Menu

Japan: జపాన్ అంతరించపోనుందా? శూన్యత వైపు సాగుతోన్న దేశం.. పరిష్కరమేంటి?

Praja Dhwani Desk
japan population decline

‘జపాన్(Japan) అని అప్పట్లో ఓ దేశం ఉండేది..’ అక్కడ వీధులు జనాలతో కిక్కిరిసిపోయేవి. పార్కుల్లో పిల్లల కేరింతలు నిత్యం కనిపిస్తుండేవి. ప్లేయర్లతో ఆటస్థలాలు నిండిపోయి ఉండేవి. ప్రతి చెరువు దగ్గర చిరునవ్వులు.. ప్రతి వీధి మలుపులో ఆనందం.. రాత్రివేళ మెరుస్తూ కనిపించే టోక్యో స్కై స్క్రేపర్లు.. ఇలా అక్కడి వారి జీవితమంతా ఉల్లాసంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ వీధులన్ని వెలవెలబోతున్నాయి. ఆడుకునే పిల్లలు లేరు. రైల్వే స్టేషన్లు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. నైట్ మార్కెట్లలో వంటగదుల్లో పొగ కమ్ముకున్నా.. కొనుగోలు చేసే వాళ్లే లేరు. ఆట స్థలాలైతే ఖాళీ..! ఒకప్పుడు మనుషులతో నిండిపోయిన నగరాలు.. ఇప్పుడు ఖాళీ వీధులతో మూగబోయాయి. పెద్ద పెద్ద భవంతులన్నీ బూత్‌ బంగ్లాలను తలపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జపాన్ శూన్యత వైపు సాగుతోంది.. మరో 700ఏళ్ల.. సరిగ్గా మరో 700ఏళ్ల గడిస్తే జపాన్‌ కాలగర్భంలో కలిసిపోయే చరిత్రగా మిగిలిపోయే ప్రమాదముంది. మరో 7 శతాబ్దాల్లో జపాన్‌ అంతరించిపోవచ్చు..! కారణం.. పిల్లలు పుట్టుకలో తగ్గుదల!

ప్రతీ ఏడాది తగ్గుతున్న జననాల సంఖ్య:

2024లో జపాన్‌లో పుట్టిన పిల్లల సంఖ్య 7,20,988 మాత్రమే. ఇది 2023తో పోలిస్తే 5శాతం తక్కువ. ఇలా జననాల సంఖ్య తగ్గిపోవడం జపాన్‌కు ఇది వరుసగా 9వ ఏడాది. ఈ సంఖ్య 1899 నుంచి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ నంబర్‌. జననాలు తగ్గడం.. మరణాలు పెరగడం జపాన్‌ను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య. 2024లో జపాన్‌లో 16,18,684 మంది మరణించారు. అంటే ఒక బేబి పుడితే ఇద్దరు చనిపోతున్నారు. దీంతో జపాన్ ఒకే ఏడాదిలో 9లక్షల మందిని కోల్పోయినట్టు లెక్క. 2008లో 12 కోట్లగా ఉన్న జపాన్ జనాభా 2048నాటికి 10 కోట్లకు పడిపోతుందని అంచనా. 2060 నాటికి అది 8 కోట్ల మందికి తగ్గుతుందట. అంటే రానున్న 40-45ఏళ్లలో నాలుగు కోట్ల మంది మాయం కానున్నారు. ఈ లెక్కన చూస్తే 2720 నాటికి…జపాన్‌లో కేవలం ఒక్క చిన్నారి మాత్రమే బతికుంటుంది. అలాంటి దుస్తితికి జపాన్‌ యువత ఆలోచనా విధానమే కారణమంటూ ప్రపంచం నిందిస్తోంది. జపాన్ యువత పెళ్లికి ఆసక్తి చూపడం లేదని.. పిల్లల్ని కనడం మానేసిందని విమర్శించే వాళ్లు ఎక్కువయ్యారు. కానీ ఆ దేశ యువత ఎందుకు ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారన్నదానిపై కొద్దీ మందే విశ్లేషిస్తున్నారు.

ఉద్యోగ భద్రత ఏది?

ఒకప్పుడు జపాన్‌ ప్రజలు కుటుంబ జీవితానికి ఎక్కువగానే విలువిచ్చేవారు. పిల్లలు ఉంటేనే జీవితానికి అర్థమని భావించేవారు. కానీ ఇప్పుడు? పెళ్లంటే భారం. కుటుంబం అంటే ఖర్చు అనే స్థితికి వారి ఆలోచనా విధానం మారింది. దీనికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు. అక్కడి యువతకు స్థిరమైన ఉద్యోగాలు లేవు. అటు పెళ్లి చేసుకుని తల్లులుగా మారితే ఉద్యోగం కోల్పోతామనే భయం మహిళల్లో కనిపిస్తోంది. పెళ్లయితే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు ఇద్దరిలో ఒకరు జాబ్‌ చేసినా కుటుంబ పోషన సాఫీగా సాగిపోయేది. కానీ దంపతులిద్దరూ ఉద్యోగం చేయాల్సిందే. ఒకవేళ పెళ్లి చేసుకున్నాక బిడ్డ పుడితే తల్లికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలను పెంచడం కోసం ఉద్యోగాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక పిల్లల్ని స్కూల్‌కు పంపించాలంటే భర్త సంపాదన ఒక్కటే సరిపోదు. ప్రభుత్వం పిల్లలని కనమని చెబుతోంది కానీ ఉద్యోగ భద్రత ఇస్తుందా? కుటుంబ పోషణకు సరిపడే జీతం ఇస్తుందా? లేదు కదా..! మరి పెళ్లి చేసుకోని పుట్టే పిల్లలను ఇబ్బంది పెట్టాలా? జపాన్‌ యువత ఆలోచిస్తున్న విధానం ఇది. ఇందులో ఏ తప్పు కనిపించడంలేదు కూడా! మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? అసలు తప్పు ఎవరిది? ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే విధంగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, విజ్ఞానం రంగాల్లో దూకుడుగా ఉన్న జపాన్‌ యువతకు ఇప్పుడు తమ సొంత భవిష్యత్తే తెలియని దుస్థితి. జపాన్ యువత ప్రేమ లేని కారణంగా పెళ్లికి దూరంగా ఉండడం లేదు.. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నా కూడా భవిష్యత్‌పై భయంతో, పిల్లలను ఇబ్బందులు పెట్టకూడదనే ఇంగితంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చంపేస్తోన్న పని… ఇక ప్రేమకు చోటెక్కడ?

అటు జపాన్‌ యువతలో చాలామందికి ఉద్యోగం, పని తప్ప వేరే జీవితమే ఉండదంటే నమ్మగలరా? జపాన్‌లో ‘కరోషి’ అనే పదం ఉంది. దీని అర్థం పని ఒత్తిడి కారణంగా చనిపోవడం. అవును..! జపాన్‌ యువతను అక్కడి కంపెనీలు రాచిరంపాలు పెడుతున్నాయి. రోజుకు 14 గంటలు పని చేయించుకుంటున్నాయి. రోజు మొత్తంలో ఇంత సమయం ఎవరైనా ఉద్యోగం చేస్తారా? కానీ చేయిస్తున్నారు? పోని దానికి సరిపడా జీతం ఇస్తున్నారా? ఇవ్వడంలేదు.. సమయమంతా ఆఫీస్‌లోనే గడిపితే ఇక కుటంబంతో కలిసి ఉండేది ఎప్పుడు? ఇంత సమయం పని చేసి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న యువతకు పెళ్లి, పిల్లల గురించి ఆలోచించే తీరిక, ఓపిక ఉంటుందా? పని ఒత్తిడితోనే జపాన్‌ యువత కడుపు నింపుకుంటున్నా ఏదో ఒక రోజు కరోషి బారిన పడతామనే భయం ప్రతి ఉద్యోగిని వెంటాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ కుటుంబానికి విలువ ఉండదు.. కేవలం పని చేయగలిగే శరీరాలకే విలువ ఉంటుంది. ఇంతటి యాంత్రిక జీవితం మధ్యలో ప్రేమ ఎవరిపై పుట్టాలో, కోరికలు ఎవరిపై పెరగాలో ఉచిత సలహాలు ఇచ్చేవారికి తెలియకపోవచ్చు.

నిందించాల్సింది ఎవరిని?

స్టేజీ ఎక్కి జపాన్‌ను నిందిస్తూ, పిల్లలను కనమని ఉపన్యాసాలు ఇచ్చేవారు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధంలో రెండు అణుబాంబులను భరించిన దేశమది. ఆ నాడే కడ తేరిపోతుందని భావించిన ఆ దేశం.. తిరిగి నిలబడి కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుంది. బాంబులు పడిన పది సంవత్సరాల్లోనే టోక్యో ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా మారింది. క్రమశిక్షణ, కష్టపడి పని చేసే అలవాటు, సమయపాలన.. ఇవే జపాన్‌ను మళ్లీ నిలబెట్టాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా మార్చాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లోనూ టాప్‌ ప్లేస్‌కు ఎదిగేలా చేశాయి. ఇదంతా అక్కడి యువత కారణంగానే జరిగింది. ఇంతటి కష్టపడే తత్వం, తెలివితేటలున్న జపాన్ యువత ఇప్పుడు పిల్లలను కనకూడదని ఎందుకు అంటున్నారో మీరే ఆలోచించాలి. మారాల్సింది అక్కడ యువత కాదు.. అక్కడి వ్యవస్థ అని అర్థం చేసుకోవాలి. అది మారిన రోజు అక్కడి యువత పెళ్లిళ్లు చేసుకోని పిల్లలను కంటుంది. లేకపోతే జపాన్ ముందుముందు మనకి కనిపించదు.. అక్కడ ఒకప్పుడు మనుషులుండేవారని చరిత్ర పుస్తకాల్లో చెప్పుకోవాల్సి వస్తుంది.

ALSO READ: జ్ఞానానికి, వ్యాపారానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎవరు గెలుస్తారు?


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *