Menu

Marriages in India: నరకంగా మారిన శుభకార్యాలు.. గుదిబండగా మారిన ఆడంబరాలు!

Tri Ten B

ఆమె పేరు లావణ్య.. వయసు 27ఏళ్లు.. తెలంగాణలోని ఓ పల్లెటూర్లో పుట్టింది. అక్కడే పెరిగింది.. అక్కడే ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంది. ఇంటర్‌, డిగ్రీ కూడా ప్రభుత్వ కాలేజీల్లోనే పూర్తి చేసింది. ఎవరి సాయం లేకుండా హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్‌ తెచ్చుకుంది. 21ఏళ్లకు జాబ్‌లో జాయిన్‌ అయిన లావణ్యకు ట్రైనింగ్‌లో నెలకు 10వేల రూపాయలు వచ్చేవి.. ఇప్పుడమే జీతం నెలకు రూ.60వేలు. చిన్నతనం నుంచి ఆమె చదువు కోసం తల్లిదండ్రులు పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. వారిది దిగువ మద్యతరగతి కుటుంబం. ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకున్న ఆమె ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేదు. తల్లిదండ్రులు కూడా లావణ్యకు జాబ్‌ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. తనకు నచ్చినట్టే ఉండనిచ్చారు.. అయితే ఒక్క విషయంలో మాత్రం చాలామందిలాగే మూర్ఖంగా ప్రవర్తించారు.

లావణ్యకి పెళ్ళి చేయాలని ఊర్లో ఇరుగుపొరుగు వారి నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో ఓ సంబంధాన్ని ఖాయం చేశారు. లావణ్యను జాబ్‌ మానేసి ఇంటికి వచ్చేయమన్నారు. ఉన్నది ఒక్క కూతురే కావడంతో చుట్టూఉన్నవాళ్లు, చుట్టాలు పెళ్ళిని ఘనంగా చేయాలని తల్లిదండ్రులకు పదేపదే చెబుతుండేవారు. అటు లావణ్య పుట్టినప్పుటి నుంచి కూడబెట్టిన డబ్బులన్ని కట్నం కింద కావాలని పెళ్ళి కొడుకు వాళ్లు అడిగేశారు. అది మొత్తం 10 లక్షల పైమాటే.. అది కాకుండా బంగారం కావాలంట.. ఇంకా పెళ్ళి ఘనంగా చేయాలంట, పక్క ఊరు, ఆ పక్కన ఊరు మొత్తం మండలంలోని అన్ని ఊర్ల వాళ్లని పిలవాలంట. అయితే లావణ్య తల్లిదండ్రులకు అంత డబ్బు లేకపోవడంతో అప్పు చేసి మరీ పెళ్ళి చేశారు. తన తల్లిదండ్రులు ఎందుకిలా చేశారో లావణ్యకు అర్థంకాలేదు.. పెళ్ళి జరిగిపోయింది. ఎవరెవరో వచ్చారో.. అందరూ ఏవేవో తినేసిపోయారు.. తర్వాత లావణ్య అత్తవారి ఇంటికి వెళ్లిపోయింది.. జాబ్‌లేని లావణ్య తనకు చాక్లెట్‌ కావాలన్నా భర్తను అడగాల్సి వచ్చేది. అతను కసురుకుంటు, విసురుకుంటూ ఏదో తన ఆస్తి మొత్తం దానం చేస్తున్నట్టు ముష్టి పారేసేవాడు..

అటు వయసు పెరిగే కొద్దీ లావణ్య తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించింది.. మరోవైపు పెళ్ళి సమయంలో చేసిన అప్పులు ఇంకా తీరలేదు.. అప్పుళ్లోల బాధలు ఎక్కువయ్యాయి.. భర్తను సాయం అడిగితే చేయను పొమన్నాడు.. అది చాలదన్నట్టు అదనంగా కట్నం తీసుకురావాలని వేధించాడు.. లావణ్యకు కోపం రాలేదు.. బాధ కలిగింది. తప్పంతా భర్తది కాదని ఇలా అప్పులు చేసి పెళ్ళిళ్లు చేసే తల్లిదండ్రులదని అనిపించింది.. మౌనంగా ఉండిపోయింది…..!

ఇది కేవలం లావణ్య కథ మాత్రమే కాదు.. ఇండియాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది అమ్మాయిల కథ. పెళ్ళి వ్యవస్థ ఎంత అన్యాయంగా ఉన్నా అది భారతీయులకు ఎప్పుడూ పవిత్రంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ పెళ్ళిళ్లు డబ్బుతో ముడిపడి ఉంటాయి. డబ్బు చుట్టూనే తిరుగుతుంటాయి. నిజానికి డబ్బులు అవసరం లేకుండా ఎవరుంటారు..? తెరగా కట్నం రూపంలో డబ్బులు ఇస్తామంటే కాదనేది ఎవరు? ఎవడో వేలల్లో ఒకడు డబ్బులు తీసుకోడు.. వాడికి కూడా ‘ఏదో సమస్య’ ఉందని సమాజం కథలు అల్లుతుంది. ‘ఆ సమస్య’ కారణంగానే డబ్బులతో పని లేకుండా అతను పెళ్ళి చేసుకుంటున్నాడని గుసగుసలాడుకుంటుంది. అందుకే కట్నం కావాలి.. పెళ్ళికి భారీగా ఖర్చు చేయాలి.. కడుపులో పట్టనన్ని ఆహార పదార్థాలు వండించాలి.. తిన్నది తర్వాత రోజు ‘కింద’ నుంచి పోతుందని బయటకు పోతుందని అందరికీ తెలుసు. అయినా బెసిక్‌ బయాలజీ మార్చిపోయి మరీ పెళ్ళిల్లో వందల రకాల ఫుడ్‌ ఐటెమ్స్‌ పెట్టించాలని పాకులాడే తల్లిదండ్రులు మన కళ్ల ముందే కనిపిస్తారు. అంబానీలు, గాలి జనార్థాన్‌ రెడ్డిలు ఎంత ఖర్చు పెట్టుకున్నా వారికి పోయేదేమీ లేదు.. అయితే పెళ్ళిని ఘనంగా చేయాలన్నే ఒక ఆలోచనతో డబ్బులు లేకున్నా అప్పు చేసి, నలుగురు దగ్గర చెయ్యి చాచి పెళ్ళి చేయడం ఎంత వరకు కరెక్టో పేద, దిగువ-మద్యతరగతి ప్రజలు ఆలోచించాలి.

విద్య అందరికీ అవసరం.. ముఖ్యంగా పాఠశాల విద్య అన్నిటికంటే ముఖ్యం. నేటి సమాజంలో విద్యకు తల్లిదండ్రులు పెట్టే ఖర్చు కంటే పెళ్ళిళ్లకు పెట్టే ఖర్చే రెండింతల ఎక్కువట. ఇవి నివేదికలు చెబుతున్న పచ్చి నిజాలు. భారత్‌లో సగటున వివాహానికి రూ.12లక్షలు ఖర్చు అవుతోంది. ఇది కేజీ నుంచి పీజీ వరకు పిల్లల కోసం తల్లిదండ్రులు ఖర్చు పెట్టేదాని కంటే డబుల్. అంటే యావరేజ్‌గా సగటున ఇండియాలో విద్యకు అయ్యే ఖర్చు రూ.6 లక్షలు.

ఇండియాలోనే కాదు… ఏ సమాజంలోనైనా పెళ్ళికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పెళ్ళి ఎలా చేసుకోవాలన్నది వ్యక్తిగత విషయం. కోట్లు ఖర్చు పెట్టి చేసుకోవచ్చు.. లక్షలు పెట్టి చేసుకోవచ్చు.. వేలల్లో చేసుకోవచ్చు.. వందల రూపాయల్లోనే ఖర్చయ్యే రిజిస్టర్‌ మ్యారేజీ కూడా చేసుకోవచ్చు. ఇది చేసుకునే వారి వ్యక్తిగత అంశం. అయితే విద్య కంటే పెళ్ళిళ్లకే ఎక్కువ ఖర్చు పెట్టడం దేనికి సంకేతం? ఇది వెనుకబాటుతనమే కదా? ఎందుకుంటే భారత్‌లోని చాలా కులాల్లో పెళ్ళిళ్ల ఖర్చంతా అమ్మాయి కుటుంబమే భరిస్తుంది. ప్రాక్టికల్‌గా చూస్తే ఇలా విద్య కంటే పెళ్ళిళ్లకే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్లంతా అమ్మాయి తరుఫు వారేనని అర్థం అవుతుంది. ఇదంతా సమాజంలో తిష్ట వేసుకున్న పితృస్వామ్యతత్వానికి నిదర్శనం. అమ్మాయి చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టడం దండగనే భావన చాలామందిలో కనిపిస్తుంటుంది. ఎందుకంటే అమ్మాయిలు వంటింటికి, అత్తవారింటికి మాత్రమే పరిమితం. ఈ విషయంలో వారికి సమాజం పేటెంట్‌ రైట్లు ఇచ్చిపడేసింది. ఇలా వంటింట్లో జీవితం గడిపే వారి చదువుకు ఖర్చు పెట్టడం ఎందుకన్నది చాలా మంది ఆలోచన. అందుకే అమ్మాయి పుట్టిన తర్వాత ఆమెపై ఖర్చు చేసే ప్రతీ రూపాయను లెక్కించే తల్లిదండ్రులు పెళ్ళి విషయంలో మాత్రం విచక్షణ మరిచి ముక్కు ముఖం తెలియని వాడి కోసం, మంది కోసం, ఆర్భాటం కోసం, పరువు కోసం, ప్రెస్టేజీ కోసం డబ్బులు కుమ్మరిస్తారు. అప్పటివరకు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒక్కరోజులోనే ఎవరిఎవరి జేబుల్లోకో వెళ్తుంది. ఇదంతా మూర్ఖత్వమో, అమాయకత్వమో వారి విజ్ఞతకే వదిలేయాలి..

ఎంతైనా పెళ్ళిళ్లు పవిత్ర కార్యాలు.. వాటి ఖర్చు గురించి ఎక్కువగా మాట్లాడకూడదు కదా.. చదువుది ఏముంది.. మహా అయితే కడుపు నింపుతుంది, స్వతంత్రంగా బతికేలా చేస్తుంది, స్వేచ్ఛగా ఉండనిస్తుంది.. ఇవన్ని పెద్ద విషయాలు కావులే.! ఎందుకంటే మాతృత్వమే పరమార్థం.. భర్తే జీవితం.. ఈ రెండే కదా అన్ని మతాలు చెప్పే విషయాలు!

Also Read: ప్రగతికి మార్గం చదువే! కేరళ ప్రభుత్వం చెబుతున్న లింగ సమానత్వ పాఠాలు!!


Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *