Menu

Kolkata Rape Horror: అత్యాచారాలకు ఉరే సరా? మరణశిక్షతో అఘాయిత్యాలను ఆపగలమా?

Tri Ten B
kolkata rape murder case capital punishment

కోసి కారం పెట్టాలి.. అడ్డంగా కొయ్యాలి.. నిలువుగా చీల్చాలి.. కాల్చిపారేయాలి.. ఉరి తీసి పడేయాలి..! ఈ మాటలు కోపంతో వచ్చేవా లేదా మనుషుల లోతుల్లో దాగిన క్రూరత్వం నుంచి వచ్చేవో ఇలా అనే వారికే తెలియాలి! కోల్‌కతా ట్రైనీ హత్యాచార ఘటన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మాటలు ఇవి..! ఇలాంటి అమానవీయ ఘటనలు జరిగినప్పుడు ఆవేశం కట్టలు తెంచుకోవడం సాధారణ విషయమే కావొచ్చు.. అయితే అది హద్దుమీరి మనం మనుషులమన్న విషయాన్ని మర్చిపోతే మాత్రం బాధిత మహిళకు న్యాయం జరగకపోగా అసల సమస్య పక్కదారి పడుతుంది. మహిళలకు ఏ మాత్రం స్వేచ్ఛనివ్వని పలు దేశాల్లో అమలువుతున్న అనాగరిక చట్టాలను ఇండియాలోనూ ప్రయోగించాల్సిందేనన్న వాదనలో ఏ మాత్రం హేతుబద్ధత లేదు.! ఏంటి అర్థంకాలేదా? ఓ సారి ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్దాం.. 2007 ఆయేషా మీరా హత్యకు ట్రైనీ డాక్టర్‌ హత్యాచార కేసుకు ఉన్న సారూప్యతను గమనిద్దాం!

నేరస్థులు తప్పించుకుంటున్నారా?

విజయవాడ ఆయేషా మీరా హత్యాచార ఘటన గుర్తింది కదా..? ఎవరో చేసిన ఘోరానికి అమాయక సత్యంబాబును పోలీసులు ఎలా ఇరికించి చిత్రహింసలు పెట్టారో మర్చిపోలేదు కదా? ఘటన జరిగిన తర్వాత అన్యాయంగా పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు చివరకు నిర్ధోషిగా తేలి నడవలేని స్థితిలో కోర్టు నుంచి కుంటుతూ ఎలా బయటకు వచ్చారో అప్పుడే మర్చిపోయారా? హత్యాచార ఘటనల్లో అసలు నేరస్థులు తప్పించుకోవడం ఇండియాలో సర్వసాధారణమైన విషయం.

ayesha meera murder case

అయేషా మీరా, సత్యంబాబు (File)

మాజీ మంత్రి బంధువే హత్య చేశారా?

పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ ప్రమేయం ఉన్న వారు, అగ్రకులాల వారు నిందితుల్లో ఎక్కువగా కనిపించరు. ఆయేషాను చంపింది సత్యం బాబు కాదని.. ఓ కాంగ్రెస్‌ మాజీ మంత్రి బంధువేనని ఆమె తల్లి ఎన్నోసార్లు ఆరోపించారు. అయితే పోలీసులు ఆ మేరకు దర్యాప్తు చేయకపోగా దళిత వర్గానికి చెందిన సత్యంబాబును అన్యాయంగా ఇరికించారు. ఇటు కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటనలోనూ అసలు నిందితులు తప్పించుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రమేయమూ ఉందన్న ప్రచారం జరుగుతోంది.

2019 హైదరాబాద్‌ దిశ హత్యాచార ఘటన తర్వాత నలుగురు అనుమానితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఆ తర్వాత తెలంగాణలో అత్యాచార ఘటనలు జరగలేదా అంటే పోలీస్‌ చర్యను సమర్థించినవారి దగ్గర సమాధానం ఉండదు.. ఎందుకంటే కఠిన శిక్షలతో సమాజంలో మార్పు వస్తుందా అంటే దానికి సంబంధించిన ఆధారాలేవీ లేవు..!

రాజకీయ ప్రమేయం ఉందా?

కోల్కతాలో జరిగింది గ్యాంప్‌ రేప్‌ అని డాక్టర్ల రిపోర్టులు చెబుతున్నా కేసు మాత్రం సివిక్ వాలంటీర్‌ సంజయ్‌రాయ్‌ చుట్టూనే తిరుగుతోంది. అతను ఈ హత్యలో భాగం కావొచ్చు.. కాకపోవచ్చు.. అసలు నిజం ఏంటన్నది ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. పోలీసులు చెబుతున్న మాటలకు అసలు ముందు నుంచి పొంతనే లేదు. ఇది సాక్ష్యాత్తు కోల్‌కతా హైకోర్టు చెప్పిన మాట. ఇటు ఘటన జరిగిన RG Kar ఆసుపత్రిలోని పలువురు డాక్టర్లు సైతం ఎవరినో కాపాడడానికి సంజయ్‌రాయ్‌ను మాత్రమే నిందితుడిగా చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

capital punsihment not a solution

ప్రతీకాత్మక చిత్రం

నిర్ధోషులకు శిక్ష పడితే అది చట్టాల లోపమే:

హత్యచార ఘటనలను ఎవరూ సమర్థించరు.. అందుకు తగిన శిక్షలు పడితీరాల్సిందే.. అయితే పడే శిక్ష సమాజంలో మార్పును తీసుకొస్తుందా లేదా అన్నది అన్నిటికంటే ముఖ్యం. హత్యాచార ఘటనలు జరిగిన ప్రతీసారి ప్రజలు ఆగ్రహావేశాలకు గురికావడం.. నిందితుడి అవయవాలు కోసేసి చంపాలి అనడం సాధారణంగా కనిపిస్తున్న విషయం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిందితుడే దోషీ కావాలని లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియడానికి కచ్చితంగా సమయం పడుతుంది. ఘటన జరిగిన 24 గంటల్లోనే చంపేయాలి లాంటి ఆవేశిత నిర్ణయాలతో అసలు తప్పు చేసిన వారు తప్పించుకుపోయే ప్రమాదం ఉంటుంది. వందమంది దోషులు తప్పించుకున్నా వారిని తిరిగి పట్టుకోవచ్చు కానీ ఓ అమాయకుడు శిక్షకు గురైతే అది చట్టాల లోపమే అవుతుంది.

capital punishment hanging kolkata murder

ప్రతీకాత్మక చిత్రం

దొరికిన వారిని చంపుకుంటూ పోతారా?

నిజం నిలకడ మీద తెలుస్తుంది.. అంతేకానీ ఈ లోపే దొరికినవాడిని చంపేస్తే అసలు నిజం కనుమరుగవుతుంది. ఇక్కడ బాధితురాలికి న్యాయం జరగలాంటే అసలు దోషులు ఎవరో తెలియాలి.. వారి వెనుక ఎవరైనా ఉంటే అది కూడా బహిర్గతం కావాలి. అప్పుడే న్యాయం జరిగినట్టు..! ఇది చేయకుండా అనుమానితులను చంపుకుంటూ పోతే అసలు నేరస్థులు ఎలా దొరుకుతారు?

అటు పోలీసులు చెప్పే కథల్లో వాస్తవం ఉందో లేదో కూడా హేతుబద్ధంగా ఆలోచించాలి కదా..! నాడు అయేషా మీరా ఘటనలో సత్యంబాబు గురించి పోలీసులు ఏం చెప్పారో వింటే విస్మయం కలగకమానదు. హాస్టల్ భవనం కాంపాండ్ వాల్ దూకి.. బాత్‌రూం పైకప్పు మీదకు వెళ్లి, అక్కడి నుంచి పైకెగిరి ఆరడగుల ఐదంగుళాల ఎత్తులో ఉన్న మొదటి అంతస్తు పిట్టగోడను సత్యంబాబు అందుకున్నాడట. అతనేం సూపర్‌మ్యాన్ కాదుగా..! ఇలాంటి పోలీసు కథలు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి..!

హింసకు హింసే సమాధానమా?

మరోవైపు హత్యచార ఘటనల్లో దోషులను ఉరి తీస్తున్న దేశాల సంగతి చూస్తే అక్కడి మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. ఆయా దేశాల్లో భర్తే భార్యపై అత్యాచారానికి పాల్పడతాడు. అది వారి మత చట్టాల కింద అసలు అత్యాచారమే కాదు! ఇటు క్యాపిటల్‌ పనిష్మెంట్‌కు అత్యాచారాలు తగ్గాయని చెప్పే ఎలాంటి ఆధారాలూ లేవు. తప్పు జరిగిపోయిన తర్వాత దోషిని ఎలా శిక్షించాలని ఆలోచించే బదులు అసలు తప్పే జరగకుండా ఎలాంటి విధానాలు అమలు చేయాలో తెలియాలంటే స్వీడెన్‌ లాంటి దేశాలను గమనించాలి. ఇది చేయకుండా ఆటవిక శిక్షలతో అత్యాచారాలు తగ్గుతాయనుకుంటే అది పొరపాటే అవుతుందని మానవ హక్కుల సంఘాలు పదేపదే చెబుతుంటాయి.

capital punishment in saudi arabia rape

ప్రతీకాత్మక చిత్రం

ఆ వికృత హక్కే అసలు సమస్య..!

తన లైంగిక అవసరాల కోసం స్త్రీలను ఒక వస్తువుగా చూసే ఆలోచన చాలా సంస్క్రతుల్లో భాగంగా కనిపిస్తుంది. అమ్మాయి శరీరం తమ హక్కుగా భావించే మగవారు కూడా మన కళ్లముందే కనిపిస్తుంటారు. రేప్‌కు సామాజీక మూలం ఈ వికృతమైన హక్కే. ఆడవాళ్లకు స్వేచ్ఛ, సమానహక్కులు ఇస్తూ వారిని స్వతంత్రంగా బతకనిచ్చే దేశాల్లో మహిళలపై జరిగే లైంగిక దాడులు తక్కువ.

ఈ వికృత సంస్క్రతిని పొగొట్టే ప్రయత్నాలు జరగకపోగా.. వాటిని పెంచి పోషించే చవకబారు సినిమాలు సమాజాన్ని మరింత చెడగొడుతున్నాయి.

దేవతలకు పూజలు చేస్తారు.. బయట ఆడది కనిపిస్తే అదోలా చూస్తారు. ఇలాంటి ఆలోచనలతోనే అత్యాచారాలు జరుగుతాయి. ఇది వ్యవస్థకు సంబంధించిన తప్పిదాలు. వీటిని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ముఖ్యంగా విద్యావ్యవస్థపై ఉంటుంది. ఇలా విధానపరమైన మార్పులు చేస్తేనే ఆడవారి పట్ల మగవారు చూసే విధానంలో మార్పు వస్తుంది. అప్పుడు రేప్‌ లాంటి ఆలోచనలే రావు. నార్వే, డెన్‌మార్క్‌ లాంటి దేశాలు ఇలానే ముందుకు వెళ్తున్నాయి.!

women safety coun tries and less rape cases

 

Also ReaD: దేశంలో హత్యాచార రాజకీయాలు .. నిజాన్ని దాటేందుకు మరెన్నో కుట్రలు!!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *