Menu

చెవిటిదైన ప్రపంచంలో పసిజీవుల ఆర్తనాదాలు..! నెత్తుటి సముద్రం కళ్ళ చూస్తున్న రణం

Tri Ten B

ఎర్ర సముద్రం రక్తపు సంద్రంలా మారిపోయింది… చిన్ని ప్రాణుల వేదన, యుద్ధ ఘోషకు సాక్ష్యంగా మారింది..!

పుస్తకాలు చిరిగి రక్తసిక్తమవుతున్నాయి.. అక్షరాలు బూటు కాలి కింద నలిగి నుజ్జునుజ్జు అవుతున్నాయి. బాంబు దాడులకు ఛిద్రమవుతున్న చిన్నారుల జీవితాలెన్నో పాలస్తీనా గడ్డపై కన్నీరు కార్చుతున్నాయి. యుద్ధం ఎవరిదైనా నష్టపోయేది అమాయకులే.. చనిపోయేది నిస్సహాయులే.. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఎడతెగని యుద్ధంలో ఎక్కువగా బలైపోతుంది అన్నెం పున్నెం ఎరుగని పసివారే..! హమాస్‌పై ప్రతీకార దాడుల పేరిట ఇజ్రాయెల్‌ సృష్టిస్తున్న మారణహోమంలో పాలస్తీనా చిన్నారులు సమిధలవుతున్నారు..! సరిగ్గా ప్రపంచ పటం నడిబొడ్డున.. శిలువనెక్కిన చేతుల నిండా మానిపోని గాయాల గుర్తుల సాక్షిగా.. అభంశుభం తెలియని పసికందులు నిర్జీవంగా మారుతున్నారు.

అమాయక పిల్లల ఆర్తనాదాలు:
అక్టోబర్‌ 7, 2023న ఇజ్రాయెల్‌ గడ్డపై పాలస్తీనా మద్దతు సంస్థ హమాస్‌ దాడులు చేసింది. ఈ అటాక్‌లో 1200మందికిపైగా ఇజ్రాయెల్‌ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్‌ సైనికులు తమ తుపాకులకు, బాంబులకు పని చెప్పారు. హమాస్‌ దళాలపై ఎదురు దాడి సాకుతో గాజాలో నెత్తురు పారించారు. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడుల్లో హమాస్‌ దళాలు వందల్లో చనిపోతే అమాయక పిల్లలు, మహిళలు వేలల్లో మరణించారు.

గత నాలుగేళ్ల లెక్కలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఈ నాలుగేళ్లలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని సాయుధ పోరాటాలలో మరణించిన వారి కంటే ఈ 10 నెలల యుద్ధంలో పాలస్తీనా భూభాగాల్లో ఎక్కువ మంది పిల్లలు చనిపోయారు. 2019 – 2022 మధ్య ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12,193 మంది పిల్లలు యుద్ధ గొడవల్లో మరణించారు. ఇటు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం మొదలైన అక్టోబర్ 2023 నుంచి ఫిబ్రవరి 2024 మధ్యలో దాదాపు 13వేల మంది చిన్నారులు అసువులు బాశారు.

సాయాన్ని కూడా అడ్డుకుంటున్న ఇజ్రాయెల్:
అక్టోబర్‌ 7, 2023 నుంచి ఆగస్టు 12, 2024 వరకు పాలస్తీనా గడ్డపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో దాదాపు 41 వేల మంది ప్రాణాలు విడిచారు. ఇందులో 15వేల మందికి కంటే ఎక్కువగా పిల్లలే ఉన్నారు. అటు 21 వేల మంది పిల్లల జాడ కనిపించడం లేదని నివేదికలు చెబుతున్నాయి. వారంతా తప్పిపోయారా లేదా చనిపోయారా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే వారంతా తల్లిదండ్రులతో మాత్రం లేరు. అటు మరికొంతమంది పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకోని అనాధలుగా మారారు. మరోవైపు గాజాకు రావాల్సిన మానవతా సహాయాన్ని కూడా రాకుండా ఇజ్రాయెల్‌ దళాలు అడ్డుపడుతుండడం అనేక విమర్శలకు కారణం అవుతోంది.

పోషకాహార లోపంతో వ్యాధులు:
అటు పాలస్తీనా భూభాగమైన వెస్ట్ బ్యాంక్‌లోనూ ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ఇది మరిన్ని మరణాలకు కారణం అవుతోంది. అటు వెస్ట్ బ్యాంక్‌ ప్రాంతంలో దాదాపు 250 మంది పాలస్తీనా పిల్లలు తప్పిపోయారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ చెబుతోంది. మరోవైపు పాలస్తీనాకు రావాల్సిన పౌషక ఆహారాలు కూడా అందడంలేదు. ముఖ్యంగా ఉత్తర గాజాలోని పిల్లలు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆకలి తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. వ్యాధులను తట్టుకోగలిగే శక్తి అక్కడి పిల్లల్లో అణువంతైనా కనిపించడంలేదు.

ఏ క్షణం ఎటువైపు నుంచి మృత్యువు కబళిస్తుందో తెలియని దీనచూపుల మధ్య పాలస్తీనా చిన్నారులు కాలం వెళ్లదీస్తున్నారు. చెమ్మ బారిన బేస్‌మెంట్లలో జీవిస్తూ మంటలు చిమ్మే బాంబుల వేడిని తట్టుకోలేక మృత్యువుగా దగ్గరవుతున్నారు. కాంక్రీటు పిల్లర్ల వెనకా.. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని మరణ భయంతో దాక్కుంటున్న పాలస్తీనా పిల్లల విషాద గాధలు ఇంకెంతకాలం కొనసాగుతాయో మరి…!

Also Read: ఇజ్రాయెల్‌ మారణహోమం.. చిన్నారులను కూడా వదలని కర్కశత్వం!


Written By

2 Comments