Menu

Russia-Ukraine War Indians: పుతిన్‌ స్వార్థానికి బలైపోతున్న భారతీయులు.. ఇదేం యుద్ధనీతి? మోదీ ఏం చేస్తున్నట్టు?

Tri Ten B
Kerala Man Dies in Ukraine: The Dark Truth Behind Indians in the Russian Army and what modi is doing as he is friend to putin

ఇంత అన్యాయమా? ఇంత మోసమా? డబ్బు, హోదా ఉంటే ఏదైనా చేయవచ్చా? అమాయకులను బలితీసుకోవచ్చా? రష్యాకు ఎందుకంత అహంకారం? పుతిన్(Vladimir Putin) ఏం చేసినా ఎందుకు చెల్లుబాటువుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పదెవరూ? రష్యా(Russia) కోసం భారతీయులు ప్రాణత్యాగాలు చేయడమేంటో అంతుబట్టడంలేదు. మరో భారతీయుడు యుక్రెయిన్‌(Ukraine) గడ్డపై తనువు చాలించాడు. రష్యా సైన్యం కోసం పోరాడుతూ యుక్రెయిన్‌ ఆర్మీ చేతికి చిక్కి చనిపోయాడు. కేరళ(Kerala)కు చెందిన 31ఏళ్ల బినిల్ బాబు యుక్రెయిన్‌లో చనిపోవడంతో ఇప్పటివరకు రష్యా సైన్యంలో చేరి ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సంఖ్య పదికి చేరింది. ఇది తర్వాతి కాలంలో ఎంతకు చేరుతుందో తెలియదు కానీ ఇండియా ఎప్పటిలాగే తమ దేశస్థులను రష్యా ఆర్మీ నుంచి విముక్తి చేయాలని పుతిన్‌ను కోరింది. ఇలా ఇండియా కోరడం, రష్యా ఏ మాత్రం పట్టించుకోకపోవడం ఎప్పుడూ జరిగే విషయమే. పైగా రష్యా భారత్‌కు మిత్రదేశమని, పుతిన్‌కు మోదీ మంచి ఫ్రెండ్‌ అని బడాయి మాటలు ఒకటి..! మిత్రదేశమైతే అన్యాయంగా ఇతరుల ప్రాణాలు బలి తీసుకోవచ్చా? అసలు 10 మంది ప్రాణాలు పోయేవరకు భారత్‌ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? ఇది చేతకానితనం కాదా? అసమర్థత కాదా? అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి? ఇంతకీ అసలు భారతీయులు రష్యా వెళ్లి అక్కడ ఆర్మీలో ఎలా పని చేస్తున్నారని మీకు డౌట్ వచ్చిందా? అదో పెద్ద స్టోరీ.. కానీ బ్రిఫ్‌ చేసి చిన్నగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ఒక ఎగ్జాంపూల్‌ చెబుతా!

మోససోవడం, చనిపోవడం, విస్మరణకు గురికావడం..

హరియాణాకు చెందిన 22ఏళ్ల రవి మౌన్‌కు ఒక రోజు కాల్‌ వచ్చింది. ‘మీరు జాబ్‌ కావాలని మమ్మల్ని సంప్రదించారు కదా.. మీకు రష్యాలో జాబ్‌ వచ్చింది.. ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేయాలి’ అని ఓ దళారి చెప్పాడు. దీంతో ఇది నమ్మిన రవి మౌన్‌ రష్యాలో జాబ్‌ అనడంతో ఎగిరిగంతేశాడు. ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు. కానీ అక్కడకి వెళ్లిన తర్వాత సీన్‌ వేరు. ముందుకు అతని పాస్ట్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా అధికారులు తర్వాత అతడిని బలవంతంగా సైన్యంలో చేర్చారు. ఇలా రష్యా ఆర్మీలో పని చేయడం రవికి ఏ మాత్రం ఇష్టం లేదు. తమ సమస్యను పరిష్కరించాలని రవి కుటుంబం భారత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా కనీస స్పందన రాలేదంటే నమ్మగలరా? చివరికి 2024 జులై 29న రవి యుక్రెయిన్‌లో ప్రాణాలు కోల్పోయాడు. అతని కుటుంబం దిక్కులేనిదిగా మారిపోయింది. రవిని తలుచుకుంటూ అతని తల్లి ఇప్పటికీ కుమిలిపోతుంది. ఇది కేవలం రవి కథ మాత్రమే కాదు.. కేరళకు చెందిన బినిల్‌ బాబు స్టోరీ అయినా, రష్యా ఆర్మీలో పని చేస్తున్న ఇతర భారతీయుల కథ అయినా ఇంచుమించు ఇలానే ఉంటుంది. దేశంలోని దళారుల చేతిలో మోసపోవడం, రష్యాలో అడుగుపెట్టిన తర్వాత అధికారుల బెదిరింపులు, బలవంతానికి తలవంచి పుతిన్‌ సైన్యానికి పనిచేయడం, తర్వాత ప్రాణాలు కోల్పోవడం.. ఇది రోటిన్‌గా మారింది.

