Menu

Women’s Day 2024: ఒక్క రోజు ఆరాటం.. ఆసాంతం అణచివేత.. ఆడవాళ్లు తెలుసుకోవాల్సిందదే!

Tri Ten B
international womens day

International Women’s Day 2024: విమెన్స్‌ డే వచ్చేసింది.. ఇక చూడు ప్రతీఒక్కడూ బాలయ్యబాబు డైలాగులే చెబుతాడు. ఆడదంటే అబల, తబల అని ఏవో పోస్టులు పెడుతుంటాడు. విమెన్స్‌ డే నాడు ఆడవాళ్ళని మునగ చెట్టు ఎక్కించే లక్షణం మగజాతికే ఉంది. అందుకే ఈ డబ్బా పోస్టులు..! స్వాతంత్ర్య దినోత్సవం నాడు దేశభక్తి ఉప్పొంగినట్టు మహిళ దినోత్సవం నాడు మహిళలపై ఫేక్‌ భక్తి రక్తి కట్టిస్తుంది. ఈ నకిలీ ఆరాధన హద్దు దాటి పోతుంది. ఇదంతా నాటకం.. ఎవడైనా ఆడదంటే బొమ్మ కాదు అమ్మ అని వాట్సాప్‌ స్టేటస్‌ పెడితే నమ్మకండి. వాడు ఎంత కట్నం గుంజి పెళ్లి చేసుకున్నాడో ముందు తెలుసుకోండి. సినిమాల్లో హీరోలు కూడా రైటర్లు రాసిచ్చిన డైలాగులే చెబుతారు.. అందుకే బయటకొచ్చి ఆడదాన్ని చూడగానే ఏదో చేయాలనిపిస్తుందని అసలు బుద్ధిని బయటపెట్టుకుంటారు..! ఈ ‘అతి’ విషెస్‌ చెప్పేవాళ్లలో ఇలాంటివాళ్లు ఉండొచ్చు.

వాళ్లకేమీ చేతకాదని అర్థం కాబోలు:
వీడేంటి మొత్తం మగజాతి మొత్తాన్ని జనరలైజ్‌ చేస్తున్నాడు.. అందరూ మగాళ్లు అలానే ఉండరు కదా అని చించేసుకోకండి. ఎందుకంటే ఆడవాళ్లని తక్కువ చేసేలా.. మగజాతి అహంకారం కొట్టొచ్చినట్టు కనిపించేలా మీరంతా ఎన్నో మాటలను వాడుకలోకి తెచ్చేశారు కదా.. అందుకే టీవీలో ఏ రాజకీయ నాయకుడు చూసినా ఇక్కడెవ్వడూ చేతికి గాజులు వేసుకుని లేడని వాగుతుంటాడు. గాజులు ఆడవారు వేసుకుంటారని..వాళ్లకేమీ చేతకాదని, పిరికివాళ్లని ఈ వ్యాఖ్య సారాంశం. విడ్డూరం ఏంటంటే.. ఈ మాట ఆడవారు కూడా అంటుంటారు.. అవగాహన రాహిత్యం కావొచ్చు!

మగాళ్లకు కొమ్ములేమీ లేవు కదా:
నువ్వు మగాడివైతే రారా చూసుకుందాం అని ఇంకొంతమంది అంటుంటారు. కలుసుకున్న తర్వాత ఏం చూసుకుంటారో తెలియదు కానీ మగాడైతే ధైర్యవంతుడు అని.. ఆడవాళ్లు ధైర్యం లేనివాళ్లని, బయటకు రాలేరాని ఈ సెంటెన్స్‌ అర్థం. ఇక అన్నిటికంటే ఎక్కువగా వాడే మాట ఒకటుంది. ఆడదానిలా ఏడుస్తావ్‌ ఏంటి అని అంటుంటారు. అంటే ఆడవాళ్లే ఏడవలా? మగవాళ్లకి ఫీలింగ్స్‌ ఉండవా? ఏడుపు ఒక ఎమోషనే కదా.. మరి ఏడ్చేవాళ్లంతా ఆడవాళ్లేనని ఎందుకు వాగడం? అది కూడా ఏడుపును తక్కువ చేసి..ఆ తక్కువతనంలో బతికేది ఆడవారేనన్నది పురుషహంకారుల మాట.

ఆడపిల్లలే నయం:
ఇక సినిమాల్లో, నిజజీవితంలో చాలామంది అనే మాట ఒకటుంది. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని.. ఇదేం దిక్కుమాలిన డైలాగో తెలియదు కానీ.. అబద్ధాలకు ఆడపిల్లలకు సంబంధం ఏంటి? మగాడు నిజం.. ఆడవాళ్లు అబద్దమని అర్థమా? అయినా ఆడపిల్లలు పుడితే ఏం అవుతుంది..? నిజానికి ఆడపిల్లలే నయం.. ఈ మాటకు కోపంతో ఊగిపోయినా ఇదే నిజం..! ఆడవారి అభ్యున్నతి గురించి సమానత్వం గురించి మాట్లాడే వారిలో కొందరు స్త్రీని సమానంగా చూస్తారని చెప్పలేం..! మార్నింగ్‌ విమెన్స్‌ డే విషెస్ చెప్పి సాయంత్రానికి అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడేవారు కూడా ఉంటారు. ఆడది వంటింట్లోనే బతకాలంట.. మగాడు బలాదూర్లు తిరగొచ్చాట. ఆడదానికి నీకేం తెలుసు అని ఇళ్లలో తరుచుగా మాటలు వినిపిస్తుంటాయి. ఈ మగవాళ్లంతా ఏదో ఐన్‌స్టిన్లు అన్నట్టు, అన్నీ వీరికే తెలిసినట్టు ఈ డైలాగులు ఎందుకో.

మతాలే ఈ వివక్షకు ప్రధాన కారణం:
అయినా మత ధర్మాలన్ని ఆడవాళ్లకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు కేవలం మగాళ్లని నిందించి లాభమేమీ లేదు. భర్త చనిపోతే తెల్ల చీర కట్టుకోవాలని.. నేలపై పడుకోవాలని, గాజులు, పట్టిలు ధరించకూడదని రూల్స్‌ పెట్టిన మతగ్రంధాలు సమాజంలో మహిళల అణచివేతకు ప్రధాన కారణం. ఏ మతం చూసినా ఇదే ఉంటుంది.. దురదృష్టమేంటంటే ఈ మతాలను ఎక్కువగా పాటించేది ఆదరించేది కూడా సాటి మహిళలే!

Also Read: వివాహాలు కావు.. వ్యాపారాలు..! ఇక్కడ అమ్మకానికి పెళ్లికొడుకులు!

 


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *