ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం…
మీరున్న ప్రాంతంలో… మీ చుట్టు పక్కల…
15 నెలల పాటు…
ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా
ప్రతి రోజూ.. ప్రతి క్షణం…
బాంబుల వర్షం కురుస్తూ ఉంటే…
భవనాలు శిథిలాలుగా మారుతూ ఉంటే…
ప్రజల నివాసాలు..శవాల కుప్పలుగా మారుతూ ఉంటే…
ఒక్కసారి ఆ సన్నివేశాన్ని ఊహించుకోండి..
అలాంటి ప్రాంతంలో ఉన్న మనుషుల మానసిక సంఘర్షణను గుర్తుతెచ్చుకోండి..
సరిగ్గా అదే పరిస్థితి అనుభవిస్తున్నారు గాజా ప్రజలు
15 నెలల ఊచకోత..! 47వేల మంది తలలు తెగిపడ్డాయి.. లక్షలాది కుటుంబాలు వీధినపడ్డాయి.. 19 లక్షల మంది ఊరి వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు.. 85,000 టన్నుల బాంబుల ప్రయోగాలతో 467 రోజుల జరిగిన నరమేధానికి ముగింపు వచ్చింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది విడతల వారిగా జరిగే ప్రక్రియ.శాంతి ఒప్పందాలు,కాల్పుల విరమణ సంతకాలు విడతల వారిగా, ఒక క్రమబద్ధంగా జరుగుతాయేమో కానీ యుద్ధం మాత్రం పద్ధతిలో జరగదు. ఏ క్షణం ఎవరు ఎటు నుంచి బాంబులు వేస్తారో తెలియదు. మృత్యువు ఎప్పుడు కబళిస్తుందో అంతుబట్టదు. అనుక్షణం భయంభయంగా గడిపే దారుణ పరిస్థితులు ఉంటాయి. ఇజ్రాయెల్(Israel)-హమాస్(Hamas) యుద్ధం మరోసారి అదే నిరూపించింది. యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేని సామాన్యులను బలి తీసుకుంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించిన మరణాలు ఇక్కడితో ఆగవు.. ఇంకా లక్షల మంది చనిపోయే ప్రమాదముంది.. అది ఎలా అంటారా? చెబుతాను చదవండి!

లాన్సెట్ జర్నల్‌లో సంచలన నిజాలు
లాన్సెట్(Lancet) జర్నల్ గురించి తెలుసు కదా? ఈ జర్నల్‌లో 2024 జులైలో ఓ కథనాన్ని ప్రచురించారు. లాన్సెట్ అధ్యయనం ప్రకారం గాజా యుద్ధ మరణాల సంఖ్య దాదాపు 2 లక్షల వరకు చేరుతుంది. అదేంటి..? కాల్పుల విరమణ సమయానికి గాజాలో చనిపోయింది 46,707 మంది అని లెక్కలు చెబుతున్నాయి కదా.. అటు ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల కారణంగా 1,139 మంది మరణించినట్టు ఆ దేశం ఎప్పుడో ప్రకటించుకుంది కదా.. మరి 2 లక్షల మంది అని చెబుతారేంటి? ఇది ఎలానో లాన్సెట్ వివరించింది. గాజా(Gaza)లో ఇజ్రాయెల్ బాంబులకు చనిపోయింది 46 వేల మందే కావొచ్చు.. అయితే రానున్న రోజుల్లో ఈ సంఖ్య 1,86,000కి చేరవచ్చు. అంటే ప్రత్యక్ష యుద్ధ మరణాల కంటే ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ. రానున్న రోజుల్లో గాజా మొత్తం జనాభాలో 8శాతం మంది మరణించే అవకాశం ఉంది. అయితే ఇవి యుద్ధం తాలుక పరోక్ష కారణాలు.

అవయవాలు కోల్పోయి.. దయనీయ స్థితిలో..
ఈ 15నెలల యుద్ధంలో గాజాలో 95శాతం నీటి వనరులు పనికిరాకుండా పోయాయి. యుద్ధ సమయంలో ఆహార సరఫరాలు నిలిచిపోయాయి. సరైన తాగునీరు లేక ప్రజలు విలవిలలాడిపోయారు. ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగనుంది. ఈ యుద్ధంలో గాయాల పాలైన వారిలో 22,500 పైగా మందికి కాళ్లు లేదా చేతులు లేవు. మరికొంత మంది ఇతర అవయవాలు కోల్పోయారు. అటు వేలాది మంది పిల్లలకు పడాల్సిన టీకాలు సరైన సమయంలో అందకపోవడంతో వారంతా వ్యాధుల బారిన పడుతున్నారు. పుట్టిన పిల్లలకు సరైన వైద్య సేవలు అందడంలేదు. వీరి మరణాల రేటు పెరుగుతోంది. గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించిన వేల టన్నుల బాంబుల పేలుడు పదార్థాలు గాజాలో భూభాగాన్ని దారుణ స్థితికి తెచ్చాయి. విషపూరిత గాలులు అనేక వ్యాధులకు దారితీస్తున్నాయి. శుభ్రత లేకపోవడంతో మలేరియా, డయేరియా లాంటి వ్యాధులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నాయి. పిల్లలు, గర్భిణీలు ప్రధానంగా ఈ వ్యాధులకు బలవుతున్నారు. ముందుముందు కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాజాలో 50శాతం మందికి పైగా వైద్య సేవలు అందడం లేదు.

అటు నిత్యం గాజా గడ్డపై పడిన బాంబుల కారణంగా విషపూరిత గాలులు ఎలాంటి వ్యాధులకు దారితీస్తాయో అంతుబట్టని దుస్థితి. ఇక యూనైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం 42 మిలియన్ టన్నుల ఇసుక, రాళ్లు గాజాలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వాటిని తొలగించడానికి పాలస్తీనా దగ్గర తగిన టెక్నాలజీ లేదు. ఈ లెక్కన చూస్తే గాజా యుద్ధం ముందునాటి స్థితికి రావడానికి 10ఏళ్లు పైనే పడుతుంది. ఇది United Nations Development Programme వేసిన అంచనా. అటు యుద్ధం మొదలైన తర్వాత గాజాలో 70శాతం జనాభా ఉపాధిని కోల్పోయిందంటే నమ్మగలరా? ఇటు వ్యాపారస్తుల దుకాణాలు నాశనమై వారి కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్న దయనీయ పరిస్థితి ఉంది. యుద్ధం మొదలైన తర్వాత 19 లక్షల మంది తమ ఇళ్లను విడిచిపెట్టారు. గాజా జనాభాలో 80శాతం మంది తాత్కాలిక టెంట్లలో నివసిస్తున్నారు. అంటే వారికి ఇల్లు లేదు. ఒక వేళ వారి ఇళ్లు మిగిలే ఉన్నా బాంబుల దాటికి అవి ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా లక్షా 86 వేల మరణాల లెక్క.
దార్విష్ ఎప్పుడో చెప్పిన సత్యం
ఇక 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడిలో 1,100 మంది ఇజ్రాయెలీలు మరణించగా, 240 మందిని హమాస్ బందీలుగా పట్టుకుంది. దీనికి ప్రతీకారమంటూ ఇజ్రాయెల్ గాజాపై బాంబు దాడులు ప్రారంభించింది. అది 15 నెలల పాటు కొనసాగింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ప్రతి 50 మందిలో ఒకరు మరణించారు. ప్రతి 20 మందిలో ఒకరు గాయపడ్డారు. మొత్తం గాయపడిన వారి సంఖ్య 1,10,265. యుద్ధంలో మరణించిన దాదాపు 47వేల మందిలో 18 వేల మందికి పైగా పిల్లలే ఉన్నారు. ఇక గాజా గడ్డలోని ప్రతి కిలోమీటరుకు 10 టన్నుల పేలుడు పదార్థాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం విన్న తర్వాత మీకేం అనిపిస్తోంది? నాకైతే ఒక కవిత్వం గుర్తొస్తుంది. పాలస్తీనా కవి Mahmoud Darwish రాసిన కవిత్వం మైండ్లోకి వచ్చింది. ‘The war will end. The leaders will shake hands. The old woman will keep waiting for her martyred son. That girl will wait for her beloved husband. And those children will wait for their hero father. I don’t know who sold our homeland. But I saw who paid the price..’ ఎన్నో దశాబ్దాల క్రితం Darwish రాసిన ఈ కవిత్వం ఏ యుద్ధానికైనా సరిపోతుంది. ఎందుకంటే యుద్ధం నడిరోడ్డుపై పడే ఓ కుటంబ ఛిద్రరూపం!
ఇది కూడా చదవండి: పుతిన్ స్వార్థానికి బలైపోతున్న భారతీయులు.. ఇదేం యుద్ధనీతి? మోదీ ఏం చేస్తున్నట్టు?

Balochistan: బలూచిస్థాన్ రక్తపాతం.. పాక్ ఆరోపణలను ఖండించిన భారత్.. అసల కథేంటి?
Social Media Vetting: స్వేచ్ఛకు సంకెళ్లు.. సోషల్‌మీడియా పోస్టులను చెక్ చేస్తున్న ట్రంప్.. నెక్ట్స్ ఏం జరగనుంది?
నెతన్యాహు UN ప్రసంగానికి దేశాల ప్రతినిధులు నిరసనగా వాకౌట్
అమెరికా ద్వంద్వ నీతి: ఇజ్రాయెల్‌కు వేల కోట్లు, భారత్‌పై ఆంక్షలు… లెక్కలేమి చెబుతున్నాయి?
America Vs Venezuela: అమెరికా నయా దందా.. డ్ర*గ్స్ ముసుగులో చీకటి యుద్ధం
Gaza Famine: గాజాపై కరువు కాటు.. పేగులను పెకిలించే కన్నీటి కథ