చర్చలు జరిపి చేతులు దులుపుకున్నారు

రష్యాలో ఉన్నత వేతనాలు, సురక్షిత ఉద్యోగాల వాగ్దానాలతో దళారులు పేద వర్గాలతో పాటు సామాజీకంగా వెనకబడిన కులాల వారిని ఆకర్షిస్తారు. తీరా రష్యా వెళ్లిన తర్వాత వారికి అక్కడి భాష తెలియకపోవడం, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో పుతిన్‌ సైన్యాధికారుల మోసాలకు బలవుతున్నారు. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పని చేస్తే సరిపోతుందని నమ్మబలుకుతారు. అంటే కుకింగ్‌ లాంటివి చేస్తే సరిపోతుందని చెబుతారు. తర్వాత యుద్ధంలో పాల్గొనాల్సిందే అంటారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల ప్రకారం, 2023లో 100మందికిపైగా భారతీయులు రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పని చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి, రష్యా అధికారులతో చర్చలు జరిపింది. 2024లో ప్రధాని మోదీ, పుతిన్‌ను కలిసిన రెండుసార్లూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే రష్యా ప్రభుత్వం భారతీయులను సైన్యంలో నియమించే ప్రక్రయను నిలిపివేశామని చెప్పింది. అయితే, ఇప్పటికే సైన్యంలో ఉన్న భారతీయులను విడుదల చేయడంలో ఆలస్యం చేస్తోంది. ఆ ఆలస్యానికి ఖరీదు ఏంటో తెలుసా? నిండు ప్రాణాలు..!

మానవ హక్కుల ఉల్లంఘన కాదా?

 

అసలు ఒక మనిషిని తనకు ఇష్టం లేకుండా ఓ పని చేయించడమే నేరం. అలాంటిది ప్రాణాలుపోయే ప్రమాదం ఉన్న ఆర్మీ వృత్తిలో చేరాలని బలవంతం చేయడమేంటి? ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదా? రష్యా చేస్తున్నది నేరం కాదా? ముమ్మాటికి క్షమించారని నేరమే.. మరి చర్యలు ఏవి? చర్యలు సంగతి పక్కనపెడితే కనీసం స్పందన కూడా లేకపోవడం అత్యంత బాధాకరం. విస్తరణ కాంక్షతో 1000 రోజులకు పైగా జరుగుతున్న యుక్రెయిన్‌ యుద్ధంలో బలైపోతుంది సామాన్య ప్రజలే. అందులో రష్యా, యుక్రెయిన్‌తో ఏ మాత్రం సంబంధం లేని భారతీయులు కూడా ఉండడం ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి..! ఇటు భారత ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. స్థానికంగా అమాయకులను మోసం చేస్తున్న దళారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఈ మోసాన్ని గుర్తించడంలో భారత ప్రభుత్వం ఆలస్యం చేసిందని.. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభించినప్పటికీ అది ముందుకు కదలలేదని తెలుస్తోంది. అటు మోదీ, పుతిన్‌కి మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, ఈ సమస్యను సమర్థంగా పరిష్కరించలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: అమెరికా, కెనడా మధ్య ముదురుతున్న యుద్ధం.. ట్రంప్ సైనిక చర్యలకు దిగుతారా?

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *