు కనీస సౌకర్యాలు పొందడాన్ని తప్పుగా మాట్లాడతారా” అని ఎస్ ఎన్ సుబ్రమణియన్ ను ప్రశ్నిస్తున్నారు.
Question: Will Mr. S. N. Subramanian work for less pay, without welfare schemes (no safety nets either) and comfort?!!! https://t.co/iYBPkoIZ8o
— RajanManikam (@manikam_rajan) February 11, 2025
He surpassed Narayan Murthi in all categories! pic.twitter.com/6H4cZ80Qgp
— Amit Misra (@amit6060) February 11, 2025
ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనకి ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు కూడా జనాలు వారానికి 90 గంటలు పని చేయాలని, మగాళ్ళు ఎంతసేపు తన ఇంట్లో భార్యలను చూస్తూ కూర్చుంటారని! దానివల్ల ఆఫీసుల్లో పని చేయండని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
చట్టాలు ఎవరికి చుట్టాలు?
భవన,ఇతర నిర్మాణ కార్మికుల చట్టం, 1996 ప్రకారం వారి రాష్ట్రాల కార్మికుల సంక్షేమ బోర్డు కింద రిజిస్టర్ చెసుకున్న వారికి పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదంలో మృతి చెందినా, లేదా పూర్తి అంగ వైకల్యం పొందిన వారికి రూ. 5 లక్షలు, పూర్తి వైకల్యం లేని వారికి 25వేల నుండి లక్ష వరకు వైకల్యం శాతం బట్టి నిర్ధారిస్తారు. పెన్షన్, ప్రసూతి సాయం, స్కాలర్‌షిప్, లోన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందుతారు. వారి సామాజిక భద్రతకు నిధులు సమకూర్చడానికి ఒక సైట్ నుండి మొత్తం నిర్మాణ వ్యయంలో 1-2% వసూలు చేసే సెస్ నిధిని కలిగి ఉంటారు. ఈ సెస్ ఫండ్ లో ₹70,744 కోట్లు రాష్ట్రాలు ఖర్చు పెట్టలేదు అని స్వయం కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో స్పష్టం చేసింది.
అయితే వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు పని పరిస్థితుల కోడ్, 2020(The Occupational Safety, Health and Working Conditions Code, 2020) చట్టం కింద భవన నిర్మాణ కార్మికులకు కవరేజ్ లభించట్లేదు.
అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం (ఉపాధి మరియు సేవా పరిస్థితుల నియంత్రణ) చట్టం,1979 లాంటి వలస వెళ్ళే భవన కార్మికులకు దన్నుగా ఉండే చట్టాలను, చెత్తబుట్టలో పడేసి హైర్ & ఫైర్ విధానంలో ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ సిస్టం వంటివి నయా లేబర్ కోడ్ లలో పెట్టి కార్మికుల జీవితాలతోనే ఆడుకుంటున్నారు.
పని ప్రదేశాల్లో చట్టంలో ఉండే కనీస రక్షక పరికరాలు తాగునీటి వసతి టాయిలెట్లు కూడా చాలా చోట్ల అమలుకు నోచుకోవడం లేదు.
కోట్లకు పడగలెత్తిన మీ సంపాదన ఎంత? వారిది ఎంత?
సుబ్రహ్మణియన్ 2024 లో ₹51 కోట్లు జీతం సీఈఓ అందుకున్నాడు. ఇది 2023 తో పోలిస్తే 43% అధికం.
రాష్ట్రాన్ని బట్టి అన్-స్కిల్డ్ వర్కర్స్ కిందకు వచ్చే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ₹ 500 – ₹750 వరకు రోజు వేతనం అందుకుంటున్నారు. వీరికి కానీస వేతన చట్టం కూడా పూర్తిగా అమలు కావడం లేదు. పైగా ఇక్కడ నిర్మాణ పనులు సంవత్సరం మొత్తం లభించవు. నెలకు 15-20 రోజులు మాత్రమే లభిస్తాయి. అంటే సుమారు ₹15000. ఇక ప్రతి నెలా ఈ పని ఉండకపోవచ్చు. కనీస వేతనం కంటే కూడా తక్కువ ఇస్తున్న పని ప్రదేశాలు చాలా ఉన్నాయి అని ఒక సర్వే సంస్థ పేర్కొంది.
ఇవాళ ఇలాంటి కంపెనీలు కోట్లు సంపాదిస్తుంటే, ఆ సంపదను సృష్టించిన కార్మికులు ఇప్పటికీ మురికివాడల్లో – రేకులే గోడలైన ఇళ్ళలో ఉంటున్నారు.
ఒక పౌరులుగా కనీస అవసరాలను, రాజ్యాంగం చెప్పే సామాజిక భద్రతను కొంతైనా అనుభవించడాన్ని కూడా తట్టుకోలేరా!
కార్మిక హక్కులు ఎవరో వేసిన భిక్షా?
ఈ పథకాలు కనీస సౌకర్యాలు ఈ కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వాలు దయ తలచి ఇవ్వట్లేదు.
కార్మిక సంఘాలు ఇతర సంఘాలు ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు, త్యాగాలు చెయ్యడం వల్లే భవన నిర్మాణ కార్మికులకు కనీసం ప్రభుత్వం తరుపున ఇన్సూరెన్స్, పెన్షన్ వంటివి లభిస్తున్నాయి. ఈ మాత్రం అయినా ఉండటం వారి పరిస్థితిని కొంత మెరుగుపరిచింది.
తిన్నది అరగక జిమ్ముల్లో ఎత్తే బరువులే కానీ..తట్టెడు కాంక్రీటు, నాలుగు ఇటుకల బరువు ఈ సూట్లు వేసుకు తిరిగే సుకుమారులకు తెలుసా?
ఇటువంటి పరిస్థితి గురించి మన దేశం మొదటి న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓ సందర్భంలో అన్నాడు
‘ లాభార్జనే ధ్యేయమైన ఆర్థిక వ్యవస్థ రెండు రాజకీయ ప్రజాస్వామిక సూత్రాలకు విఘాతం కలిగిస్తుందని’ అంబేడ్కర్ చెప్పారు.
* వ్యక్తుల జీవితాలను రాజ్యవ్యవస్థ కాకుండా, ప్రైవేటు యాజమాన్యాలు నిర్దేశిస్తాయని,
* అలాగే జీవనోపాధి కోసం పౌరులు తమ రాజ్యాంగ హక్కులను కోల్పోవాల్సి రావొచ్చని అన్నాడు.
కార్పొరేట్లకు డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసు కానీ జనాల బాగు కోరటం గుర్తుపెట్టుకోరు. ఇవాళ కాలంలో ఇటువంటి కార్పొరేట్ కంపెనీల అధినేతలు సామాన్య జనాల శ్రమపై విషం కక్కడం దీనికి నిదర్శనం.
Also Read: Charles Darwin:డార్విన్ సిద్ధాంతం! ప్రతి జీవి కథ. మతాలు పెట్టే పేచీ!