Menu

IND vs ENG: హైదరాబాద్ కోటపై తొలిసారి బ్రిటీష్ జెండా.. ఆ ఇద్దరే కారణం!

Sumanth Thummala

ఓటమెరుగని హైదరాబాద్ కోట బద్దలైంది. పసలేని వ్యూహాలు నిర్లిప్తతో టీమిండియా ఓటమిపాలైంది. 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఆదివారం హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. హైదరాబాద్ లో ఈ మ్యాచ్ ముందు వరకు టెస్టులో టీమిండియా ఓటమి ఎరుగదు. ఎల్.బి స్టేడియం వేదికగా జరిగిన మూడు టెస్టుల్లో భారత్ ఒకటి గెలిచి రెండు డ్రాలు ఆడగా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం ఇంగ్లండ్‌తో తలపడే ముందు భారత్ ఒకటి డ్రా చేసుకుని వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లను గెలుచుకుంది.

ఇక ఓటమికి అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో ఇంకా ఫీల్డింగ్ లో చేసిన తప్పిదాలే ఓటమికి కారణాలు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఆ ఇద్దరే గెలుపును దూరం చేశారా? :

మొదటి టెస్ట్ ఇంగ్లాండ్ గెలుపుకు భారత్ ఓటమికి ఇద్దరు క్రికెటర్లు ఓల్లీ పోప్, టామ్ హార్ట్లీ ఏ కారణమా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఈ ఇద్దరి ప్రదర్శన ఇంగ్లాండ్ ను విజయతీరాలకు చేర్చింది. మొదటి ఇన్నింగ్స్ లో కేవలం ఒక్క పరుగే చేసిన పోప్ రెండవ ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయానికి కీలకమయ్యాడు.. ఒకానొక దశలో 163 కే 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కనీసం ఆధిక్యం తీసుకుంటుందా అని అనుకుంటుండగా ఓలీ పోప్ లోయర్ ఆర్డర్ తో విలువైన భాగస్వామ్యాలు నిర్మించి 420 పరుగులు చేసి 230 పరుగుల ఆధిక్యం సంపాదించారు. 2012 అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్ జట్టు 406 పరుగులు చేసింది. ఆ తర్వాత పర్యాటక జట్టు రెండో ఇన్నింగ్స్ లో 400 పైన పరుగులు చేయడం ఇదే తొలిసారి. మొత్తంగా ఒక పర్యాటక జట్టు ఇలా చేయడం కేవలం 9వ సారి.


ఓలీ పోప్ మన స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కొని స్వీప్, రివర్స్ స్వీప్, డ్రైవ్ షాట్లతో ఇన్నింగ్స్ ఆసాంతం బ్యాటింగ్ చేసాడు. స్వదేశంలో రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన నాలుగవ బ్యాటర్ గా తన నిలిచాడు.

ఇక టామ్ హార్ట్లీ మొదటి ఇన్నింగ్స్ లో 131 పరుగులకు కేవలం రెండు వికెట్లు తీసి అంత ప్రభావాన్ని చూపించలేకపోయాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో తనే భారత బ్యాటర్ల నడ్డిని విరిచాడు 62 పరుగులకు 7 వికెట్లు తీసుకొని, టెస్ట్ అంగ్రేటంలో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఇంగ్లాండ్ స్పిన్నర్ గా చరిత్ర సృష్టించాడు.(అత్యుత్తమ గణాంకాలు -జేమ్స్ లాంగ్రిడ్జ్ 56-7) భారత కీలక బ్యాటర్లందరి వికెట్లు తనే తీసుకున్నాడు.

బౌలర్ల తడబాటు,ఫీల్డర్ల నిర్లిప్తత! 

మొదటి టెస్ట్ లోని మొదటి ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగ్ వేసిన భారత బౌలర్లు రెండవ ఇన్నింగ్స్ వచ్చేసరికి తడబడి ఇంగ్లాండ్ కు ఆధిక్యాన్ని సమర్పించుకున్నారు.

ప్రధాన బౌలర్లైన అశ్విన్ – జడేజా జోడి 2017 శ్రీలంక కొలంబోలో జరిగిన టెస్టులో 437 పరుగులు ఇచ్చిన తర్వాత ఈ మ్యాచ్ లోనే 400 పైచిలుకు పరుగులు ఇచ్చింది. స్వదేశంలో జరిగిన టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా ఇద్దరూ తలా 100+ పరుగులు చేయడం తొలిసారి.


ఇక ఫీల్డింగ్ లో కూడా క్యాచ్ లు వదిలేయడం మ్యాచ్ ను చేజారి చేజార్చింది. పోప్ 110 పరుగుల వద్ద అక్సర్ పటేల్ క్యాచ్ జారవిడిచాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 257/5 కేవలం 67 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత పోప్ 86 పరుగులు జోడించగా లోయర్ ఆర్డర్ లో 64, 80 పరుగుల విలువైన భాగస్వామ్యాలు నిర్మించాడు. అలాగే రాహుల్ కూడా పోప్ 186 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ జారవిడిచాడు. ఇది కచ్చితంగా విజయాన్ని జార విడిచిన తప్పిదాలు.

మళ్ళీ అదే సంప్రదాయం:

మొదటి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసిన భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ లో పేలవ ప్రదర్శన చేసింది. ఓపెనర్లు 42 పరుగుల భాగస్వామ్యం చేసిన తర్వాత ఏ బ్యాటరు ఎక్కువసేపు క్రీసులో ఉండలేదు. మొదటి ఇన్నింగ్స్ లో అరంగేట్ర బౌలర్ అయిన టామ్ హార్ట్లీ ని బాగా ఆడిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో చేతులెత్తేశారు. తద్వారా ఎన్నో ఏళ్లుగా అరంగ్రేట బౌలర్లకు వికెట్ల సమర్పించుకునే అలవాటును కొనసాగించారు.

దాంతో పాటు ఇంగ్లాండ్ ప్రధాన స్పిన్నర్ అయిన జాక్ లీచ్ కంటే కూడా ఆ జట్టు ప్రధాన బ్యాటర్ , పార్ట్ టైం బౌలర్ రూట్ రెండో అత్యుత్తమ బౌలర్ గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్ లు కలిపి 140 పరుగులకు 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక నిర్లక్ష్యంగా ఆడిన షాట్లు, అనవసరపు రనౌట్ లతో టీమిండియా మూల్యం చెల్లించాల్సి వచ్చింది.

భారత్ మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు కూడా బ్యాటింగ్ అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ పరుగులు చేయలేదు. ఇదే విషయం కోచ్ ద్రావిడ్ ” నాల్గవ రోజు వికెట్‌పై 230 పరుగులు చేయడం ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది, అది మలుపు తిరుగుతోంది. రెండవ రోజు బ్యాటింగ్ చేయడానికి పరిస్థితులు చాలా బాగున్నప్పుడు మొదటి ఇన్నింగ్స్‌లో మేము బోర్డులో 70 పరుగులు తక్కువగా ఉండవచ్చని నేను అనుకున్నాను” అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఆ ఇద్దరి పేలవ ప్రదర్శన! 

ఈ టెస్టులో సీనియర్ ప్లేయర్ కోహ్లీ గైర్హాజరైనప్పటికీ జట్టు బలంగానే కనిపించింది. కానీ శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ గత పది ఇన్నింగ్స్ నుండి విఫలమవుతూ వస్తున్నారు. ఈ పది ఇన్నింగ్స్ లలో కనీసం ఒక అర్థ సెంచరీ కూడా నమోదు చేయలేదు. మరీ ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ ఒక టెస్ట్ బ్యాటర్ లాగా కాకుండా తొందరపాటు పడుతున్నట్టు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు.


కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఓటమికి “టాప్ ఆర్డర్లో చేసిన పేలవ ప్రదర్శనతో పాటు ఫీల్డర్లు వదిలేసిన అవకాశాలు మ్యాచ్ ను ఎక్కువ ప్రభావితం చేశాయని” అన్నాడు.

 

ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో రెండో టెస్ట్ ఫిబ్రవరి రెండో తారీఖున వైజాగ్ లో జరుగుతుంది.


Written By

1 Comment

1 Comment

  1. Bhargav says:

    In 2nd Innings Hartley bowled really well

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *