ప్రియ కు లెక్చరర్ అవ్వాలని కోరిక. అందుకే B.Z.C పూర్తి చేసి పీ.జీ చేద్దామని అనుకుంది. తన కుటుంబం లో డిగ్రీ పట్టా అందుకున్న మొదటి వ్యక్తి తనే. కానీ దళిత కుటుంబంలో పుట్టి అంతంత మాత్రంగానే ఉన్న ఆర్థిక,సామాజిక స్థితిగతులలో తన ఇంట్లో వాళ్ళు చదువుని ఆపేసి పెళ్లి చేసుకుని ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్ల ఎక్కువ చదివితే ఎక్కువ కట్నం ఇవ్వాల్సి ఉంటుంది అని, ఆడపిల్ల కి ఎక్కువ చదువు అవసరం లేదు పైగా చదివించే స్థోమత అసలే లేదు.
వైష్ణవి తల్లిదండ్రులు బాగా డబ్బు, పరపతి ఉన్నవాళ్ళు. తనకి ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. పెద్ద కాలేజీ లో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యింది. తనకి కట్టడాలు,దాని వెనక ఉన్న సివిల్ ఇంజనీరింగ్ అన్నా,వాటిని డిజైన్ చెయ్యడం అన్నా చాలా ఆసక్తి.. కానీ తన పేరెంట్స్ దానికి ఒప్పుకోలేదు. కారణం ఆ ఫీల్డ్ లో ఆడపిల్లలు ఇమడలేరు అని ఆందోళన పడ్డారు.
ఇవి కథలు కావు. నేటి సమాజంలో జరుగుతున్న నిత్యకృత్యాలు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టింది అని అనుకునే ఈ సమాజంలోనే, అదే ఆడపిల్ల పుట్టకుండా పురిట్లోనే చంపడం, పుట్టాక ఆడపిల్ల పుట్టిందని భారంగా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు.
ఇలాంటి ఆలోచనల నుండి బయటకు వచ్చి, ఆడపిల్లను ఎదగనిచ్చి సమాజంలో వారి హక్కలను జీవితాలను కాపాడాలనే ఉద్దేశంతో 2011 లో ఐక్యరాజ్యసమితి ఈ రోజును తీసుకొచ్చింది. ఈ 2025 సంవత్సరం “The girl I am, the change I lead: Girls on the frontlines of crisis.” అనే అంశంతో జరుగుతుంది. అంటే ఆడపిల్లగా మార్పుకు నాయకత్వం వహిస్తూ.. సంక్షోభంలో కూడా ముందు ఉండాలి అని. మరి దేశంలో ఆ పరిస్థితులు ఉన్నాయా?
పురిట్లోనే చితికిపోతున్న ఆడపిల్ల:
దేశంలో ఇప్పటికీ ఆడపిల్ల అని కొన్ని స్కానింగ్ సెంటర్లలో తెలుసుకుని అబార్షన్ చేసుకుంటున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకే ఒక్క హర్యానా రాష్ట్రంలో ఈ సంవత్సరం 300 అబార్షన్ సెంటర్ల లైసెన్స్ లను రద్దు చేశారు. ఈ రాష్ట్రం దేశంలోనే లింగ నిష్పత్తి లో చివరి స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో ఒకటి.
అందుకే 2015లో కేంద్ర ప్రభుత్వం “బేటీ బచావో, బేటీ పడావో” అనే పథకాన్ని హర్యానా లోనే ప్రారంభించింది. ఆ సమయంలో హర్యానా లింగ నిష్పత్తి 1000:876 మాత్రమే. అక్కడి నుండి ఎన్నో ప్రయత్నాలు జరిగాక 2019 లో 1000 అబ్బాయిలకు 923 అమ్మాయిలు ఉండగా, 2024 లో మళ్ళీ 1000:910 కి పడిపోయింది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక బీహార్ రాష్ట్రం 2020 నుండి తన జననం సమయంలో లింగ నిష్పత్తి (Sex Ratio at Birth) నిరంతరం పడిపోతున్న ఏకైక రాష్ట్రంగా ఉంది.
2020లో బీహార్‌లో జననం సమయంలో లింగ నిష్పత్తి 964 గా నమోదయింది, 2021లో ఇది 908 కు పడిపోయింది 2022లో అది తగ్గి 891 కి చేరింది. బీహార్ తరువాత 2022లో తక్కువ లింగ నిష్పత్తి ఉన్న ఇతర రాష్ట్రాలు:
మహారాష్ట్ర – 906.
తెలంగాణ – 907.
గుజరాత్ – 908.
ఇది దేశ సగటు 1000:913 కంటే కూడా తక్కువ.
_ తెలంగాణలో దేశ సగటు కంటే ఎక్కువగా 2019 లో 1000:953 నమోదు చేసుకుని 2021 కి 922 గా ఉంది.
2021 లో పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం, “బేటీ బచావో బేటీ పడవో” కార్యక్రమం కింద 2016-2019 మధ్య విడుదల చేసిన మొత్తం ₹446.72 కోట్లలో, ఏకంగా 78.91% కేవలం మీడియా అడ్వకసీ (ప్రచారం) కోసమే ఖర్చు చేయబడింది,” అని ఆ నివేదిక పేర్కొంది. దీన్ని బట్టి పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని, వృధా ఖర్చులను చూడోచ్చు.
అత్యధిక లింగ నిష్పత్తి (Sex Ratio at Birth ) ఉన్న రాష్ట్రాలు:
నాగాలాండ్ – 1068.
అరుణాచల్ ప్రదేశ్ – 1036.
లడాఖ్ – 1027.
మెగాలయా – 972.
కేరళ – 971.
* 2022లో ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తిలో 1000:938 తో ఉంది.
Source : Civil Registration System 2022.
బాల్య వివాహాల్లో మగ్గుతున్న జీవితాలు:
కేంద్రం 2024లో సుప్రీం కోర్ట్‌కు సమర్పించిన నివేదికలో, రాష్ట్రాల ద్వారా పంపిన గణాంకాలను సమీకరించిన డేటా ప్రకారం, గత మూడు సంవత్సరాల్లో తమిళనాడులో మొత్తం 8,966 బాల్య వివాహాలు జరిగాయి అని వెల్లడించింది. ఆ తర్వాత కర్ణాటకలో 8,348, పశ్చిమ బెంగాల్లో 8,324, తెలంగాణలో 4,440, ఆంధ్రప్రదేశ్‌లో 3,416, అసాంలో 3,316, మహారాష్ట్రలో 2,043, గుజరాత్లో 1,206, ఉత్తర ప్రదేశ్‌లో 1,197, హర్యానాలో 1,104 బాల్య వివాహాలు జరిగాయని నివేదిక పేర్కొంది.
అత్యల్పంగా బాల్య వివాహం రేటు కేరళలో (0.1%), ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానాలో 0.4% మరియు 0.6% గా నమోదయింది” అని 2023 సీ ఆర్ ఎస్ (SRS) గణాంక నివేదిక, 2025 సెప్టెంబర్‌లో ప్రకటించింది.
ఈ నివేదిక ప్రకారం, దేశంలో సగటున 2.1% మహిళలు 18 ఏళ్ల కంటే చిన్న వయసులో వివాహం చేసుకున్నారు.
అక్షరాస్యత లోనూ అంతరాలే :
చదువుల తల్లి సరస్వతి అయినా దేశంలో ఆడపిల్లల అక్షరాస్యత లో మాత్రం వెనుకబడే ఉంది. జాతీయ నమూనా సర్వే కార్యాలయం విడుదల చేసిన శ్రామిక శక్తి సర్వే (PLFS) 2023-24 నివేదిక ప్రకారం ఏడేళ్ల పైబడిన వారిలో దేశ అక్షరాస్యత 79.7%. దాంట్లో మగవారు 87.2% గా ఉండగా ఆడవాళ్ళు 74.6% ఉన్నారు. అంటే 12.6% తేడా.
అక్షరాస్యతలో అత్యధిక లింగ వ్యత్యాసం (20.1%) రాజస్థాన్‌లో ఉంది. అక్కడ పురుషుల అక్షరాస్యత 85.9% కాగా, స్త్రీల అక్షరాస్యత 65.8%గా నమోదైంది. బీహార్‌లో ఈ వ్యత్యాసం 16.2% (పురుషులు: 82.3%, స్త్రీలు: 66.1%), మధ్యప్రదేశ్‌లో 16.1% (పురుషులు: 83.1%, స్త్రీలు: 67.0%) ఉంది.
మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో మిజోరం పురుషుల – స్త్రీల అక్షరాస్యత రేట్లు వరుసగా 99.2% – 97%గా ఉన్నాయి. కేరళలో, పురుషులకు 96.7% మరియు స్త్రీలకు 94% చొప్పున అక్షరాస్యత ఉన్నాయి.
నా అనుకున్న వాళ్ళే కామాంధులు:
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా పిల్లలపై జరిగిన నేరాల సంఖ్య 1,77,335గా నమోదైంది. వీటిలో 67,694 కేసులు (మొత్తం 38.17%) పాక్సో చట్టం (POCSO) కింద నమోదయ్యాయి.
పాక్సో చట్టంలోని సెక్షన్లు 4 మరియు 6 (లైంగిక దాడి) కింద నమోదైన కేసుల్లో 96.6% కేసుల్లో నిందితుడు బాధితుడికి పరిచయమైన వ్యక్తే అని రికార్డులు చెబుతున్నాయి.
మొత్తం కేసులలో 39,076 కేసుల్లో తెలిసిన కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, ఇరుగు పొరుగువారు, ఆన్లైన్ పరిచయస్తులు మెజారిటీ నిందితులుగా ఉన్నారు. కేవలం 1,358 కేసుల్లో మాత్రమే తెలియని లేదా గుర్తు పట్టలేని వ్యక్తులు నిందితులుగా ఉన్నారు.
పిల్లలపై లైంగిక నేరాల విభాగాల్లో, లైంగిక వేధింపుల కేసులు అత్యధికంగా పెరిగాయి — 2022లో 63,414గా ఉండగా, 2023లో 67,694కి పెరిగాయి.
డేటా ప్రకారం, పిల్లలపై లైంగిక నేరాల కేసుల్లో బాధితులలో 98% కంటే ఎక్కువ మంది అమ్మాయిలే.
ఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బాలికల పరిస్థితి ఎలా ఉంది అంటే
. 15–19 ఏళ్ల బాలికలు, బాలుర కంటే రెండు రెట్లు ఎక్కువగా విద్య, ఉపాధి లేదా శిక్షణలో లేకుండా ఉంటున్నారు.
. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న బాలికలు, స్థిరమైన పరిస్థితుల్లో ఉన్న బాలికల కంటే 90% ఎక్కువగా పాఠశాలకు దూరమవుతున్నారు.
. 15–19 ఏళ్ల బాలికలలో ప్రతి 4 మందిలో ఒకరు, ఎప్పుడైనా రిలేషన్ షిప్ లో ఉన్నవారు, తమ భాగస్వామి ద్వారా హింసకు గురైనట్లు తెలిపారు.
. 20–24 ఏళ్ల యువతుల్లో ప్రతి 5 మందిలో ఒకరు, చిన్న వయస్సులోనే వివాహం చేసుకున్నవారు.
సంక్షోభ ప్రాంతాల్లో బాల్యవివాహాల రేటు ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపుగా ఉంది.
. ఆర్థిక – ప్రకృతి సంక్షోభాలు, ఘర్షణలు, వలసలు — ఇవన్నీ బాల్యవివాహం, లైంగిక హింస, ప్రసవ సమయంలో మరణాల ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
పితృస్వామ్యపు వ్యవస్థలో ఒక ఆడపిల్లకు నిరంతరం సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. తన కలలు, ఆశయాలను సమాజం నిర్ణయిస్తుంది. ఎటువంటి కష్టం వచ్చినా మొదట జీవితం ఆగిపోయేది అమ్మాయిదే. కులం, ఆర్థిక కారణాలతో కూడా అబ్బాయి కంటే అమ్మాయిలే చదువులో జీవిత అవకాశాల్లో నష్టపోతున్నారు.
ఆడపిల్ల జీవితాన్ని ఇలాంటి కారణాలు నిరంతరం అడ్డంకులు సృష్టిస్తూనే ఉన్నాయి. ఇవి మారానంతవరకు ఆడపిల్ల అంటే ఇంటి లక్ష్మి అని ఆకాశంలో సగం అని ఎంత ప్రచారం చేసుకున్న వ్యర్ధమే!.








Lakshmapur Elections: లగిశెట్టి మాధవి.. సామాన్యుల కోసం పనిచేసే జర్నలిస్ట్..! లక్ష్మాపూర్ ప్రజలకు మాధవి హామీ ఇదే!
Telangana Holiday Calendar: 2026లో 27 సెలవులు మాత్రమే.. తీవ్ర నిరాశలో ప్రజలు..!
Piracy vs OTT: ఓటీటీ లు సినిమాను సమాధి చేస్తున్నాయా? పైసా పై అత్యాశే పైరసీ ని పెంచుతుందా ?
Telangana Assembly-లో Kaleshwaram రచ్చ: KCR-ను Target చేసిన Ghose Commission, CBI-కి Case!
తెలంగాణ విద్యాసంస్థల్లో Facial Recognition హాజరు: లాభమా? నష్టమా?
HCU Land Issue: సుప్రీం చేతిలో రేవంత్‌కు చివాట్లు! అసలు లొల్లి పర్యావరణం కోసమా? ఈ వివాదం వెనక పూర్తి చరిత్ర ఏంటి?