ఆమె కళ్ళలో భయం కనిపించింది. కత్తి దూస్తున్న సొంత కుటుంబసభ్యులను చూసి ఆమె నివ్వెరపోయింది. కులం పేరుతో మరణానికి బలి కానున్న తన భర్తను కాపాడలేని నిస్సాహయ స్థితిలో ఆమె గుండె ముక్కలైపోయింది. ఇది ఏదో సినిమా కథ కాదు.. పల్లెటూరిలో జరిగే పాత కథలూ కాదు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు జరిగే వాస్తవ ఘటనలు. తమ ఇంట్లో బిడ్డ ప్రేమించిన వ్యక్తి వేరే కులానికి చెందినవాడైతే చాలు జీవితాన్ని పాతాళంలోకి నెట్టేస్తారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో వడ్లకొండ కృష్ణని అలానే చేశారు. బీసీ కులానికి చెందిన భార్గవిని దళితుడైన కృష్ణ పెళ్లి చేసుకోవడం ఆ కుటుంబానికి నచ్చలేదు. తమ పరువు పోయిందని భావించిన భార్గవి కుటుంబం కృష్ణను కిరాతకంగా హత్య చేసింది. భార్గవి నాన్నమ్మ కళ్లలో ఆనందం కోసం ఇలా చేశామని ఎంతో ఆనందంగా ఆ కుటుంబం ప్రకటించుకోవడం వారి కర్కశతకు ఉదాహరణ. ఇక ఇలాంటివి జరగడం కొత్తేమీ కాదు.. తెలంగాణలోనూ, ఏపీలోనూ.. ఇండియాలోని ప్రతీ గల్లీలోనూ ఈ తరహా ఘటనలు అనేకం జరిగాయి. అందుకే కులాంతర వివాహం చేసుకున్నవారి భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంది. CPM తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ కూడా ఇదే సూచించారు. ఇంతకీ ఈ చట్టం అవసరం ఎందుకు? దేశంలో కులం పేరిట ప్రేమికులను, పెళ్లిచేసుకున్న జంటలను చంపే ఘటనలు పెరుగుతున్నాయా? అధికారిక లెక్కలు ఏం చెబుతున్నాయి?
ఎన్నో హత్యలు.. ఒక్కటే కారణం:
ఇండియాలో కులాంతర పెళ్లిళ్లు జరగడమే చాలా అరుదు. 2011 జనగణన ప్రకారం భారత్‌లో కేవలం 5.8శాతం వివాహాలు మాత్రమే కులాంతరంగా ఉన్నాయి. మిజోరామ్‌లో 55శాతం కులాంతర వివాహాలు జరుగుతుండగా.. మధ్యప్రదేశ్‌లో ఈ సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కులాంతర వివాహాల శాతం 5.2శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో ఇది కేవలం 4.9శాతంగా ఉంది. భారత్‌లో కులాంతర వివాహాలపై నిర్బంధం ఒక అతి పెద్ద సమస్య. ఇది ప్రేమికులను విడదీస్తోంది. ఒకవేళ ఇంట్లో వారిని ఎదురించి పెళ్లి చేసుకున్నా వారికి రక్షణ మాత్రం ఉండడంలేదు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. దళితుడైన ప్రణయ్ అగ్రకులానికి చెందిన అమృతను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె తండ్రి మారుతిరావు కిరాయి గూండాలతో సొంత అల్లుడినే చంపేశాడు. 2024 డిసెంబర్‌లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ నాగమణి తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆమె సోదరుడు పరమేశ్ ఆగ్రహంతో, కారుతో ఆమెను ఢీకొట్టి, కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా హత్యలు చాలా జరిగాయి. 2016లో తమిళనాడులో శంకర్ అనే దళిత యువకుడు, కులాంతర వివాహం చేసుకున్నందుకు తన భార్య కౌసల్య కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురయ్యాడు. 2018లో కర్ణాటకలో కీర్తి అనే యువతి, తన కుటుంబం అనుమతి లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దీంతో ఆమె తండ్రి, సోదరులు కలిసి ఆమెను హత్య చేశారు. 2014లో ఉత్తరప్రదేశ్‌లో అమృత అనే యువతి, కులాంతర ప్రేమలో ఉండగా, ఆమె కుటుంబ సభ్యులు ఆ లవ్‌ను వ్యతిరేకించారు. దీంతో ఆమెను హత్య చేసి, ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించారు. 2007లో హర్యానాలో మనోజ్, బబ్లీ అనే జంట కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే వారి కుటుంబాలు, గ్రామ పంచాయతీ ఈ వివాహాన్ని వ్యతిరేకించి ఇద్దరిని చంపడం పెను సంచలనం రేపింది. రాష్ట్రాల వారీగా చూస్తే పంజాబ్, హర్యానా లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కులం పేరిట ప్రేమికులను, పెళ్లైన జంటలను హత్య చేయడం ఎక్కువగా జరుగుతోంది. 2015లో అత్యధికంగా 251 మంది కేవలం ఇతర కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవడం కారణంగానే హత్యకు గురయ్యారు. ఇటు తెలంగాణలో ఈ తరహా హత్యలు 45 వరకు రికార్డ్ అయ్యాయని చెబుతున్నారు జాన్ వెస్లీ.
చట్టంలో లోపాలు:
ఇండియాలో కులాంతర వివాహాలు చేసే జంటలు సామాజిక, కుటుంబ, న్యాయ పరంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టం కచ్చితంగా అవసరం. నిజానికి 1954లో ప్రవేశపెట్టిన ప్రత్యేక వివాహ చట్టం(Special Marriage Act) ద్వారా భారత్‌లో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఈ చట్టం కులం, మతం, జాతి లాంటి అంశాలను పరిగణించకుండా, ఇద్దరు మేజర్లు స్వచ్ఛందంగా వివాహం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, ఈ చట్టం ప్రక్రియలో 30 రోజుల నోటీస్ పీరియడ్ లాంటి నిబంధనలపై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ నోటిస్ టైమ్‌లో జంటలో కనీసం ఒకరు జిల్లా వివాహ అధికారికి పెళ్లి నోటీసు సమర్పించాలి. అప్పుడు ఆ అధికారి ఈ నోటీసును తన కార్యాలయంలో స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ఉంచుతారు. ఈ నోటీసు డిస్‌ప్లే చేసిన తేదీ నుంచి 30 రోజుల లోపు, ఎవరైనా ఈ వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు. ఒకవేళ వివాహ అధికారి వాటిని పరిశీలించి, వివాహం జరగకూడదని నిర్ణయిస్తే జంటకు ఈ నిర్ణయాన్ని చెబుతారు. ఇక ఈ నోటీస్ సమయంలో పెళ్లి చేసుకోవాలని భావించిన జంటలకు కుటుంబ సభ్యులు లేదా సమాజం నుంచి ఒత్తిడి, బెదిరింపులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే ఈ చట్టంలోని పలు అంశాలను మార్చాలన్న డిమాండ్ కూడా ఉంది. అదే సమయంలో కులాంతర వివాహాలు చేసుకునే జంటలను రక్షించడానికి ప్రత్యేక చట్టం ద్వారా భౌతిక, న్యాయ రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇది చాలా మంది సోషల్ యాక్టివిస్టులు చెబుతున్న మాట.
ఇది కూడా చదవండి: హిందువులకు ద్రోహం చేస్తున్న సనాతన పార్టీ.. మహాకుంభమేళ మృతుల సంఖ్యపై న్యూస్‌లాండ్రీ షాకింగ్ రిపోర్టు!