WTC ఫైనల్‌కు వెళ్లడం పక్కా అనే స్థాయి నుంచి ఇప్పుడు ఫైనల్‌కు వెళ్లడం కోసం శ్రీలంకపై ఆధారపడాల్సిన పరిస్థితికి వచ్చింది టీమిండియా. 6 నెలల్లో మొత్తం మారిపోయింది. ఇటివలీకాలంలో ఎన్నడూ లేని ఓటమును మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌కు గురైన భారత్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపైనా బోల్తా పడింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3తో చేజార్చుకుంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో గెలుపుతో సిరీస్‌ను ఘనంగా ఆరంభించిన టీమిండియా తర్వాత ఏ మ్యాచ్‌లోనూ ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఏ గేమ్‌లో అయినా గెలుపోటములు సహజమేనైనా భారత్ క్రికెట్ జట్టు ఓడిపోయిన తీరు మాత్రం అత్యంత దారుణంగా ఉండడం అభిమానులను తీవ్రంగా బాధపెడుతోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్(Border Gavaskar Series)లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.
1) కెప్టెన్ రోహిత్
టీమిండియా గెలిచిన ఏకైక పెర్త్ టెస్టులో జట్టుకు నాయకత్వం వహించాడు బూమ్రా(Jasprit Bumrah). ఆ తర్వాత రెండో టెస్టు నుంచి రోహిత్(Rohit Sharma) జట్టులో కలిశాడు. రెండు, మూడు, నాలుగు టెస్టులను టీమిండియా రోహిత్ సారధ్యంలోనే ఆడింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు టెస్టులను భారత్ ఓడిపోయింది. మూడో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఈ మూడు టెస్టుల్లో రోహిత్ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్ అత్యంత అద్వాన్నంగా ఉంది. ఫీల్డ్ సెట్ చేయడంలో రోహిత్ ఎన్నో విమర్శలను మూటగట్టుకున్నాడు. అగ్రెసీవ్‌గా ఫీల్డ్ సెట్ చేయాలన్సిన చోట డిఫెన్సివ్‌గా ఫీల్డ్ సెట్ చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లకు అవకాశమిచ్చాడు. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా చివరి వికెట్ తియ్యడానికి టీమిండియా అష్టకష్టాలూ పడింది. ఆ సమయంలో దూకుడుగా వ్యవహరించాల్సిన రోహిత్ డిఫెన్సివ్ మైండ్‌సెట్‌తో కొంపముంచాడు. అంతేకాదు బౌలర్లను సరిగ్గా వినియోగించుకోవడంలోనూ విఫలమయ్యాడు. బూమ్రాపైనే మొత్తం భారం వేసి అతడిపై తీవ్ర ఒత్తిడి పెంచాడు. అటు బ్యాటింగ్ పరంగా రోహిత్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది.. గత 15 ఇన్నింగ్స్‌లో 10 సగటుతో బ్యాటింగ్ చేసిన రోహిత్ టెస్టు కెరీర్ చివరి దశకు చేరుకునేట్టే.
2) కోచ్ గంభీర్
మరోవైపు ఎన్నో అంచనాలతో టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్(Gautham Gambhir).. భారత్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్(Gregg Chapel)ను గుర్తుకు తెస్తున్నాడు. అసలు గంభీర్ ఏం చేస్తున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. గంభీర్ రాకముందు గత దశాబ్దాంలో టీమిండియా టెస్టుల్లో ఇంత దారుణంగా ఆడిన సందర్భాలు లేవు. జట్టు కూర్పు నుంచి ఆటగాళ్ల సెలక్షన్ వరకు అంతా గందరగోళంగా ఉంది. అసలు సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కి బదులుగా జురెల్, దేవ్‌దత్ పడికల్‌ను టెస్టుల్లో ఓ మ్యాచ్ ఎందుకు ఆడించారో అర్థంకాదు. డొమెస్టిక్ క్రికెట్‌లో పరుగులు వరద పారిస్తున్న అభిమాన్యు ఈశ్వరన్(Abhimanyu Eswaran) ఊసే కోచ్‌కు అక్కర్లలేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఓటములకు కోచ్ అసలు బాధ్యత వహించలేదు. నిజానికి గంభీర్ వచ్చిన తర్వాత టీమిండియా 27 ఏళ్లలో తొలిసారి శ్రీలంకపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను కోల్పోయింది మొదటి సారి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 30 వికెట్లు కోల్పోయింది. 36 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌పై భారత్ హోమ్ టెస్టును కోల్పోయింది. 12 సంవత్సరాల తర్వాత, హోమ్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. 19 ఏళ్ల తర్వాత చిన్నస్వామి వేదికగా భారత్ ఓడిపోయింది. 12 ఏళ్ల తర్వాత వాంఖడేలో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయింది. 10 సంవత్సరాల తర్వాత హోమ్ టెస్ట్ సిరీస్‌లను బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయింది. ఇంత దారుణమైన, చెత్త రికార్డులను గంభీర్ మూటగట్టుకున్నాడు. అయినా ఇంకా మౌన వ్రతమే పాటిస్తున్నాడు. అటు బీసీసీఐ సైతం గంభీర్‌కు అండగా నిలబడుతూనే ఉంది.
3) కోహ్లీ-ఇతర బ్యాటర్లు
క్రికెట్ కెరీర్‌ని ఎంచుకున్న పిలల్లకు, యువకులకు ఆఫ్ స్టంప్ బయట పడిన బాల్‌న ఎలా టచ్ చేస్తే అవుట్ అవుతారో వివరంగా చెప్పాలంటే కోహ్లీ(Virat Kohli) బ్యాటింగ్‌ను చూపిస్తే సరిపోతుంది. ఇంత కమిట్‌లెస్ ప్లేయర్ టీమిండియాలో ఇంకెవరూ లేరేమో అనిపించేలా కోహ్లీ చేసిన తప్పునే పదేపదే చేస్తూ వచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ అవుటైన చివరి 30 సార్లలో ఏకంగా 29సార్లు క్యాచ్ అవుట్‌గానే వెనుదిరిగాడు. అందులో ఎక్కువగా ఆఫ్ స్టంప్ బయటపడ్డ బంతులే ఉన్నాయి. కేవలం చేసిన తప్పే పదేపదే చేయడం విషయంలోనే కాదు జట్టులో కోహ్లీ టెస్టు స్థానం కూడా ఓ మిస్టరీనే! ఐదేళ్లలో 30టెస్టు సగటుతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ ఇంకా జట్టులో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఐదేళ్లలో కోహ్లీ టెస్టు సగటు 55 నుంచి 46కు దిగజారిందంటే అర్థం చేసుకోవచ్చు. 2024 టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లలో కోహ్లీ టెస్టు యావరేజ్ 7గా ఉంది. ఇది 10వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చే బుమ్రా కంటే తక్కువ. కోహ్లీ కంటే మరే ఇతర బ్యాటర్ ఇంత తక్కువ సగటు కలిగి లేడు. ఆస్ట్రేలియాపై సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఆ తర్వాత ఏ మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేదు. మరోవైపు జైస్వాల్(Jaiswal), నితీశ్‌రెడ్డి(Nitish Reddy) మినహా ఇతర బ్యాటర్లది అదే తీరు. సిరీస్‌కు ఒకటి, రెండు ఇన్నింగ్స్‌ల్లో రాణించి మిగిలిన మ్యాచ్‌ల్లో అట్టర్‌ఫ్లాప్ అవ్వడం కేఎల్ రాహుల్(KL Rahul) ట్రెడిషనల్ గేమ్ ప్లే! మరోసారి అదే చేశాడు. అటు శుభ్‌మన్ గిల్(Shubman Gill) విదేశీ గడ్డలపై అసలు పనికి వస్తాడా రాడా అన్నది కెప్టెన్, కోచ్, సెలక్టర్ల విజ్ఞతకే వదిలేయాలేమో.
4) బౌలింగ్:
జట్టులో బుమ్రా ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరూ లేరా? ఒక పేసర్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 50కు పైగా ఓవర్లు వెయ్యడమేంటి? బౌలరా.. బౌలింగ్ మెషీనా? బుమ్రాను ఇంతలా రుద్దుతారా? ఇది సగటు టీమిండియా అభిమాని ప్రశ్న. ఈ సిరీస్ మొత్తానికి బుమ్రానే అసెట్. 13 యావరేజ్‌తో 2.76 ఎకానమితో 32 వికెట్లు పడగొట్టిన బుమ్రాకు కనీసం అవతల ఎండ్‌లో సహకరం అందించేవారే కరువయ్యారు. సిరాజ్ తీసిన వికెట్ల కంటే అతను ప్రదర్శించిన అత్యుత్సాహమే ఎక్కువ. అటు ఆకాశ్‌దీప్ సైతం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అటు జడేజా కూడా అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ భారాన్నంతా బుమ్రా ఒక్కడే మోశాడు.
5) బీసీసీఐ:
ఇండియాలో టెస్టు మ్యాచ్ జరిగితే బాల్ బొంగరాలు తిరిగినట్టు గింగరాలు తిరుగుతుంది. కానీ అవే పిచ్‌లు విదేశీ గడ్డలపై ఉండవు కదా..! భారత్ పిచ్‌లు ఎందుకు స్పోరిటివ్‌గా ఉండవో బీసీసీఐకే తెలియాలి. భారత్‌లో పేసర్ కావాలని క్రికెటర్ అవ్వాలనుకున్న ఏ ఒక్క పిల్లాడూ అనుకోడు. ఇదంతా బీసీసీఐ పుణ్యమే. అటు క్రికెట్‌కు అల్టిమేట్ ఫార్మెట్ అయిన టెస్టుల్లో అసలు టీమిండియా బ్యాటర్లకు 300 బంతులు ఆడే ఓపిక, తీరిక, సత్తా ఎందుకు ఉండడంలేదో.. దీనికి బీసీసీఐ ఎలాంటి సమాధానం చెబుతుందో, అసలు దీన్ని ఒక సమస్యలాగా భావిస్తుందో లేదో తెలియదు. అటు ప్లేయర్లకు తీవ్రమైన వర్క్ లోడ్ ఉంటుంది. అయినా బీసీసీఐకి ఇవేవీ పట్టవు! ధనిక బోర్డులకు ధనంపై ఉండే శ్రద్ధ ఆటగాళ్ల బాగోగులు గురించి ఉండవుకావొచ్చు.
ఇది కూడా చదవండి: ఓవైపు అగ్రరాజ్యాల దురహంకారం.. మరోవైపు మత ఛాందసం.. ఈ రెండిటి మధ్య అఫ్ఘాన్ క్రికెట్ ఎలా ఎదిగింది?